Share News

నా పేరు రైతు.. నా పైరు కవాతు..!

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:30 AM

మహమ్మారి గళానికి అమరిన అరదండమై ఉరితాడును హత్తుకునే మొండెమై కాలం కొయ్యకు వేళ్లాడుతూ చిరుగుతున్న వస్త్రమై మిన్నంటి రెపరెప లాడుతున్న వ్యవసాయ కార్మికులం...

నా పేరు రైతు.. నా పైరు కవాతు..!

మహమ్మారి గళానికి అమరిన అరదండమై

ఉరితాడును హత్తుకునే మొండెమై

కాలం కొయ్యకు వేళ్లాడుతూ

చిరుగుతున్న వస్త్రమై

మిన్నంటి రెపరెప లాడుతున్న

వ్యవసాయ కార్మికులం

కళ్ళనీ ఒళ్ళునీ భగ భగ మండించే

పంటనై మంటనై మండిన నేను

ఆరుగాలం స్వేదాన్ని ముద్దాడినా

ఆర్చి పేర్చిన పంటకు

గిట్టుబాటు లేక బ్రతుకుల్ని

కాటేసిన దృశ్యం

ఏపుగా పెంచి సున్నితంగా తుంచి

ఎండబెట్టి గల గలా గంపకెత్తి

బస్తాల్లో బానెడు ఆశల్తో కుక్కి

మార్కెట్‌ యార్డుల్లోకెల్తే

తల వేళ్లాడదీసిన పంట ధర

నా భరోసాను ముక్కలు చేసింది

నెత్తిన సూరీడు సూదిమొనతో గుచ్చినట్టు

సురుక్కు సురుక్కున పొడుస్తున్నా

నా మదిలో తొలుస్తున్న దొక్కటే

పంటంతా నా చెమట తూకానికైనా అమ్మాలి

చిల్లుపడ్డ కుండలో నీళ్లాగ నట్లే

మా బతుకెప్పుడూ నీరుగారుతూనే వుంది

విపణి శక్తులూ ప్రకృతి విపత్తులూ

మాయదారి కలుపు చట్టాలు

తల తాకట్టు పెట్టుకొమ్మన్నై

అన్నీ మమ్ముల్ని అమ్ముడు పొమ్మన్నై

అన్నీ మమ్మల్ని అవమానించినై

పంటను మా గుండె మంటనూ

నిలువునా తగలబెట్టుకొమ్మన్నై

వ్యవసాయానికి వెన్నుముకనై

అన్నపూర్ణ దేశంలో రాజునై రారాజునై

అక్షర పుటల్లో వర్ధిల్లిన నేను

ఇప్పుడు చేతుల్ని నెత్తి మీద

చరుచుకుంటూ ఏకరువు పెడుతున్నా

మిరప పండ్లను కస పిస

రోట్లో నూరిన కారం లెక్క

నిఖార్సుగా భగ భగ మండుతున్నా

కమ్ముకొచ్చిన కసాయి రక్కసిపై

ఉద్యమ మందును పూట పూటకూ

పిచికారీ చేస్తున్నా

బ్రతుకు పంట ఎందుకు

పచ్చగా పండదో వేచి చూస్తున్నా

ఇప్పటివరకూ

బలిపీఠంపై మోకరిల్లిన తల నాదే కావచ్చు

కానీ... ఇప్పుడిక సమస్యలను

ఉరితీసే తలారీని నేనే..!

నా పేరు రైతు.. నా పైరు కవాతు..!

కటుకోఝ్వల రమేష్

(రైతు ఉద్యమానికి సంఘీభావంగా)

Updated Date - Feb 20 , 2024 | 01:30 AM