Share News

ఫ్రెంచ్ దర్పణంలో మోదీ భారత్!

ABN , Publish Date - May 24 , 2024 | 06:33 AM

పారిస్ కేంద్రంగా పనిచేసే ‘ప్రపంచ అసమానతల పరిశోధనశాల’ (World Inequality Lab) ఈ ఏడాది మార్చిలో ‘1922–2023 మధ్య భారతదేశంలో ఆదాయం, సంపదల అసమానతలు : ఆవిర్భవించిన ధనస్వామ్యం’...

ఫ్రెంచ్ దర్పణంలో మోదీ భారత్!

పారిస్ కేంద్రంగా పనిచేసే ‘ప్రపంచ అసమానతల పరిశోధనశాల’ (World Inequality Lab) ఈ ఏడాది మార్చిలో ‘1922–2023 మధ్య భారతదేశంలో ఆదాయం, సంపదల అసమానతలు : ఆవిర్భవించిన ధనస్వామ్యం’ అనే డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. ప్రసిద్ధ ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ సారథ్యంలో నలుగురు పరిశోధకులు జరిపిన ఈ అధ్యయనం భారతదేశంలో ధనికులకూ పేదలకూ మధ్య ఆర్థిక అంతరం విపరీతంగా పెరిగిందని అది ఇప్పుడు అగ్రభాగాన ఉన్న ఒక శాతం ధనికుల వద్ద దేశ సంపదలో 40 శాతం పోగుపడిందని, జనాభాలో పైన ఉన్న 10 శాతాన్ని తీసుకుంటే అది 60 శాతానికి చేరిపోయిందనీ ఆ అధ్యయనం తేల్చింది. మిగిలిన తొంభైశాతంలో ఉన్న నలభై శాతం మధ్యతరగతి వద్ద 29 శాతం జమ కాగా అడుగున ఉన్న యాభై శాతం ప్రజలకు 6 నుంచి 7 శాతం మాత్రమే మిగిలిందని వివరించింది.


ఈ పరిశీలన స్థూలంగా ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్సు దేశ ఆర్థిక పరిస్థితిని పోలి ఉంది. ఇదేకాదు అనేక ఇతర అంశాల్లో కూడా ఇప్పుడు మనదేశం అప్పటి ఫ్రాన్సులానే ఉందనిపిస్తుంది. 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవం ఫ్రాన్స్‌లో రాచరిక వ్యవస్థతో పాటు భూస్వామ్య వ్యవస్థను కూల్చివేసి మొదటిసారి మధ్యతరగతి సామాజిక వర్గాల ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇది రెండు వందల ఏళ్లు ఫ్రాన్సును పాలించిన బూర్బన్ రాజవంశ నిరంకుశత్వాన్ని పెకలించింది. మనుషులకు మొదటిసారి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను పంచి ఇచ్చింది.

ఫ్రెంచ్ సమాజంలో రెండు అంతరాలు ఉండేవి. ఒకటి అవకాశాలు ఉన్న వర్గం (Privileged Class), రెండు అవకాశాలు లేని వర్గం (unprivileged class). మొదటి వర్గంలో భూస్వాములూ, మతాచార్యులూ ఉండగా మధ్యతరగతి, సామాన్యులు రెండవ వర్గంలో ఉన్నారు. మొత్తం జనాభాలో ఒక శాతం ఉన్న అవకాశాలున్న వర్గం దేశ సంపదలో నలభై శాతం కైవసం చేసుకుని ఉంది. తొంభైతొమ్మిది శాతం ఉన్న అవకాశాలులేని వర్గం మిగిలిన అరవై శాతం పంచుకోవలసి వచ్చింది. అసలు తేడా అది కాదు. నలభై శాతం సంపద కలిగిన వర్గానికి పన్నుల చెల్లింపునుంచి మినహాయింపు ఉండగా దేశ పన్నుల భారాన్నంతా సామాన్యులూ, మధ్యతరగతే మోయవలసి వచ్చింది. అందుకే ఫ్రాన్సులో ‘భూస్వాములు యుద్ధాలు చేస్తారు. మతాచార్యులు ప్రార్థనలు చేస్తారు. ప్రజలు పన్నులు చెల్లిస్తారు’ అనే నానుడి వచ్చింది. ఇది అటుంచితే ఫ్రాన్సులో అప్పుడున్నది రాజ్యాంగబద్ధ రాచరికం. కానీ, అది నామమాత్రమే. నిజానికి నెలకొన్నది నిరంకుశ రాచరికం. రాజ్యాన్ని ప్రశ్నించినవాళ్లు వెలుతురే కనిపించని బాస్టైల్ అనే జైలులో మరణించేదాకా నిర్బంధించబడేవారు. రాజ్యాంగాన్ని అనుసరించి ఎస్టేట్స్ జనరల్ అనే పార్లమెంట్ ఉండేది. చట్టాలు చేయడంలో రాజు దాని అనుమతి పొందవలసి ఉంది. కానీ బూర్బన్‌లు 175 సంవత్సరాలుగా దానికి ఎన్నికలు జరపలేదు. విప్లవానికి రెండేళ్ల ముందునాటికి ఆడంబరాలతో, యుద్ధాలతో ఖజానా ఖాళీ అయిపోవడంతో ధనిక వర్గంపై పన్నులు విధించక తప్పదనే ప్రతిపాదన వచ్చినపుడు ఆ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. రాజు సైతం ఆ వర్గాన్నే సమర్థించడంతో సామాన్యులు వెంట నడవగా మధ్యతరగతి నాయకత్వంలో విప్లవం చెలరేగి రాజకీయ, సామాజికవ్యవస్థల్ని పడగొట్టింది.


ఎవరు ప్రజలు? ప్రభుత్వం ఎవరి సంక్షేమం కోసం ఉంది? అనే ప్రశ్నలు ఫ్రెంచ్ రాజవంశానికి అర్థం కాలేదు. విప్లవం నాటి ఫ్రెంచ్ చక్రవర్తి 16వ లూయీ భార్య మేరీకి ఎప్పుడూ తమను పరివేష్టించి ఉండే ధనిక వర్గాలు కాక అసలు ప్రజలు వేరే ఉంటారని తెలియదట. అందుకే ఆమెకు ప్రజలు బ్రెడ్డు లేక అలమటిస్తున్నారని చెబితే ‘బ్రెడ్డు దొరకకపోతే కేకులు తినవచ్చు కదా’ అని అన్నదని అంటారు. తన రాజ్యాన్ని ఆర్థిక దుస్థితినుంచి బయట పడెయ్యడానికి, జనాన్ని ఆకలి నుంచి రక్షించడానికి తన ప్రభుత్వమే భూస్వాముల మీద మతాచార్యులమీద పన్ను విధించటానికి సిద్ధపడితే వారితో కలిసి తనకు తానే అడ్డుపడి చివరికి బలి కావడం ఫ్రాన్సు చక్రవర్తికి ఆత్మహత్యా సదృశమైంది. ఆ ఫ్రెంచ్ సందర్భం పికెటీ బృందం పరిశీలనలో తేలిన ఒక్క శాతం మంది నలభై శాతం సంపద కలిగి ఉన్న అంశంతో మొదలై ధరల పెరుగుదల, నిరుద్యోగం, పన్నులతో ప్రజలు కుదేలౌతుంటే, కార్పొరేట్లకిచ్చిన లక్షల కోట్ల రుణాలను మాఫీచేసి దేశ ఆర్థికవ్యవస్థను ఆ వర్గాలకు కట్టబెట్టడుతున్న ఇప్పటి భారతీయ సందర్భంతో సరితూగుతున్నది. తమ మీద విధించిన పన్నులు చెల్లించడానికి నిరాకరించి, ప్రజల దాడులు తప్పించుకోవడానికి దేశంనుంచి పారిపోయిన ఫ్రెంచ్ భూస్వాములతో – కోట్లాది రూపాయల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పలాయనం చేసిన పెద్దమనుషులను పోల్చవచ్చు. 2014 తర్వాత పైస్థాయి వ్యాపారస్థులతో ప్రభుత్వం జట్టుకట్టడం బాగా పెరిగిపోయిందని ఈ అధ్యయనం ధ్రువీకరించడం రెండు సందర్భాల మధ్య సారూప్యతను పెంచుతున్నది.


బూర్బన్ చక్రవర్తి 14వ లూయీ సర్వ మంత్రాంగాన్ని నిర్వీర్యం చేసి అధికారాన్నంతా తన చేతుల్లోనే కేంద్రీకృతం చేసుకున్నాడు. కాలు దువ్వి మరీ యుద్ధాలు చేశాడు. తన అంత్యక్రియలకు కూడా మిగలకుండా డబ్బును దుబారా చేశాడు. ‘నేనే రాజ్యాన్ని’ (I am the state) అని హూంకరించాడు. ఇప్పుడు కూడా మన దేశంలో అన్నిటా అంతటా తానై వ్యవహరించే నాయకత్వాన్ని చూస్తున్నాం. అన్ని చోట్లా ఒక్క రూపాన్నే దర్శిస్తున్నాం. అనుచరుల్ని తప్ప సహచరుల్ని అనుమతించని ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దేశంలో ఒక వర్గాన్ని తమ వాళ్లుగా, మరికొన్ని వర్గాల్ని ఇతరులుగా చూసే వివక్షాపూరిత పరిపాలనను గమనిస్తున్నాం. ఈ నియంతృత్వ ధోరణి గత పదేళ్లలో బాగా బలపడిన వైనాన్ని అసమానతల డాక్యుమెంట్ నిర్ద్వంద్వంగా ప్రస్తావించింది.

విద్య, వైద్యం, న్యూట్రిషన్ వంటి రంగాలలో ప్రజల పెట్టుబడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే దేశంలో సామాన్యులేకాదు, శిష్ట వర్గంకూడా ప్రయోజనం పొందుతుందని భావించిన పికెటీ బృందం దేశంలోని 167 అత్యంత ధనిక కుటుంబాల మీద రెండు శాతం సూపర్ టాక్స్‌ను విధించాలని ప్రతిపాదించింది. ఇది ఫ్రాన్సులో విప్లవానికి తక్షణ కారణమైన ధనిక వర్గాలమీద విధించబూనుకున్న పన్నును తప్పక గుర్తుకు తెస్తుంది.

పారిస్‌ను భీకర క్షామం కమ్ముకోగా, చిన్న బ్రెడ్డు ముక్క కోసం ‘అలగా జనం’ కాట్ల కుక్కల్లా కొట్లాడుకుంటున్నపుడు వేల మంది పారిస్ స్త్రీలు దాదాపు పాతిక మైళ్ల దూరం ఆకలియాత్ర చేసి ‘వర్సే’ రాజభవనాన్ని ముట్టడించారు. తేరిపార చూస్తే ప్రభుత్వం నిర్దేశించిన మార్కెట్ స్థలాల్లోనే రైతులు తమ పంటలను విక్రయించాలని నిర్దేశించిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రాజధాని ఢిల్లీ మీద సంవత్సరం పైగా రైతులు చేసిన ముట్టడి అటువంటిదే. చట్టాలు రద్దయినా కనీస మద్దతుధర కోసం ఇప్పుడు జరుగుతున్నదీ దానికి కొనసాగింపే. ఈ సందర్భంలోనే సిఎఎ, యన్ఆర్‌సిలకు వ్యతిరేకంగా ఢిల్లీ షహీన్ బాగ్‌లో మహిళలు చేసిన ఆందోళన గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది? ‘ఒక వ్యక్తి పుట్టుక, పుట్టిన చోటు, పౌరసత్వం గురించి మాట్లాడడానికి మహిళలకన్నా అర్హులెవరుంటారు?’ అని రొమిలాథాపర్ వేసిన అర్థవంతమైన ప్రశ్నకు, తమ బిడ్డల, భర్తల, తల్లిదండ్రుల ఆకలి తీర్చేందుకు రాజు మీద దాడి చెయ్యడానికి పారిస్ స్త్రీల కంటే మించిన అవసరమెవరికి ఉంటుంది అనే ప్రశ్నతో అనుసంధానం సరిగ్గా కుదురుతుంది.


‘కళ్లు మిరుమిట్లు గొలిపే సంపదల్ని చూపించి నాగరికత అంటున్నారు. తప్పులు జ్ఞానంగా చలామణి అవుతున్నాయి. అణచివేతకు అదుపు అనే పేరు పెట్టారు. ఊడ్చిపారెయ్యండి ఈ వ్యవస్థ అక్రమ నిర్మాణాన్ని. అసమానతల్ని సమం చెయ్యండి. ఈ సంకెళ్లని తెంచండి’ అంటూ విప్లవానికి ముందు ఫ్రెంచ్ తత్వవేత్త రూసో ప్రజలకు పిలుపు ఇచ్చాడు. కొద్దిమంది దగ్గరున్న సంపద చూపించి దేశం అభివృద్ధి చెందిందని చెప్పటం, ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడటం, అభూతకల్పనల్ని చరిత్రగా నమ్మబలకటం, ప్రభుత్వ వ్యవస్థల్ని ఉపయోగించి అనుకూలంగా లేనివారిని అణగద్రొక్కడం రూసో మాటల్ని ఇక్కడ ప్రాసంగికం చేస్తున్నాయి. Error miscalled knowledge అన్న ఆయన మాట ఇప్పుడు ఎంత సత్యమో కదా.

విప్లవానికి ముందు ఫ్రాన్సులో నెలకొన్న పరిస్థితులు ఇంచుమించుగా యూరప్ అంతా ఉన్నవే. కానీ విప్లవాన్ని ఫ్రాన్సులో సాధ్యంచేసింది మటుకు ఆ దేశానికి మాత్రమే పరిమితమైన మధ్యతరగతి మేధావి వర్గం. భారతదేశంలో ఒకప్పుడు బెంగాల్‌కు ఉన్న స్థానం యూరప్‌లో ఫ్రాన్సుకు ఉండేది. ఇవి రెండూ సమకాలికులకంటే ఒకరోజు ముందుంటాయి. విప్లవానికి ముందు ఫ్రాన్సులో ఒక ఉక్కపోత వాతావరణం ఉండేది. స్వేచ్ఛగా మాట్లాడలేని, నచ్చింది తినలేని, నిజం మాట్లాడలేని, నేనీ దేశ పౌరుణ్ణి అని ప్రకటించుకోలేని ఊపిరాడనితనం ఇప్పుడు ఇక్కడ కూడా ఆవహించింది. మాంటెస్క్యూ, వోల్టేర్, రూసో, డిడిరో లాంటి మేధావులు ఫ్రెంచ్ సమాజంలో కదలిక తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పౌరసమాజం సృష్టించిన చైతన్యం లాంటిది ఇప్పుడు దేశమంతా వ్యాపించడమే మిగిలి ఉంది.


ప్రజాస్వామ్యంలో ఎన్నికలే విప్లవాలు. ఫ్రెంచ్ విప్లవం మనకు సాధించి పెట్టింది అదే. సందర్భం మారినపుడు రూపం మారుతుంది. ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యేటప్పటికి రంగులు వెలిసిపోయి అసలు రూపాలు బయటపడుతున్న నేపథ్యాన, ప్రజలు సత్యాసత్యాలను గుర్తించగలుగుతున్న దశలో, దేశం మరో విప్లవం అంచుకు నడుస్తోందనే వార్తల మధ్య చరిత్ర పురాస్మృతిగా మిగలకూడదు, కొత్త అర్థంలో పునరావృతమే కావాలి.

కొప్పర్తి వెంకటరమణమూర్తి

Updated Date - May 24 , 2024 | 06:33 AM