ఆధునికం.. ఆలయం.. రాజకీయం!
ABN , Publish Date - Jun 28 , 2024 | 03:57 AM
భారత్ అంటే ఆత్మజ్ఞాన అవలోకన.. ఇహలోక విముఖత.. మోక్షమార్గ అన్వేషణ.. ధర్మాధర్మ వివేచన.. ఈ భావనలు ఒకప్పుడు బాగా వినిపించేవి. ధనార్జనకు, శారీరక కోరికలకు భారత సంస్కృతిలో సముచిత స్థానం లేదని...
భారత్ అంటే ఆత్మజ్ఞాన అవలోకన.. ఇహలోక విముఖత.. మోక్షమార్గ అన్వేషణ.. ధర్మాధర్మ వివేచన.. ఈ భావనలు ఒకప్పుడు బాగా వినిపించేవి. ధనార్జనకు, శారీరక కోరికలకు భారత సంస్కృతిలో సముచిత స్థానం లేదని, వీటిని అదుపులో ఉంచటమే మన గొప్పతనమని ప్రచారం జరిగేది. ప్రజలందరూ ఇవే భావాలతో ఉండేవారా? లేక కొద్దిమందికే అవి పరిమితమా? అని ప్రశ్నించుకుంటే జవాబులు స్పష్టంగానే కనపడతాయి. మన సమాజమంతా ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోలేదు. సంపదలకు, సుఖాలకు, అధికార దాహాలకు దూరంగా లేదు. గతంలో జరిగిన యుద్ధాలే అందుకు నిదర్శనం. అద్వైత చింతనతో పాటూ కౌటిల్య నీతి పుష్కలంగా ఉండేది. కొద్దిమంది పాటించే విలువలను, నమ్మకాలను అందరివిగా పరిగణించటంతో మనలో విచిత్ర భావనలు ఏర్పడ్డాయి. వాటికి కారణాలను శోధిస్తే చాలా సంగతులు తెలుస్తాయి. బ్రిటిషు పాలనను సవాల్ చేయటానికి స్ఫూర్తినిచ్చే భావజాలం ఆనాడు కావాల్సి వచ్చింది. ఆత్మన్యూనతతో బలమైన శక్తులను ఎదుర్కోలేం. జాతీయోద్యమ కాలంలో గతానికి సంబంధించి ఘనమైన ఉదాత్త చిత్రాన్ని అందుకోసమే సృష్టించుకున్నాం. ఆధ్యాత్మిక ఔన్నత్యానికి భారత్ ప్రతీక అన్న భావన అలా ఏర్పడిందే! మన గతమంతా గొప్పదనే ఆలోచనకు మూలమూ అదే. ఆత్మజ్ఞానంలో మనమే మేటి అన్న అతిశయోక్తులు ఆ దారిలోనే వచ్చాయి. పాశ్చాత్య దేశాలకు భౌతిక సంపద దండిగా ఉండొచ్చు! బాహ్యలోక విజ్ఞానం మెండుగానూ ఉండొచ్చు! కానీ ఆత్మసంతృప్తిని అందించే తత్వం కోసం భారత్ వైపే చూడాలన్న వాదన ఆ ధోరణిలో భాగమే!
రాజకీయ అవసరాల కోసం ప్రచారమైన ఈ భావాలను వాస్తవాలుగా అంగీకరిస్తే నిజస్వభావాలు మరుగున పడిపోతాయి. కాలక్రమంలో వాటిని వెలికితీయటం కష్టంగా మారుతుంది. వెలికి తీసినా నమ్మటం తేలిక కాదు. ఇప్పటికీ ఈ సమస్య తీవ్రంగానే ఉంది. అయినాసరే వాస్తవాల లోతుల్లోకి వెళ్లే చరిత్రకారులు ఎప్పుడూ ఉంటారు. దక్షిణ భారతం అంటేనే ఆలయాలకు నిలయం. వాటి చుట్టూ తిరిగిన రాజకీయాలనూ, ఆధిపత్యాల పట్టువిడుపులనూ పరిశీలించిన వారిలో చరిత్రకారుడు క్రిస్టఫర్ బేకర్ ఒకరు. దక్షిణ భారత రాజకీయాలపై బేకర్ లోతైన విశ్లేషణలు చేశారు. అందులో భాగంగా ఆలయాలు రాజకీయాల పరస్పర ప్రభావాల గురించి ఎన్నో విశేషాలను వెల్లడించారు.
ఆలయాలు ఆధ్యాత్మిక, శిల్ప కళా కేంద్రాలే కాదు.. సామాజికార్థిక జీవనంలోనూ వాటిది కీలక పాత్రే. కిందటి శతాబ్దం ఆరంభం నాటికి మద్రాసు రాష్ట్రంలోనే 75,000 ఆలయాలు ఉండేవి. వీటిల్లో కొన్ని చాలా పెద్దవి. మదురై, రామనాథపురం, తిరుచిరాపల్లి, తంజావూరు, తిరునెల్వేలి జిల్లాలు ఆలయాలకు చాలా ప్రసిద్ధి. మదుర మీనాక్షి, బృహదీశ్వరాలయం, రామేశ్వరం, రంగనాథస్వామి ఆలయాలు ఇక్కడే ఉన్నాయి. మన తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. భక్తుల సందర్శనలో, ఆదాయంలో దానితో పోల్చదగిన ఆలయం మరొకటి లేదు. రాజులు, సామంతులు, సేనానాయకులు, వ్యాపారులతో పాటు సాధారణ భక్తులు కూడా భూములు, నగలు, నగదును దానాలుగా ఇవ్వటంతో పెద్ద దేవాలయాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేవి. వివిధ రూపాల్లో పోగుపడిన సంపదతో ఆర్థికంగా దేవాలయాల పాత్ర పెరిగిపోయింది. వందేళ్ల క్రితం ఏదైనా గుడికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తే చాలా ఎక్కువ. ఒక్క తిరునెల్వేలి జిల్లాలోని అయిదు శైవ మఠాల్లో ఒక్కోదానికి దాదాపు ఆనాడు లక్ష ఆదాయం ఉండేది. తిరుపతి ఆదాయం 19వ శతాబ్దం చివరిలోనే ఏటా 5 లక్షలు ఉండేది. 1950ల నాటికి రోజుకు లక్ష దాటేసింది. ఇక దానంగా వచ్చిన భూములు వేలవేల ఎకరాల్లో ఉండేవి. తమిళనాడులో తంజావూరు చాలా ధనిక జిల్లా. 1950ల్లో కూడా అక్కడ మూడోవంతు భూములు గుడులతో ముడివడి ఉండేవి. భూసంపద, నగదు నిల్వలు భారీగా ఉన్న దేవాలయాలు ఉద్యోగ, ఉపాధులనూ ఎక్కువే కల్పించేవి. పూజారులు, సహాయకులు, వాయిద్యకారులు, నాట్యకత్తెలు, ఆదాయ గణకులు, వృత్తి పనివారు, భూముల పర్యవేక్షకులు, పంటల పరిశీలకులు, శిల్పులు, మరమ్మతుదారులు, కాంట్రాక్టర్లు, సామగ్రి సరఫరాదారులు.. ఇలా ఎంతోమంది ఆలయాలపై ఆధారపడేవారు. పెద్ద విపణులు, దుకాణాల సముదాయాలు కూడా ఆలయాల నియంత్రణలో ఉండేవి. వడ్డీలకు అలయాలు అప్పులు ఇచ్చేవి.
ఒక కులం సామాజిక స్థాయిని నిర్దేశించటంలో కూడా ఆలయాల పాత్ర ఉండేది. ఆలయాల్లో ఏ కులం వారిని ఎంత మేరకు అనుమతించాలి.. ఎవరికి ఏ పూజలో పాల్గొనే అవకాశమివ్వాలి.. అన్నవి చాలా కీలకంగా ఉండేవి. వీటిని బట్టి కూడా కులాల హోదాలు నిర్ణయమయ్యేవి. ఏదైనా వ్యాపారంలో బాగా లాభాలు గడించిన వారు ఆలయాల గుర్తింపు పొందటానికి తహతహలాడేవారు. నట్టుకొట్టై చెట్టియార్లకు ఒకప్పుడు సామాజికంగా ప్రముఖస్థానం ఉండేది కాదు. ఆలయాలకు విరాళాలు ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సారాయి వ్యాపారంలో బలపడిన నాడార్లు అలాంటి స్థానాన్నే పొందారు.
ఆలయాలతో పాటు మఠాలు కూడా ప్రముఖపాత్రను పోషించేవి. కొత్త పార్లమెంటు భవనంలో ఉంచిన రాజదండంపై (సెంగోల్) పెద్ద వివాదం చెలరేగిన సంగతి గుర్తుండే ఉంటుంది. దాన్ని నెహ్రూకు అందించింది తిరువాదుతురై మఠం. ఈ మఠానికి తిరునెల్వేలి, మదురై, తంజావూరు జిల్లాల్లో 38,000 ఎకరాల భూములుండేవి. మరో 130 మఠాలపై కూడా తిరువాదుతురైకు నియంత్రణ ఉండేది. నాంగునేరి వైష్ణవ మఠానికి కూడా పెద్దఎత్తున ఆస్తులు ఉండేవి. 200 వైష్ణవమఠాలు దాని ఆధీనంలో ఉండేవి. ఇలా పెద్ద ఆలయాలు, మఠాల సంపదలు, ఆస్తులు, నియంత్రణల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. సంపదలు, ఆస్తులు ఉన్నచోట ఆధిపత్య పోరు ఉంటుంది. ఆలయాలు అందుకు అతీతం కాలేదు. గుడులపై ఆధిపత్యం రాజకీయ జీవితానికి సోపానంగా భావించటం 19వ శతాబ్దంలో మొదలైంది. బ్రిటిషు పాలకులు ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల పదవుల కోసం పోటీచేయటానికి ఆలయ కమిటీల్లో సభ్యులుగా, ట్రస్టీలుగా ఉండటాన్ని మొదటిమెట్టుగా భావించేవారు. 1923లో రెండు వర్గాలు మదుర మీనాక్షి ఆలయ ఆధిపత్యం కోసం పెద్దపోరాటాలే చేశాయి. గెలిచిన వర్గం నేతృత్వంలో కుంభాభిషేకం జరిపితే దాన్ని అడ్డుకోటానికి వైరివర్గం ప్రయత్నించింది. ఆలయ మేనేజరు పోస్టుపై వివాదం మొదలై సమ్మెచేసే వరకూ పరిస్థితి వెళ్లింది. ధర్నాలు, ఆందోళనలతో ఆలయం అట్టుడికిపోయింది. వివాదం కోర్టులకు ఎక్కింది. తిరువాదుతురై మఠాధిపతి 1920లో చనిపోతే వారసత్వ వివాదం మొదలై 15 ఏళ్లపాటు కేసులు కొనసాగాయి.
ఆలయాలపై నియంత్రణ ఒక్కోచోట ఒక్కోరీతిలో ఉండేది. కొన్నిచోట్ల ఆలయాన్ని స్థాపించిన జమిందారీ కుటుంబాలే వాటిపై అధికారాన్ని చలాయించాయి. ఉత్తర సర్కారు (కోస్తాంధ్ర) జిల్లాల్లో ఈ పరిస్థితి ఉండేది. కులాల అజమాయిషీలో కూడా కొన్ని ఆలయాలు ఉండేవి. కోమటి వర్గం చేతుల్లోని కన్యకాపరమేశ్వరి ఆలయాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కొన్నిచోట్ల మఠాల నియంత్రణ ఉండేది. మరికొన్ని చోట్ల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే వ్యక్తులు సర్వం తమ చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పేవారు. స్థానికుల నుంచి ఎంపికైన కమిటీల చేతుల్లో కొన్నిచోట్ల ఆలయాల నిర్వహణ ఉండేది. బ్రిటిషు పాలనకు ముందు స్థానిక రాజులు ఆలయాల కార్యకలాపాలను నియంత్రించేవారు. ఆలయ నిధులపై పన్ను కూడా విధించేవారు. కొన్నిచోట్ల ఆలయ ఆధికారులకే శిస్తువసూలు బాధ్యతను అప్పగించేవారు. ఆలయాలపై పట్టు నిలుపుకోవటం తమ పాలనకు కీలకంగా భావించేవారు. బ్రిటిషు పాలకులు కొంతకాలం ఆ పాత్రను నిర్వహించి 1857 తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశారు. కొన్నిచోట్ల మఠాధిపతులు, జమిందార్లనే నిర్వహణను చూసుకోమన్నారు. మరికొన్ని చోట్ల కొన్ని కుటుంబాలకు వాటిని కట్టబెట్టారు. అట్లా వీలుకాని చోట్ల కమిటీలను ఏర్పరచారు. 1920ల నాటికి ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. ఆలయాల వ్యవహారాలపై ప్రభుత్వం జరిపిన పరిశీలనల్లో ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి. 1863–1910 మధ్య తిరుమల వ్యవహారాలను అయిదుగురు మహంతులు నియంత్రించారు. వారు లక్షల్లో నిధులను దుర్వినియోగం చేశారు. రామనాథపురం జమిందారు రామేశ్వరం ఆలయానికి చెందిన ఆరు లక్షలను తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నారు. కావాల్సిన వారికి ఆలయ భూములను కట్టబెట్టటం విపరీతంగా నడిచేది. ఆధిపత్యం కోసం కొన్ని చోట్ల హత్యలూ జరిగాయి. 1905లో తిరుమల మహంతును అక్కడి పూజారే హత్యచేశాడు.
మున్సిపల్ కౌన్సిళ్లు, పట్టణపాలన బోర్డుల్లో పట్టుకోసం ఆలయాలపై అజమాయిషీకి ప్రయత్నించే వ్యక్తులు క్రమేపీ పెరిగిపోయారు. వైరివర్గాల మధ్య పోరు అధికమైంది. ఈ నేపథ్యంలో 1878–1915 మధ్య ఆలయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసురావటానికి చట్టసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిని పెట్టిన వాళ్లందరూ స్వదేశీ ప్రతినిధులే. అందరూ హిందువులే! అవేమీ ఆమోదం పొందలేదు. 1920ల్లో అధికారంలోకి వచ్చిన జస్టిస్ పార్టీ ఆలయాల నియంత్రణకు చట్టం తీసుకువచ్చింది. అంతకుముందు 1908లో సివిల్ ప్రొసిజర్ కోడ్‌కు ఒక సవరణ తీసుకొచ్చి ఆలయాల పాలనలో కోర్టులు జోక్యం చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో వందల ఆలయాల వ్యవహారాలు కోర్టులకు ఎక్కాయి. జస్టిస్ పార్టీ ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్లతో ఆలయాల కమిటీలను నింపివేసింది. కొత్త చట్టం కింద ఆస్తుల వివరాలను తెలపమని 13,669 దేవాలయాలను అడిగితే 229కి సంబంధించి మాత్రమే సమాచారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా 1924 తర్వాత ఆలయాలపై పట్టుసాధించే పనిలో పడింది.
చరిత్రను నిశితంగా చూస్తే తెలిసేది ఒకటే! ఆలయాలు రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా లేవు. రాజులు తమ పాలనను సమర్థించుకోటానికి, పాలితులను విధేయులుగా మార్చుకోటానికి, తాము దైవాంశ సంభూతులం అన్న భావనను పెంచుకోటానికి ఆలయాలను ఉపయోగించుకున్నారు. వలసపాలన నాటి రాజకీయాలు ఆలయాలపై ఆధిపత్య పోరును పెంచాయే తప్ప తగ్గించలేదు. స్వతంత్ర పాలనలో బహిరంగ పోరుతగ్గినా ఆశ్రితులకు, ఆనర్హులకు ఆలయ పదవులను కట్టబెట్టటం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది.
రాహుల్ కుమార్
(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్)