Share News

ప్రధానమంత్రులు – పాత్రికేయ సమావేశాలు

ABN , Publish Date - May 30 , 2024 | 01:19 AM

సాధారణ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఎవరికివారే అధికారంలోకి వస్తామన్న బింకంతో ధీమాగా పైకి కనిపిస్తున్నారు. అంచనాలు తారుమారు కావచ్చని, నిజమూ కావచ్చని, అంతా ఓటర్ల దయ అని...

ప్రధానమంత్రులు – పాత్రికేయ సమావేశాలు

సాధారణ ఎన్నికలు ముగియబోతున్నాయి. ఎవరికివారే అధికారంలోకి వస్తామన్న బింకంతో ధీమాగా పైకి కనిపిస్తున్నారు. అంచనాలు తారుమారు కావచ్చని, నిజమూ కావచ్చని, అంతా ఓటర్ల దయ అని వైరాగ్యంతో వున్న నాయకులూ లేకపోలేదు. గెలవడానికి అనుసరించిన అనేకానేక వ్యూహాలలో పాత్రికేయులను మంచి చేసుకోవడం కూడా ప్రధానమైనదే. అలా మీడియాను ఎన్నికలప్పుడు, ఎన్నికలు లేనప్పుడు మంచి చేసుకోవడానికి అధికార, ప్రతిపక్ష నాయకులు అవలంబించే దారులు విభిన్నంగా ఉంటాయి.


‘చురుమురి’ అనే పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ పోస్ట్ చేసిన ఆసక్తికర సమాచారాన్ని అనుసరించి– ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతి 30 రోజుల్లో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా కనీసం 26 సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చారట. సార్వత్రక ఎన్నికలలో బీజేపీకి అనుకూలంగా ఉండే మీడియా కవరేజీ ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తున్నదనేది ఒక విశ్లేషణ. ఇలాంటి ఇంటర్వ్యూల పరంపర నెలరోజుల తరువాత కూడా అంతో ఇంతో మోతాదులో కొనసాగింది. వాస్తవానికి, 2019 సాధారణ ఎన్నిలప్పుడు సైతం ప్రధాని మోదీ అప్పట్లో తన ఇంటర్వ్యూల పరంపరలో తాను భావించిన న్యాయమైన సమయ భాగాన్ని, కేవలం 20 రోజుల వ్యవధిలో, పది ప్రింట్ మీడియా, నాలుగు టెలివిజన్ మీడియాలకు మాత్రమే ఇచ్చారు. ఇందులో ఏమీ తప్పుపట్టడానికేమీ లేదేమో!


ప్రతి ప్రధానమంత్రికి తనదైన ‘మీడియా దృక్పథ శైలి’ ఉంటుంది. మాజీ ప్రధానమంత్రులతో పోల్చినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియా సమావేశాల వ్యవహార శైలి భిన్నంగా వున్నప్పటికీ, ఒకరిది తప్పనో, వేరొకరిది ఒప్పనో ఖచ్చితంగా చెప్పలేము. ఉదాహరణకు, మోదీ ప్రధానమంత్రిగా తన మొట్టమొదటి, ఆ మాటకొస్తే ఏకైక ప్రెస్ కాన్ఫరెన్స్‌ను మే 2019లో నిర్వహించారు. కాకపోతే, వింతగా, ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదు. ఆయనకు బదులుగా నాటి సహచర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమాధానాలు ఇచ్చారు. విదేశాల్లో, 2015లో ఇంగ్లాండ్ సందర్శన సందర్భంలో ఒకసారి, 2023లో అమెరికా పర్యటన సందర్భంలో మరొకసారి మాత్రమే మోదీ పాత్రికేయుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వాస్తవానికి, వైట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, పాత్రికేయులు అడిగిన రెండే రెండు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రపంచవ్యాప్త కరోనా మహమ్మారి సమయంలో కూడా, మోదీ ఎలాంటి మీడియా సమావేశాలలో పాల్గొనలేదు.

నరేంద్ర మోదీకి ముందు ప్రధానిగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ మీడియాకు సన్నిహితంగా, సులభంగా అందుబాటులో ఉండేవారు. తరచుగా మీడియా సమావేశాలను కూడా నిర్వహించేవారు. ఆయన ప్రతి విదేశీ పర్యటన సందర్భంగా తిరుగు ప్రయాణంలో మీడియా సమావేశాలు నిర్వహించేవారు. అయినప్పటికీ, మన్మోహన్ సింగ్‌ను మౌన మునిగా అభివర్ణిస్తూ, తరచుగా ఆయన మీడియాకు సమాధానం ఇవ్వరని బీజేపీ విమర్శించేది.


2014 జనవరి 3న, ఒక భారత ప్రధానమంత్రి (మన్మోహన్ సింగ్) భారతదేశంలో నిర్వహించిన చిట్ట చివరి ప్రెస్ మీట్‌లో వందమంది పాత్రికేయుల నుండి 62 ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని, ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్‌కు సమాచార సలహాదారుడిగా పనిచేసిన పంకజ్ పచౌరి ట్విట్టర్‌లో తెలియచేశారు. దాన్ని షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ, మన్మోహన్ తన పదేళ్ళ పదవీ కాలంలో 117 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారని చెప్పారు! ఈ రకంగా చూస్తే, నరేంద్ర మోదీకి, మన్మోహన్‍ సింగ్‌కు ఎంత విస్మయకరమైన వ్యత్యాసం వున్నదో అర్థమవుతుంది. 2004 సెప్టెంబర్‌లో మన్మోహన్ సింగ్ మీడియా సమావేశం నిర్వహించడం ద్వారా, వాస్తవానికి, ‘నెహ్రు కాలం’ నాటి సత్సంప్రదాయాన్ని కూడా పునరుద్ధరించారు.

పదిహేడేళ్ళ పాటు ప్రథమ ప్రధానమంత్రిగా పనిచేసిన జవహర్‌ లాల్ నెహ్రూ తరచుగా పత్రికా సమావేశాలను నిర్వహించేవారు. ఆయనకు పాత్రికేయుల స్వాతంత్ర్యంమీద నిబద్ధత ఉండేది. సాధారణంగా విజ్ఞాన్ భవన్‌లో జరుగుతుండే ‘మీట్–ది–ప్రెస్’ కార్యక్రమంలో గుర్తింపు పొందిన పాత్రికేయులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొనేవారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగడానికి ముందు తమను గుర్తించడానికి ప్లకార్డులను చూపే సంప్రదాయం వుండేది. వాటిని అప్పట్లో ‘మాసాంతం ప్రెస్ కాన్ఫరెన్స్‌లు’గా సంబోధించేవారు. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర రచయిత, ప్రముఖ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా వాటిని ‘జవహర్‌లాల్ సాహసోపేతమైన పత్రికా సమావేశాలు’గా అభివర్ణించారు. ఆ సమావేశాల్లో లభ్యమయ్యే ‘సమాచారం, విద్య, వినోదా’లను తాను మరలా ఎప్పుడూ చూడలేదంటారు.


ఇందిరాగాంధీ ప్రధానిగా భారతీయ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎన్నో ఒక చేతి వేళ్లతోనే లెక్కించవచ్చని పత్రికా రంగంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత అరుణ్‌పురి అనేవారు. విదేశాలకు పర్యటించడానికి ముందు మాత్రం విధిగా ఇందిరాగాంధీ ఆ దేశానికి చెందిన పాత్రికేయుడికి ‘కర్టెన్ రైజింగ్ ఇంటర్వ్యూ’ ఇవ్వడం జరిగేదని అన్నారాయన. పశ్చిమ దేశాల పాత్రికేయులకు, ఆమె రక్షణలో ఉన్న పార్లమెంట్ హౌస్ లేదా సౌత్ బ్లాక్‌లో ఉన్న ఆమె క్వార్టర్స్‌లోకి వెళ్లడం చాలా సులువని ఆయన అభిప్రాయపడ్డారు. అదే భారతీయ పాత్రికేయుల విషయానికొస్తే, ఆమెను కలిసేందుకు సాధారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో మాత్రమే అవకాశం కలిగేది. అవి కూడా, తరువాత, అరుదైపోయాయి.

ఒక భారత ప్రధానమంత్రిగా ‘మొట్టమొదటి జాతీయంగా ప్రసారం చేయబడిన లైవ్ టీవీ ప్రెస్ కాన్ఫరెన్స్’ను రాజీవ్‌గాంధీ 1985 జూలై 7న నిర్వహించారు. గంటకు పైగా సాగిన దాంట్లో రాజీవ్ 30కి పైగా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అలాంటి టెలివిజన్ పత్రికా సమావేశాలను సాదాసీదా కార్యక్రమంగా, క్రమం తప్పకుండా నిర్వహించే ఆలోచన ఉన్నట్లు అప్పుడు రాజీవ్ అన్నారు. ఆయన తన పదవీకాలంలో 60కి పైగా ప్రెస్‌మీట్‌లు నిర్వహించారు. బోఫోర్స్ వివాదం వరకు అవి కొనసాగాయి. వి.పి. సింగ్ 1989లో కేవలం ఒకే ఒక్క పత్రికా సమావేశం నిర్వహించారు!


1994–2004 మధ్యకాలంలో ప్రధానమంత్రులుగా వున్న హెచ్.డి. దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్, అటల్ బిహారీ వాజపేయిలు, ఎలాంటి పత్రికా సమావేశాలను నిర్వహించలేదు. ‘మీడియాతో మాట్లాడటానికి అయిష్టత’ వ్యక్తం చేయడం అనే సంప్రదాయాన్ని, మోదీ కంటే చాలా ముందుగానే వీరు నెలకొల్పారని అనాలేమో. దేవేగౌడ, గుజ్రాల్ పదవీకాలం అతిస్వల్పమే. వారిరువురికీ మీడియా ముందు రావడానికి సమయం కూడా లేదు. వాజపేయి ప్రధానమంత్రిగా, ఢిల్లీలో అధికారిక పత్రికా సమావేశాన్ని, తన ఆరు సంవత్సరాల పదవీ కాలంలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. పాత్రికేయులతో ఆయన ముఖాముఖి సమావేశాల కలయికలు క్లుప్తంగా ముగిసేవి.

ఇదంతా పక్కన పెడితే, 75 సంవత్సరాలు నిండిన అతిపెద్ద ప్రజాస్వామ్య భారతావనిలో, నిరంతరం మార్పుకు గురవుతున్న నిజాయితీ రహిత, అసత్య, అనైతిక, వక్ర రాజకీయ, సామాజిక నీతి వ్యవస్థ నట్టనడుమ, అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాలుపంచుకుంటున్న మీడియా వ్యవస్థలు నిర్వహించే ఈ సమావేశాల ద్వారా ఏమైనా ఫలితం వున్నదా అని కొందరి విశ్లేషకుల అభిప్రాయం.


దురదృష్టవశాత్తు చాలా పత్రికా సమావేశాలలో కొందరు పక్షపాత పాత్రికేయులు వేసే ప్రశ్నలు సమావేశ అంశానికి భిన్నంగా, ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా, ‘ప్రజలకు ఆసక్తి కలిగించే’ లేదా ‘సెన్సేషనల్’ విషయాలకు సంబంధించినవే కావడం గమనార్హం. అలాంటప్పుడు సమావేశం నిర్వహించే వ్యక్తిని, అందునా ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తిని విసిగించే దిశగా ఇంటర్వ్యూ కొనసాగుతుంది ఒక్కొక్కసారి. బహుశా ఈ కారణంతోనే, ఒక్కొక్క ప్రధాని తమదైన శైలిలో పత్రికా ప్రతినిధులను కలుసుకోవడం జరుగుతుండవచ్చు. ఒకప్పుడున్న పద్ధతులు, విలువలు, నిబద్ధతలు, ఎల్లప్పుడూ వుండాలని లేదుగా? అందుకే జవహర్‌లాల్ నెహ్రూ తన పద్ధతిలో పత్రికా సమావేశాలు నిర్వహించడం ఏ విధంగా వంద శాతం సరైనదో, అలాగే నరేంద్ర మోదీ తనదైన పద్ధతిలో పత్రికలు, న్యూస్ ఛానల్స్, న్యూస్ ఏజెన్సీలకు విడివిడిగా తన ఇష్టమొచ్చినప్పుడు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా సరైనదేమో. ఎవరి దారి వారిదే. ఎవరికి వారే, యమునాతీరే!

వనం జ్వాలానరసింహారావు

Updated Date - May 30 , 2024 | 01:20 AM