Share News

మీడియాపై కక్ష–ప్రజాస్వామ్యంపై దాడి

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:06 AM

‘సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది’. సరిగ్గా 104 సంవత్సరాల క్రితం, 31 జనవరి 1920నాడు ‘మూక్‌నాయక్’ జర్నల్....

మీడియాపై కక్ష–ప్రజాస్వామ్యంపై దాడి

‘సామాజిక వ్యవస్థను ఓ సినిమాలా ప్రేక్షకుడి కోణంలో చూస్తే ఈ దేశం అన్యాయాలకు పెట్టనికోటలా కనిపిస్తుంది. కచ్చితంగా అలానే అనిపిస్తుంది’. సరిగ్గా 104 సంవత్సరాల క్రితం, 31 జనవరి 1920నాడు ‘మూక్‌నాయక్’ జర్నల్ తొలి సంచిక కోసం అంబేడ్కర్ రాసిన తొలి కథనం ప్రారంభ వ్యాఖ్యలు నేటి వైసీపీ గూండాలు మీడియాపై చేస్తున్న దాడులకు అద్దం పడుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మెరుగైన సేవలందించి వారి అభిమానం పొందాల్సిన వారు ప్రతీకారంతో, అధికార బలంతో మీడియాను అణచి వేసి దాడులు చేస్తూ బలపడాలనుకోవడం చేతకానితనం అవుతుంది. ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియాపై దాడులకు పూనుకోవడం బాధాకరం. ప్రజల కోసం వినియోగించాల్సిన అధికారాన్ని మీడియా నోరు నొక్కేందుకు ఉపయోగించే వికృత సంస్కృతి మరోసారి బయటపడింది. వాదనలో నెగ్గలేనివారే భౌతిక దాడులకు దిగుతారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా అంతు చూస్తామంటూ ప్రజాస్వామ్య సంస్థలను బెదిరించేవారు నియంతలు అవుతారు. కానీ ప్రజాస్వామ్యవాదులు కాజాలరు. ప్రజాస్వామ్యంలో నియంతలకు చోటుండదు.

ఒక చెట్టు నుంచి కొన్ని లక్షల అగ్గిపుల్లల్ని తయారు చేయొచ్చు! ఒక అగ్గిపుల్లతో లక్షల చెట్లను కాల్చి బూడిద చేయొచ్చు! అందుకే... వస్తువు గొప్పదనం కన్నా, దాని వినియోగం ముఖ్యమంటారు. అధికారం అడ్డం పెట్టుకోని మీడియాపై దాడులకు పాల్పడుతున్నారు. నేరస్వభావం ఉన్న ముఖ్యమంత్రి ఏలుబడిలో పౌరుల ప్రాథమిక హక్కులను హరించివేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలసూత్రం చట్టం ముందు అందరూ సమానమే. కానీ ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. చొక్కాలు మడతపెట్టండి అంటూ జగన్‌రెడ్డి సభల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థలపై దాడులకు పాల్పడుతున్నారు. జగన్‌రెడ్డి ప్రతి సభలోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 పేరెత్తకుండా సభ ముగించడంలేదు. అంటే వాటిపై ఆయనకు ఎంత అక్కసు ఉందో అర్థమౌతుంది. జగన్‌రెడ్డి నవరత్నాల పేరుతో చేస్తున్న మోసపు సంక్షేమాన్ని మీడియా సంస్థలు ఎండగట్టడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారు. అంతేకాకుండా జగన్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నారని మీడియాపై దాడులు చేయిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తే, విమర్శిస్తే, నిరసిస్తే తట్టుకోలేక విచక్షణా రాహిత్యంతో ప్రజాస్వామిక హక్కుల పీక నులిమి వేయడానికి సిద్ధపడింది జగన్ ప్రభుత్వం. ప్రశ్నించే గొంతులను, మీడియాను ఏదో ఒక విధంగా అణచివెయ్యడమే ఎజెండాగా పెట్టుకొన్నారు. కర్నూలులో కాటసాని సైకో గ్యాంగ్ ఈనాడు కార్యాలయంపై పోలీసుల సమక్షంలో దాడులు చేశారు. రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి విలేఖరిపై తీవ్రంగా దాడులు చేశారు. ఇది ఒక పత్రికా స్వేచ్ఛమీదే జరిగిన దుర్మార్గపు దాడి. పోలీసు యంత్రాంగం ఇప్పటివరకు దాడి చేసిన వారిని అరెస్టు చేయకపోవడం, కనీసం స్పందించకపోవడం చూస్తుంటే వారి పనితీరు ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది. పాత్రికేయుల మీద దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే అవుతుంది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు ఎత్తిచూపడం మీడియా వృత్తి ధర్మం. వాటిని పట్టించుకోకుండా మీడియా మౌనంగా వుంటే ప్రభుత్వం చేస్తున్న నేరాలు, ఘోరాల్లో పాలు పంచుకున్నట్లే అవుతుంది.

ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న సామెత లాగా మీడియా వాచ్ పేరుతో ఆంక్షలు విధించాలని గతంలో జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2007లో జీవోని విడుదల చేస్తే, తండ్రి వారసత్వానికి కొనసాగింపుగా 2019లో జగన్‌ జీవోని విడుదల చేశారు. గతంలో ఏబీఎన్, టీవీ–5, ఈటీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిపేయాలంటూ వైకాపా నాయకులు ఎంఎస్‌వోల మీద బలవంతంగా ఒత్తిడి తెచ్చారు. వాస్తవాలు ప్రజలకు చేరవేస్తున్నారన్న కక్షతో టీవీ–5 కార్యాలయంపై రాళ్ల దాడి, బీఆర్.నాయుడు, సాంబశివరావు, మూర్తి లాంటి సీనియర్ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై అక్రమ కేసు బనాయించిన జగన్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందారు. జగన్ సభలో శ్రీకృష్ణ అనే ఫోటోగ్రాఫర్‌పై దాడికి పాల్పడ్డా ఇంతవరకు బాధితులపై చర్యలు తీసుకోలేదు. తునిలో ఆంధ్రజ్యోతి విలేఖరి కాతా సత్యనారాయణ హత్యకు గురయ్యారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ విలేఖరిపై హత్యాయత్నం, కోనసీమలోని ఐ–పోలవరం ప్రజాశక్తి విలేకరిపై వైసీపీ కార్యకర్తల దాడి, నరసన్నపేట విశాలాంధ్ర విలేఖరిపై దాడులకు పాల్పడ్డారు. అమరావతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెడుతున్నారని కుట్ర పూరితంగా ముగ్గురు విలేఖరులపై అక్రమ కేసులు పెట్టారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ–5 ఛానళ్ల ప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టులు, విలేఖర్లు, మీడియా, పత్రికలపై ప్రభుత్వం జులం చెలాయించి పత్రికా స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం చేస్తోంది.

అద్దాన్ని ద్వేషించడం, అక్షరం పైన యుద్ధం ప్రకటించడం ఏ నాయకుడికైనా శ్రేయస్కరం కాదు. మీడియాపై ఆంక్షలు విధించే దుస్సాహసానికి ఒడిగట్టిన జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఆయన పెత్తందారులను మించిపోవడమే కాదు నియంతలా వ్యవహరిస్తున్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వాహకాలు భయభ్రాంతులకు గురైతే ప్రజలకు నష్టం కలుగుతుంది. ఏమి రాస్తే, ఏమి చెబితే ఎప్పుడు ఎటునుంచి ఎవరు దాడిచేస్తారోనని మీడియా హడలిపోయే దుస్థితి వస్తే ప్రజాస్వామ్యానికి చెడ్డకాలం దాపురించినట్టే. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పాత్రలో అందరూ కచ్చితంగా పాత్రికేయులకు అండగా నిలబడాలి. ఆంధ్రప్రదేశ్‌లో మీడియాపై దాడిని ప్రజాస్వామ్య జీవన విధానంలో విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండించాలి.

కొత్తపల్లి శామ్యూల్ జవహర్

మాజీ మంత్రి

Updated Date - Feb 29 , 2024 | 04:06 AM