Share News

ప్రజాస్వామ్య భారతానికి అండ మన రాజ్యాంగం

ABN , Publish Date - Nov 26 , 2024 | 05:33 AM

‘‘రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం మాత్రమే కాదు, ఇది జీవన వాహనం. దాని ఆత్మ నిత్యం యుగస్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అన్న అంబేడ్కర్‌ మాటలు చెరగని సత్యాలు. మన రాజ్యాంగ నిర్మాతలు వ్యక్తి ఆధారిత వికాసాన్ని...

ప్రజాస్వామ్య భారతానికి అండ మన రాజ్యాంగం

‘‘రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం మాత్రమే కాదు, ఇది జీవన వాహనం. దాని ఆత్మ నిత్యం యుగస్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది’’ అన్న అంబేడ్కర్‌ మాటలు చెరగని సత్యాలు. మన రాజ్యాంగ నిర్మాతలు వ్యక్తి ఆధారిత వికాసాన్ని ఆశిస్తూ దేశానికి ఆచరణీయ పాలనా నమూనాను రూపొందించారు. గత ఏడున్నర దశాబ్దాలుగా దేశానికి దిక్సూచిగా పనిచేస్తున్న రాజ్యాంగ అమలును పరిశీలిస్తే దీని నిర్మాతల దార్శనికత దేశ ప్రజలకు తెలుస్తుంది.


12 భాగాలు, 395 అధికరణలు, దేశకాలానుగుణంగా కొత్త విషయాల్ని జోడించిన 106 సవరణలతో కూడిన రాజ్యాంగం సుమారు ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లేందుకు ప్రధాన భూమికను వహిస్తోంది. స్వాతంత్ర్యోద్యమ ఫలితంగా సాధించిన స్వయం పాలనలోంచి, స్వేచ్ఛావాయువుల్లోంచి ప్రజలే మన రాజ్యాంగాన్ని రాసుకున్నారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన మన రాజ్యాంగం పురాతన భారతీయ సంప్రదాయాల మీద నిర్మితమైనది. నాలుగు వేల సంవత్సరాల చరిత్రలో ఈ దేశ ప్రజల అనుభవాలు రాజ్యాంగంలో నిక్షేపితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఆధునిక రాజ్యాంగాలు చాలా విఫలమయ్యాయి. కాని భారత రాజ్యాంగం అలా కాకుండా నిలిచి వెలుగుతున్నది.

ప్రతి భారతీయ పౌరుడూ కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా స్వేచ్ఛగా తన భావాలను, అభిప్రాయాలను వెల్లడించగలుగుతున్నారంటే అది భారత రాజ్యాంగం సాధించిన గొప్ప విజయమనే చెప్పాలి. అధికరణ 19(1)ఎ భారతీయ పౌరుల్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెర్సస్‌ రాజ్‌ నారాయణ్‌కి సంబంధించిన కేసులో ప్రతి భారతీయ పౌరుడూ సమాచారాన్ని స్వీకరించడంతో పాటు వ్యాప్తి చేసే హక్కును కలిగివున్నాడని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం, మత సహనం, అందరికీ సమాన అవకాశాలు, అట్టడగు వర్గాల కోసం ప్రత్యేక చట్టాలు, సంక్షేమ కార్యక్రమాలు భారత రాజ్యాంగం ప్రసాదించింది. రాజ్యాంగ రచనలో కార్యదక్షత వహించిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సంపూర్ణ ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించారు. సమ ప్రజాస్వామ్య పద్ధతుల్ని రాజ్యాంగ పరిషత్తు తీసుకొచ్చింది. వ్యత్యాసం లేని ప్రజాస్వామ్యాన్ని తీర్మానించింది. పరిపూర్ణ ప్రజాస్వామ్యానికి రాజ్యంగ రచయితలు పునాదులు వేశారు.


ప్రజల ఆర్థిక, సాంఘిక జీవితంలో విప్లవాత్మక మార్పులను రక్తపాతం లేకుండా తీసుకొచ్చే ప్రక్రియే ప్రజాస్వామ్యం అని ఈ సందర్భంలోనే డాక్టర్‌ అంబేడ్కర్‌ పేర్కొన్నారు. ఇటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్యాలు రక్తమాంసాల పాత్ర పోషిస్తాయని వివరించారు. కులం ద్వారా వచ్చిన వెనుకబాటుతనంతో ఉత్పత్తి కులాలు అణచివేతకు గురయ్యాయని, వీటిని అధిగమించాలంటే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థే దివ్యఔషధమనీ ఆయన అన్నారు. ఎటువంటి వాదప్రతివాదాలూ లేకుండానే పరిషత్‌ దీనిని ఆమోదించింది. ఈ నేపథ్యంలోనే వివిధ వర్గాల ప్రజల మధ్య ఐక్యతను సాధించేందుకు వివిధ సంక్షేమ విధానాలు రూపొందాయి. సహృదయ భావజాలాన్ని పెంపొందించే నిర్ణయాలు కూడా జరిగాయి. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షునిగా డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్‌ సమావేశంలో ప్రజాస్వామ్య మూలాలు భారతీయుల వారసత్వ సంపద అన్నారు. జె.ఎస్‌.మిల్‌, హెరాల్డ్‌ లాస్కీ, మెకావర్‌ చెప్పిన పాశ్చాత్య ప్రజాస్వామ్యం భారతదేశానికి సరిపడదని అంబేడ్కర్‌ పేర్కొన్నారు. భారతదేశ సామాజిక చట్రం అందుకు భిన్నంగా ఉందన్నారు.


వివిధ కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా, భాషలుగా, సంస్కృతులుగా విభజన చెందిన ఈ సమాజం, ‘ఏకతా’ భావనకు చేరుకోవడానికి అవసరమైన మానసిక పరివర్తనను పెంపొందించే రాజకీయవ్యవస్థ అవసరాన్ని రాజ్యాంగ పరిషత్‌ తెరమీదికి తీసుకొచ్చింది. ప్రజల మనోభావాలకు అనుగుణంగా మార్పులు, చేర్పులకు అవకాశం వుండాలని సభ్యులు కోరుకున్నారు. ఇది సమాజ ఆశయాలను, ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి. రాజ్యాంగం అందించిన ప్రాథమిక హక్కులు నిర్లక్ష్యానికి గురికాకూడదు. దీనిని విస్మరించి పాలకులు స్వప్రయోజనాల కోసమే పనిచేస్తే, బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమం కుంటుబడుతుంది. ఇక్కడే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే రచనాసంఘం ప్రజాస్వామ్యమంటే కేవలం ప్రభుత్వ ఏర్పాటు ఒకటే కాదని వివరణ ఇచ్చింది. ప్రజాస్వామ్యం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగినప్పుడే ఓటుహక్కు విలువ తెలుస్తుందని రాజ్యాంగ పరిషత్తు భావించింది. రాజకీయపార్టీల లక్ష్యాలు, వారి కార్యాచరణను ప్రజలు అంచనా వేయగలగాలనేది వారి ఉద్దేశం. అప్పుడే పారదర్శకంగా ఓటుహక్కు వినియోగించుకోగలుగుతారన్నారు. రాజ్యం – కులం – మతవ్యవస్థల ఉనికి, స్వరూపస్వభావాలు మనిషిని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకున్నప్పుడే సంపూర్ణ ప్రజాస్వామ్యం మనగలుగుతుందని రచనా సంఘం పేర్కొంది. అందుకే ‘‘ఒకవ్యక్తి – ఒకే ఓటు, ఒక ఓటు – ఒకే విలువ’’ అనే సూత్రానికి అవిశ్రాంతంగా కృషి జరిగింది. ఇది ఆచరణలోకి వచ్చే వరకు డాక్టర్‌ అంబేడ్కర్‌ చాలా కృషి చేశారు.


రచనా సంఘం మూడు రకాల ప్రజాస్వామ్యం గురించి చర్చించింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సిద్ధాంత ప్రాతిపదికగా కలిగిన జీవనవిధానం సామాజిక ప్రజాస్వామ్యం. ప్రజల మధ్య ధనిక, పేద వ్యత్యాసాలు తగ్గిపోయి సామాజిక సహజీవనానికి బాటలు వేసేది ఆర్థిక ప్రజాస్వామ్యం. పెట్టుబడిదారీ ఆర్థిక విధానం కొన్ని సందర్భాల్లో ప్రజాస్వామ్య లక్ష్యాలకు అడ్డంకిగా నిలుస్తుందన్నారు. ఈ విధానంలో వ్యక్తి స్వేచ్ఛ, ఇతర హక్కులకు సైతం రక్షణ కొరవడుతుంది. అందుకే శ్రేయోరాజ్యాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపనకు తగిన ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. రాజ్యాంగం ద్వారా బలహీనవర్గాలు జీవనోపాధి పొందే విధంగా వీటిని రూపొందించారు. సామాజిక వనరుల మీద యాజమాన్య నియంత్రణ ప్రజలకే వుండాలని పరిషత్‌ ఆకాంక్షించింది. సంపద, ఉత్పత్తికారకాలు ఏ కొద్దిమంది చేతుల్లోనో కేంద్రీకృతం కాకూడదని, బలహీనవర్గాల విద్య, ఉపాధి ఆర్థిక విషయాలను రాజ్యమే పరిరక్షించాలని ఆశించారు. ఆదేశిక సూత్రాల అమలు ద్వారా ఆదర్శ ప్రజాస్వామ్యాన్ని నిర్మించవచ్చని, ఇటువంటి కార్యాచరణ సాధ్యం కావాలంటే ప్రభుత్వమే ఈ బాధ్యత వహించాలనేది రచనా సంఘం తరుపున అంబేడ్కర్‌ సూచించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనితీరు బాగుంటేనే అది వర్ధిల్లుతుంది. దీనికి ప్రధానంగా రెండు విషయాలు మూలస్తంభాలుగా నిలవాలి. ఒకటి సమర్థవంతమైన పాత్రపోషించగల ప్రతిపక్షం, రెండు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోగల పరిస్థితులు. ఇవి ఉన్నప్పుడే అణగారిన ప్రజానీకం విముక్తి సుసాధ్యమవుతుంది.


ప్రజాస్వామ్యం అంతరించిపోతే ప్రజల ఆకాంక్షలు నీరుగారిపోతాయన్నది రచనా సంఘం హెచ్చరిక. రాజకీయ పార్టీల బాధ్యతాయుతమైన పాలనతోనే రాజ్యాంగం మనగలుగుతుంది. ఈ సందర్భంలోనే దేశీయ రాజనీతి సిద్ధాంతకర్తలు నాడు రాజ్యాంగాన్ని కొనియాడారు. సమైక్య జీవన వేదంగా ఈ ముసాయిదా సాక్షాత్కరిస్తుందన్నారు. అంఖండ భారతాన్ని నిర్మించి పటిష్టపరిచిన రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుని ఉత్సవంగా జరుపుకుందాం.

డా. జీకేడీ ప్రసాద్‌

(నేడు భారత రాజ్యాంగ అమృతోత్సవం)

Updated Date - Nov 26 , 2024 | 05:33 AM