ప్రతిష్ఠకు మచ్చ ఫోన్ ట్యాపింగ్!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:48 AM
టెలిఫోన్ కాదు కదా కనీసం సరైన రవాణా వసతి కూడ లేని మారుమూల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. మాధవరెడ్డి లోక్‍సభలో 1980లలో తాను టెలిఫోన్ల టాపింగ్‌పై లేవనెత్తిన ఒక ప్రశ్న దేశ రాజకీయాలలో...

టెలిఫోన్ కాదు కదా కనీసం సరైన రవాణా వసతి కూడ లేని మారుమూల ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సి. మాధవరెడ్డి లోక్‍సభలో 1980లలో తాను టెలిఫోన్ల టాపింగ్‌పై లేవనెత్తిన ఒక ప్రశ్న దేశ రాజకీయాలలో దుమారం రేపుతూ ఒక ముఖ్యమంత్రి పదవికి ఎసరు తెచ్చింది. రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి జనతాదళ్ సభ్యుడు మధుదండావతేతో కలిసి మాధవరెడ్డి లెవనెత్తిన ఈ అంశం చివరకు స్వంత పార్టీ ముఖ్యమంత్రి రామకృష్ణాహెగ్డే పదవికి ఎసరు తెచ్చిపెట్టింది. నైతిక విలువల నాయకుడిగా పేరు కల్గిన దిగవంత హెగ్డే తన రాజకీయ ప్రత్యర్థి దేవగౌడకు రాజధానిలో ఎంత వరకు ప్రాబల్యం ఉందో తెలుసుకోవడానికి అతని ఫోనును ట్యాపింగ్ చేసారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. టెలిఫోన్ల ట్యాపింగ్ అనేది నూతనంగా ఏమీ కాకున్నా, అది బహిర్గతమైన ప్రతిసారి రాజకీయ దుమారం చెలరేగడం షరా మాములే.
ప్రస్తుతం తెలంగాణలో చర్చనీయంశంగా మారిన టెలిఫోన్ ట్యాపింగ్ తీరు ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన దాని కంటె విభిన్నమైంది. ఒక సంప్రదాయక భద్రతాపరమైన నియమాన్ని రాజకీయ శక్తులు దుర్వినియోగం చేసిన విధానం ఆందోళన కలిగిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ సంభాషణలను వినడం లేదా రికార్డు చేయడం సులభతరమవుతూ ఒకప్పుడు జిల్లా ఎస్పీలకు కూడా లేని ఈ అధికారం ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు కూడ విస్తృతంగా లభిస్తున్నది. ఇది ఆందోళనకరం. ప్రభుత్వ ఆధ్వర్యంలోని ల్యాండ్ లైన్లు కనుమరుగవుతూ మొబైల్ ఫోన్ వ్యవస్థ పెరిగిన తర్వాత అనుమతులు, సర్వీసు ప్రొవైడర్లు వగైరాలతో సంబంధం లేకుండా నేరుగా దొంగచాటుగా వినే అవకాశం దక్కింది. కేవలం అత్యున్నత నిఘా స్థాయిలో మాత్రమే వాడే ఐఎంఎస్‍ఐ విధానాన్ని కూడా కార్పొరేట్లు, పాలకపక్షాలు సునాయసంగా వాడుతున్నాయంటే విస్మయం కలిగిస్తుంది.
దేశవిదేశాల నుంచి నిత్యం వచ్చే కొన్ని లక్షలాది ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ సందేశాలను భారతీయ నిఘా వర్గాలు పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు సంబంధిత ప్రభుత్వ వర్గాలను అప్రమత్తం చేస్తుండడం ఒక సంప్రదాయక భద్రతపరమైన నియమం. భారతదేశంలో ప్రతి రోజు దాదాపు పది లక్షలకు పైగా ఫోన్ కాల్స్‌ను కేంద్ర ప్రభుత్వ అధ్వర్యంలోని పది నిఘా సంస్థలు ట్యాపింగ్ చేస్తుండగా, అందులో విదేశాలలోని భారతీయ ఎంబసీలలో కేంద్రీకృతమై ఉండే ‘రా’ నిఘా విభాగం కూడా ఒకటి, ఇందులో పని చేసే అధికారులందరూ కూడా విధి నిర్వహణలో చిత్తశుద్ధి కలిగిన వారుగా పేరుంది. వీరికి తోడుగా అదనంగా రాష్ట్రాల పోలీసులు కూడా ట్యాపింగ్ చేస్తుంటారు.
జాతి భద్రత, శ్రేయస్సు కోసం ఉగ్రవాదులు, నేరస్థులపై దృష్టి సారించవల్సిన నిఘా నేత్రాన్ని పాలకుల విధానాలను విమర్శించే వారిపై ఎక్కుపెట్టడం పాలకులకు మామూలు విషయమే. కానీ శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి పోలీసులకు కూడా అవకాశం ఉండడంతో ఈ రకమైన దుర్వినియోగం జరుగుతుంది. దేశంలో ఫోన్లు, మెసేజ్‌లను టాపింగ్ చేసే అగ్రరాష్ట్రాలలో తెలంగాణ కూడా ఒకటి అనేది మరిచిపోకూడదు.
నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్‌లో రాజకీయాలు, నేరాలతో ఎలాంటి సంబంధం లేని ఒక యువతి ఫోన్‌ను ట్యాప్ చేసిన సంఘటన మొదలు మహారాష్ట్రలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం పతనం, తెలంగాణలోని తాజా పరిణామాల వరకు రాష్ట్రాలలో దీన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో అవగతమవుతుంది.
ఒక్క ఫోన్లే కాదు, ఇతర విధానాల ద్వారా కూడా సమాచారాన్ని సేకరించే చట్టబద్ధ వ్యవస్థకు 2011 లోనే భారతదేశం నాంది పలికింది. దీని ద్వారా సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండా, శాంతిభద్రతలు రాష్ట్రాల ఆంశమైనప్పటికీ రాష్ట్రాలతో ప్రమేయం లేకుండా నేరుగా కేంద్రమే ఫోన్లు, మెసేజ్‌లు, మెయిల్స్, ఫోటోలు... వగైరా సర్వం సేకరించే సెంట్రల్ మానిటరింగ్ సిస్టం (సిఎంఎస్) విధానాన్ని రూ.800కోట్లతో ప్రారంభించింది. సిఎంఎస్ విధానం ఎదుటివారికి తెలియకుండా వారి ఫోన్ల సంభాషణను, మెసేజ్‌లను, ఫోన్‍లోని ప్రతి ఆంశాన్ని గమనిస్తూ నిక్షిప్తం చేస్తుంది. నాట్ గ్రిడ్ విధానం అనేది పౌరునికి సంబంధించిన 21 రకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతుంది. అదే విధంగా నెట్రా అనేది ఒక్క సామాజిక మాధ్యమాలలోనే కాదు, ఒక కంప్యూటర్‍లో ఏమేం ఉందో తెలుసుకోగలుగుతుంది. వ్యక్తిగత గోప్యతను హరించే ఈ మూడు నిఘా విధానాలు కూడ భారతదేశంలో చట్టబద్ధంగా అమలులో ఉన్నాయి.
దేశ సరిహద్దు అవతలి శత్రువుపై వినియోగించాల్సిన నిఘా పరిజ్ఞానాన్ని పాలకులు తమను ప్రశ్నిస్తున్న గొంతుకల నోరు మూయడానికి వినియోగిస్తుండటమే ఆందోళన కలిగిస్తున్న అంశం.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)