Share News

తొమ్మిదేళ్ల విద్యా విధ్వంసం కొత్త ప్రభుత్వానికి ఓ సవాల్‌

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:09 AM

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి దాదాపు 43 వేల ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఉండేవి. మారుమూల గ్రామంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పాఠశాలలు పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేవి///

తొమ్మిదేళ్ల విద్యా విధ్వంసం కొత్త ప్రభుత్వానికి ఓ సవాల్‌

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి దాదాపు 43 వేల ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్రంలో ఉండేవి. మారుమూల గ్రామంతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ పాఠశాలలు పేద విద్యార్థులకు అందుబాటులో ఉండేవి. 2014 నాటికి ఉపాధ్యాయుల కొరత కూడా పెద్దగా ఉండేది కాదు. అంతేగాక, ఆ ఏడాది రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో దాదాపు 12 శాతం నిధులు విద్య రంగానికే కేటాయించారు. కానీ 2014 తర్వాత రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యానికి గురైంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను 2014తో పోలిస్తే సుమారు ఐదు వేల నుంచి ఆరు వేలకు తగ్గించి కొన్ని పాఠశాలలను మూసివేశారు, మరికొన్ని పాఠశాలలను ఇతర పాఠశాలల్లో విలీనం చేశారు. 2014కు ముందు నాలుగింట మూడవ వంతు విద్యార్థులు (75 శాతం) ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించేవారు. కానీ 2023 నాటికి మొత్తం విద్యార్థులలో కేవలం 50శాతం మాత్రమే ప్రభుత్వ రంగ పాఠశాలలకు పరిమితమయ్యారు. దీనితోపాటు ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పూర్తిగా నిర్వీర్యం అయినాయి. విశ్వవిద్యాలయాల్లో దాదాపు 70 నుంచి 75 శాతం బోధనా సిబ్బంది ఖాళీలు ఉన్నాయి. ఇక అనుబంధ, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ పాఠశాలలో దాదాపు కనుమరుగయ్యారు. విశ్వవిద్యాలయాలకు చాలీచాలని నిధులు కేటాయించారు. 2014 తర్వాత ఎంతో గొప్పగా ప్రచారం చేస్తూ స్థాపించిన గురుకుల పాఠశాలలు కూడా సిబ్బంది కొరత, నిధుల కొరతతో నామమాత్రంగానే మిగిలిపోయాయి. 2014లో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి సుమారు 12 శాతం నిధులను కేటాయిస్తే, 2022–23 సంవత్సరంలో కేవలం 6 శాతం నిధులు మాత్రమే కేటాయించబడ్డాయి.

దేశంలో వివిధ రాష్ట్రాల విద్య ప్రమాణాల సూచికలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం దిగువన ఉంది. బోధన సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడం, నాణ్యమైన బోధన సిబ్బందిని నియమించకపోవడం, కేవలం కాంట్రాక్ట్, ఔట్‍ సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించి పాఠశాలలను, కళాశాలలను నడపటం, కనీస మౌలిక వసతులు లోపించటం, బోధన, మౌలిక వసతులను ఆధునీకరించకపోవడం లాంటివి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా తగ్గడానికి గల కారణాలు.

అలాగే ప్రతిభలేని వారిని విద్యాసంస్థల అధిపతులుగా నియమిస్తూ వచ్చారు. బీఆర్‍ఎస్ కార్యకర్తల్లాగా పని చేసిన బోధనా సిబ్బందిని విశ్వవిద్యాలయ ఉపకులపతులుగా, విద్యాసంస్థల అధిపతులుగా నియమించడం కూడా విద్యా వ్యవస్థ ధ్వంసం కావడానికి మరో కారణం. బీఆర్‌ఎస్ హయాంలో నియమితులైన చాలామందికి విజన్, జాతీయ, అంతర్జాతీయ అనుభవం లేకపోవడం, చాలామంది పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించడం వల్ల విశ్వవిద్యాలయాల పనితీరు కుంటుపడింది.

అలాగే బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యా మండలి పనితీరుపై అనుమాన మేఘాలు అలుముకున్నాయి. ప్రతిష్టాత్మకమైన వివిధ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఉన్నత విద్యా మండలిలోని కీలక అధికారులు బీఆర్‌ఎస్‌ కీలక నాయకుల కనుసన్నల్లో పని చేసినట్టుగా వివాదాలు వెల్లువెత్తాయి. ఉన్నత విద్యా సంస్థల ప్రమాణాలు పెంచి వాటిని రాష్ట్ర అభివృద్ధి సాధకాలుగా తీర్చిదిద్దాల్సిన ఉన్నత విద్యా మండలి కొందరు బీఆర్‌ఎస్ నాయకుల చేతిలో బందీగా మారిందని విమర్శలు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసి రాష్ట్ర సామాజిక ఆర్థిక అభివృద్ధిలో విద్యారంగాన్ని కీలక భాగస్వామిగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీనికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి నాంది పలికే విధంగా విద్యావ్యవస్థను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదనుగుణంగా అభయ హస్తంలో పేర్కొన్న ఆరు గ్యారంటీల్లో, రెండు గ్యారెంటీలు విద్యారంగానికి సంబంధించినవే కావడం గమనార్హం. అవి ఐదు లక్షల విద్యా భరోసా కార్డ్, ప్రతి మండలంలోనూ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాల ఏర్పాటు. అంతేకాకుండా గత బీఆర్‍ఎస్ ప్రభుత్వ హాయంలో వార్షిక బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన నిధులను 6 శాతం నుండి 15 శాతానికి పెంచి విద్యారంగానికి పెద్దపీట వేస్తామని ప్రస్తుత ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేగాక, విద్యాశాఖను ముఖ్యమంత్రి తన పరిధిలో పెట్టుకోవటాన్ని బట్టి ఆయన ప్రత్యక్షంగా విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు అభివృద్ధికి కంకణం కట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం హర్షణీయం. అంతేగాక ఉన్నత విద్యా మండలిని వెంటనే పూర్తిగా ప్రక్షాళన చేసి, ప్రతిభతో పాటు జాతీయ, అంతర్జాతీయ అనుభవం ఉన్న మేధావులను అధికారులుగా నియమించి ఇక ముందు ఎలాంటి ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్ కాకుండా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలి. దీనితోపాటు విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకంలో కూడా ఇలాంటి మేధావులను నియమించినట్లయితే విశ్వవిద్యాలయాలను రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో భాగస్వాములుగా మార్చవచ్చు.

విద్యా వ్యవస్థతో నైపుణ్య అభివృద్ధిని సంఘటితం చేసి నాణ్యమైన, సృజనాత్మక మానవ వనరులను తయారు చేసే విధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన తెలంగాణ విద్యా మిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా పారిశ్రామిక అభివృద్ధికి నైపుణ్యం గల మానవులను అందించడమే కాకుండా, లక్షలాది నిరుద్యోగ యువతకు నైపుణ్యం కల్పించి ఉపాధి మార్గాన్ని సుగమం చేసినట్లవుతుంది. వచ్చే ఐదేళ్లలో స్పష్టమైన లక్ష్యాలతో ఈ విద్యా మిషన్ పనిచేసినట్లయితే విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే విధంగా తయారు చేయవచ్చు.

ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య

వ్యవసాయ ఆర్థికవేత్త

Updated Date - Jan 05 , 2024 | 01:09 AM