Share News

మోదీకి ఎమర్జెన్సీ అవసరమే లేదు!

ABN , Publish Date - Apr 05 , 2024 | 03:06 AM

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్షాలు జరిపిన ‘సేవ్ డెమాక్రసీ’ ర్యాలీలో 2024 ఎన్నికలకు ఒక ఎజెండాను నిర్దేశించే లక్ష్యంతో ‘బీజేపీ వెర్సస్ డెమాక్రసీ’ అనే పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు...

మోదీకి ఎమర్జెన్సీ అవసరమే లేదు!

ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో ప్రతిపక్షాలు జరిపిన ‘సేవ్ డెమాక్రసీ’ ర్యాలీలో 2024 ఎన్నికలకు ఒక ఎజెండాను నిర్దేశించే లక్ష్యంతో ‘బీజేపీ వెర్సస్ డెమాక్రసీ’ అనే పెద్ద బ్యానర్‌ను ప్రదర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష నేతలందరూ ఇలా ఏకమయ్యారు. ‘నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని రక్షించటం’ అన్నమాట ఇక్కడ పలుమార్లు వినిపించింది. అచ్చంగా ఇదే నినాదంమీద చారిత్రాత్మక 1977 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఇందిరాగాంధీ అంతటి బలమైన శక్తిని ఓడించాయి. కానీ కాస్త లోతుగా పరిశీలిస్తే, 2024కీ 1977కీ చాలా తేడా ఉంది, నరేంద్ర మోదీకీ ఇందిరాగాంధీకీ పోలిక లేదు.

మొదటి విషయమేమిటంటే– ఇరవై ఒక్క నెలల పాటు సాగిన ఎమర్జెన్సీ కాలంలో వందలాది మంది రాజకీయ నేతల, ఉద్యమకారుల అరెస్టుతో, ఇప్పుడు ఇద్దరు ప్రతిపక్ష ముఖ్యమంత్రుల అరెస్టును పోల్చలేం. ప్రతిపక్షాలను అణచివేయటానికి ప్రభుత్వ సంస్థలను ఆయుధాలుగా వాడటమన్నది నాటి పదవీ దుర్వినియోగాన్ని గుర్తుకు తెచ్చినా, దీన్ని ఎమర్జెన్సీ కాలంతో పోల్చటమంటే మరీ దూరం వెళ్ళినట్టే. ప్రభుత్వానికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేని బలహీనమైన ప్రతిపక్షమే ఉన్నప్పటికీ, మరీ ‘ప్రతిపక్ష రహిత భారతం’ అన్న మాట వాడే దశలో ఇంకా లేము. దీనికి మహరాష్ట్రలో ప్రతిపక్షం ఇస్తున్న బలమైన పోటీ ఒక ఉదాహరణ.

రెండో విషయం– అతుకులబొంత లాంటి నేటి ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’తో పోలిస్తే, 1977ల నాటి ప్రతిపక్షం ఎంతో రాజకీయ అనుభవాన్ని, ప్రతిష్ఠను కలిగి ఉండేది. నాడు సోషలిస్ట్, జన్‌సంఘ్ వంటి విభిన్న శక్తులు తీవ్రమైన కాంగ్రెస్ వ్యతిరేకత పునాదిగా ఏకమై రాత్రికి రాత్రి జనతా పార్టీకి పోత పోశాయి. స్వాతంత్ర్య సమరయోధుడైన జయప్రకాష్ నారాయణ్ ఆ కూటమికి ఒక నైతికమైన వెన్నెముకగా నిలిచారు. మొన్న రామ్‌లీలా మైదాన్‌లో గుమికూడిన వారిలో ఒక్కరైనా జయప్రకాష్ నారాయణ్ లాంటి నీతిబద్ధమైన నాయకత్వాన్ని గుర్తు తేగలరా? మోదీపై వ్యతిరేకత నేటి ప్రతిపక్షాల్ని పైస్థాయిల్లో ఏకం చేస్తున్నప్పటికీ, కింది స్థాయిల్లో వాటి మధ్య ఘర్షణ వాతావరణం ఇంకా సమసిపోలేదు. పంజాబ్‌లో ఆప్ – కాంగ్రెస్ వైరం, బెంగా‍ల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల వైరం, మరో పక్క కేరళలో కాంగ్రెస్‌ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.

మూడో విషయం– ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడవేయటం అనే అంశంలో ఈ ప్రతిపక్షాలేవీ తక్కువ తినలేదు. నియంతల్లా ప్రవర్తించిన ముఖ్యమంత్రులు ప్రతిపక్షంలో చాలామంది ఉన్నారు. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర (వికాస్ అగాఢీ పాలన)ల్లో భిన్నాభిప్రాయం వెల్లడించిన గొంతులు కఠిన శిక్షలను ఎదుర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఒక ఆయుధంగా వాడుకున్నట్టే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పోలీస్ యంత్రాంగాన్ని వాడుకున్నాయి.

నాలుగో విషయం– ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన ఆవశ్యకత కాలక్రమేణా ప్రజల దృష్టిలో ఏమంత ప్రాధాన్యత గల విషయం కాకుండా పోయింది. ఇందుకు భిన్నంగా 1977లో ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు సన్నగిల్లడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబికింది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం అమలు చేసిన బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు దీనికి కారణమయ్యాయి. ఎమర్జెన్సీ చర్యల ప్రభావం అంతగా పడని దక్షిణాది నుంచి మాత్రం కాంగ్రెస్‌కు మద్దతు లభించింది. పైపెచ్చు ప్రజాస్వామిక విలువలు మనగలిగేందుకు బలమైన చోదక శక్తిగా నిలిచే పట్టణ మధ్యతరగతి వర్గం 1970ల నాటితో పోల్చి చూస్తే ఇప్పుడు ఎంతో భిన్నమైన సామాజిక – ఆర్థిక వర్గంగా మారింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో పట్టణాల్లో ప్రమాణాలూ, విలువలూ సన్నగిల్లుతాయి. ‘నాకు నేను ముఖ్యం’ తరహా జీవన శైలికి అలవాటుపడిన పౌరులు రాజకీయ ఉద్యమాలకు దూరం జరుగుతారు. స్వలాభానికి నష్టం వాటిల్లే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వారు ఉద్యమాల వైపు అడుగులు వేస్తారు. పేపర్ లీకేజీలకు నిరసనగా రోడ్డెక్కిన యువతను, రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతాంగాన్నీ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన ప్రజా బాహుళ్యమంతా ఆన్‌లైన్ ఉద్యమాలకే పరిమితం అవుతుంది. దేశంలో నియంతృత్వం గురించి ధ్రువ్ రాఠీ అనే యూట్యూబర్ చేసిన వీడియోను ఆవేశంగా షేర్ చేయటంతోనే రాజ్యాంగ స్వేచ్ఛలను పరిరక్షించే పోరాటంలో వీరి పాత్ర ముగిసిపోతుంది. 1970ల్లోని పరిస్థితి వేరు. అప్పటికింకా ట్రేడ్ యూనియన్లు, పౌర హక్కుల సంఘాలు, ఆదర్శవాద రాజకీయాలు సజీవంగా ఉన్నాయి. ప్రజాస్వామిక ఆవరణ కోసం పోరాడటం అనేది అప్పటికి ఎంతో ముఖ్యమైన అంశం. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు అంతా వాట్సాప్ మెసేజీలకే పరిమితం.

చిత్రమేమిటంటే, పట్టణ మధ్యతరగతి ఆగ్రహావేశాలతో ఉప్పొంగి, రాజకీయ వర్గాల్ని కుదిపివేసిన ఆఖరు ఘట్టంలో కేజ్రీవాల్ కూడా ఉన్నారు. 2011లో కేజ్రీవాల్, ఆయన బృందం కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టిన సందర్భమది. మొత్తం రాజకీయ వర్గమంతటికీ వ్యతిరేకంగా రాజకీయాల్ని శుద్ధి గావించే ఉద్యమంగా అది పేరుమోసింది. ‘నేతలందరూ దొంగలే’ (సబ్ నేతా చోర్ హై) అన్న నినాదంతో పాలక వర్గాల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నవారంతా రోడ్ల మీదకొచ్చి ప్రదర్శనలు చేశారు. అప్పటికి కేజ్రీవాల్ వ్యవస్థలను వ్యతిరేకిస్తున్న ఒక బైటి మనిషి. ఆయన ఏ శక్తులపై అప్పుడు దాడి చేశారో అదే శక్తులతో ఇప్పుడు జట్టు కట్టారు. నాడు ‘అవినీతి వ్యతిరేక’ ఉద్యమానికి నాయకత్వం వహించిన మనిషి కాలచక్రం గిర్రున తిరిగేసరికి నేడు ఢిల్లీ లిక్కర్ పాలసీ మచ్చను చెరిపివేసుకోవటానికి తాను అవినీతి ఆరోపణల్ని ఎక్కుపెట్టినవారితోనే కలిసి ప్రయత్నిస్తున్నాడు. ఇలా స్వీయరక్షణ కోసం ఏర్పాటైన రాజకీయ అమరికకు విశ్వసనీయత ఎలా వస్తుంది, అది ఎన్నాళ్ళని కొనసాగుతుంది?

మరో పరస్పర విరుద్ధమైన విషయం ఏమిటంటే– రాజకీయ నేతలపై తీవ్ర వ్యతిరేకత సృష్టించిన కేజ్రీవాల్ ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ నుంచి అతిపెద్ద లబ్ధి పొందింది ఎవరంటే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుప్పకూలిన శిథిలాల మధ్య నుంచి మోదీ అధికారం వైపు అడుగులు వేశారు. ఆయన ఇందిరాగాంధీ దగ్గర నుంచి కొన్ని కిటుకులు అరువు తెచ్చుకున్నారు. ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కోసం అన్ని రకాల వ్యవస్థాగతమైన అడ్డంకులను నిర్మూలించటంలో.

ఇందిరాగాంధీతో పోలిస్తే మోదీ రాజకీయంగా మరింత తెలివైనవాడు, మరింత నిర్దయగలవాడు. ఇందిరాగాంధీ ఏదో కంగారులో, కొడుకు సంజయ్‌గాంధీ బృహత్ ఆకాంక్షల ప్రోద్బలంతో, దేశంలో అత్యవసరస్థితిని ప్రకటించారు. కానీ మోదీ రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యానికి తలొగ్గి పని చేస్తున్నానని ప్రకటిస్తూనే దాన్ని ఎన్నికల నియంతృత్వంవైపు, మెజారిటేరియన్ మతస్వామ్యంవైపు ఒక క్రమ పద్ధతిలో ముందుకు నెడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న చట్టాలతోనే ప్రతిపక్షాన్ని భయపెట్టగలిగినప్పుడూ, ఎలా చెప్తే అలా లొంగి నడుచుకునే మీడియా చుట్టూ ఉన్నప్పుడూ ఇక ఎమర్జెన్సీని వాడాల్సిన పనేముంది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌కు బెయిల్ ప్రొవిజన్ సవరణలను పార్లమెంటులో మనీ బిల్లుగా ప్రవేశపెడితే, దానికి అనూహ్యంగా సుప్రీంకోర్ట్ బెంచ్ నుంచి ఆమోదం లభించింది. పదవీ విరమణకు దగ్గర్లో ఉండి ఆ బెంచ్‌కు నేతృత్వం వహించిన జడ్జి ఇప్పుడు లోక్‌పాల్! అవినీతి వ్యతిరేకత ముసుగులో రాజకీయ వైరాల్ని లెక్క తేల్చుకోవటానికి ఇలా ఒక అమానుషమైన చట్టాన్ని వాడుకున్నారు. ఈ క్రమంలో ‘జెయిల్ కాదు బెయిల్’ అనే ప్రాథమిక సూత్రం మరుగున పడిపోయింది. ప్రతీకార రాజకీయాలు చట్టబద్ధత పొందాయి. అందుకే చెప్పేది– స్వాతంత్ర్యానంతర భారతదేశంలో ఇదివరకెన్నడూలేని ఎన్నికల యంత్రాంగం మద్దతుతో నిలబడిన ఈ రాజకీయ నాయకుడిని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలు చేపడుతున్న ‘ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం’ లాంటి ప్రదర్శనలు చాలవు, అంతకుమించి కావాలి.

తాజా కలం: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఒక సర్వే ప్రకారం 67శాతం మంది భారతీయులు ‘పార్లమెంట్ జోక్యం గానీ కోర్టుల జోక్యం గానీ లేకుండా ఒక బలమైన నాయకుడు నిర్ణయాలు తీసుకోగలిగే వ్యవస్థ దేశానికి అవసరం’ అని కోరుకుంటున్నారు. ఇలా కోరుకునేవారి సంఖ్య 2017లో 55శాతం ఉండేది. మరి ఇక ప్రజాస్వామ్యానికి దిక్కేది?

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - Apr 05 , 2024 | 03:06 AM