Share News

నూట అరవై ఏడేళ్ల క్రితం...

ABN , Publish Date - Mar 08 , 2024 | 01:23 AM

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో పనిగంటల తగ్గింపు కోసం, పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పన కోసం, పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలని 1857 మార్చి 8న యువతులు తొలి అడుగు వేశారు....

నూట అరవై ఏడేళ్ల క్రితం...

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో పనిగంటల తగ్గింపు కోసం, పని ప్రదేశాల్లో సౌకర్యాల కల్పన కోసం, పురుషులతో సమానంగా వేతనం ఇవ్వాలని 1857 మార్చి 8న యువతులు తొలి అడుగు వేశారు. ఇది 146 మంది కాల్చివేతకు దారి తీసింది. ఈ వీర నారీమణుల బలిదానం ఆధునిక మహిళల అభ్యున్నతికి, తదుపరి సాధించిన సాధికారతకి, విజయాలకి, విశ్వాసాలకి స్ఫూర్తిగా నిలిచింది.

‘కమ్యూనిస్టు భూతాన్ని’ ప్రపంచం నుంచే తరిమేయాలని భావించిన అమెరికా గడ్డపైనే స్త్రీ కార్మికులు చేసిన గర్జన విజయం సాధించటమే గాక, అంతర్జాతీయంగా మహిళా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకమైన రోజుగా మార్చి 8ని నిలిపింది. ఇవే సమస్యలపై పురుష కార్మికులు చేసిన ఉద్యమానికి మే 1– ప్రపంచ కార్మిక దినోత్సవం (మే డే)గా అవతరించింది. ఇలా స్త్రీ, పురుష కార్మికుల దీక్షా దినాలకి అమెరికా గడ్డ వేదికగా మారింది.

ఆకలి కడుపులతో చావటం కన్నా పోరాడుతూ చావటం మేలు అంటూ తెగువ ప్రదర్శించిన ఈ యువతుల్ని బయటకు వెళ్లకుండా గేట్లు మూసివేసి కాల్పులు జరిపిన యాజమాన్యాల కర్కశత్వం చూసి మహిళాలోకమే కాదు యావత్‌ మానవజాతి నివ్వెరపోయింది. భవిష్యత్‌ పోరాటాలకు స్త్రీ జాతిని ఈ సంఘటన సమాయత్తం చేసింది. 1910లో కోపెన్‌హెగెన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సు ఈ రోజుని శ్రామిక మహిళా దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చింది. చాలాకాలం తర్వాత 1975లో దీన్ని ఆమోదించి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించగా, భారతదేశం కూడా దీన్ని పాటిస్తోంది. సుదీర్ఘకాలం జరిగిన ఈ కృషిలో జర్మన్‌ కమ్యూనిస్టు నాయకురాళ్ళు క్లారా జెట్కిన్‌, రోజా లగ్జెంబర్గ్‌, కారల్‌ మార్క్స్‌ కుమార్తె ఎలినార్‌, సోవియట్‌ తొలి మహిళా మంత్రి కొల్లంతోయ్‌ల పాత్ర ఉంది. 1917లో జారు పతనంతో ఏర్పడిన సోవియట్‌ యూనియన్‌ మహిళలకు ఓటు హక్కు ఇవ్వటంతో పాటు చట్టసభలకు కూడా వారిని ఎన్నిక చేసింది.

దీంతో 1917లోనే నార్వే, డెన్మార్క్‌లు, 1918లో ఇంగ్లండ్‌, 1920లో అమెరికా మహిళలకు ఓటుహక్కు కల్పించాయి. అయినా చట్టసభల్లో స్త్రీల ప్రాతినిధ్యం అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకొనే వాటిలో ఆశించిన స్థాయిలో పెరగలేదు. మనదేశం అయితే గత సంవత్సరం గణాంకాలలో 193 దేశాల సూచీలో 143వ స్థానంలో ఉంది. 1996లో రాజ్యసభ ఆమోదించిన మూడోవంతు రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో నెగ్గటానికి 27 సంవత్సరాలు పట్టటం మహిళల పట్ల మన అధికార రాజకీయ పక్షాలకున్న అభిమానంలోని డొల్లతనాన్ని ఎత్తి చూపుతుంది.

మహిళల అభ్యున్నతికోసంగా చెప్పబడే అనేక చట్టాలు – బాల్య వివాహాల నిషేధ చట్టం (1922), ప్రత్యేక వివాహ చట్టం (1955), వరకట్న నిరోధక చట్టం (1961), సమాన పనికి సమాన వేతనం చట్టం (1976), కుటుంబ కోర్టు చట్టం (1984), మహిళల్ని అసభ్యంగా చిత్రించటాన్ని నిరోధించే చట్టం (1986), ఆస్తి హక్కులో సమాన హక్కు (1986), భ్రూణ హత్యల నిరోధక చట్టం (1994), ర్యాగింగ్‌ నిరోధక చట్టం (1997), గృహహింస నిరోధక చట్టం (2005), ఇవిగాక ఐపీసీలో 498(ఎ), 376, 354 లాంటి చట్టాలేగాక, 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్త్రీలకు రిజర్వేషన్‌ కల్పించటం లాంటి అనేక చట్టాలు రూపొందించినా కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల్లో ఏర్పడిన జడత్వం కారణంగా స్త్రీలకు ఆశించిన ప్రయోజనాలు అందటం లేదు.

శాసనాలు చేయటం నాణేనికి ఒకవైపు కన్పడుతున్నా మరోవైపు ఆచరణలో వైఫల్యాలు గణనీయంగా కన్పిస్తున్నాయి. రాజ్యాంగం (14వ అధికరణ) లింగ వివక్షతని నిషేధిస్తున్నా అడుగడుగునా అది దర్శనమిస్తుంది. వైద్యరంగం ఎంతో ఆధునికతను, సాంకేతికతను సంతరించుకున్నా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఐదు లక్షల ప్రసూతి, ఇతర గర్భ సంబంధ సమస్యలతో మహిళలు మృతి చెందుతున్నారు. ఈ రేషియో యూరప్‌, ఆఫ్రికాల మధ్య 1:180గా ఉండటం ప్రపంచం ఎలా అసమతుల్యతతో ఉందో అర్థమవుతుంది. గత దశాబ్దకాలంలో మన దేశంలో మహిళలకు వ్యతిరేకంగా జరిగిన నేరాలు 22 లక్షల 40 వేలు అని గణాంకాలు చెబుతున్నాయి. 2022లో 4 లక్షల 4 వేల కేసులు నమోదైతే, 2023లో 4 లక్షల 45 వేల కేసులు నమోదయ్యాయి. ఈ 22 లక్షల కేసుల్లో 498(ఎ) వరకట్న వేధింపుల కేసులే 9 లక్షలున్నాయి. స్త్రీకి ఏ మాత్రం రక్షణలేని రాష్ట్రాలుగా ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలు ఉండగా; నాగాలాండ్‌, కేరళ, తమిళనాడులు సేఫ్‌జోన్‌లో ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు మధ్యస్థంగా 15, 16 స్థానాల్లో ఉన్నాయి. నగరాల విషయంలో ఢిల్లీ రక్షణ లేమిలో ప్రథమస్థానంలో నిలవగా, చెన్నై సేఫ్‌జోన్‌లో ఉంది. జాతీయ నేర సమాచార బ్యూరో తెలుపుతున్న ఈ వివరాలు చట్టాల వల్ల స్త్రీలకు రక్షణ జరగదనే వాస్తవాన్ని నిరూపిస్తున్నాయి. చట్టం అమలుపరిచే విధానం క్రియాశీలకమై, నిజాయితీ కూడి ఉండాలి. అలా ఆ వ్యవస్థ మారేంతగా స్త్రీ జనం జాగృతం కావాలి. మన దేశంలో రోడ్డు ప్రమాదాల్లో కంటే ఎక్కువగా గృహహింస కారణంగానే మహిళలు గాయపడుతున్నారని వింటుంటే మహిళా సాధికారికత అనేది ఎంత అర్థరహితమైనదో తెలుస్తుంది. పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది.

మహిళలపై అత్యాచారాల మీద ఉక్కుపాదం మోపుతున్నాం అనే ప్రకటనల పక్కనే నిర్భయ (ఢిల్లీ), దిశ (హైదరాబాద్‌), హత్రాస్‌, ఉన్నావ్‌, వాకపల్లి లాంటి ఘటనలు కుప్పలు తెప్పలుగా ప్రచురితమవుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఒక మహిళ దేశానికి ప్రథమ మహిళగా వుందని, ఎప్పుడో 2027లో ఓ 35 రోజులు జస్టిస్‌ నాగరత్న దేశ ప్రథమ ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారని, ఏడున్నర దశాబ్దాల తర్వాత ముగ్గురు మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారని ఉబ్బిపోవటం కాదు. ఒక మహిళ హైకోర్టు సాధారణ న్యాయమూర్తిగా, ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవటానికి స్వతంత్ర భారత్‌లో మూడు దశాబ్దాలు పట్టిందని మనం సిగ్గుపడాలి. ఈ స్థితి నుండి మహిళలు ఉన్నతంగా ఎదగాలి, మానవ హక్కులంటే మహిళల హక్కులే అనే స్పృహ పెరగాలి. ప్రపంచ సంపద, సమాజానికి అవసరమైన సంపద సృష్టిలో పురుషునికన్నా స్త్రీ పాత్ర ఎక్కువనేది నిస్సందేహం. కాని పితృస్వామిక క్షీణ విలువల కారణంగా ఇది విస్మరించబడుతున్నది. 365 రోజుల్లో ఈ ఒక్కరోజేనా? అనుకోవద్దు. ఈ రోజు గొప్పతనాన్ని గుర్తించాక 364 రోజులు వాటంతటవే దాని దగ్గరకు నడుచుకుంటూ వస్తాయి.

చెరుకూరి సత్యనారాయణ

(మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం)

Updated Date - Mar 08 , 2024 | 01:23 AM