Share News

‘మా గాడ్ బాబాసాహెబ్.. గాడ్‌ఫాదర్ బాబు’

ABN , Publish Date - Jul 31 , 2024 | 01:51 AM

జీవితమంతా పేదరికం.. ఎటుచూసినా వివక్ష.. అణచివేత.. అన్యాయం.. అంటరానితనం.. ఆకలి.. దిక్కులేని బతుకులు.. శతాబ్దాల దాష్టీకానికి చరమగీతం పాడుతూ దళిత జనోద్ధరణకు బాబా సాహెబ్ అంబేడ్కర్ దిక్కయి...

‘మా గాడ్ బాబాసాహెబ్.. గాడ్‌ఫాదర్ బాబు’

జీవితమంతా పేదరికం.. ఎటుచూసినా వివక్ష.. అణచివేత.. అన్యాయం.. అంటరానితనం.. ఆకలి.. దిక్కులేని బతుకులు.. శతాబ్దాల దాష్టీకానికి చరమగీతం పాడుతూ దళిత జనోద్ధరణకు బాబా సాహెబ్ అంబేడ్కర్ దిక్కయి నిలిచాడు. రాజ్యాంగబద్ధంగా హక్కులు ప్రసాదించాడు. అవి అమలు చేసే నేతలు, పార్టీలు తమ చెప్పుచేతల్లోని దళితులకే పదవులు కట్టబెట్టారు. డబ్బున్న దళితనేతలనే చేరదీశారు. వారి వారసులకే పదవులు పందేరం చేశారు. దశాబ్దాల రాజకీయ వివక్ష నుంచి దళితులకు స్వాతంత్ర్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ‘అన్న’ నందమూరి తారకరామారావు ఆరంభించిన తెలుగుదేశం–దళిత తేజంను చంద్రబాబు కొనసాగించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దళితజాతి మూలాల నుంచి, మారుమూల దళితపల్లెల నుంచీ.. అసలు సిసలు దళిత ప్రతినిధులను ఏరికోరి తెచ్చి మరీ సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు. దళితజాతి అభ్యున్నతికి పాటుపడాలి అంటూ మాపై జాతి రుణం తీర్చుకునే బాధ్యత పెట్టారు.


అనంత‌పురం జిల్లా, సింగ‌న‌మ‌ల మండ‌లం, అలంక‌రాయునిపేటలో ఎస్సీ (మాదిగ) కులానికి చెందిన చిన్న రైతు కుళ్లాయ‌ప్ప కొడుకు ఎమ్మెల్యే అవుతాడ‌ని క‌ల‌లో కూడా నా తండ్రి ఊహించి ఉండ‌డు. ప్ర‌జాస్వామ్య దేవాల‌యంలో ‘ఎంఎస్ రాజు అను నేను..’ అని ప్ర‌మాణం చేసే అర్హ‌త క‌ల్పించింది బాబాసాహెబ్ అంబేడ్కర్ అయితే.. అవ‌కాశం ఇచ్చింది టీడీపీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు. అణ‌గారిన వ‌ర్గాల‌కు రాజ‌కీయ అవ‌కాశాలు ద‌క్కిన‌ప్పుడే ప్ర‌జాస్వామ్యం ప‌రిపుష్టం అవుతుంద‌ని పోరాడిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశ‌యాన్ని చంద్ర‌బాబు ఆచ‌ర‌ణ‌లో పెట్ట‌డంతో నాలాగే 2024 ఎన్నిక‌ల్లో 24 మంది ఎస్సీలం శాస‌న‌స‌భ్యులుగా గెలిచాం. మా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. మా తాత‌లు, తండ్రులు క‌నీసం వార్డు మెంబ‌ర్లు కూడా కాదు. మా వెనుకా ఎవ‌రూ లేరు. మా ముందూ ఎవ‌రూ లేరు. మా ముందు నిలిచింది అంబేడ్కర్ మ‌హాశ‌యుడు. నేనున్నానంటూ మా వెన‌క నిలిచింది చంద్ర‌బాబు. ఫాద‌ర్లు త‌ప్పించి గాడ్‌ఫాద‌ర్లు లేని తొలిసారి ఎన్నికైన ద‌ళిత ఎమ్మెల్యేలం మేమంతా. మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ చేరుకుని అక్క‌డ అంబేడ్కర్ ఘాట్‌ చైత‌న్య‌భూమిలో అంబేడ్కర్ మ‌హాశ‌యునికి ఘ‌న‌నివాళులు అర్పించాం. బాబాసాహెబ్ మాట‌, బాబు బాట‌లో ప‌య‌నిస్తూ.. ఎన్నుకున్న ప్ర‌జ‌లకు, అణ‌గారిన వ‌ర్గాల‌కు సేవ‌చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశాం.


ప్రపంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌ం భార‌తదేశం. ఈ దేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ అణగారిన వర్గాల హక్కుల కోసం ఎనలేని కృషి చేశారు. దేశ సామాజిక వ్యవస్థలో అసమానతలు అంతమొందించేందుకు త‌న జీవితాంతం ప‌నిచేశారు. సామాజిక వ్యవస్థలో సమూల మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నం చేయాలని భావించిన అంబేడ్కర్ ‘బోధించు–స‌మీక‌రించు –పోరాడు’ అని నిన‌దించారు. అణ‌గారిన వ‌ర్గాల‌కు విద్య, విజ్ఞాన‌, రాజ‌కీయ రంగాల్లో ప్ర‌వేశించే అర్హత రాజ్యాంగం ద్వారా క‌ల్పించారు. రాజ్యాంగం అమ‌లైన ద‌శాబ్దాల త‌రువాత కూడా అస‌మాన‌త‌లు పొడ‌సూపుతూనే ఉన్నాయి. ఈ స‌మ‌యంలోనే అణ‌గారిన వ‌ర్గాల‌కు అండ‌గా తెలుగుదేశం పార్టీ జెండాని నిలిపారు మ‌హానాయ‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావు. అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తికి అహ‌ర‌హం శ్ర‌మిస్తున్న చంద్ర‌బాబు ద‌ళిత బ‌హుజ‌నుల సామాజిక‌, ఆర్థిక‌, రాజ‌కీయ వికాసానికి ఎన‌లేని కృషి చేస్తున్నారు. దళితజాతి ప్రగతి కోసం గళం ఎత్తండి.. నిలదీయండి.. నినదించండి.. అంటూ యువ దళిత సైన్యాన్ని తయారు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.

మడకశిర నుంచి నేను, పూతలపట్టు నుంచి సామాన్య జ‌ర్న‌లిస్ట్‌ అయిన మురళీ మోహన్, పార్వతీపురం శాసనసభ్యులుగా ఎటువంటి రాజ‌కీయ నేప‌థ్యంలేని విద్యావంతుడు బోనెల విజయ్‌చంద్ర, నందికొట్కూరు నుంచి సామాన్య టీడీపీ కార్య‌క‌ర్త అయిన‌ జయసూర్య, కోడుమూరు నుంచి నిరుపేద ద‌ళితుడు ద‌స్త‌గిరి, గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకటరాజు, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాస్ ఎన్నికై స‌గ‌ర్వంగా శాస‌న‌స‌భ‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశామంటే.. అది అంబేడ్కర్ ఇచ్చిన హక్కు– తెలుగుదేశం పార్టీ, చంద్ర‌బాబు ప్ర‌సాదించిన వ‌రం. మా కంటే ముందు మా ద‌ళిత తేజాలు పార్ల‌మెంటు స్పీక‌ర్‌గా జీఎంసీ బాల‌యోగి, అసెంబ్లీ స్పీక‌ర్‌గా ప్ర‌తిభా భార‌తిల‌కు ప‌ట్టం క‌ట్టింది తెలుగుదేశం పార్టీయే, చంద్ర‌బాబుగారే.

ఎంఎస్ రాజు

మడకశిర ఎమ్మెల్యే

Updated Date - Jul 31 , 2024 | 01:51 AM