పుణ్యపు రాశుల ప్రోది
ABN , Publish Date - Apr 09 , 2024 | 01:44 AM
కోపం తాపం శాపం దరి రానీయకు క్రోధీ! అందరి మంచిని కోరే అగణిత ప్రేమాంబుధీ!...
కోపం తాపం శాపం
దరి రానీయకు క్రోధీ!
అందరి మంచిని కోరే
అగణిత ప్రేమాంబుధీ!
నామవాచకమై నిలువుము
క్రోధీ ‘నామ్ కే’ వాస్తే!
ప్రేమలు పొంగగ పరువుము
దోస్తానీకే రాస్తే!
అజ్ఞానం అలసత్వం
అసమానత ఆక్రోశం
అననుకూల దృక్పథాల
అక్షర సత్యపు క్రోధి!
సామర్థ్యం సహృదయం
సహనం సంయమనంతో
సానుకూల భావనలకు
పుణ్యపు రాశుల ప్రోది!
ఆద్యంతములు ఎరుగని
అఖండ కాలవాహిని -
సమస్త జీవజాలానికి
జీవనకాంక్షా మోహిని!
ఆకులన్ని రాలినా
చెట్టు చిగురు వేస్తుంది
నిరీక్షించి వసంతాన
కోయిలమ్మ కూస్తుంది
రాత్రి చీకటిని భరిస్తు
తొలి కిరణం మెరుస్తుంది
మండుటెండలను దాటి
వాన మబ్బు కురుస్తుంది
అవనిలోని అణువణువూ
ఆశావహ సందేశం
కృషితో ఋషి కావాలని
ఈ ఉగాది ఆదేశం
మడిపల్లి దక్షిణామూర్తి