Share News

సామరస్యానికి లాకులెత్తండి!

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:11 AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రధానమంత్రిని కలిసినపుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు...

సామరస్యానికి లాకులెత్తండి!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రధానమంత్రిని కలిసినపుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అలా కోరడంలో తప్పులేదు. కానీ, వాస్తవంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నికర జలాల కేటాయింపులు లేవు. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచలేదు. తుదకు అపెక్స్ కౌన్సిల్ ఆమోదమూ లేదు.

సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. తెలంగాణతో పాటు అవశేష ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమకూ అపకారం జరిగింది. తెలంగాణకు గాని రాయలసీమకు గాని సాగునీటి రంగంలో సరైన న్యాయం జరగలేదంటే అది బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరిగినపుడు తప్ప రాష్ట్ర విభజన తరువాత కాదు. అందువల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు సమయంలోనూ, తుది తీర్పు వచ్చినపుడు 2013లో సుప్రీంకోర్టు తలుపు తట్టి గెజిట్ నోటిఫికేషన్ జరగకుండా స్టే తెచ్చింది. ఇన్నేళ్లు గడిచినా ఈ కేసు సుప్రీంకోర్టులోనే వుంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని ట్రిబ్యునల్ తీర్పు పునఃసమీక్ష కోసం ప్రయత్నించి వుండాలి. అలా చేయలేదు. తన రాజకీయ అవసరార్థం ఆంధ్రప్రదేశ్‌తో అంతర్ రాష్ట్ర జల వివాదాన్ని అట్టే పెట్టుకొన్నారు.

బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఉరితాడు. కర్ణాటకకు గంపగుత్తగా నేరుగా వాడుకొనేందుకు 170 టియంసిలు, మహారాష్ట్రకు 78 టియంసిలు ఇచ్చి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 39 టియంసిలు మాత్రమే కేటాయించింది. కన్నీటి తుడుపుగా 145 టియంసిలు క్యారీ ఓవర్ కింద చూపారు. ఇంత అన్యాయం జరిగితే కేసీఆర్ ఏనాడూ పల్లెత్తుమాట అనకపోగా, అవశేష ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే తమకు అన్యాయం జరిగిందని వాదించేవారు.. అంతేకాదు, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోను, సుప్రీంకోర్టులోను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగి కృష్ణ జలాలు పంపకం చేయాలని పట్టుపట్టారు. కాని బేసిన్ మొత్తంలో తెలుగు రాష్ట్రాలకు జరిగిన అన్యాయం గురించి పట్టించుకోలేదు. తుదకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బుట్టలో వేసుకొని కొత్త ట్రిబ్యునల్ నియామకానికి మార్గం సుగమం చేసుకున్నారు. కొత్త ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకైనా రేవంత్ రెడ్డి ఆగి వుండాల్సింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించమని వెంటనే కోరకపోతే తనకు కేసీఆర్ దక్షిణ తెలంగాణలో పొగ బెడతారని భావించి వుండవచ్చు.

ఒక రాష్ట్రం రెండుగా విభజింపబడితే వాటి మధ్య సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సంధానకర్తగా వ్యవహరించాలి. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సైంధవ పాత్ర పోషించింది. బేసిన్‌లోని అన్ని రాష్ట్రాల మధ్య ఒక ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది, కోర్టు కేసులతో పెండింగ్‌లో వుంది. దాని అతీగతీ తేలక ముందే రాష్ట్ర విభజన చట్టం మేరకు అదే ట్రిబ్యునల్ విచారణ జరిపేందుకు నోటిఫై చేసింది. ఆ తీర్పు రాలేదు. తిరిగి అదే రెండు రాష్ట్రాల మధ్య మరో ట్రిబ్యునల్ నియామకం చేసింది. బహుశా భారతదేశ చరిత్రలో అంతర్ రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి ఇన్ని ట్రిబ్యునల్‍ల నియామకం ఎక్కడా జరిగివుండదేమో. మరోవేపు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై చేసేందుకు కర్ణాటక మహారాష్ట్ర ప్రభుత్వాలు యత్నాలు చేస్తున్నాయి. ఒక వేళ సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రాల మధ్య తంపులు పెట్టి పబ్బం గడుపుకొనేందుకు సిద్ధంగా ఉన్న కేంద్రం నోటిఫై చేస్తే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలు అంతటితో ఖతమౌతాయి. తదుపరి సుప్రీంకోర్టు పరిధి కూడా దాటిపోతుంది.

ఈ సందర్భంలో, రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు ఏకకంఠంతో 2013లో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తమకు సమ్మతం కాదని, బేసిన్‍లోని అన్ని రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పునఃపంపిణీ జరగాలని గట్టిగా పోరాడాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ట్రిబ్యునల్ తీర్పుపై సమీక్ష కోసం న్యాయం పోరాటం చేస్తే, రెండు రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడిన వారవుతారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తారో అనుమానమే. జగన్‌కు పొగబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ షర్మిలను దింపుతోందన్న వార్తల నేపథ్యంలో, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలసి పోరాటానికి జగన్‌ సిద్ధపడతారా? ఇక, రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నా లేకున్నా ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం కాకపోతే మరోమారు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన వారవుతారు. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ బేసిన్‌లో మొత్తం 448 టియంసిలు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా ఉపయోగించుకొనేందుకు దక్కింది 39 టియంసిలు మాత్రమే. ఇది సరిదిద్దబడితే తెలుగు రాష్ట్రాల్లో మిగులు జలాల ఆధారంగా గల ప్రాజెక్టులకు అటు ఇటుగా సర్దుబాటు చేసుకోవచ్చు. ముందు, బేసిన్‌లో న్యాయమైన వాటా లభించిన తరువాత తెలుగు రాష్ట్రాలు తమ లెక్కలు తేల్చుకోవచ్చు. ఆ ఆలోచన చేయకుండా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కయ్యానికి ప్రాధాన్యత ఇస్తే చివరకు ఎవరికీ దక్కేదేమీ ఉండదు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Updated Date - Jan 05 , 2024 | 01:14 AM