Share News

జమిలి కాదు, సంస్కరణలు ముఖ్యం

ABN , Publish Date - Dec 27 , 2024 | 06:03 AM

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడమే సర్వరోగ నివారణి అంటున్నది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి...

జమిలి కాదు, సంస్కరణలు ముఖ్యం

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడమే సర్వరోగ నివారణి అంటున్నది కేంద్ర ప్రభుత్వం. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని, శాంత్రిభద్రతల సమస్యలు ఉండదని కేంద్ర ప్రభుత్వం వాదన. కానీ జమిలి ఎన్నికలు జరిగినప్పటికి లోక్‌సభ, శాసనసభలు ముందే రద్దు కావనే గ్యారంటీ ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ఏదైనా సాధ్యమేనని, జమిలి ఎన్నికలు ముఖ్యం కాదు, ఎన్నికల సంస్కరణలు తక్షణావసరం అంటున్నారు. ముందు ప్రజాస్వామ్యానికి ప్రాణధారమైన, పారదర్శకమైన పాలనకు బాటలు వెయ్యాల్సిన ఎన్నికల విధానాన్ని సంస్కరించాల్సి ఉంది. లెక్కకు మించిన కుంభకోణాలతో కోటానుకోట్లు కొల్లగొట్టిన నేతలు చట్టసభల్లో శాసననిర్మాతలై వెలిగిపోతున్నారు. చట్టసభల్లో నేరచరితగలవారు, నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు 25 నుంచి 50 శాతానికి ఎగబాకినా, ఈ అవ్యవస్థను రూపుమాపాలన్న ఆలోచన ఎవరూ చెయ్యడం లేదు?


నేరస్తులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకట్ట వేసే శాసనంతోనే స్వచ్ఛ రాజకీయాలకు పునాది పడుతుందని, అటువంటి చట్టాన్ని పట్టాలెక్కించాలని కొన్నేళ్ళ క్రితమే పార్లమెంటును సర్వోన్నత న్యాయస్థానం కోరినా, ఆచరించిన దాఖలాలు లేవు. ఏటా ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఎలా పెరిగిపోయిందో చూస్తున్నాం. సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లే ఇండియాలో ఎన్నికల వేళ నాట్యమాడుతున్నది దాదాగిరి ధనస్వామ్యమే. ఎంత ఖర్చుపెట్టయినా ఎన్నికైతే చాలు అధికార పార్టీలోకి ఫిరాయించి డబ్బు సంపాదించవచ్చు అనే ధోరణి వికృతరూపం దాల్చింది. దీనిని అడ్డుకోవాలంటే ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా పార్టీ మారిన వెంటనే వారి సభ్యత్వం సభాపతి సహా ఎవరి ప్రమేయం లేకుండా తక్షణం రద్దయిపోయేలా చట్టం తేవాలి.


1990లో గోస్వామి కమిటీ నుంచి జస్టిస్ జె.ఎస్ వర్మ సారథ్యంలో ఏర్పాటయిన సంఘాల వరకు ఎన్నికల సంస్కరణలు అత్యావశ్యమని తేల్చి చెప్పాయి. సమాజ శ్రేయాన్ని, దేశాభివృద్ధిని కాంక్షించే వారికి స్వేచ్ఛాయుత ఎన్నికల వ్యవస్థే భరోసాగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే ఎన్నికలను నిర్వహించే సమున్నత వ్యవస్థ స్వతంత్రతతో రాజీపడరాదన్న సుప్రీం స్ఫూర్తికి పట్టం కట్టాలి. రాజ్యాంగంలోని 324 అధికరణ ద్వారా తనకి దఖలుపడిన విస్తృత అధికారాలతో ఎన్నికల సంఘం పటిష్ఠ చర్యలు తీసుకొనే విధంగా ఎన్నికల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థని కంటికి రెప్పలా సర్వ స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించే బలమైన అధికారం ఉన్న ఎన్నికల కమిషన్ నేడు కీలుబొమ్మగా మారిందన్న అపప్రథ ఉన్నది. అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడేవారిని ఎన్నికల కమిషనర్లుగా నియమించాలని సర్వోన్నత న్యాయస్థానం కూడా స్పష్టం చేసింది. కఠినమైన ఎన్నికల సంస్కరణలు అమలు చేసి ప్రజల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించాలి. ఇప్పటికైనా కేంద్రంలోని ప్రభుత్వం సత్వరం ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టి, రాజకీయాల్లో నేరస్తుల నిర్మూలనపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి ఉంది. అనేక ప్రజాస్వామ్య దేశాలు రాజ్యాంగ వ్యవస్థల బలోపేతమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు పటిష్ఠ సంస్కరణలు చేపడుతున్నాయి. కాబట్టి రాజకీయాల్లో విలువలు పెంచే విధంగా అన్ని వైపుల నుంచి కఠినాతి కఠినమైన ఎన్నికల సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం పూనుకోవాలి.

నీరుకొండ ప్రసాద్

Updated Date - Dec 27 , 2024 | 06:03 AM