Share News

మోదీ వ్యాఖ్యలో నిజమున్నది కానీ..!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:39 AM

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలిసింది ఏమీ లేదు; రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలు, ప్రత్యర్థి పక్షాలపై అవధులు లేని విమర్శలు, ప్రజలకు అరచేతిలో...

మోదీ వ్యాఖ్యలో నిజమున్నది కానీ..!

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలిసింది ఏమీ లేదు; రాజకీయ పార్టీలు తమ ప్రణాళికలు, ప్రత్యర్థి పక్షాలపై అవధులు లేని విమర్శలు, ప్రజలకు అరచేతిలో స్వర్గాన్ని చూపుతున్న వాగ్దానాలతో రణోత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. వివిధ వర్గాలలోని తమ మద్దతుదారులను నిలుపుకోవడమూ, ఓటు బ్యాంకును విస్తృతపరచుకోవడమే వాటి లక్ష్యంగా ఉన్నది. ఇటువంటి వ్యూహాలు, ఎత్తుగడలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మినహాయింపు కాదు. రాజస్థాన్‌లో ఒక ఎన్నికల ప్రచారసభలో ఆయన వెలువరించిన ప్రసంగమే అందుకు నిదర్శనం. సంపద పునఃపంపిణీ హామీల విషయమై కాంగ్రెస్ పార్టీపై ఆయన ఆ ఉపన్యాసంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ముస్లింలకు సంపదను కాంగ్రెస్ పునఃపంపిణీ చేస్తుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2006లో ఒక ఉపన్యాసంలో సూచించారని నరేంద్ర మోదీ రాజస్థాన్ ఎన్నికల సభలో వక్కాణించారు. కాంగ్రెస్ పార్టీ ‘దేశ సహజ వనరుల’పై ప్రథమ హక్కును ముస్లింలకే ఇస్తుందని, ‘చొరబాటుదారుల’కు, ‘అధిక సంతానం ఉన్నవారికి’ ఆస్తులను పునఃపంపిణీ చేస్తుందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.


మోదీ ప్రసంగంలోని ప్రస్తావనల వరుస ముస్లింల నుంచి అక్రమ వలసదారులకు, వీరి నుంచి అధిక సంతానం ఉన్న వారికి అంటూ సాగింది. ఈ ప్రస్తావనల క్రమం పొరపాటున చోటు చేసుకుందా లేక ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం జరిగిందా అన్నది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే అది నిస్సందేహంగా ఒక వివాదాస్పద ప్రకటన. మోదీ వ్యాఖ్యలు ఒక కీలకమైన రాజకీయ ఎత్తుగడ అని కొంతమంది వాదిస్తున్నారు. హిందూ భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు, ప్రతిపక్షాల, బీజేపీ వైఖరుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపేందుకే మోదీ ఆ వ్యాఖ్యలు చేశారనేది ఆ వాదనల సారాంశం.

మోదీ మద్దతుదారులు తమ నాయకుడు ముస్లింల విషయమై చేసిన ఈ నిర్దిష్ట వ్యాఖ్యలను సమర్థించేందుకు ఎంతదూరమైనా వెళ్లగలరు; ఎటువంటి వాదనలనైనా చేస్తారనడంలో సందేహం లేదు. మన్మోహన్ సింగ్ ప్రకటనలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తూ మోదీ ప్రసంగంలోని మిగతా అంశాల గురిచి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షం సైతం తమ మాజీ ప్రధానమంత్రి ప్రకటనల లక్ష్యాన్ని స్పష్టం చేయాలి, మోదీ ప్రసంగంతో తలెత్తిన సమస్యలను ఎత్తి చూపాలి.

రాజకీయ పరిస్థితుల పరంగా చూస్తే సార్వత్రక ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండగలదని వ్యక్తమవుతున్న భయాలకు ప్రతిస్పందనే మోదీ వివాదాస్పద ప్రసంగమని చెప్పవచ్చు. హిందువుల ప్రయోజనాల ఏకైక రక్షణదారు భారతీయ జనతా పార్టీ మాత్రమేనని, ముస్లింలను బుజ్జగించడానికే ప్రతిపక్షం ప్రాధాన్యమిస్తుందనే భావనను స్థిరీకరించేందుకు సుస్థిరపరచడమే లక్ష్యంగా మోదీ ఆ ప్రకటన చేశారు. అభివృద్ధి సాధనలో తన సాఫల్యాల పైనే ప్రధానంగా ఆధారపడేందుకు అధికార పక్షం విముఖతను కూడా ఆ ప్రకటన ఎత్తి చూపుతోంది. అయితే మోదీ వ్యాఖ్యలపై తరచు వాద ప్రతివాదాలకు దిగే ప్రతిపక్షాలు మైనారిటీల పట్ల వివక్ష చూపుతున్న విధానాలు వేటినీ చర్చలోకి తీసుకురాలేకపోతున్నాయి. నిజానికి గుజరాత్‌లోని 70 విభిన్న ముస్లిం కులాలు, వాటిని ఓబీసీ జాబితాలో చేర్చడం మూలంగా ఏ విధంగా లబ్ధి పొదాయో జర్నలిస్ట్ స్మిత ప్రకాష్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోదీ విపులంగా చర్చించారు.


కర్ణాటకలో యావత్ ముస్లిం మతస్థులను ఓబీసీలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరించడాన్ని విమర్శించడం ద్వారా ప్రధానమంత్రి ఒక సుసంగత అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ వర్గీకరణ అష్రాఫ్‌ ముస్లింలను బుజ్జగించడమూ, పస్మాండ ముస్లింల పట్ల వివక్ష చూపడమేనని చెప్పి తీరాలి. తమను ఓబీసీలుగా పరిగణించాలన్న అష్రాఫ్ ముస్లింల వాదన న్యాయసమ్మతమైనది కాదు. ఆ వర్గంలోని పేదలను ఆర్థికంగా వెనుకబడిన వర్గంలో చేర్చడం న్యాయబద్ధమవుతుంది. పస్మాండ ముస్లింలకు కేటాయించిన ఆర్థిక వనరుల నుంచి ఆ అష్రాఫ్ ముస్లింలు లబ్ధి పొందుతున్నారు.

ముస్లింలకు రిజర్వేషన్లను మత ప్రాతిపదికన కాకుండా సామాజిక– ఆర్థిక అంతస్తుల ఆధారంగా కల్పించాలని ఒక పస్మాండ ముస్లింగా నేను కోరుతున్నాను. మత ప్రాతిపదిక రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధం కావు.

ఒక పస్మాండ ముస్లింగా నా అస్తిత్వాన్ని గురించిన ఎటువంటి అవమానకరమైన వ్యాఖ్య అయినా సరే నాకు తీవ్ర మనస్తాపం కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా భారత ప్రభుత్వాధినేత నుంచి అటువంటి వ్యాఖ్య రావడం ఎంతో బాధాకరమవుతుంది. ఆ వ్యాఖ్య, అక్రమ వలసలు, బుజ్జగింపు రాజకీయాలకు వ్యతిరేకంగా చేసినదైనప్పటికీ అది అంతులేని మనోవేదన కలిగిస్తుంది. అయినప్పటికీ నా భావోద్వేగాలకు అతీతంగా సమస్యను చూసేందుకు, నా నిర్ణయాలకు విధానాలు, క్షేత్ర వాస్తవాలను ఆధారం చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తాను. సహ పౌరుల నుంచి గౌరవాదరాలు, సంఘీభావాన్ని కోరుకుంటున్నట్టుగానే బుజ్జగింపు రాజకీయాలను, ఇతర సామాజిక వర్గాల పట్ల వివక్షను నేను తిరస్కరించగలనా అని కూడా ప్రశ్నించుకుంటాను. అధిక సంఖ్యాకుల బాధ్యతలుగా తరచు పరిగణింపబడే సామాజిక న్యాయం, జెండర్ సమానత్వం లౌకిక వాదం గురించి ధైర్యంగా మాట్లాడగలనా అనే విషయమై కూడా తీవ్రంగా ఆలోచించుకుంటాను. ‘దేశ సహజ వనరులపై మొదటి హక్కు ముస్లింలదే’ తరహా ప్రకటనలను స్పష్టంగా వ్యతరేకిస్తున్నానా అనే విషయాన్ని నేను విశ్లేషించుకుంటాను. బుజ్జగింపు రాజకీయాల నుంచి దూరం జరిగేందుకు, వాటిని ప్రశ్నించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా నేను భావిస్తున్నాను. అయితే యావత్ ముస్లిమ్ మతస్థులకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం ద్వారా ఆ లక్ష్యాన్ని సాధించడాన్ని నేను ఆమోదించ లేను. దాన్ని నేను ఖండిస్తున్నాను.

పస్మాండ ముస్లింలు చాల వరకు బుజ్జగింపు రాజకీయాల నుంచి నానా యాతనలు పడుతున్నారు. వాస్తవానికి మమ్ములను ఒక ఓటు బ్యాంకుగా పరిగణిస్తున్నారు. అష్రాఫ్‌ ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తూ మా హక్కులను తరచు నిర్లక్ష్యం చేస్తున్నారు. బుజ్జగింపు ధోరణులను ప్రశ్నిస్తున్నవారు ఆచరిస్తున్న రాజకీయాలు సైతం అష్రాఫ్ ముస్లింలకే అధిక లబ్దిని సమకూరుస్తున్నాయి. సంక్షేమం సమస్థాయిలో అందక పోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి విషమ పర్యవసానాలకు పస్మాండలు అల్లాడుతున్నారు.

అమేనా బేగం

(ది ప్రింట్)

Updated Date - Apr 28 , 2024 | 12:40 AM