Share News

సమగ్ర అభివృద్ధికి ఆక్సిజన్ రిజర్వేషన్లు

ABN , Publish Date - May 10 , 2024 | 12:58 AM

భారత రాజ్యాంగం దేశంలో అత్యంత వెనుకబడిన, అణచివేయబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, ఆర్థికంగా బలహీనుల అభివృద్ధికి రిజర్వేషన్ల విధానం ద్వారా ఎంతో దోహదం చేసింది. ఈ విధానం ద్వారా...

సమగ్ర అభివృద్ధికి ఆక్సిజన్ రిజర్వేషన్లు

భారత రాజ్యాంగం దేశంలో అత్యంత వెనుకబడిన, అణచివేయబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, ఆర్థికంగా బలహీనుల అభివృద్ధికి రిజర్వేషన్ల విధానం ద్వారా ఎంతో దోహదం చేసింది. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాల్లో, విద్యాలయాల అడ్మిషన్లు వంటి ప్రక్రియల్లో ఆయా వర్గాల ప్రవేశం సుగమమై వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతుల్లో విస్తృతమైన మార్పులు వచ్చినవి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రిజర్వేషన్ల వ్యవస్థను రద్దు చేయాలన్న ఉద్దేశంలో భాగంగా బీజేపీ తన పదేళ్ల పాలనలో వందకు పైగా ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేసింది. ప్రభుత్వ సంస్థలు తగ్గితే ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గుతాయి. క్రమంగా రిజర్వేషన్లు నామమాత్రంగా మారతాయి. దీనితో పైన పేర్కొన్న వర్గాలన్నిటికీ ప్రాతినిధ్యం తగ్గుతుంది. ఇది బీజేపీ ఉద్దేశం. కాని కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో అణచివేయబడిన వర్గాల ప్రాధాన్యత పెంచటానికి 2024 ఎన్నికల మేనిఫెస్టోలో రిజర్వేషన్ల పరిమితి 50శాతం కంటే ఎక్కువగా పెంచుతామని ప్రకటించింది.


బీజేపీ పదేళ్ల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మటం, అనుయాయులకు ఓడ రేవులు విమానాశ్రయాలు ఇవ్వటం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం మినహా చేసిన అభివృద్ధి ఏమీ లేదు. పైగా ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారంలో తన స్థాయిని దిగజార్చుకుని ముస్లిం రిజర్వేషన్లు వంటి అంశాలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం దురదృష్టకరం. అంతేగాక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు 15శాతం రిజర్వేషన్లు ఇస్తుందని మరో అబద్ధపు ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల పత్రంలో ఎక్కడా వీటి గురించి చర్చలేదు. అయితే భారత్‌లో తీవ్రంగా ఉన్న ఆదాయ అసమానతలను అంచనా వేసి ఆర్థిక విధానాల్లో మార్పులు తీసుకురావడం ద్వారా సంపద సమాన పంపిణీ చేస్తామని, ఆదాయ అసమానతల నిర్మూలన చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో తెలిపింది. ఈ అంశాన్నే మోదీ వక్రీకరించారు.

దేశంలో ముస్లింల సామాజిక వెనుకబాటుతనం ముస్లిం రిజర్వేషన్ల అవసరాన్ని తప్పనిసరి చేస్తున్నది. మన దేశంలో ముస్లింలు భారతీయ మూల సూత్రాలైన ఏకేశ్వరోపాసన, గురు పరంపర, అగ్నిపూజ, నాట్యం, సంగీతం వంటి అంశాలను అనుసరించే సూఫీ మార్గాన్ని అనుసరించేవారు, అంతేకాక, అధికులు పాస్మాండ ముస్లింలు. ముస్లింల స్థితిగతులపై నియమించబడిన రాజీందర్ సచార్, సుధీర్ కమిటీలు ముస్లింలు ఎస్సీ, ఎస్టీల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపినాయి. కాబట్టి ముస్లిం రిజర్వేషన్లు అనేవి మత కోణంలో కాకుండా సామాజిక, ఆర్థిక కోణంలో పరిగణించబడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా 15శాతం కన్నా ఎక్కువగా ఉన్న ప్రధాన మైనారిటీ వర్గం అయిన ముస్లింలను ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావటానికి ఈ రిజర్వేషన్లు దోహదం చేస్తాయి.


రిజర్వేషన్లను 50శాతానికి పెంచాలి అంటే కులగణన తప్పనిసరి. కులగణన ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జనాభా వివరాలు తెలిసిన తర్వాత తదనుగుణంగా రిజర్వేషన్లు అమలైతే వారి ప్రాతినిధ్యం న్యాయంగా పెరిగి సామాజిక అభివృద్ధి సాధ్యపడుతుంది. కులగణన ద్వారా ఆయా వర్గాలకు ప్రత్యేకంగా ప్రణాళికలు, విధానాల రూపకల్పన చేయడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది. దేశంలో 1931 నాటివి మినహా బీసీ గణాంకాలు అందుబాటులో లేవు. కాబట్టి దేశంలో కుల గణన ద్వారా బీసీ జనాభా లెక్కించడం ద్వారా వారి స్థితిగతులను అంచనా వేయవచ్చు. భారతీయ మూలవాసులు, భూమి పుత్రులు అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి కులగణన తప్పనిసరి అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మూలాల ఆధారంగా శూద్రునిగా ప్రకటించుకుని, వారి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కులగణన ద్వారా వారికి ఖచ్చితంగా తగిన రాజకీయ, ఆర్థిక ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పటం గమనార్హం.


రిజర్వేషన్లు, రాజ్యాంగం, కులగణన వంటి అంశాల్లో బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో బీజేపీ యుటర్న్ తీసుకుని మాట మారుస్తున్నది. ఓబీసీ వ్యతిరేకత వల్ల తమ ఓట్లకు గండి పడుతుందని రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచన లేదని వివరణ ఇచ్చుకుంది. కులగణనకు బీహార్‌లో బీజేపీ అనుకూలంగాను, కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగానూ ఉంటూ రెండు నాలుకల ధోరణి అవలంభించటం సిగ్గుచేటు. దీనికి ప్రధాన కారణం దేశంలో కులగణన వల్ల రిజర్వేషన్ల పరిమితిని పెంచాల్సిన అవసరం బైటపడటం, ఇతర అనేక డిమాండ్లు నెరవేర్చాల్సి రావటం. స్వంత రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను బీజేపీ వ్యతిరేకించటం పూర్తిగా ఖండించాల్సిన అంశం.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి కుల గణనకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నారు. గాంధీ అన్నట్లు ‘అన్ని కులాల సమగ్ర ఐక్యతే భారతీయతకు మూలం’. కులగణన ద్వారా రిజర్వేషన్లు పెంచి భారతీయ మూలవాసుల సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది.

డా. రియాజ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి

Updated Date - May 10 , 2024 | 12:58 AM