ఆరోగ్యశ్రీ అనారోగ్యంలో వైద్యవ్యవస్థ
ABN , Publish Date - Jul 05 , 2024 | 05:37 AM
‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న సామెత ఆరోగ్యశ్రీ పథకానికి సరిగ్గా సరిపోతుంది. పేదలకు మెరుగైన వైద్యం అనే ఉన్నతాశయం మాటున...

‘మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న సామెత ఆరోగ్యశ్రీ పథకానికి సరిగ్గా సరిపోతుంది. పేదలకు మెరుగైన వైద్యం అనే ఉన్నతాశయం మాటున రాజకీయ స్వలాభంతో ఆరంభించిన ఆరోగ్యశ్రీ పథకం మొత్తం వైద్య వ్యవస్థనే దిగజార్చింది. ప్రజలకు విద్య, వైద్యం, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతే. కానీ ఓట్లు దండుకోడానికి కుహనా రాజకీయవాదులు వల్లించే ఉచిత కార్పొరేట్ విద్య, ఉచిత కార్పొరేట్ వైద్యం లాంటి పథకాలు ఖచ్చితంగా గర్హనీయం. పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు లాంటివి పెట్టడంలో కొంత అర్థం ఉంది. కానీ నచ్చిన హోటల్లో భోజనం చేయమని పేదలకు కార్డులు మంజూరు చేస్తే అది దివాలాకోరు రాజకీయం అవుతుంది. ఇప్పుడు అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకం ఈ కోవలోకే వస్తుంది.
చేసే వైద్యం ఒకటే అయినా ప్రభుత్వ రంగంతో పోలిస్తే, ప్రైవేటు రంగంలో హంగులు, ఆర్భాటాలు జోడించడం వల్ల అది పైకి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ప్రాథమిక సేవలు అందించే నెపంతో ప్రజలను అనవసరపు కార్పొరేట్ ఆకర్షణలతో మభ్యపెట్టి, ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేయటం వారిని మోసగించడమే అవుతుంది. ఒక పక్క ‘ఆసరా’ అంటూ అడక్కపోయినా డిశ్చార్జి లోపే పేషెంట్ల అకౌంట్లలో డబ్బులు వేసి వారిని ప్రలోభపెట్టడం, మరోవైపు సేవలు అందించిన ఆసుపత్రులకు మాత్రం బిల్లులు చెల్లించకుండా ఇదిగో... అదిగో అంటూ అబద్ధాలు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్యాకేజీ రేట్లు పెంచకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం... ఆరోగ్యశ్రీ పథకం మాటున ఓట్లు దండుకునే స్వార్ధ పాలకుల కుటిలనీతిని చెప్పకనే చెబుతుంది.
పాలకులు ఆర్భాటంగా చెప్పుకునే ‘ఆరోగ్యశ్రీ’ తరచి చూస్తే అంతా లోపభూయిష్టమే. చాలా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ రోగుల పరిస్థితి ద్వితీయ శ్రేణి పౌరుల కన్నా దారుణంగా ఉంటుంది. పాలకులు ఇచ్చే అరకొర ప్యాకేజీలు తమకు గిట్టుబాటు కాక దాదాపు అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌మెంట్ నుంచి తప్పుకున్నాయి. చిన్న, మధ్య తరగతి ఆసుపత్రులు మాత్రమే తప్పక ఎంపానెల్ అవుతున్నాయి. అక్కడ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్‌ని చూసేది ఎంబీబీస్ డాక్టర్లే కానీ స్పెషలిస్టులు కాదు. అలాగే ఎక్కువ శాతం ఆపరేషన్లు చేసేది అనుభవజ్ఞులైన వైద్యులు కాదు. వాడే మందులు, పరికరాల నాణ్యత కూడా ప్రశ్నార్థకమే. కార్పొరేట్ హాస్పిటల్లో సిజేరియన్‌కి లక్ష రూపాయలు బిల్లు అవుతుంటే... ప్రభుత్వం వారిచ్చే పదీ పదిహేను వేలకు ఇంతకంటే మంచి సేవలు ఊహించుకోవటం అత్యాశే అవుతుంది.
ఆరోగ్యశ్రీ పథకం ప్రైవేటు ఆసుపత్రుల మధ్య అనవసరమైన పోటీ తెచ్చి వారిని పీకల్లోతు అప్పుల్లోకి దింపింది. సమాజంలో దాదాపు అందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ లేకుండా ఆసుపత్రుల మనుగడ కష్టమైంది. దాంతో తలకు మించిన భారం అయినా అన్ని ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ఎంపానల్‌మెంట్ కోసం పడకల సంఖ్య, సౌకర్యాలు పెంచుకున్నాయి. ఇంకా, అలవికాని నిబంధనల నేపథ్యంలో రకరకాల లైసెన్సుల కోసం భారీగా ముడుపులు ముట్టజెప్పాల్సిన పరిస్థితి. ఒక పక్క పెరిగిన నిర్వహణ ఖర్చు, అధికారిక, అనధికారిక ఫీజులు; మరో పక్క అరకొర ప్యాకేజీలు, అవి కూడా సకాలంలో రాని పరిస్థితి. కాబట్టి ఆస్పత్రి యాజమాన్యాలు నిజాయితీగా ఉందామన్నా ఉండలేని స్థితి. ఆరోగ్యశ్రీ వదిలేసి ప్రాక్టీస్ చేద్దామంటే ఓట్ల కోసం నాయకులు విచ్చలవిడిగా కార్డులు మంజూరు చేయిస్తున్నారు. ఆ కరుణాహృదయుల అనుగ్రహంతో అనేక మంది రోగులు కారులో వచ్చి, డీలక్స్ రూము తీసుకుని, ఆపరేషన్ మాత్రం ఆరోగ్యశ్రీ కింద చేయించుకుని వెళ్తున్నారు. పేదవారి పరిస్థితి షరా మామూలే.
ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తించడం మరో ప్రహసనం. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యసేవలు ఎప్పుడూ ఉచితమే. వీటిలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయడం వల్ల పేదలకు ఏం మేలు జరుగుతుందో పాలకులకే తెలియాలి. ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రులకు కొంత అదనపు ఆదాయం వస్తే రావచ్చు. కానీ ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతభత్యాల రూపంలో ప్రభుత్వానికి అనవసరపు వ్యయం కూడా పెరుగుతుంది. తరువాత ఒకే గొడుగు కింద చెయ్యాల్సిన సేవలను ఆరోగ్యశ్రీ, నాన్ ఆరోగ్యశ్రీ అని విభజన చేయడం వల్ల సాఫీగా జరిగిపోయే పనిలో లేనిపోని గందరగోళం, ఆటంకం ఏర్పడుతుంది.
పేదల ఆరోగ్యం మీద నిజంగా మనస్సు ఉన్న పాలకులు చేయాల్సింది ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుని మెరుగుపరచి ప్రజల్లో వాటిపట్ల నమ్మకం కల్పించడం. ఆరోగ్యశ్రీ పేరు మీద ఖర్చు చేస్తున్న నిధులను గవర్నమెంట్ ఆసుపత్రులను బలోపేతం చేయడానికి వినియోగిస్తే ఈ పథకం కింద ఇప్పుడు ప్రైవేటు ఆసుపత్రులు ఇచ్చే సేవ కంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించవచ్చు. నిజానికి పాలకులు తాయిలాలు పంచడం మీద పెట్టే దృష్టిలో ఒక్క శాతం ప్రజారోగ్యం మీద పెడితే ప్రభుత్వ ఆసుపత్రులను ప్రపంచస్థాయి ఆసుపత్రులుగా తీర్చిదిద్దవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రమాణాలు పెరగాలంటే ముందు బడ్జెట్ కేటాయింపులు తగిన స్థాయిలో జరగాలి. తరువాత మంచి ప్రతిభ, పేరు, సేవాతత్పరత ఉన్న వైద్యులను గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రులకు సీఈఓలుగా, సలహాదారులుగా నియమించాలి. చాలామంది వైద్యులకు ప్రభుత్వ సర్వీసు మీద ఆసక్తి ఉన్నా, ప్రభుత్వ వ్యవస్థలోని మితిమీరిన బ్యూరోక్రసీ వల్ల, మూస ధోరణులు, కాలం చెల్లిన విధానాల వల్ల ప్రభుత్వ సర్వీసులు అంటే విముఖత చూపిస్తున్నారు. బ్యూరోక్రసీ తగ్గించి, ఫ్లెక్సిబిలిటీ పెంచితే ప్రతిభావంతులు, సేవాతత్పరత ఉన్న వైద్యులు ఖచ్చితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఆసక్తి చూపుతారు. తరువాత పార్ట్ టైం సర్వీస్, వాలంటరీ సేవలకు అవకాశం కల్పించి ప్రతిభావంతులైన ప్రైవేట్ వైద్యుల సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వినియోగించుకోవచ్చు. తద్వారా పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించవచ్చు.
వైద్య వ్యవస్థను ప్రక్షాళన గావించటానికి పాలకులు చేయవలసిన మరో ముఖ్యమైన పని ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రులకు పరిమితం చేయడం. అనేక ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల్లో మంచిగా సౌకర్యాలు, నిపుణులు ఉండి కూడా పేషెంట్స్ లేకపోవడంతో వైద్య విద్యార్థులకు తగిన శిక్షణ ఉండడం లేదు. ఆరోగ్యశ్రీని మెడికల్ కాలేజీలకు పరిమితం చేస్తే, పేదలకు మెరుగైన వైద్యం లభించడంతో పాటు ఎంబీబీస్ విద్యార్థులకు, అలాగే పీజీలకు కూడా మంచి శిక్షణ లభిస్తుంది. మిగతా ప్రైవేట్ ఆస్పత్రులతో పోలిస్తే మెడికల్ కాలేజీ ఆస్పత్రులు... అనుభవజ్ఞుల పర్యవేక్షణలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తాయి.
చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్, ఇతర ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ గుదిబండ నుంచి విముక్తి పొందుతాయి. అనవసర లైసెన్సుల బెడద, ముడుపుల భారం లేకుండా వారు ఎప్పటి లాగానే తమ మీద నమ్మకంతో వచ్చిన రోగులకు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి సేవలు అందించగలరు. తద్వారా గవర్నమెంటు ఆసుపత్రుల మీద అధిక భారం పడదు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రక్షాళన చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రపంచ స్థాయి ఆసుపత్రులుగా తీర్చిదిద్ది, మంచి ప్రమాణాలు, విలువలతో కూడిన వైద్యవ్యవస్థకు బాటలు వేయాలి.
డా. గోనుగుంట్ల శ్రీనివాసరావు