Share News

సమాంతర రేఖలు

ABN , Publish Date - Jun 24 , 2024 | 05:55 AM

ఎక్కడో ఆగిపోతారు వాళ్ళు ఆ పాత సంగతులనే దుక్కీ దున్ని పొడవు వెడల్పులను కత్తిరించి అరచేతి పరిమాణానికి ప్రపంచాన్ని కుదించి...

సమాంతర రేఖలు

సమాంతర రేఖలు

1

ఎక్కడో ఆగిపోతారు వాళ్ళు

ఆ పాత సంగతులనే దుక్కీ దున్ని

పొడవు వెడల్పులను కత్తిరించి

అరచేతి పరిమాణానికి ప్రపంచాన్ని కుదించి

2

మనిషి సంకుచితాలన్నీ

అభ్యంతరాలుగా రూపుదిద్దుకుంటాయి!

సాకులని చంకనపెట్టుకుని

ప్రపంచం ఎప్పుడూ కుంటుతూనే ఉంటుంది!

3

ఏ ఇదమిత్థాలలో లేని లోకమా,

బహుశా ప్రేమ బానిసత్వమన్న నెపం వేసి

ఏ దయను తాకవనుకుంటా

4

వ్యాపిస్తున్నట్లుగా కనిపిస్తూ

కుంచించుకుపోవటం నీకు తెలిసిన విద్య

విస్తరించే ప్రతిసారి

గాయాలతో లోపలికి తెరుచుకోవటం

నేను తప్పించుకోలేని బలహీనత!

5

సంకోచ వ్యాకోచాలకి

ఎవరికి అర్థాలు వారే ఇచ్చుకునే

ఆత్మ సంతృప్త జీవులు మనుషులు!

ఓ ప్రపంచమా

అందుకేనేమో...

నువ్వు చెప్పే మరణాలు నావి కాదు

నేను చెప్పే మరణాలు నీవి కాదు!

6

దేని ప్రత్యేకత దానిదే

అన్న వాస్తవాన్ని విస్మరించటం వల్లనేమో

సమాంతర రేఖలుగా మిగిలి

ఇన్ని రాద్ధాంతాలలోకి లాగబడుతున్నాం!

రాళ్ళబండి శశిశ్రీ

74163 99396

Updated Date - Jun 24 , 2024 | 05:55 AM