Share News

నెహ్రూ భావదీప్తి,‘అయోధ్య’ ప్రశ్నలు

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:42 AM

‘బాబ్రీ మసీద్‌ను కూల్చి వేసింది శివసైనికులు. 17 నిమిషాల వ్యవధిలో ఆ పనిని పూర్తి చేశారు. అక్కడే ఉన్న భారతీయ జనతా పార్టీ వారు తమ కర్తవ్యాన్ని దాదాపుగా విడిచిపెట్టారు. పైగా ఆ కర్మభూమికి దూరంగా...

నెహ్రూ భావదీప్తి,‘అయోధ్య’ ప్రశ్నలు

‘బాబ్రీ మసీద్‌ను కూల్చి వేసింది శివసైనికులు. 17 నిమిషాల వ్యవధిలో ఆ పనిని పూర్తి చేశారు. అక్కడే ఉన్న భారతీయ జనతా పార్టీ వారు తమ కర్తవ్యాన్ని దాదాపుగా విడిచిపెట్టారు. పైగా ఆ కర్మభూమికి దూరంగా వెళ్లిపోవడమూ జరిగింది. శివసైనికులు మాత్రమే ధైర్యంగా నిలబడి, తెగువతో వ్యవహరించి లక్ష్యాన్ని సాధించారు. అవును, అయోధ్యలో రామమందిరం మా సృ‌ష్టి ...’ శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఇటీవల ఒక పత్రికా గోష్ఠిలో ఉద్ఘాటించారు. డిసెంబర్ 1992, జనవరి 2024 సంవత్సరాల మధ్య భారత రాజకీయాలు ఎంతదూరం ప్రయాణించాయో రౌత్ వ్యాఖ్యలు చెప్పకనే చెప్పాయి.

ఆనాడు అంటే 1992లో బీజేపీ, శివసేనలు కుశ లవులుగా ఉండేవి కదా. నేడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన మహారాష్ట్రలో ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణంలో ఒక భాగస్వామిగా ఉన్నది. కాంగ్రెస్ సైతం ఆ కూటమి లోనే ఉన్నది. అయోధ్య వివాదంపై శివసేన నాటి నుంచీ నేటి వరకూ ఒకే దృఢ వైఖరితో వ్యవహరిస్తూ వస్తోంది. సందేహం లేదు. 1992లో శివసేన సర్వాధినేత బాల్ ఠాక్రే సగర్వంగా ఇలా చెప్పుకున్నారు: ‘మా కుర్రాళ్లే అయోధ్యలో ఆ పనిని పూర్తి చేశారు.’ మరి లౌకికవాదమే తమ విధానమని చెప్పుకునే రాజకీయ పక్షాలు ఎలా వ్యవహరించాయి? నైతిక సందిగ్ధతకు గురయ్యాయి. అనైతికంగా రాజీ పడ్డాయి. జాతీయవాదానికి మతపరమైన భాష్యాలకు లొంగిపోయాయి. ఇది రాజీ పడడం కాక మరేమిటి? లౌకికవాద పార్టీల ఇటువంటి నికృష్ట ప్రవర్తన కారణంగానే రాజకీయ హిందూత్వ తిరుగులేని రీతిలో ప్రజల మనసులలోకి, హృదయాలలోకి పురోగమించింది. ఇదెంత విడ్డూరమో అంతకంటే అధికంగా అసంగతం.

ఆ అయోధ్య వ్యవహారం మూడు దశాబ్దాల అనంతరం కూడా దేశ రాజకీయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తోంది. ఇది సార్వత్రక ఎన్నికల సంవత్సరం. మరి కొద్ది రోజుల్లో అయోధ్యలో అద్వితీయంగా నిర్మించిన రామమందిరానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్నది. ఈ మహద్ఘటనను ఆధారంగా చేసుకుని ఎన్నికలలో చరిత్రాత్మక విజయం సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రస్తుత రాజకీయమంతా అదే లక్ష్యంతో సాగుతున్నది. మరి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ తన వైఖరి ఏమిటో సుస్పష్టంగా ఎందుకు వ్యక్తం చేయలేకపోతోంది? మన దేశంలో అపూర్వ టెలి కమ్యూనికేషన్స్ విప్లవానికి ప్రధాన కారకుడు, కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ విభాగానికి అధిపతి అయిన శామ్ పిట్రోడా ఇటీవల ఒక ప్రాసంగిక ప్రశ్న వేశారు: ‘ఇప్పుడు మన ప్రజలకు అత్యవసరమయింది రామ మందిరమా? లేక నిరుద్యోగిత, ద్రవ్యోల్బణ సమస్యల పరిష్కారమా?’. చాలా ఉపయుక్తమైన ప్రశ్న, సందేహం లేదు. అయితే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం వెన్వెంటనే ఈ వ్యాఖ్యలకు తనకు తానుగా దూరం జరిగింది. ఆ వ్యాఖ్యలు శ్యామ్ పిట్రోడా వ్యక్తిగత అభిప్రాయాలే కాని, పార్టీ దృక్పథాన్ని ప్రతిబింబించేవి కావని’ ఎఐసిసి ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా అందుతున్న ఆహ్వానాలను ఆమోదించే విషయంలో కూడా కాంగ్రెస్ నాయకత్వం ఊగిసలాట వైఖరినే ప్రదర్శిస్తోంది. రెండు అవాంఛనీయ ప్రత్యామ్నాయాల మధ్య చిక్కుకుంది.

నవ భారత నిర్మాత జవహర్ లాల్ నెహ్రూ నిర్దేశించిన లౌకికవాద పథంలో దశాబ్దాల పాటు మున్ముందుకు సుస్థిరంగా ప్రస్థానించిన కాంగ్రెస్‌లో ఇప్పుడు రామ మందిరం ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానాలపై ఎందుకు అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది? అంగీకరిస్తే లౌకికవాద నిబద్ధత ఏమయ్యేట్టు? తిరస్కరిస్తే ‘హిందూ వ్యతిరేక పార్టీ’గా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తేందుకు ప్రత్యర్థిపక్షాలు ఒక క్షణమూ సంకోచించవు. ప్రజాభిప్రాయాన్ని హిందూత్వ శక్తులు ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో కాంగ్రెస్ సందిగ్ధ పరిస్థితి స్పష్టం చేస్తోంది.

మత ప్రమేయ రాజకీయాలు, ముఖ్యంగా హిందూత్వ శక్తుల సవాళ్లను కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా ఎదుర్కొంటూ వస్తోంది. అయితే ఆ రాజకీయ ప్రతిస్పందనలలో ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన, అదీ హింసాత్మకంగా వస్తుందేమోనన్న భయం కాంగ్రెస్ ప్రతిస్పందనలను సదా ఆవరించి ఉండటం ఒక కొట్టివేయలేని వాస్తవం. 1980 వ దశకం రాజకీయ పరిణామాలను ఒకసారి అవలోకించండి. ఇందిర, రాజీవ్ లిరువురూ అటు లౌకికవాద, ఇటు మతవాద శక్తులు రెండింటితోనూ సరిసమానంగా వ్యవహరించడానికే ప్రయత్నించారన్న విషయం స్పష్టమవుతుంది. ఆ ఇరువురి సారథ్యంలోని ప్రభుత్వాల విధానాలనూ ఆ వైఖరే ప్రభావితం చేసింది. బాబ్రీ మసీద్ ద్వారాలను తెరువడం, ఆ వివాదాస్పద స్థలం వద్ద శిలాన్యాస్‌కు అనుమతించడం హిందూ బృందాలను బుజ్జగించడానికి కాగా, షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం, ‘శాటానిక్ వర్సెస్’పై నిషేధం విధించడం ముస్లిం మత ఛాందసవాదులను సంతృప్తపరచడానికే అనడంలో సందేహం లేదు. ఓటు బ్యాంకులను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఇటువంటి రాజకీయ నిర్ణయాలు బహుళ మతాలకు ఆలవాలంగా ఉన్న భారతీయ సమాజంలో నిజమైన లౌకికవాద ప్రభావాలను బలహీనపరిచాయి. అ‍సలు లౌకికవాదం పట్ల ప్రజల్లో తిరస్కారభావాన్ని పెంపొందించడానికే ఆ రాజకీయ సంకోచాలు ఎంతైనా తోడ్పడ్డాయి.

1992 డిసెంబర్‌లో దేశం నలుమూలల నుంచీ లక్షలాది కరసేవకులు అయోధ్యకు తరలి వచ్చినప్పుడు ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ప్రభుత్వం వ్యవహరించిన తీరునూ అటువంటి భయమే ప్రభావితం చేసిందనడంలో సందేహం లేదు. అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని పరిరక్షించడం నరసింహారావు ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. అయినా కరసేవకుల వెల్లువను ప్రభుత్వం ఉపేక్షించింది. ఫలితంగానే బాబ్రీ మసీద్‌ను ప్రభుత్వం రక్షించలేక పోయింది. దరిమిలా చెలరేగిన మత ఘర్షణల్లో వందలాది అమాయకుల ఊచకోతలు సంభవించాయి. ప్రభుత్వం దృఢసంకల్పంతో వ్యవహరిస్తే అలా జరిగేదేనా? ఇక ఇటీవలి సంవత్సరాలలో కాంగ్రెస్ నాయకులు నుదుట బొట్టు పెట్టుకుని మరీ తాము నిష్ఠాగరి‌ష్ఠులమైన హిందువులమని చాటుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతీచోటా రాహుల్ గాంధీ విధిగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. తాను శివభక్తుడినని, జంధ్యం ధరించిన హిందువునని రాహుల్ అనేక విధాలుగా చెప్పుకుంటున్నాడు.

కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒక కచ్చితమైన నిబద్ధతతో లౌకికవాద విధానాలను అమలుపరచకపోవడం వల్లే ఇప్పుడు ఆ పార్టీ ఆ భావజాలం విషయంలో తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటోంది. ప్రత్యర్థి పక్షానిదే అన్ని విధాల పైచేయిగా ఉన్నది. కనుకనే కాంగ్రెస్ ముస్లిం అనుకూల పార్టీ అని ప్రజలు విశ్వసించేలా చేయడంలో బీజేపీ సఫలమయిందని ఐదేళ్ల క్రితమే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించక తప్పలేదు. హిందీ రాష్ట్రాలకు చెందిన ‘లౌకికవాద’ మండల్ యోధులు రాజ్యాంగ విలువలకు చిత్తశుద్ధితో కట్టుబడి లేకపోవడం వల్లే వారిని ‘ముస్లిం అనుకూలురు’గా హిందూత్వ వాదులు చిత్రించగలుగుతున్నారు. ఈ విషయమై తమపై వస్తున్న ఆరోపణలకు ‘మండల్’ యోధులు సరైన సమాధానమివ్వలేకపోతున్నారు.

నిజమైన లౌకిక వ్యవస్థ అన్ని మతాల వారినీ సమభావంతో చూస్తుంది. ఎటువంటి మతపరమైన వివక్ష లేకుండా ప్రతీ ఒక్కరికీ న్యాయాన్ని సమకూరుస్తుంది. బాబ్రీ మసీద్ కూల్చివేత, సుప్రీంకోర్టు మాటల్లో ‘నేరపూరిత చర్య’. ఆ దురాగతానికి కారకులయిన వారిపై, 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితులపై జరిగిన విధంగా శీఘ్రగతిన విచారణ ఎందుకు జరపలేదు? ఇది ప్రశ్నించవలసిన విషయం. యదార్థ లౌకికవాద సమాజం బహుళత్వవాదానికి నిబద్ధమై ఉండాలి. అని మతాల వారిని సమభావంతో ఆదరించాలి. సహన భావంతో వ్యవహరించాలి. ఓటు బ్యాంకులకు ప్రాధాన్యమిచ్చే మెజారిటీవాద రాజకీయాలను త్యజించాలి. పాలనా విధానాలు, పద్ధతులపై మత ప్రభావం ఉండకూడదు. ఏ ఒక్క మత పరమైన అస్తిత్వానికి అధిక ప్రాధాన్యమివ్వకూడదు. మత పరమైన గుర్తింపు రాజకీయాలు చేసే నేతలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి.

లౌకికవాదం గురించిన తన దార్శనికతను జవహర్ లాల్ నెహ్రూ 1960లో ఇలా స్పష్టీకరించారు: ‘భారత్‌లో మత ప్రమేయం లేని ఒక రాజ్య (సెక్యులర్ స్టేట్) వ్యవస్థను పరిపూర్ణంగా, పటిష్ఠంగా నిర్మించుకోవడం గురించి మనం తర్జన భర్జన పడుతున్నాం. ‘సెక్యులర్ ’ అనే ఆంగ్ల పదానికి హిందీ భాషలో సరైన, కచ్చితమైన మాటను కనుగొనడం కూడా బహుశా, అంత సులువైన విషయం కాదు. లౌకికవాదం అంటే మతానికి పూర్తిగా వ్యతిరేకమైనదిగా కొంతమంది భావిస్తున్నారు. ఆ భావన ఎంతమాత్రం సమంజసమైనది కాదు. అన్ని మతాలను సమానంగా గౌరవించి, ఆదరించి, ఎటువంటి మినహాయింపు లేకుండా వాటన్నిటికీ సమస్థాయి అవకాశాలు కల్పించడమే లౌకికవాదం. అదే దాని గుణశీలత, అదే దాని సార్థకత’. ఈ సమున్నత ఆదర్శానికి, మన గణతంత్ర రాజ్య ప్రాథమిక సూత్రానికి తాము మనసా వాచా కర్మణా కట్టుబడి ఉన్నామని, ప్రజా జీవితంలో ఆ స్ఫూర్తి సంపూర్ణంగా విలసిల్లేందుకు నిబద్ధమై ఉన్నామని ఏ రాజకీయ పార్టీ అయినా నిశ్చితంగా చెప్పగలదా? అటువంటి నైతిక సమున్నతితో వ్యవహరించే రాజకీయపక్షాలు ఒకటికి మించి ఉన్నప్పుడు మాత్రమే మన ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్య భవిష్యత్తుకు భరోసా సమకూరుతుంది.

gరాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Jan 12 , 2024 | 01:43 AM