Share News

ఆసరా కాదు.. అక్కచెల్లెమ్మలకు టోకరా

ABN , Publish Date - Feb 01 , 2024 | 03:19 AM

ప్రతి బహిరంగ సభలో నా అక్క చెల్లెమ్మలు అంటూ రాగాలు తీసే జగన్‌రెడ్డి పాలనలో మహిళకు చేసింది శూన్యం. జనాన్ని వంచించడంలో ఆయన్ని మించిన ఘనులు లేరు....

ఆసరా కాదు.. అక్కచెల్లెమ్మలకు టోకరా

ప్రతి బహిరంగ సభలో నా అక్క చెల్లెమ్మలు అంటూ రాగాలు తీసే జగన్‌రెడ్డి పాలనలో మహిళకు చేసింది శూన్యం. జనాన్ని వంచించడంలో ఆయన్ని మించిన ఘనులు లేరు. మా మెనిపెస్టో బైబిల్, ఖురాన్‌తో సమానం అని మహిళలను బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి, అన్ని డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి వారికి పంగనామాలు పెట్టారు. ఇచ్చిన హామీల్లో 99.5 శాతం అమలుచేశామని గప్పాలు చెబుతున్నారు. రాష్ట్రంలో కోటీ 14 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే, 79 లక్షల మందికే ఆసరా అంటూ, సకాలంలో డ్వాక్రా రుణాలు చెల్లించిన 75శాతం మందికి టోకరా వేయడం జగన్ మోసకారితనానికి నిదర్శనం. కోటిమందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళల్లో ఆసరా వల్ల లబ్ధిచేకూరేది 25 శాతం మందికి మాత్రమే. అందులోనూ... ఐదు, పదివేలు రుణం తీసుకున్న వారే ఎక్కువ.

ఏప్రిల్ 11, 2019న ఖాతాలో నిల్వ ఉన్నరుణ మొత్తాన్ని నాలుగు వాయిదాలలో జగన్ రద్దు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ మహిళల గ్రూపులకు సరాసరి లక్షా, లక్షన్నరకు మించి ఏ బ్యాంకులు రుణాలు ఇవ్వవు. బీసీలకు రూ.2 నుంచి 3 లక్షలు మాత్రమే ఇస్తాయి. మిగిలిన వర్గాలకు రూ.5 నుంచి 15 లక్షల వరకు రుణాలు ఇస్తాయి. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మహిళలకు అతి తక్కువగా మాత్రమే రుణాలు రద్దయ్యాయి. పైకి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని కల్లబొల్లి మాటలు చెప్పే జగన్‌రెడ్డి ఆచరణలో వారికి పథకాల ఫలాలు దూరం చేసి, దగా చేస్తున్నారు. డ్వాక్రా మహిళల జీవనప్రమాణాలు తిరోగమన బాట పట్టడంతో అన్ని వర్గాలు, అన్ని రంగాలు దెబ్బతిన్నాయి.

టీడీపీ హయాంలో పొదుపు మహిళలకు సున్నా వడ్డీ రూ.5 లక్షల వరకు వర్తింపజేశారు. తాను అధికారంలోకి వస్తే దానిని రూ.10 లక్షలకు పెంచుతానని నమ్మించిన జగన్‌, తీరా అధికారంలోకి రాగానే దానిని రూ.3 లక్షలకు కుదించి మహిళలను మోసం చేశారు. ఆ మూడు లక్షలకు కూడా సున్నా వడ్డీ కేంద్రమే భరిస్తోంది, ఇక జగన్‌రెడ్డి ఇచ్చిందేంటి? వృద్ధాప్యంలో ఆదుకుంటాయని డ్వాక్రా మహిళలు దాచుకున్న రూ.2,118 కోట్ల అభయహస్తం నిధులను కూడా దారి మళ్లించారు. ఉన్నతి పథకంతో ఎస్సీ, ఎస్టీ మహిళలకు చంద్రబాబు రూ.800 కోట్లిస్తే.. జగన్‌రెడ్డి ఆ పథకాన్ని రద్దు చేశారు. 45 ఏళ్లకే పెన్షన్ అని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక నాలుక మడతేసి, చేయూత అంటూ దగా చేశారు. రూ.1.80 లక్షలు అందాల్సిన సాయానికి గండికొట్టారు. ప్రభుత్వ కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను తరలిస్తూ అందుకయ్యే ఖర్చును కూడా వారితోనే పెట్టించి డ్వాక్రా సంఘాల నిధులు హారతి కర్పూరంలా కరిగించారు. నిత్యావసరాల ధరలు, అప్పులు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం మోపారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని పక్కాగా అమలు చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక ఉన్న డ్వాక్రా రుణాలు రూ.13,655. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో ఒక్కొక్కరికీ రూ.10,000 చొప్పున రూ.8,500 కోట్ల రుణాలు మాఫీ చేశారు. అందరికీ సమన్యాయం చేయాలనే లక్ష్యంతో పసుపు–కుంకుమ కింద 2018–19లో రూ.10 వేల కోట్లు చెల్లించారు. వడ్డీ రాయితీ కింద రూ.2,514 కోట్లు చెల్లించారు. అయినా టీడీపీ రుణమాఫీ చేయలేదంటూ జగన్‌రెడ్డి ప్రచారం చేశారు. మరోవైపు 2014 ఏప్రిల్ 1 నాటికి డ్వాక్రా సంఘాల ఎన్‌పిఏలు 10.33 శాతం (SLBC 182) ఉండగా, 2019 ఏప్రిల్ 1 నాటికి 1.56 శాతానికి తగ్గించిన ఘనత చంద్రబాబుది (SLBC 206). అయినా.. ఎన్‌పిఏలు 18 శాతం అంటూ నిస్సిగ్గుగా అబద్ధపు రాతలు రాశారు. 2019 ఏప్రిల్ 1 నాటికి డ్వాక్రా సంఘాల అవుట్ స్టాండింగ్ అమౌంట్ రూ.27,571 కోట్లు. దాన్ని చూపించి డ్వాక్రా సభ్యులు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పడం వారి బుద్ధి రాహిత్యానికి అద్దం పడుతోంది. అదే నిజమైతే.. 2023 అక్టోంబర్‌ 10 నాటికి (SLBC 224) డ్వాక్రా సంఘాల మొత్తం రుణాలు రూ.58,598 కోట్లున్నాయి. అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకా అప్పుల్లో కూరుకుపోయినట్లా? ఆర్థికంగా అభివృద్ధి చెంది మహిళలు తమ కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో వారి ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు శ్రీకారం చుడితే, జగన్‌రెడ్డి వాటిని నిర్వీర్యం చేశారు. గ్యారంటీ లేనిదే పైసా అప్పు ఇచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వానికి బ్యాంకులు తేల్చి చెప్పడంతో, పొదుపు మహిళలు దశాబ్దాలుగా పైసా పైసా కూడబెట్టుకుని బ్యాంకుల్లో జమచేసుకున్న రూ.8,702 కోట్ల మూలధనాన్ని కొల్లగొట్టేస్తున్నారు. ఇంకా ఏ మొహం పెట్టుకొని నేనే రాష్ట్రానికి కావాలంటున్నారో మరి జగన్‌రెడ్డి? ఆయన్ని భరించడానికి మహిళా లోకం సిద్ధంగా లేదు.

డ్వాక్రా వ్యవస్థ ఏర్పాటుతో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా అంతర్జాతీయ వేదికలపై మహిళల్ని నిలబెట్టిన ఘనత చంద్రబాబుది. దేశంలోనే తొలిసారిగా దళిత మహిళకు స్పీకర్ పదవి; మహిళా కండక్టర్ నియామకం; దీపం పథకం కింద 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు; మహిళల పేరు మీదనే ఇళ్ల పట్టాలు–భూముల కొనుగోలు; డ్వాక్రా మహిళలకు రైతు బజార్లు, ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలతో మహిళా శక్తిని గుర్తించింది టీడీపీయే. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు సాగిస్తున్న ప్రగతికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన పునాదులే కారణం. మహిళలకు ఆస్తిహక్కు, రాజకీయంగా 9శాతం రిజర్వేషన్లు, స్త్రీ అభ్యున్నతికి పద్మావతీ మహిళా వర్సిటీ ఏర్పాటు, స్థానిక సంస్థలు, కళాశాలలు, ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేసింది తెలుగుదేశమే. మహిళలకు 11 రకాల ఉచిత వైద్యపరీక్షలు, రక్ష పథకం కింద బాలికలకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు, సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుక పథకం, తల్లికి వందనం, కిషోర్ బాలికా సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, ముస్లిం మహిళలకు డ్వామ్రా వంటి పథకాలు విజయవంతంగా అమలు చేశారు. మద్య నిషేధం చేస్తామని మహిళల ఓట్లు వేయించుకున్న జగన్‌, నాసిరకం మద్యంతో మహిళల మాంగళసూత్రాలు తెంచారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. స్త్రీ నిధి, ఉన్నతి రద్దు చేశారు. ఎన్టీఆర్ బేబీ కిట్లు, తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్, దీపం పథకాలు నాశనం చేశారు. బాలింతలకు రూ.5 వేలు పథకం నిలిపివేశారు. పెళ్లి కానుక పథకాన్ని రద్దు చేసి, కళ్యాణమిత్రల్ని రోడ్డున పడేశారు.

తప్పులు చేసినవాడు అయినా మారతాడేమో కానీ మోసం చేసే బుద్ధి ఉన్నవాడు మారడు. సంక్షేమ పథకాలను అక్కచెల్లెమ్మల ఓట్ల కోసం వాడుకొని, అవసరం తీరాక వాటి కోతలకు పూనుకోవడం వంటి చర్యలకు పాల్పడి, వాటిపై ఆధారపడిన వారిని మోసం చేశారు జగన్‌రెడ్డి. వైసీపీది చరిత్ర ఎరుగని మోసంగా డ్వాక్రా మహిళలు అర్థం చేసుకోవాలి. ఇటువంటి మహిళా ద్రోహి ప్రభుత్వాన్ని సాగనంపడానికి మహిళాలోకం కదలాలి.

ఆచంట సునీత

తెలుగునాడు అంగన్‌వాడీ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షురాలు

Updated Date - Feb 01 , 2024 | 03:19 AM