Share News

పార్వతీశం, నీకు వందేళ్ళు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:41 AM

1924లో తెలుగులో పూర్తి హాస్య నవలగా ముద్రింపబడినది మొక్కపాటి నరసింహశాస్త్రి ‘బారిష్టర్‌ పార్వతీశం’. ఈ నవలకు రచయితనంటే తప్ప గుర్తుపట్టలేనంతగా నవల ప్రఖ్యాతి తనను మించి స్థిరపడిపోయిందని, ‘‘ఆ పేరు మీదనే...

పార్వతీశం, నీకు వందేళ్ళు!

1924లో తెలుగులో పూర్తి హాస్య నవలగా ముద్రింపబడినది మొక్కపాటి నరసింహశాస్త్రి ‘బారిష్టర్‌ పార్వతీశం’. ఈ నవలకు రచయితనంటే తప్ప గుర్తుపట్టలేనంతగా నవల ప్రఖ్యాతి తనను మించి స్థిరపడిపోయిందని, ‘‘ఆ పేరు మీదనే నేటికీ చెలామణీ అవుతున్నా’’నని మొక్కపాటి నరసింహశాస్త్రి ఒకచోట చెప్పుకుంటారు. గత శతాబ్ద కాలంలో (1924-2024) ఈ నవల పొందిన ప్రజాదరణకు ఇదొక నిదర్శనం.

తెలుగు నవలా సాహిత్యంలో హాస్య రచనలు కాస్త తక్కువే. ఆ తరహా రచనలు చేసిన వారిని వేళ్ళ మీద లెక్కించవచ్చు. హాస్యం ద్వారా ‘వ్యంగ్యం’ చెప్పేవారున్నారు. నిజానికి రెండూ వేరు వేరు. ఎన్‌.ఆర్‌. నంది, పతంజలి, ఆదివిష్ణు, డి.వి. నరసరాజు, యర్రంశెట్టి సాయి, జంధ్యాల తదితరులు, వీరితోపాటు ముళ్లపూడి వెంకటరమణ, శ్రీరమణలను ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. ‘రాజకీయ భేతాళ పంచ వింశతిక’, ‘నవ్వులో శివుడున్నాడురా’ వంటి రచనలు నేటికీ ‘వాస్తవ దృశ్యాలు’గా నిలిచి ఉన్నాయంటే కారణం- ‘హాస్యం’ (వ్యంగ్యం).

ఏముందీ ‘బారిష్టర్‌ పార్వతీశం’ నవలలో అనే సందేహం ఉన్నవారు బహుశా తెలుగు లోకంలో తక్కువనే నా భావన. ఇది మూడు భాగాల రచన. మొదటి భాగంలో ఉన్న హాస్యం రెండు మూడు భాగాలలో క్రమంగా తగ్గిందనే భావన ఉంది. ఇందుకు కారణంగా రచయిత ‘హాస్యం జీవితంలో అన్ని దశల్లోనూ సమానంగా ఉండకపోవచ్చు’ అని సర్ది చెప్పారు. వాస్తవం కూడా అంతే కదా. ఈ రచనలో ప్రధాన పాత్ర పార్వతీశం. ఇతను నరసాపురం దగ్గర మొగల్తూరు గ్రామవాసి. పడవ ప్రయాణం అతని నిత్య వ్యవహారం. అతను చదువు కోసం చెన్నై వెళ్లాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్‌ వెళ్లి బారిష్టర్‌ చదువుకొని వచ్చాడు. ఇదీ వరుసగా ఆ కుర్రాడి జీవితంలో ‘వివిధ వికాస దశలు’. అయినా ‘ఆంగ్లేయ విద్యతో పాటు అబ్బవలసిన అనేక రకాలైన సుగుణాలు అతనిలో కొరతపడ్డాయి. నేటి నాగరికతంతా అతనికి కొత్త. ఎన్నడూ రైలెక్కి ఎరగని వ్యక్తి అని శాస్త్రిగారు ముందుమాటలో చెబుతారు. అటువంటి వ్యక్తి ఇంగ్లాండు వరకు వెళ్లి బారిష్టర్‌ చదివి వచ్చాడంటే నమ్మవలసిందే.

పార్వతీశం చేసే ప్రతీపనిలో చదువరికి హాస్యం ‘కనిపిస్తుంది’. రైలులో అతడి నడత, మద్రాసులోనూ పడిన అవస్థలు, స్టీమర్‌లో చిక్కులు... రచన చదువుతున్నంతసేపు ఒక ఘట్టానికి మించి మరొక ఘట్టం కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తుంది. చక్కని, ఆరోగ్యవంతమైన హాస్యాన్ని రచయిత మొక్కపాటి నరసింహశాస్త్రి ఈ రచనలో స్పృశించారు.

‘బారిష్టర్‌ పార్వతీశం’ చిరంజీవిగా నిలిచిపోవడానికి కారణం- ప్రధాన వస్తువులోని సునిశితమైన ‘సన్నివేశపరమైన హాస్యం’ దానికి సరిజోడైన ‘సంభాషణ పరమైన’ హాస్యం. అలాగే మనం కొత్త ప్రాంతాలకు పోయినప్పుడు అక్కడ ఆచార వ్యవహారాలు, వస్తువులు చూసినప్పుడు వాటిని ఎలా అనుసరించాలో తెలియక అయోమయానికి గురవుతాం. ఫోర్క్‌, చెంచాలతో దోశ తినటం ఎలానో నాకిప్పటికీ తెలియదని ప్రముఖ సినీ హాస్య రచయిత, దర్శకుడు జంధ్యాల అంటారు. అటువంటిది మొగల్తూరులోని అమాయకమైన కుర్రాడు చెన్నై, ఇంగ్లాండ్లకు వెళితే...!? ‘‘పొరపాటు మరో పొరపాటుకి మూలమై వికృతులు ఒకదానికొకటి గుది గ్రుచ్చినట్లు పెనవేసుకున్నట్లు చూపించి, ఊహకందని వంపులోకి కథను ఈడ్చితే’’! అతనికి ఆవేదన, చదువరులకు ఆనందం!

పార్వతీశం స్వభావతః మూర్ఖుడు కాదు. పరిస్థితులతనిని మూర్ఖునిగాచేసి వెక్కిరిస్తాయి. పార్వతీశానికి మించి ఎప్పుడో ఒకప్పుడు నవ్వుల పాలైన అవస్థలు జీవితంలో మనం కూడా ఎదుర్కొనే ఉంటాం. అందుకే పార్వతీశం మనందరివాడు. ఇందుకు కారకులైన మొక్కపాటి వారికి తెలుగు సాహితీ లోకం రుణపడి ఉంది.

‘బారిష్టర్‌ పార్వతీశం’ రచనలో అతడు ఆడవాళ్ళ టోపీ కొనటం, ఫ్రాన్స్‌లో షాపులో తివాచీ మీద నడవకూడదేమోననుకొని మైనం నునుపు పెట్టిన చెక్కల మీద నడవబోయి పడిపోవటం... ఇలా ఆ పాత్ర చేతకానితనం మనకు విపరీతమైన హాస్యాన్ని అందిస్తుంది. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఉంటే అనే ఆత్మ పరిశీలన చేసుకుంటే నవ్వు రాదు. ‘‘ప్రతీ హాస్యం వెనుక ఓ విషాదం ఉంటుందనే’’ చార్లీ చాప్లిన్‌ వ్యాఖ్యానం ఈ రచనంతటా కనిపిస్తుంది. మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు. అతనిలో అజ్ఞాన జనితమైన అపచారాలు చాలా ఉంటాయి. ఇటువంటివి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించటం కొంతవరకు అతిశయోక్తిలా కనిపించినా తప్పక హాస్యజనకంగా ఉంటుందంటారు రచయిత. హాస్యాన్ని ఆస్వాదించేవారు ఎంతమంది ఉంటారో, విమర్శించేవారు అంతకుమించి ఉంటారు. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ‘ఇది కాపీ రచన’ అని, ‘వీడి బొంద ఇంతగా హాస్యం రాయడం మన వాళ్లకు.. అబ్బే’ అన్నవారున్నారని రచయిత అంటారు. ఈ విషయం గురించి రచయిత తన ముందుమాటలో ‘‘ప్రతీ ఆంధ్రుడికి ఒక గట్టి నమ్మకం. ఏమంటే బుద్ధి కుశలత కలిగిన ఏ పనిగాని ఆంధ్రుడు చేయలేడని. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదైనా కనబడితే ‘ఇది ఎక్కడో చేతి దెబ్బ కొట్టాడని’ అనుకొని తృప్తి పడతారు. అలా అనుకోకపోతే పాపం వారికి ఆ పూట భోజనం చేసినట్లుండదు’’ అని రాసుకున్నారు. ఇది నాటికి (1924) నేటికి (2024) ఏనాటికి వాస్తవమే కావచ్చు.

రచయిత వాక్యాలలోనే ముగింపు పలుకుతాను: ‘‘ఎవరైనా నాకు నవ్వు ఎప్పుడూ రాదు అంటే అతని శరీరతత్వంలో ఏదో జబ్బు ఉన్నదన్న మాట. లేదూ ఏమైనా సరే నేను నవ్వనని ఎవరైనా భీష్మించుకుని కూర్చుంటే అతనికి కొంచెం దూరంలో ఉండటం మంచిదన్నారు (ఇది కూడా ఓ ఆంగ్ల రచయిత చెప్పినదే సుమండి. నేను గొప్ప ఆంధ్రున్ని మరి)’’.

భమిడిపాటి గౌరీ శంకర్‌

94928 58395

Updated Date - Apr 22 , 2024 | 03:41 AM