Share News

జనసంకల్పమే మోదీ గ్యారంటీ

ABN , Publish Date - Apr 16 , 2024 | 03:59 AM

ప్రజలు తిరస్కరించిన రాజకీయ పార్టీలలో ప్రధానమైనది కాంగ్రెస్. గత రెండు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ....

జనసంకల్పమే మోదీ గ్యారంటీ

ప్రజలు తిరస్కరించిన రాజకీయ పార్టీలలో ప్రధానమైనది కాంగ్రెస్. గత రెండు ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో కేవలం రెండు రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీని ముఖాముఖి 190 స్థానాల్లో ఎదుర్కొన్నది. బీజేపీ 175 స్థానాల్లో విజయం సాధించగా కేవలం 15 స్థానాల్లో మాత్రమే బొటాబొటి ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ గెలిచింది. దాదాపు 224 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 50 నుంచి 70 శాతం వరకు ఓట్లు సాధించింది. ఈ గణాంక వివరాలను చూస్తే ఏమి అర్థమవుతుంది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ దరిదాపుల్లో కూడా రాలేదని స్పష్టమవుతుంది. అలాంటి పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు ఏమి విలువ ఉంటుంది? దాదాపు 6 దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలినప్పటికీ కోట్లాది ప్రజలను దారిద్ర్యం నుంచి విముక్తి కలిగించలేకపోయిన పార్టీ ఇప్పుడు సామాజిక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. కుటుంబ వారసులు, అవినీతిపరులు, అక్రమార్జనపరులు, పదవికోసం నానా గడ్డి కరిచేవారున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఆరుదశాబ్దాల పాటు ప్రజలను కులాలుగా, మతాలుగా చీల్చి పబ్బం గడుపుకుంది. అలాంటి పార్టీ చేసే వాగ్దానాలను ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదు.

భారతీయ జనతా పార్టీకి ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు ఉన్న విశ్వసనీయత వేరు. ఎన్నికల ప్రణాళిక అనేది బీజేపీకి ఒక సైద్ధాంతిక పత్రం. ప్రజలను గౌరవించే ప్రమాణ పత్రం. ఒక దృఢ సంకల్పం. అందుకే రానున్న అయిదు సంవత్సరాల్లో బీజేపీ తాను అమలు చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు ప్రజలకు సంకల్పపత్రం రూపంలో తెలిపింది. సంకల్పం అంటే హామీలకు మించింది. రానున్న అయిదు సంవత్సరాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. అవినీతిపై పోరును మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. రాబోయే తరం కోసం సంస్కరణలను అమలు చేసి వివిధ రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని స్పష్టం చేసింది. అనేక ప్రజా అనుకూల నిర్ణయాలను తీసుకుంటానని తెలిపింది. 2047 కల్లా భారత్‌ను అగ్రరాజ్యంగా మార్చేందుకు ఒక్క క్షణం వృథా చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని తెలిపింది. వివిధ వర్గాలకు మోదీ గ్యారంటీ పేరుతో తాము తీసుకోబోయే చర్యలనన్నీ ఈ మేనిఫెస్టోలో ప్రకటించింది.

బీజేపీ తాను వాగ్దానం చేసిన వాటిలో అనేకం అమలు చేసింది. కశ్మీర్‌ను భారతదేశం నుంచి విడదీసి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ను రద్దుచేసి కశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగం చేస్తామని బీజేపీ కొన్ని దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆర్టికల్ 370ను రద్దు చేసింది. ఉమ్మడి పౌర స్మృతి దిశగా చర్యలు ప్రారంభించి త్రిపుల్ తలాఖ్‌ను రద్దుచేసింది. అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన చోటే రామమందిరం నిర్మించి తీరతామని బీజేపీ ఎప్పుడో వాగ్దానం చేసింది. ఆ కల నెరవేరి ఈ ఏడాది జనవరిలోనే అయోధ్యలో భవ్యమైన రామమందిరం వెలిసింది. ఉగ్రవాదం, నక్సలిజంపై బీజేపీ ఏ మాత్రం సహించని వైఖరిని అవలంబించినందువల్లే ఇవాళ దేశం ఈ దుష్టశక్తులనుంచి ఊపిరి పీల్చుకుంటోంది. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసి దేశాభివృద్ధికి తగ్గ అధునాతన చట్టాలను ప్రవేశపెట్టింది. బ్రిటిష్ కాలపు వలస పాలనను ప్రతిబింబించే నేర శిక్షాస్మృతి స్థానంలో సమగ్రమైన భారతీయ నేర సంహితను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 5 దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన 5 దేశాల్లో ఒకటిగా మారింది. మోదీ హయాంలో 25 కోట్లమంది పేదలు దారిద్ర్య రేఖను దాటిపోయారు. రైతులు, మహిళలు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలు, ఎస్‌సి, ఎస్‌టి, ఆదివాసీల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనపడుతున్నాయి. గత పది సంవత్సరాల్లో రైతులకు కనీస మద్దతు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. అంతర్జాతీయ ధరలతో నిమిత్తం లేకుండా ఎరువులు చవక ధరల్లో లభిస్తున్నాయి. ఇవన్నీ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించి మరీ అమలు చేసింది. మోదీ ప్రభుత్వం గత పదేళ్లుగా తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేసేందుకే ఈ మేనిఫెస్టోను రూపొందించారు. పదేళ్ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో దేశమంతా నిరాశా నిస్పృహలు నెలకొనివున్నాయి. మోదీ తొలి హయాంలో ఈ నిరాశా నిస్పృహలు తొలగిపోయి దేశం ఆర్థికంగా బలోపేతం కాగలదనే విశ్వాసం బలపడింది. గత అయిదేళ్లలో ఈ విశ్వాసం ఆత్మవిశ్వాసంగా మారింది. దేశంలో నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్ధి వేగంగా అమలవుతాయని, యువకులు, మహిళలు, మధ్యతరగతి, అణగారిన వర్గాలకు అవకాశాలు పెరుగుతూనే ఉంటాయని ఒక స్పష్టత వచ్చింది. ఆధునిక భారతానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకూ ఒకే పౌర స్మృతి కొనసాగుతుందని, స్త్రీపురుషుల మధ్య సమానత్వం ఏర్పడుతుందని ఆశాభావం కలిగింది. ప్రతి ఏడాది దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరిగి వేల కోట్లు ఖర్చయ్యే దుస్థితి పోయి ప్రతి ఐదేళ్లకూ ఒకేసారి దేశమంతటా అన్ని స్థాయిల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అందరికీ స్పష్టమైపోయింది.

ఈ పదేళ్లుగా ప్రధాని మోదీ పనితీరు ఆధారంగానే బీజేపీ ఇవాళ అత్యంత ఆత్మవిశ్వాసంతో తన సంకల్ప పత్రాన్ని ప్రజల ముందు ప్రకటించింది. వచ్చే పాతికేళ్లలోపు దేశంలో మార్పులు ఏమి జరుగబోతాయో ప్రకటించింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసేందుకు ‘కృషి మౌలిక సదుపాయాల మిషన్’ను ప్రకటించింది. వృద్ధులకు ఉచితంగా, నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజనను విస్తరిస్తామని తెలిపింది. 2029 వరకు దేశంలో 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా కొనసాగుతుందని తెలిపింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పైప్ ద్వారా గ్యాస్‌ను అందిస్తామని తెలిపింది. ముద్రా రుణాలను రూ.20 లక్షల మేరకు రెట్టింపు చేస్తామని ప్రకటించింది పేద కుటుంబాలకు పిఎం సూర్య ఘర్ ముఫ్తి బిజ్లీ యోజన క్రింద ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని తెలిపింది.

కాంగ్రెస్ పార్టీలో కొందరు తమను తాము మేధావులు అనుకునేవారు ప్రజలను భ్రమింపచేసేందుకు అందమైన పదాలతో వాగ్దానాలను రూపొందించి మేనిఫెస్టోలో చేరుస్తారు. బీజేపీలో అలా జరగదు. బీజేపీ తన మేనిఫెస్టో కోసం ప్రజలనుంచి సూచనలు కోరింది. దాదాపు 11 లక్షల మంది ప్రజలు తమ సూచనలు చేశారు. 4 లక్షల మంది నమో ఆప్ ద్వారా తమ ఆలోచనలను పంచుకున్నారు. వీటన్నిటినీ దాదాపు 50 మందికి పైగా బీజేపీ కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు రెండు నెలల పాటు క్రోడీకరించి సంకల్ప్ పత్రాన్ని రూపొదించారు. అందుకే బీజేపీ సంకల్పం అంటే ప్రజల సంకల్పం. మోదీ గ్యారంటీ అంటే జనం ఆత్మవిశ్వాసం.

వై. సత్యకుమార్

(బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - Apr 16 , 2024 | 03:59 AM