Share News

ఒకరుండాలి

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:50 AM

ఒకరుండాలి. బ్లేడ్తో పెన్సిల్‌ చెక్కుతున్నప్పుడు చూపుడు వేలు చివర తెగి రక్తం బొట బొటా కారుతున్నప్పుడు అదాటుగా వేలును నోటిలో పెట్టుకుని చప్పరించే అమ్మాయిలా ఒకరుండాలి...

ఒకరుండాలి

ఒకరుండాలి. బ్లేడ్తో పెన్సిల్‌ చెక్కుతున్నప్పుడు చూపుడు వేలు చివర తెగి రక్తం బొట బొటా కారుతున్నప్పుడు అదాటుగా వేలును నోటిలో పెట్టుకుని చప్పరించే అమ్మాయిలా ఒకరుండాలి.

ఈదురుగాలికి ఒక్కసారిగా దుమ్ములేచి కంట్లో కారంలో పడినప్పుడు చెంపలను అరచేతుల్లోకి తీసుకుని పూల రెక్కల కనురెప్పలను విప్పదీసి ఉఫ్‌ ఉఫ్‌ మని కళ్ళల్లోకి ఊదే మిత్రుడులా ఒకరుండాలి.

తుమ్మముళ్ళు అరికాలి మడమలోకి మెత్తని పులిలా కసుక్కున దిగినప్పుడు ప్రేమగా పాదాన్ని మోకాలి మీద పెట్టుకుని ఇంకా ఉమ్ము రాసి పిన్నీసుతో నొప్పి తెలియ కుండా ముల్లునుతీసి రాయుప్పు పెట్టి అగ్గితో కాకపెట్టిన వదినమ్మ లాంటి ఒకరుండాలి.

అల్లరి చేశాడని పట్టరానికోపంతో పిల్లాడిని అదేపనిగా కొట్టేస్తే ఏడ్చి ఏడ్చి అలసిపోయి వాడు నిద్రపోతే ఆనక ఎత్తుకొని వొళ్ళో పండబెట్టుకుని మండుతున్న పొయ్యి ముందుకూర్చుని ఏడుస్తూ పుల్లలేగదోస్తున్న అమ్మలాంటి ఒకరుండాలి.

తనను ప్రాణాప్రదంగా చూసుకునే నాన్న కాలేయం చెడిపోయి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు పక్కటెముకను తీసిఇచ్చినట్లు తన కాలేయన్ని కొంత తీసి ఇచ్చి పునర్జన్మ ప్రసాదించిన తల్లిలాంటి కూతురు ఒకరుండాలి.

వణుకుతున్న చేతులతో కాఫీగ్లాసును చేతికి అందించ లేక సతమతమవుతున్న నరాలు పైకి తేలిన తాతయ్య చేతులమీద తన మృదువైన చేతులు అదిమిపట్టి గ్లాసును నోటికి అందించిన మనవరాలు లాంటి ఒకరుండాలి.

నెలల పసిపాపకు ఒంటినిండా నూనె పట్టించి గోరువెచ్చని నీళ్లతో సున్నిపిండి స్నానం చేయించి చివరన చిన్నారి ముక్కును నోట్లో పెట్టుకుని పీల్చి తుపుక్కున ఉమ్మిన అమ్మమ్మ లాంటి ఒకరుండాలి.

అప్పుడే ఈనిన లేగదూడ ఒళ్లంతా గొప్ప తన్మయత్వంతో నాకుతున్న తల్లిఆవులా అప్పుడే రాసిన తడియారని కవితను గొప్ప ప్రేమతో వినే మిత్రుడున్నట్టు ఒకరుండాలి.

చివరాఖరుకు ఆ ఒక్కరు నలుగురు అవ్వాలి, ఆ నలుగురు వెనక్కి తిరిగి చూసుకుంటే పెద్ద సమూహం అవ్వాలి.

శిఖామణి

98482 02526

Updated Date - Mar 11 , 2024 | 01:50 AM