వికసించని మన పారిశ్రామిక భారతం!
ABN , Publish Date - Jul 30 , 2024 | 03:37 AM
వికసిత భారత్! దీని గురించి జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. సమావేశాలు, గోష్ఠులు, లక్ష్య ప్రకటనలు, విధానాల రూపకల్పనలు.. ఎటుచూసినా వికసిత భారత్ వైపే దేశం కదులుతున్నట్లుగా ప్రచారం హోరెత్తుతోంది...
వికసిత భారత్! దీని గురించి జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. సమావేశాలు, గోష్ఠులు, లక్ష్య ప్రకటనలు, విధానాల రూపకల్పనలు.. ఎటుచూసినా వికసిత భారత్ వైపే దేశం కదులుతున్నట్లుగా ప్రచారం హోరెత్తుతోంది. రాజకీయ దృష్టితో దీన్ని ప్రచారపటాటోపంగా కొట్టివేయటం తేలిక. భిన్న రాజకీయ దృక్పథంతో పెదవి విరవటమూ కష్టం కాదు. వీటికి మించి వికసిత భారత్ భావన సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవాలంటే చాలా విషయాలను స్పృశించాలి. అందుకు మన ఆర్థికాభివృద్ధి చరిత్రలోకి వెళ్లాలి. అదెంత వేగంతో నడిచిందో చూడాలి. ఆ వేగం ఆశించిన రీతిలో కాకుండా అరకొరగా ఉంటే కారణాలను వెతకాలి. ఆర్థిక వికాసానికి, మేధో వికాసానికి సంబంధాలను చూడాలి. అసలు ఈ రెండిటికీ బంధనాల్లాంటివి ఉంటే అవెందుకు ఏర్పడ్డాయో విశ్లేషించాలి. మూడు రోజుల క్రితం దిల్లీలో నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధానమంత్రితో పాటు సీఎంలూ పాల్గొన్నారు. 2047 నాటికి మన ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవాలనే లక్ష్యానికి అనుగుణంగా విధానాలను రూపొందించుకుని, అడ్డంకులను తొలగించుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. స్వాతంత్య్రం పొందిన వందేళ్ల నాటికి (2047) మూడు అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండాలన్నదే వికసిత భారత లక్ష్యం. లక్ష్యం ఘనంగా పెట్టుకోవటంలో తప్పులేదు.
1950 నాటికి ఆర్థికంగా భారత్‌తో సమానస్థాయిలో ఉన్న కొన్ని దేశాలు చాలా ముందుకు వెళ్లాయి. ఆగ్నేయాసియా, చైనాల ఆర్థిక చరిత్ర చూస్తే ఇదే అర్థం అవుతుంది. బంగ్లాదేశ్‌ను పరిశీలించినా కొన్ని రంగాల్లో ఆ దేశం ముందుకు వెళ్లింది. మానవాభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఇది స్పష్టంగా కనపడుతుంది. 2024లో బంగ్లాదేశ్ తలసరి జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) 2,529 డాలర్లు. దారిద్య్రరేఖ (రోజుకు 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయం) దిగువన అయిదు శాతం ప్రజలే ఉన్నారు. సగటు ఆయుర్దాయం 74 ఏళ్లు. శ్రామికశక్తిలో బంగ్లా మహిళల వాటా 43 శాతం ఉంది. ఆ దేశంతో పోల్చితే భౌగోళికంగా భారత్‌కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. అయినా కొన్ని విషయాల్లో వెనుకబడే ఉంది. భారత్‌లో తలసరి జీడీపీ 2484.8 డాలర్లు ఉంటే, దారిద్య్ర రేఖకు దిగువున 12.9 శాతం (2021 నాటికి) ప్రజలు ఇప్పటికీ జీవిస్తున్నారు. మన సగటు ఆయుర్దాయం 68 ఏళ్లే. ఇక శ్రామికశక్తిలో మహిళల వాటా (37శాతం) బంగ్లాతో పోల్చితే తక్కువ. తాజా మానవాభివృద్ధి సూచికలో సైతం బంగ్లాదేశ్ కంటే (129) అయిదు పాయింట్లు (134) దిగువునే ఉన్నాం.
ఇప్పుడు మరికొన్ని దేశాలను చూద్దాం. 1970ల నాటికి సింగపూర్ పరిస్థితి దయనీయంగా ఉండేది. ప్రస్తుతం ఆ దేశ వార్షిక తలసరి జీడీపీ 88450 డాలర్లు. మలేసియా కూడా మంచి స్థితిలోనే (13310) ఉంది. థాయిలాండ్ (7810), చైనా (13140), దక్షిణ కొరియా (34165), భూటాన్ (4010), ఐర్లండ్ (106,060), డొమినికన్ రిపబ్లిక్ (11170).. ఇట్లా ప్రత్యక్ష, పరోక్ష వలస పాలన నేపథ్యం ఉన్న దేశాలను తీసుకున్నా ఎంతో ముందుకు వెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఐర్లండ్‌కు 1922లో బ్రిటన్ నుంచి స్వేచ్ఛ లభించినా 1970ల వరకూ పేద దేశంగానే ఉండేది. ఆ తర్వాత బ్రిటన్‌ను అధిగమించింది. ప్రస్తుత ఐర్లండ్ తలసరి జీడీపీతో పోల్చితే బ్రిటన్ తలసరి జీడీపీ సగం కంటే తక్కువగానే ఉంది.
అశించిన స్థాయిలో భారత్ గణనీయంగా ఆర్థికాభివృద్ధిని సాధించలేక పోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధిలో మనం పెట్టుకున్న లక్ష్యాలను సాధించలేదు. 1950ల నుంచి ఇప్పటి వరకూ జీడీపీలో పారిశ్రామిక రంగం వాటా 20 శాతానికి దాటిన సందర్భాలు అరుదనే చెప్పాలి. వాటా పెరగటం కంటే తరిగిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఇప్పుడూ ఒకప్పుడూ అగ్రరాజ్యాలుగా ఉన్న దేశాలన్నీ పారిశ్రామిక రంగంలో గణనీయ అభివృద్ధిని సాధించిన తర్వాతే ఆ స్థాయికి చేరుకున్నాయి. 1950ల నుంచి పారిశ్రామికాభివృద్ధి పరంగా మనం సరైన గాడిలో నడిచిన సందర్భాలు చాలా తక్కువ. దీనిమీద ప్రముఖ ఆర్థికవేత్త సుమిత్ కె.మజుందార్ తన ‘లాస్ట్ గ్లోరీ–ఇండియాస్ క్యాపిటలిజం స్టోరీ’ అన్న పుస్తకంలో మంచి విశ్లేషణే చేశారు. 2013–2014 వరకూ సుమిత్ చేసిన పరిశీలనలో ఒకటి మాత్రం స్పష్టంగా వెల్లడైంది. 1950ల నుంచి 2013– 14 వరకూ అంటే 63 ఏళ్ల కాలంలో సేవలరంగమే ప్రధాన పాత్ర వహించింది. ఆ కాలం నాటి సేవల రంగం వార్షిక సగటు వాటా 48 శాతం ఉంది. ఆర్థిక సంస్కరణలతో (1991) సేవలరంగం మరింత ఊపందుకున్న మాట నిజమే. అంతకు ముందు కూడా దాని ప్రాధాన్యం తక్కువ కాదు. ఇక ఇదే కాలంలో పారిశ్రామికరంగం వార్షిక సగటు వాటా 18 శాతానికి మించలేదు. వ్యవసాయం వాటా 34 శాతం వరకూ ఉంది. 63 ఏళ్ల సగటును కాకుండా 2010 తర్వాత పరిస్థితినే తీసుకుంటే వ్యవసాయ రంగం వాటా (14శాతం) బాగా తగ్గిపోయింది. అదింకా క్షీణిస్తూనే ఉంది. దీనికి బదులు పారిశ్రామిక రంగం వాటా పెరిగిందా? అంటే అదీ లేదు. యథాప్రకారం సేవల రంగం (66శాతం) వాటానే విపరీతంగా పెరిగింది. స్పష్టంగా చెప్పుకోవాలంటే వ్యవసాయరంగ ఆధిక్యత నుంచి సేవలరంగం ప్రాబల్యంలోకి మన ఆర్థిక వ్యవస్థ అడుగుపెట్టింది. దీర్ఘ దృష్టితో చూస్తే దేశంలో పారిశ్రామిక రంగం ఎప్పుడూ ఆధిక్యతను ప్రదర్శించ లేదు. అందుకే పారిశ్రామికాభివృద్ధికి చేదోడువాదోడుగా నిలిచే మేధోవికాసమూ మనకు అరకొరగానే జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మనదంటూ చెప్పుకోదగిన ప్రభావిత ఆవిష్కరణలూ కనపడలేదు. ఆ ఆవిష్కరణలతో సమాంతరంగా పెంపొందే శాస్త్రీయ ఆలోచనా విధానమూ సమగ్రంగా బలపడలేదు. వ్యవస్థీకృత రంగంలో కార్మికవర్గం గణనీయ శక్తిగా ఎదగలేదు. అభివృద్ధి చెందిన దేశాలన్నీ పారిశ్రామిక రంగాన్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుని ఆర్థికంగా సుసంపన్నం అయిన తర్వాతే సేవల రంగాన్ని విస్తరించుకున్నాయి.
బలమైన పారిశ్రామిక రంగం లేకుండా కేవలం సేవలరంగం ఆధిక్యతతో సుసంపన్నం అవుతామని అనుకోవటం ఇప్పటికీ ప్రశ్నార్థకమేనన్నది సుమిత్ మజుందార్ అభిప్రాయం. ఆదాయంలో భారత్ కంటే ముందున్న ఆసియా దేశాల్లో పారిశ్రామిక రంగం వాటా 40 శాతం దాకా ఉంది. ఉత్పాదక సామర్థ్యం కూడా చాలా మెరుగ్గా నమోదైంది. సాధించాలనుకున్న పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యంలో అయిదో వంతుకు కూడా భారత్ చేరుకోలేదు. అలా చేరుకుని ఉంటే మన జాతీయాదాయం ఎన్నో రెట్లు పెరిగేది. ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం వాటా అయిదింట రెండు వంతులకు చేరుకుంటే మన పరిస్థితి భిన్నంగా ఉండేది. 11.5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థకు ఎప్పుడో చేరుకుని ఉండే వారం. చైనాకు దరిదాపుల్లో నిలిచేవాళ్లం. సామర్థ్యం లోపించిన పారిశ్రామిక రంగంతో మనం ఆర్థికంగా చేరుకోగలిగిన స్థాయిలో 20 శాతం మాత్రమే సాధించగలిగాం. అనేక అభివృద్ధి కొలమానాల్లో భారత్ పేద దేశంగా ఉండటానికి ఇదే ప్రధాన కారణం. వివిధ పార్టీలకు చెందిన ప్రభుత్వాలు పారిశ్రామికాభివృద్ధి ప్రాధాన్యత గురించి చాలానే చెప్పాయి. పంచవర్ష ప్రణాళికల లక్ష్యాల్లోనూ ఇదే కనపడింది. చివరికి 1991 నాటి ఆర్థిక సంస్కరణల ప్రధాన లక్ష్యమూ ఘనమైన పారిశ్రామికాభివృద్ధిని సాధించటమే. ఆత్మనిర్భర్–మేకిన్ ఇండియా ప్రకటనల పరమార్థమూ అదే! ఇక ఉద్యోగ కల్పనలో వ్యవస్థీకృత పారిశ్రామిక రంగం వాటా చాలా తక్కువ. 2015 నాటికి ఒక శాతం జనాభానే ఈ రంగంలో ఉపాధిని పొందుతున్నారు. చిన్నాపెద్దా అన్ని కలిపి మొత్తంగా తయారీ రంగాన్ని తీసుకున్నా 13 మిలియన్ల మంది మాత్రమే అందులో ఉన్నారు.
స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యంలో కొంత మెరుగుదల కనిపించింది. కానీ ఆ తర్వాత 1960ల నుంచి 1980ల చివరి వరకూ ఆశించిన స్థాయిలో అది పెరగలేదు. ఆర్థిక సంస్కరణల తర్వాత కొంత ఎదుగుదల కనపడినా లక్ష్యాలకు చాలా దూరంలోనే ఉండిపోయింది. క్యాపిటలిజం అంటేనే పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచటం. ఇందులో వెనుకబడిన చోట పారిశ్రామిక పురోగతి సాధ్యం కాదు. ఈ పరిస్థితిలో గణనీయ మార్పు లేకుండా వికసిత భారత్ లక్ష్యాలు నెరవేరుతాయా? అన్నది పెద్ద ప్రశ్నార్థకమే!
గరిష్ఠ లాభాల కోసమే వెంపర్లాడే ప్రైవేటు రంగం విశాల దృష్టితో జాతీయ అభివృద్ధికి తోడ్పడే రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటం, కుల–మత రాగద్వేషాలకు అతీతంగా సమర్థతకు పెద్దపీట వేస్తూ సంస్థల నిర్వహణకు పూనుకుంటూనే ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది ఎంతో కొంత వాస్తవరూపం దాల్చుతుంది. గత అనుభవాలనూ, మన ప్రైవేటు రంగం స్వభావాన్నీ దృష్టిలో ఉంచుకుని ఇదంత తేలికగా సాకారమయ్యే పరిస్థితి లేదని సుమిత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానంతో ఏకీభవించకపోయినా ఆయన వ్యక్తంచేసిన సందేహాన్ని తేలికగా కొట్టిపారేయలేం. సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, నూతన ఆవిష్కరణల జోలికి వెళ్లకుండా, అమ్మకాలు–కొనుగోలు లావాదేవీలతో లాభాలు గడించాలన్న లక్షణం భారత వ్యాపారవర్గానికి వారసత్వంగా రావటం వల్ల కూడా పారిశ్రామిక రంగంలో పురోగతి సాధించలేక పోయామని సుమిత్ పేర్కొన్నారు. ఇక రాజకీయ వర్గంతో పాటు అధికారవర్గమూ ఆశ్రిత పెట్టుబడిదారులకు అండదండలు అందించింది. దీంతో పోటీ తత్వం దెబ్బతిని పారిశ్రామిక ఉత్పాదక సామర్థ్యాన్ని పెరగనీయకుండా చేసింది. పరిశ్రమల ప్రారంభానికి కఠినమైన రీతిలో లైసెన్స్, పర్మిట్ వ్యవస్థను అమలుపరచటం, ఉత్పత్తులకు కోటాలను ప్రభుత్వమే కఠోరంగా నిర్ణయించటంతో 1991కు ముందు పారిశ్రామిక రంగంలో నిజమైన పోటీలేకుండా చేసింది. ఆర్థిక సంస్కరణల అనంతరం ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అనుచిత లబ్ధినిపొందటం ఇంకా సాగుతూనే ఉంది.
75 ఏళ్ల చరిత్రను చూస్తే వికసిత భారత్ సాకారం కావటం అనేక సవాళ్లతో కూడినదిగా స్పష్టమవుతుంది. ఉత్పాదక సామర్థ్యానికి అడ్డుగా నిలుస్తున్న ఎన్నో జాడ్యాలను వదిలించుకోవాలి. పారిశ్రామిక, సమాచార సాంకేతిక విజ్ఞానంలో సొంతముద్రను వేయగలగాలి. గతమంతా ఘనమనుకునే సంకుచిత ధోరణికి స్వస్తిపలకాలి. బహుళ సంస్కృతుల సమాజాన్ని నిత్యం భయపెట్టే ఉన్మాద రాజకీయాలకు వీడ్కోలు చెప్పాలి.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)