Share News

ఓటుబొమ్మ కాదు, కోట్లజనం గొంతు!

ABN , Publish Date - Apr 13 , 2024 | 03:17 AM

అంటరానితనాన్ని సమూలంగా అంతమొందించాలని ప్రపంచ వేదికల మీద హక్కుల స్వరాన్ని బలీయంగా వినిపించిన నిమ్నజాతుల విమోచకుడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. ఆ దిశగా సాగిన పోరాటం ఈనాటికీ...

ఓటుబొమ్మ కాదు, కోట్లజనం గొంతు!

అంటరానితనాన్ని సమూలంగా అంతమొందించాలని ప్రపంచ వేదికల మీద హక్కుల స్వరాన్ని బలీయంగా వినిపించిన నిమ్నజాతుల విమోచకుడు బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌. ఆ దిశగా సాగిన పోరాటం ఈనాటికీ భారత సామాజికచట్రాన్ని కుదిపేసే పరిణామమే. అందుకే ‘జీవించి ఉన్న అంబేడ్కర్‌ కంటే మరణించిన అంబేడ్కర్‌ మరీ ప్రమాదకరం’ అన్నాడు ధనంజయ్‌ కీర్‌. తిలక్‌, సావర్కర్‌, భగత్‌సింగ్‌, ఫూలే జీవితచరిత్రలు రాసిన కీర్‌, అంబేడ్కర్‌ జీవితచరిత్రనూ రాశారు. దక్షిణాసియా రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్‌ క్రిష్టఫర్‌ జఫర్‌లాట్‌ కీర్‌ను కొనియాడుతూ అంబేడ్కర్‌ని గొప్పగా ఆవిష్కరించిన పరిశోధకుడని అన్నారు. మన భారతావనిలో అంబేడ్కర్‌ విగ్రహం లేని దళితవాడ ఒక్కటీ లేదు. వాటిలో ప్రాణత్యాగాలతో నిర్మాణం జరిగిన విగ్రహాలూ చాలానే ఉన్నాయి. అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడమంటే దళితకులాలకు ఒక పండుగే కాదు మహోద్యమం. ఈ పరిస్థితుల్ని పసిగట్టిన రాజకీయపార్టీలు అంబేడ్కర్‌ విగ్రహాలతో లబ్ధి పొందడం కోసం నిత్యం ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే గతంలో మాయావతి ఉత్తరప్రదేశ్‌లో స్మృతివనం నిర్మించారు. తెలంగాణలో కేసీఆర్‌ భారీ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మరో అడుగుముందుకేసి రూ. 400 కోట్ల ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులతో స్మృతివనాన్ని కట్టించారు.

ఇలా దేశమంతా పుట్టుకొస్తున్న స్మృతివనాల మధ్యలో ఆర్భాటంగా ఏర్పాటు చేస్తున్న భారీ అంబేడ్కర్‌ విగ్రహాలు ప్రభుత్వాల వైఖరిని తేటతెల్లం చేస్తున్నాయి. వాస్తవానికి ఆయన ఆశించిన అభివృద్ధి, సంక్షేమాల్ని అమలు చేయడం కోసం ఇదంతా జరగడం లేదు. కేవలం ఆయనను అభిమానించే కోట్లాదిజనం ఓట్ల కోసం మాత్రమే ఈ తతంగం సాగుతోందని సామాన్యులకు సైతం తెలిసిపోతోంది. తెలంగాణలో ప్రేమ వివాహాలు చేసుకున్న దళితులు మంథనీ మధుకర్‌, ప్రణయ్‌లను భయంకరంగా హత్య చేశారు అనేక రాష్ట్రాలలో ఇలాంటి ఘటనలే ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అంతమొందించలేనప్పుడు ఇక రాజ్యాంగస్ఫూర్తి అనేది ఎక్కడుంది? పోటీపడి విగ్రహాలు ఏర్పాటు చేయడం కంటే ప్రాథమికహక్కుల్ని పరిరక్షించడం ముఖ్యవిధి అని ఈ ప్రభుత్వాలు ఎప్పటికి గుర్తెరుగుతాయో అర్థం కావడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విజయవాడలో నిర్మించిన అంబేడ్కర్‌ స్మృతివనాన్ని ప్రత్యామ్నాయ సాంస్కృతిక శిఖరమంటూ ఘనంగా చాటుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేకబస్సుల్లో దళితుల్ని తీసుకొచ్చి స్మృతివనాన్ని చూపిస్తున్నారు. దళితజాతి కోసమే జగన్మోహన్‌రెడ్డి దాన్ని నిర్మించారని, మళ్ళీ ఆయన్నే గెలిపించుకోవాలని వాళ్ళకు చెబుతున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అంబేడ్కర్‌ను ఇలా ఓటుబొమ్మగా మలిచేస్తున్నారు. దళితుల అభివృద్ధి నిజంగా ప్రభుత్వ ధ్యేయమే అయితే నిరుద్యోగయువతకు ఉద్యోగాలు కల్పించి, వృత్తినైపుణ్యాలు పెంచి, రుణాలు మంజూరు చేసి వాళ్ల ఉన్నతికి తోడ్పడాలి. విద్యార్థులకు సకాలంలో ఉపకారవేతనాలు, విద్యారుణాలు అందించి ఆదుకోవాలి. అలాకాకుండా ప్రాథమికహక్కుల్ని కూడా పథకాలుగా మార్చేసి బటన్‌నొక్కి పండుగ చేసుకోవడం శ్రేయోరాజ్యస్ఫూర్తికి పూర్తి విరుద్ధం. అంబేడ్కర్‌ పేరిట ఉన్న ఓవర్‌సీస్‌ ఎడ్యుకేషన్‌ పథకాన్ని జగన్‌రెడ్డి తన పేరు మీదకి మార్చుకున్నారు. అంబేడ్కర్‌ పట్ల ఆయనకున్న గౌరవం ఎంతో ఈ చర్యే బట్టబయలు చేస్తోంది.

రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను శక్తివంతమైన వ్యవస్థగా తీర్చిదిద్దుతానని ప్రగల్భాలు పలికిన జగన్‌ కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ వైద్యకళాశాలల్లో సగం సీట్లను రిజర్వేషన్ల పరిధి నుంచి తొలగించి కోట్లాదిరూపాయల ఫీజులకు అమ్ముకుంటున్నారు. ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం కింద వైద్యం చేయడానికి కార్పోరేట్‌ ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగం కుంటుబడిపోయింది. తొంభైశాతం ఉన్న ఉద్యోగఖాళీలను భర్తీ చేయకపోవడంతో విద్యాసంస్థలు వెలవెలబోతున్నాయి. మధ్యాహ్నభోజన పథకం అమలు అంతంత మాత్రంగానే ఉంది. ఇక వసతిగృహాలు, గురుకుల పాఠశాలల పరిస్థితి చెప్పనక్కరలేదు. బియ్యంలోనో, అన్నంలోనో పురుగులు పడటం కాదు, ఏకంగా పథకాల్లోనే పందికొక్కులు పడ్డాయని విద్యార్థుల తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఈ లోపాలను కప్పిపుచ్చుకోవడానికే నాసిరకం బూట్లు, బట్టలు, బ్యాగులు పంపిణీ చేస్తున్నారనే విమర్శల్లో వాస్తవం ఉంది. ఇంటర్మీడియేట్‌ విద్య నుంచి గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌, రీసెర్చ్‌ డిగ్రీల వరకు పేదలను దూరం చేసి గందరగోళం సృష్టించారనే చెప్పాలి. అంబేడ్కర్‌ ఇలాంటి విద్యావిధానాన్ని కోరుకోలేదు. ఆయన ఉచితవిద్య, వైద్యం ప్రభుత్వాల ప్రథమకర్తవ్యం కావాలని ఆకాంక్షించారు. అణగారినవర్గాలకు, నిమ్నజాతులకు ఉన్నతవిద్య అందుబాటులో ఉండడం కోసం నిరంతరం ఉద్యమించారు.

దళితులు నా మేనమామలు అని ప్రకటించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, దళితుడైన తన డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంను అతికిరాతకంగా హత్య చేసినా ఆయనకే అండగా నిలిచారు. డాక్టర్‌ సుధాకర్‌ను చిత్రహింసలకు గురిచేసి అతడి చావుకు కారణమయింది జగన్‌ ప్రభుత్వమే. ఎస్సీ, ఎస్టీల నుంచి అధికమొత్తంలో డి–పట్టా భూములు బలవంతంగా లాక్కోవడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఈ సర్కారు పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఎన్నోచోట్ల అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్సు బ్యూరో గణాంకాల ప్రకారం గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులు వేలల్లో ఉన్నాయి. వీరిలో మరణించినవాళ్ళు గానీ, గాయపడ్డ బాధితులు గానీ సుమారు నాలుగువందల మంది ఉన్నారు. ఈ దుశ్చర్యలను ప్రశ్నించిన వ్యక్తుల మీద పలుచోట్ల దాడులు జరిగాయి. దళితులు విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడంలో ఎన్నో ఆటంకాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వాధికారులు, నాయకులు చొరవ తీసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించిన సందర్భం ఒక్కటీ కనిపించదు. అటుతిప్పి ఇటుతిప్పి రాజకీయంగా లబ్ధి పొందే దిశగానే నడిపిస్తారు. ‘గరగపర్రు’ అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపులో కచ్చితంగా ఇదే జరిగింది. తరచు రాష్ట్రంలో ఏదోమూల అంబేడ్కర్‌ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం ఆయన విగ్రహాలు పూజ్యనీయమైపోతున్నాయి. ఆయనను ఆరాధించేవారితో ప్రభుత్వాధినేతకు జేజేలు పలికించడం పార్టీశ్రేణులతో పాటు అధికారులకు కూడా తప్పనిసరి అవుతోంది.

అంబేడ్కర్‌ విగ్రహాల నిర్మాణం ప్రజల్లో సామాజికచైతన్యం నింపడం కోసం కాదని, ఇదంతా రాజకీయ లబ్ధి కోసమేననే విషయం జాతిస్పృహ కలిగిన అందరికీ తెలిసిందే. ఇలాంటి మోసపూరిత రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికే ఆ మహనీయుడు ఈ దేశంలో మహిళలు, మైనారిటీలతో సహా అణగారిన ప్రజలందరికీ రాజ్యాంగరక్షణలు కల్పించారు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయకుండా నేటి పాలకులు ఆయన విగ్రహాల్ని ఓటుబొమ్మలుగా మార్చేయడం విచారకరం. రాజకీయప్రజాస్వామ్యం కంటే సామాజికప్రజాస్వామ్యాన్నే ఎక్కువగా ఆకాంక్షించిన అంబేడ్కర్‌ ఆలోచనలకు విరుద్ధంగా నేటి ప్రభుత్వాలు దిమ్మలు కట్టి బొమ్మలు పెట్టి మభ్యపెడుతున్నాయి. ఈ విషయాన్ని దళిత, బహుజన మేథోవర్గం గ్రహించాలి. భవిష్యత్‌తరాల్లో పెంపొందించవలసిన అంబేడ్కర్‌ స్ఫూర్తిని పక్కదోవ పట్టిస్తున్నారనే సంగతిని సైతం గుర్తించాలి. అప్పుడే అంబేడ్కర్‌ అంటే ఓటు బొమ్మకాదు, కోట్ల జనం గొంతు అనే విషయం పాలకుల తలకెక్కుతుంది. ఈ దేశంలో సామాజిక వెలివేతకు గురయిన కోట్లాదిమంది స్వరం తానొక్కడే అయి పోరాడిన ఆ యోధుడి సిద్ధాంతాలు ఆచరణలోకి వస్తాయి. ఆ సమోన్నత స్త్రీ విమోచకుడిని, రాజనీతిజ్ఞుడిని ఓటుబొమ్మను చేసి ఆడుకుంటున్నవారి ఆలోచనలకు సంకెళ్ళు పడతాయి. అదే ఆయనకు నిజమైన నివాళి అని ప్రభుత్వాలు గుర్తించాలి. అలా గుర్తించేలా సమస్త దళితజనం గుణపాఠం నేర్పాలి.

డాక్టర్‌ జీకేడీ ప్రసాద్‌

Updated Date - Apr 13 , 2024 | 03:17 AM