Share News

మోదీ గ్యారంటీ : ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:18 AM

మొత్తం ఓటర్లు 96 కోట్ల మందికి పైమాటే; 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో 543 నియోజకవర్గాలు, వీటిలో 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లు... ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలివి....

మోదీ గ్యారంటీ : ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’

మొత్తం ఓటర్లు 96 కోట్ల మందికి పైమాటే; 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో 543 నియోజకవర్గాలు, వీటిలో 10 లక్షలకు పైగా పోలింగ్ బూత్‌లు... ప్రపంచ అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ రూపురేఖలివి. అయినా ఈ బృహత్ ప్రజాస్వామ్య సమాజంలో సార్వత్రక ఎన్నికల పోరాటం కేవలం ఒకే ఒక్క పేరుపై జరుగుతోంది: నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 2024 సార్వత్రక ఎన్నికలు అంతిమ అధ్యక్ష–తరహా ఎన్నికల పోరు. అధికార భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల సమరాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం రూపంలో చేస్తోంది! తనవైన సొంత ఎన్నికల వ్యూహాలు ఉన్న కేరళ, ప్రాంతీయ నాయకుల మధ్య పాత తరహా పోరు జరుగుతున్న ఆంధ్రపదేశ్‌ను మినహాయిస్తే ప్రతి ఇతర రాష్ట్రంలోను ఒకే ఒక్క అభ్యర్థి ఉన్నాడు. ఈ సార్వత్రక ఎన్నికలను అతడు తన నాయకత్వంపై ఒక రెఫరెండమ్ (ప్రజాభిప్రాయ సేకరణ)గా మార్చి వేశాడు. ఆ ఒకే ఒక్క అభ్యర్థి నరేంద్ర మోదీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బీజేపీ మానిఫెస్టో సైతం ఒక వ్యక్తికి ఎనలేని ప్రాధాన్యమిచ్చింది. ఆ ఎన్నికల ప్రణాళిక ఇచ్చిన ప్రతి హామీలోనూ ‘మోదీకీ గ్యారంటీ’ అనే ఊతపదం (భాషా భూషణం) కనిపిస్తుంది. అంతేనా? మానిఫెస్టో ప్రతి పేజీని నరేంద్ర మోదీ బొమ్మలు ఆవరించుకుని ఉన్నాయి. ‘ఒకే దేశం, ఒకే నాయకుడు’ పేరిట జరుగుతున్న అవధులు లేని వ్యక్తి పూజలో పార్టీ వ్యక్తిత్వం అంతర్గతమైపోయింది. 1970 దశకంలో కాంగెస్ అధ్యక్షుడు దేవ్‌కాంత్ బారువా ‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’ అని ఇందిరాగాంధీని అపఖ్యాతికరంగా ప్రస్తుతించిన అనంతరం ఒక సార్వత్రక ఎన్నికల సమరం పూర్తిగా ఒక వ్యక్తి కేంద్రంగా జరగడం ఇదే మొదటిసారి. నరేంద్ర మోదీని మొట్టమొదట ప్రధానమంత్రి పదవికి తీసుకువచ్చిన 2014 సార్వత్రక ఎన్నికల సమరం ‘అచ్చే దిన్’ (మంచి రోజు) హామీతో మార్పుకు ఓటుగా (ఓట్ ఫర్ ఛేంజ్) జరిగింది; 2019 సార్వత్రక పోరు కూడా నాయకత్వం గురించే అయినా పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్ ప్రతీకార దాడుల ఫలితంగా జాతీయవాద భావోద్వేగ పూరిత వాతావరణంలో జరిగింది. మరి ఇప్పుడైనా అంటే 2024 సార్వత్రక ఎన్నికలు అయినా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం, ఆదాయ అసమానతలు మొదలైన ప్రజాసమస్యలు కేంద్రంగా జరుగుతున్నాయా అంటే లేదనే చెప్పి తీరాలి. ఆ అంశాల ప్రాతిపదికన జరుగుతున్నాయని కనీసం ఎవరూ చెప్పడమే లేదు. గత పదేళ్ల మోదీ సర్కార్ సాఫల్య వైఫల్యాలపై అర్థవంతమైన చర్చ సైతం జరగడం లేదు. బీజేపీ ఓటర్లను మినహాయిస్తే హిందూత్వకు సైతం ఎలాంటి ప్రాధాన్యం లభించడం లేదు.

తీవ్ర స్థాయిలో ఊదరగొడుతున్న ‘వికసిత్–భారత్’ కథనాన్ని సైతం, ఒకే ఒక్క నాయకుడు మాత్రమే భారత్‌ను ఉజ్వల భవిష్యత్‌లోకి తీసుకువెళ్లగలడన్న మౌలిక విశ్వాసం చుట్టూ నిర్మించారు. 2036లో ఒలింపిక్ క్రీడోత్సవాలను భారత్‌లోనే నిర్వహించనున్నామనే హామీని సైతం నరేంద్ర మోదీయే శాశ్వతంగా ప్రధానమంత్రిగా ఉంటారనే భరోసా ఆధారంగా ఇవ్వడం జరిగింది. 2022 నాటికి ‘నవభారత్’ నిర్మాణ స్వప్న సాకార గడువును చాలా నేర్పుగా 2047కు, దాని అనంతర కాలానికి మార్చి వేశారు. ప్రధానమంత్రి ‘అమృత్ కాల్’ దార్శనికతలో దాన్ని ఒక భాగంగా చేర్చారు.

నిజానికి ‘గ్యారంటీ’ అన్న భావన బీజేపీ సొంతం కానేకాదు. ఆ పదాన్ని తొలుత సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం ప్రాతిపదికగా చేస్తూ ఆ పదాన్ని ఆప్ వాడింది. ఆ తరువాత హిమాచల్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో తమ హామీల గురించి నొక్కి చెప్పేందుకు కాంగ్రెస్ ఆ పదాన్ని బాగా ఉపయోగించుకున్నది. ఇప్పుడు అదే ప్రధానమంత్రి నరేంద్ర యోదీ యుఎస్‌పి (యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్)గా ఉన్నది. ఓటర్లు సాధారణంగా స్థానిక నాయకుల మాటలను నమ్మరని, నరేంద్ర మోదీ లాంటి జాతీయ స్థాయి నాయకులనే విశ్వసిస్తారనే అవగాహనే ‘గ్యారంటీ’కి ప్రధాన ఆధారం (వాస్తవ లబ్ధి దక్కకపోయినా ఎక్కువగా ఆశాభావమే ‘గ్యారంటీ’కి ప్రాతిపదికగా ఉన్నప్పటికీ మోదీ లాంటి నేతలను ప్రజలు తప్పక విశ్వసిస్తారు మరి).

కర్ణాటకే ఇందుకొక మంచి ఉదాహరణ. కోటీశ్వరులు, పార్టీ ఫిరాయింపుదారులు, రాజకీయ కుటుంబాల వారసులతో రాష్ట్ర బీజేపీ నిండిపోయి ఉంది. ‘భిన్నమైన పార్టీ’గా పేరుపొందిన బీజేపీ ఇప్పుడు కర్ణాటకలో నరేంద్ర మోదీ కేంద్రిత ఎన్నికల ప్రచార యంత్రాంగం ఆధారంగా ఎట్టి పరిస్థితులలోనూ, ఏ విధంగానైనా సరే గెలిచి తీరేందుకు శతథా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ ఎంపీలలో సగం మందికి పైగా (వీరందరూ సీనియర్, విధేయ కార్యకర్తలు) మళ్లీ పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించిన బీజేపీ, దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ (ఎస్)తో పొత్తు పెట్టుకున్నది. ఏడాది క్రితం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో దేవెగౌడ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది. జనతాదళ్ (ఎస్) తండ్రి–తనయుడి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమేనని తూర్పార పట్టింది. అధికారంలో ఉన్నప్పుడు పాలనా వ్యవస్థను పూర్తిగా అవినీతిమయం చేసిందని కూడా తీవ్రంగా ఆరోపించింది.

దక్షిణ బెంగళూరులో యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఒక ఆదివారం ఉదయం ‘రన్ ఫర్ నమో’ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ప్రధానమంత్రి ముఖచిత్రం ఉన్న టీషర్ట్‌లు, మాస్క్‌లు పంపిణీ చేశారు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అనే నినాదాల మధ్య ‘మోదీ మోదీ’ అనే మంత్రఘోష ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. కర్ణాటకలో బీజేపీ తప్పక గెలిచే లోక్‌సభ నియోజకవర్గాలలో దక్షిణ బెంగళూరు ఒకటి. అయినప్పటికీ దక్షిణ బెంగళూరులోనే కాకుండా రాష్ట్రంలోను, దేశవ్యాప్తంగాను ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలోను బ్రాండ్ మోదీ పేరిటే ఈ సార్వత్రక ఎన్నికలలో పోరాడుతున్నామని యువ ఎంపీ తేజస్వి సూర్య అంగీకరించారు.

ఒక విధంగా బీజేపీ శ్రేణుల మోదీ స్థిరీభావనం (మోదీ ఫిక్సేషన్) అర్థం చేసుకోదగిందే. ప్రధానమంత్రికి లభిస్తున్న తిరుగులేని ప్రజాదరణ మీ విజయానికి తప్పక తోడ్పడే అవకాశమున్నప్పుడు అందుకు మీరు ఎందుకు గర్వపడకూడదు? ఆశిస్తున్న విజయోన్నతికి ఆ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు బీజేపీ సరిగ్గా చేస్తుంది అదేనని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ 1971 అనంతరం ఆమెకు లభించిన ‘విజయేందిర’, ‘దుర్గామాత’ కీర్తిప్రతిష్ఠల ఆధారంగా తన వ్యూహాలను రూపొందించుకోలేదా? ప్రజల విశ్వాసాన్ని పరిపూర్ణంగా పొందిన తమ అపూర్వ అగ్రనేత కీర్తి ప్రతిష్ఠలను బీజేపీ ఎందుకు ఉయోగించకోకూడదు? అయితే ఎన్నికలలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అటువంటి వ్యూహాలను అనుసరించడం అర్థం చేసుకోదగిన విషయమే కానీ బహుళ–పార్టీ ప్రజాస్వామ్యంలో అది సదా ఆరోగ్యకరమైన పరిణామం కాదు, కాబోదు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అటువంటి వ్యూహాలను అనుసరించడం సమస్త ఇతర నాయకులు, రాజకీయ పక్షాలు అన్నిటినీ ఓటర్లు ఎన్నుకునేందుకు అసంగతమైన వారు, అనవసరమైనవిగా చేసేందుకు ప్రయత్నించడమే అవుతుంది.

మోదీ నాయకత్వ పోకడలను ఇప్పుడు మౌనంగా అంగీకరిస్తున్న సంఘ్ పరివార్ ఒకప్పుడు ‘వ్యక్తి’ (నాయకుడు) ప్రాముఖ్యత కంటే ‘సంఘటన్’ (సంస్థ) ప్రాధాన్యాన్ని తరచు నొక్కి చెపుతుండేది. 1999, 2004 సార్వత్రక ఎన్నికల సందర్భంలో ‘భారత్ ఎదురుచూస్తున్న నాయకుడు’గా వాజపేయిని అభివర్ణిస్తూ బీజేపీ చేసిన ప్రచారోద్ధృతి పట్ల సంఘ్ పరివార్ ఎలా ఆగ్రహం వ్యక్తం చేసిందో గుర్తు చేసుకోండి. వాజపేయికి అలా ఎనలేని ప్రాధాన్యమివ్వడం సంఘ్ పెద్దలు ససేమిరా అంగీకరించలేదు. మరి అదే సంఘ్ పరివార్ ఇప్పుడు ‘ఆయేగా తో మోదీ హి’ ప్రచారార్భాటాలను నిరాక్షేపంగా సమ్మతిస్తోంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన పక్షంలో నరేంద్ర మోదీ తప్పకుండా తమ సైద్ధాంతిక ఎజెండాలోని ప్రధాన అంశాలన్నిటినీ తప్పకుండా అమలుపరుస్తారనే భరోసా పూర్తిగా ఉండడం వల్లే సంఘ్ పెద్దలు మౌనం వహించారు. సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న వాజపేయి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రతిబంధకాల నడుమ ప్రధానమంత్రిగా, కూటమి అధినేతగా తన విధులను అతి జాగ్రత్తగా నిర్వర్తించవలసి వచ్చింది. మోదీకి అటువంటి ఇబ్బందులు లేవు. సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ అధికరణ 370ని రద్దు చేసింది; అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది; ఉమ్మడి పౌరస్మృతిని అమలుపరుస్తామని ఇప్పుడు హామీ ఇస్తోంది.

లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులు చాలావరకు దేశానికి పెద్దగా తెలియని వ్యక్తులు, ఎలాంటి ప్రాముఖ్యం లేనివారు; ప్రధానమంత్రి ఫర్మానాలను కేంద్ర మంత్రులు తూ.చ తప్పకుండా అమలుపరుస్తున్నారు; అధికారంలో ఎవరుంటే వారికి పూర్తి విధేయతతో వ్యవహరిస్తారనే ‘కీర్తి’ని బ్యూరోక్రాట్లు ఎటువంటి మినహాయింపు లేకుండా నిలబెట్టుకుంటున్నారు; ప్రతిపక్షాలు కన్నెర్ర జేస్తున్నాయి గానీ మోదీ వాటిని ఇప్పటికే లేవలేని విధంగా చితగ్గొట్టేశారు కదా; ఇక మీడియా అమిత వినయ విధేయతలతో ప్రధానమంత్రికి జేజేలు కొడుతోంది... ఈ పరిస్థితుల్లో జరుగుతున్న 18వ సార్వత్రక ఎన్నికల్లో మోదీ పేరిట, అవును మోదీ పేరిట మాత్రమే ప్రభుత్వ అనుకూల తిరుగులేని ప్రజాతీర్పుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదొక తెలివైన వ్యూహం. స్వల్పకాలికంగా ఇది, చీలిపోయిన, ధైర్యం కోల్పోయిన, నిరుత్సాహంలో ఉన్న ప్రతిపక్షంతో పోటీపడుతున్న బీజేపీకి గొప్ప లబ్ధి సమకూర్చే వ్యూహం, సందేహం లేదు. అయితే దీర్ఘ కాలంలో అదొక అనివార్య ప్రశ్నను హఠాత్తుగా మన ముందుకు తెస్తుంది: ‘మోదీ తరువాత, ఎవరు?’

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

Updated Date - Apr 19 , 2024 | 05:18 AM