పోలీస్ రాజ్యం ఎవరిదో ప్రజలింకా మర్చిపోలేదు!
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:22 AM
అప్పుడప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తుంటాయి. నరరూప రాక్షసులు మానవత్వంపై ప్రవచనాలు వినిపిస్తుంటారు. అబద్ధాలకోరులు నిజాలను భుజాలపై నిలబెడుతున్నామంటూ గప్పాలు కొడుతుంటారు...

అప్పుడప్పుడు దెయ్యాలు వేదాలు వల్లిస్తుంటాయి. నరరూప రాక్షసులు మానవత్వంపై ప్రవచనాలు వినిపిస్తుంటారు. అబద్ధాలకోరులు నిజాలను భుజాలపై నిలబెడుతున్నామంటూ గప్పాలు కొడుతుంటారు. నియంతలు ప్రజాస్వామ్యానికి కాపాలా కుక్కలమంటూ భుజాలు చరుచుకుంటారు. అవినీతిపరులు నీతినిజాయితీలకు నిలువుటద్దాలమంటూ స్వోత్కర్షలకు పాల్పడు తుంటారు. పదేళ్ల పాటు కీరిటం లేని చక్రవర్తిలా, యువరాజులా గుర్తింపు పొందిన కేటీఆర్ వీటన్నింటికీ అసలు సిసలు ప్రతిరూపం.
తమ పాలన స్వర్ణయుగమనీ తమ పాలనా కాలంలో అవలంబించిన విధానాలతోనే తెలంగాణ పారిశ్రామిక అనుకూల రాష్ట్రంగా మారిందని అధికారంలో ఉన్నప్పుడూ, అధికారం కోల్పోయిన తర్వాతా కేటీఆర్ పలు వేదికలపై చెప్పుకొచ్చారు. అదే కేటీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తుంటే అడ్డుకునే కుట్రలకు తెరలేపారు.
పరిశ్రమలకు భూ సేకరణ ఎక్కడైనా కొంత ఇబ్బందులతో కూడుకున్నదే. ఏళ్లుగా భూమిని నమ్ముకున్న రైతులు వాటిని వదులుకునేందుకు ఇష్టపడరు. ఆ అనుబంధాన్ని పూడ్చలేకపోయినా భూమికి సరైన నష్ట పరిహారం ఇచ్చి మరోచోట భూమి కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ క్రమంలోనే లగచర్లలోనూ పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి భూ సేకరణకు ప్రభుత్వం ప్రయత్నించింది. రైతుల్లో కొంత ఆందోళన ఉన్నా పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత, కలిగే లబ్ధి, భూములు కోల్పోయే వారికి ఇచ్చే పరిహారం తదితర అంశాలపై చర్చించేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అక్కడకు వెళ్లారు. ముందుగా పన్నిన కుట్ర ప్రకారం ఆయనను గ్రామం లోనికి పిలిపించిన బీఆర్ఎస్ గూండాలు కలెక్టర్, ఇతర అధికారులపై దాడులకు పాల్పడడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఆ గ్రామంలో సెంటు భూమి లేని ఓ గుండా నేతృత్వంలోని అల్లరిమూక అధికారులపై దాడులకు తెగబడింది. దీనిని ఖండించాల్సిన కేటీఆర్ భూ నిర్వాసితులపై కేసులు పెడుతున్నారంటూ, ఆడవారిని లైంగిక వేధింపులకు గురి చేశారంటూ, దళితులూ గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ తప్పుడు ఆరోపణలతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు గుండెలు బాదుకుంటూ తిరుగుతున్నారు. తమ పార్టీ నేతలు కుట్రపూరితంగా చేసిన వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారు. దాడులకు తెగబడిన బీఆర్ఎస్ అరాచక ముఠా నాయకుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డితో పదులసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ లేవని బుకాయిస్తున్నారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఒక హాస్యాస్పదమైన ప్రకటనను కేటీఆర్ చేశారు. పోలీసు రాజ్యం గురించి బీఆర్ఎస్ పాలకులకు, కేటీఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. పోలీస్ రాజ్యానికి తార్కాణంగా నిలిచిన ఉదంతాలు గత పదేళ్ళ పాలనలో లెక్కలేనన్ని జరిగాయి. కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో రోజుల తరబడి సాగుతున్న ఇసుక దోపిడీని పండగ రోజైనా ఆపమని అడిగిన నేరెళ్ల దళితులను రాత్రిళ్లు ఇళ్ల నుంచి ఎత్తుకువెళ్లి రోజుల తరబడి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. మా సమస్యలు చెప్పుకుంటాం ధర్నా చౌక్‌కు వెళ్లనివ్వాలని కోరిన వర్గాలను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధించారు. ప్రతిపక్ష నేతలు, వివిధ రంగాల ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందారు. ఖమ్మం మార్కెట్‌లో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై మిర్చి పంటను తక్కువ ధరకు దోచుకోవడంపై ఆందోళన చేసిన గిరిజన రైతులకు ఉగ్రవాదుల మాదిరి సంకెళ్లు వేసి నడిపించారు. దళిత మహిళ మరియమ్మను లాకప్‌లో చంపారు. ప్రతిపక్ష నేతలు రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిల ఇళ్లలోకి అర్ధరాత్రులు చొరబడి తలుపులు బద్దలు కొట్టి అరెస్టులు చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ కోదండరాం ఇంటి తలుపులను గొడ్డళ్లతో నరికి ఆయనను అరెస్టు చేశారు. నోరెత్తిన నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులపై కేసులపై కేసులు మోపి జైళ్లకు పంపారు. ప్రశ్నించిన మీడియాను వంద అడుగుల లోతున పాతరేస్తామని రంకెలు వేశారు. అధికారం పోయిన ఏడాదిలోనే ఇన్ని తప్పులను కేటీఆర్ మర్చిపోయారా? లేక ప్రజలకు ఆ మాత్రం జ్ఞాపకశక్తి ఉండదనే చిన్నచూపుతో ‘పోలీసు రాజ్యం’ అన్న పదం వాడారా? ఆయనకే తెలియాలి.
మానవ హక్కులు, జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, రాజ్యాంగ విలువలూ అంటూ తనకు బొత్తిగా తెలియని, తానెప్పుడూ విలువ ఇవ్వని అంశాలపై కేటీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితుడు ఆరె కనకరాజు మృతదేహాన్ని గ్రామానికి తరలించకుండా హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరిపించినప్పుడు కేటీఆర్‌కు మానవ హక్కులు గుర్తుకు రాలేదా? నేరెళ్ల బాధితులను రోజుల తరబడి హింసించినప్పుడు, కేసుల నుంచి తన వారిని తప్పించేందుకు వారిని బ్లాక్‌మెయిల్ చేసినప్పుడు జాతీయ ఎస్సీ కమిషన్ గుర్తుకురాలేదా? పోడు భూములు సాగు చేస్తున్నారంటూ ఖమ్మం జిల్లా ఎల్లన్న నగర్‌లో 18 మంది గిరిజన మహిళలు, అందులో ఏడాది లోపు పిల్లలున్న ముగ్గురు తల్లులను అరెస్టు చేయించి జైళ్ల పాలు చేసినప్పుడు మానవత్వం, మానవ హక్కులు, జాతీయ ఎస్టీ కమిషన్, పోలీసు రాజ్యం... ఇవేమీ కేటీఆర్‌కు గుర్తులేవా?
ఢిల్లీకి మూటలు మోస్తున్నారని పదే పదే కేటీఆర్ విమర్శలు చేయడం పరమ ఎబ్బెట్టుగా ఉంది. తెలంగాణలో దోచుకున్న వందల కోట్ల రూపాయలతో దేశవిదేశాల్లో కేటీఆర్ కుటుంబం వ్యాపారం చేస్తోందనే ఆరోపణలున్నాయి. ఢిల్లీలో మద్యం వ్యాపారంలో దిగి వంద కోట్ల రూపాయలు చేతులు మారడంలో కింగ్‌పిన్ కల్వకుంట్ల కవిత అని సీబీఐ, ఈడీ తమ ఛార్జిషీట్లలో పేర్కొన్న విషయం కేటీఆర్‌కు తెలియదా?
ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండబట్టే కేటీఆర్ కుటుంబం మూసివేసిన ధర్నా చౌక్‌ను తిరిగి తెరిపించారు. ఆ ధర్నా చౌక్‌లో కూర్చొనే కేటీఆర్, ఆయన బావ హరీశ్‌రావు తిట్ల పురాణం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పోలీసు రాజ్యంపై నమ్మకం లేనందునే కేటీఆర్ సోషల్ మీడియా కాలకేయ సైన్యం నిత్యం ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో విషం చిమ్మగలుగుతోంది. ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉండబట్టే ఇంకా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, కార్యకర్తలు ఇష్టారీతిగా విమర్శలు చేయగలుగుతున్నారు. కానీ ఆయన మంచితనాన్ని చేతగానితనంగా, సహనాన్ని అసమర్థతగా భావిస్తే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు.
ప్రతిపక్ష నేతగా ఎన్నికైన కేటీఆర్ తండ్రి కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గోరంత విశ్వాసం లేదు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పోలీసు రాజ్యం అనే పదాలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. కేటీఆర్ కుటుంబ అహంకారాన్ని, నాటి పోలీసు రాజ్యాన్ని చూసినందునే ప్రజలు శాసనసభలో వారిని ఓడించి పదవులు ఊడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నాకు పరిమితం చేశారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యలు ఇకనైనా ప్రజాస్వామిక స్ఫూర్తిని అలవర్చుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదంలో పడుతుంది.
చామల కిరణ్ కుమార్‌రెడ్డి
భువనగిరి లోక్‌సభ సభ్యులు