Share News

ఒప్పులకుప్ప, ఒడిలో మీడియా!

ABN , Publish Date - May 03 , 2024 | 05:09 AM

ప్రధాన స్రవంతి మీడియాలో స్వతంత్ర గళాలను మూసేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్న స్వతంత్ర ఛానల్స్ వెంట పడుతోంది. ‘బోల్ తా హిందుస్తాన్’ అనే హిందీ న్యూస్ ఛానల్‌ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు...

ఒప్పులకుప్ప, ఒడిలో మీడియా!

ప్రధాన స్రవంతి మీడియాలో స్వతంత్ర గళాలను మూసేసిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్న స్వతంత్ర ఛానల్స్ వెంట పడుతోంది. ‘బోల్ తా హిందుస్తాన్’ అనే హిందీ న్యూస్ ఛానల్‌ని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు యూట్యూబ్ నుంచి తొలగించారు. ఏప్రిల్ 4న కేంద్రంలోని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఈ ఛానల్‌ని రద్దు చేస్తున్నట్లు యూట్యూబ్ నుంచి ఈమెయిల్ ద్వారా సమాచారం వచ్చింది. వెంటనే రాత్రికి రాత్రి తీసివేయడం కూడా జరిగిపోయింది. ఈ ఛానల్‌కి 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‍స్టాగ్రామ్‌లో 40వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కొన్ని వారాల క్రితం ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ రద్దు చేశారు. ఇప్పుడు మొత్తం ఛానల్‌నే తీసేసారు. ఈ ఛానల్ అల్ప సంఖ్యాకుల, దళిత బహుజనుల సమస్యల మీద వార్తలు చేస్తుంది.


‘బోల్ తా హిందుస్తాన్’ తతంగం ఇంకా నడుస్తూనే ఉండగా మరో రెండు ఛానల్స్‌కి అదే రకం నోటీసు వచ్చింది. అవి ‘నేషనల్ దస్తక్’, ‘ఆర్టికల్ 19’. ఈ ఛానల్స్ కూడా దళిత బహుజన విషయాల గురించి బలంగా కంటెంట్ చేస్తాయి. ఈ ఛానల్స్ చేసే కార్యక్రమాలను చూసి ప్రభుత్వం ఎందుకు ఇంతగా బెదురుతోంది? పార్లమెంట్ ఎన్నికల్లో హిందుత్వ రాజకీయాల ముసుగు ఈ ఛానల్స్ తొలగిస్తున్నాయనా? ‘నేషనల్ దస్తక్’ అనే ఛానల్‌కి దాదాపు 94 లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఇక ఛానల్‌ని చూసేవాళ్లు మరో 30 లక్షల మందికి షేర్ చేస్తూ ఉంటారు. ఈ ఛానల్ ప్రత్యేకించి దళిత్ బహుజన్ హక్కుల గురించి విస్తృతంగా కవరేజ్ ఇస్తుంది. దళిత బహుజన యువతని జర్నలిస్టులుగా తీసుకుంటుంది. ఇంటర్న్‌షిప్స్ ద్వారా కొన్ని వేలమందిని మీడియా ప్రొఫెషనల్స్‌గా తయారు చేస్తుంది. పెద్ద మీడియా సంస్థలు కవర్ చేయని వార్తలను ఈ ఛానల్ చేస్తుంది. యూపీ బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఈ ఛానల్‌కి కొన్ని లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. సరిగ్గా మోడల్ కోడ్ ఉన్న సమయంలో, ఎలక్షన్ మధ్యలో ఇంత బలమైన ఛానల్‌ని మూసివేయడం ఎలక్షన్ కమిషన్‌కి ఏ మాత్రం తప్పుగా అనిపించట్లేదు. మూసివేయటానికి ఎటువంటి ప్రత్యేక కారణం ఇవ్వకుండా, ఎటువంటి ప్రక్రియా పాటించకుండా, కేవలం ఉల్లంఘన జరిగిన కార్యక్రమాన్ని తొలగించమనకుండా, మొత్తం ఛానల్‌నే మూసివేయడం ఎంత దౌర్జన్యం?

ఇదే క్రమంలో ‘ఆర్టికల్ 19’ అనే ఛానల్‌కి కూడా ప్రభుత్వం నుంచి ఇటువంటి బెదిరింపే వచ్చింది. గతంలో కేరళలోని ‘మీడియా వన్’ అనే సాటిలైట్ ఛానల్‌ని కూడా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వ శాఖ లైసెన్స్ రెన్యూ చేయకుండా మూసివేసే పరిస్థితి కల్పించింది. జాతీయ భద్రత నెపంతో, కారణం బహిరంగంగా చెప్పకుండా ప్రభుత్వం కోర్టులో సీల్డ్ కవర్ అందించింది. సీఏఏకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, దాని తరవాత ఢిల్లీలో జరిగిన అల్లర్లను గురించి ఆ ఛానల్ చేసిన విస్తృత కవరేజ్‌లో– ఢిల్లీ పోలీస్ నిష్పాక్షికంగా తమ విధులు చేయలేదని, అల్లర్లలో ఆరెస్సెస్ పాత్ర ఉందని విమర్శలు చేయడం ప్రభుత్వానికి నచ్చక ఛానల్‌ని మూసేసింది. దీనిని దేశభద్రతతో ముడిపెట్టింది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఛానల్‌ని దాదాపు సంవత్సరం తరవాత మళ్ళీ తెరవగలిగారు.


మొదటగా, 2014లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణికి బలి అయ్యింది హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ బాబీ ఘోష్. ఈయన 2016–17 మధ్య తాను ఎడిటర్‌గా ఉన్న కాలంలో హేట్ ట్రాకర్‌ని రూపొందించి, అందులో దేశవ్యాప్తంగా అల్పసంఖ్యాకుల మీద జరిగిన విద్వేష దాడులను ఎప్పటికప్పుడు నమోదు చేయించాడు. 28 సెప్టెంబర్ 2015లో దాద్రి‌లో అఖ్లాఖ్‌ని గొడ్డు మాంసం కోసం గోహత్య చేశాడన్న తప్పుడు ఆరోపణలతో పట్టపగలు మూకదాడి చేసి, హత్య చేశాక ఈ హేట్ ట్రాకర్‌ని మొదలుపెట్టారు. ఇది ప్రారంభం అయిన కొన్నాళ్లకే బాబీ ఘోష్‌ని తీసేయమని యాజమాన్యం మీద ప్రభుత్వం నుంచి ఒత్తిడి మొదలైయింది. బాబీ ఘోష్ త్వరలోనే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. పత్రిక వెంటనే తమ వెబ్‌సైట్ నుంచి హేట్ ట్రాకర్‌ని తీసివేసింది. ఇక తరువాతి కాలంలో రవీష్ కుమార్, పుణ్య ప్రసూన్ బాజ్‌పాయి, అభిసార్ శర్మ వంటి దిగ్గజ జర్నలిస్టులను యాజమాన్యాల మీద ఒత్తిడి తెచ్చి ఉద్యోగాలు విడిచి వెళ్లే లాగా చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్‍డిటీవీ లాంటి న్యూస్ సంస్థల్ని పెట్టుబడిదారీ మిత్రులు స్వాధీనం చేసుకునే పరిస్థితులని సృష్టించింది.


ఒక పక్క కుల వివక్షకు, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉన్న ఛానళ్లు, పత్రికల మీద, పాత్రికేయుల మీద విరుచుకుపడే ప్రభుత్వం సుదర్శన్ టీవీ, రిపబ్లిక్, టైమ్స్ నౌ, ఆజ్ తక్ వంటి ఛానళ్లు ప్రతిరోజూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టే షోలు చేస్తుంటే చూసీ చూడనట్టు ఉంటోంది. గత కొన్ని నెలల్లో ఈ ఛానళ్లకి నేషనల్ బ్రాడ్‌‍కాస్టింగ్ అండ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ విద్వేషపూరిత షోలు చేస్తున్నారని జుర్మానాలు విధించటం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం వాటిపై చర్య తీసుకోకపోగా, నియంత్రించే ఊసే లేదు.

గతంలో హత్రాస్‌లో ఒక దళిత మహిళను అగ్ర కులాల వాళ్లు అత్యాచారం చేసి, దారుణంగా హింసించి చంపిన ఘటన తరవాత, దానిని గురించి రిపోర్ట్ చేయడానికి వెళుతున్న సిద్దిక్ కప్పన్‌ను ఇంకా ఒక్క అక్షరం కూడా రాయకముందే అరెస్ట్ చేసి రెండేళ్ల పాటు జైల్లో మగ్గించింది కేంద్ర ప్రభుత్వం. ఈ సంఘటనలన్నిటికీ కామన్ విషయం దళిత బహుజనుల, అల్ప సంఖ్యాకుల రక్షణ, భద్రత, హక్కులు అని గమనించాలి. ఈ ప్రభుత్వం పదే పదే మనకు పంపుతున్న సందేశం – ఈ దేశంలో అగ్ర కులాల, బహు సంఖ్యాకుల ఆధిపత్యమే ఉండాలి. ఇతరుల సమస్యలు తలెత్తినా, గొంతులు లేచినా అణచివేత అనివార్యం. మీడియా మీద అణచివేతను కేవలం 19(1)A కోణం నుంచి చూస్తే సరిపోదు. దీనికి ప్రబలంగా కుల మత కోణం కూడా ఉంది. అగ్రకుల పాత్రికేయులను వెంటాడటం వెనుక కూడా వారు ఈ సామాజిక వర్గాలకు మద్దతుగా నిలబడినప్పుడే జరుగుతున్నది. ఈ విషయాన్ని ప్రజాస్వామ్య వాదులం ఎంత మందిమి గుర్తిస్తున్నాం? గుర్తిస్తే మన కర్తవ్యం ఏమిటి?

ప్రొ. పద్మజ షా

Updated Date - May 03 , 2024 | 05:09 AM