Share News

మాయ ఐదేళ్లకోసారి..

ABN , Publish Date - May 10 , 2024 | 12:37 AM

పెద్దసిరమ్మ పండగలా ఊరికి జాతరొస్తుంది అప్పటివరకూ మెలకువతోనే ఉంటాము ఆ రాత్రి ఊరిమీదొక మాయ దట్టమైన మబ్బులా కమ్ముకుంటుంది బలి కోరినట్టు బతుకుల్ని కోరుతూ...

మాయ ఐదేళ్లకోసారి..

పెద్దసిరమ్మ పండగలా ఊరికి జాతరొస్తుంది

అప్పటివరకూ మెలకువతోనే ఉంటాము

ఆ రాత్రి ఊరిమీదొక మాయ

దట్టమైన మబ్బులా కమ్ముకుంటుంది

బలి కోరినట్టు బతుకుల్ని కోరుతూ

ఒక రాకాసినీడ మునివాకిట తలుపు తడుతుంది

చెమటచిందే చేతులకు/ తాయిలాల తైలం పూస్తుంది

గంజి తాగే గొంతులో గరళం పోస్తుంది

అంతే.. మత్తు ఆవహించి మనమంతా

మైకంలో మునిగిపోతాం విచక్షణ కోల్పోతాం!

అప్పుడే అది..

చూపుడువేళ్ల మీద చీకటిచుక్క పెట్టీ

మన భవితను

బేలట్ పెట్టెల్లో కొల్లగొట్టుకుపోతుంది

తేరుకున్నాక తీరా జూస్తే..

యింకేముంది ఊరంతా ఒకటే చీకటి

చెరచబడ్డ ఆడకూతురులాగుంది ఊరు

చూరుమీద గబ్బిలం భయపెడుతుంది

పొలాల కాలవల్లో కన్నీరు పారుతుంది

ధరలు ధరమీద ఉండవు

ఊరుమీద ఒకటే దుఃఖపుముసురు

వరద బాధితుల్లా.. మనమంతా

కట్టుగుడ్డలతో నడివీధిలో నిలబడతాము

కడుపుపుట్టలో

ఆకలిపాములు సుడిమడతలు పడతాయి

ఎవడో విసిరే ముష్టి మెతుకుల కోసం

గుర్తింపు కార్డ్ పట్టుకొనీ క్యూలైన్లో నిలబడతాం!

అప్పటికే.. మన చూపుడువేళ్లు తెగిపోయి

చేతులు మొండివైపోతాయి

పిడుగులు కురిసే గొంతు‌లు పిల్లికూతలై పోతాయి

ఎవడో జుర్రేసిపోయిన తాటిబురికిలమై

వీధిన పడ్డపుడుగానీ మనకు తెలిసిరాదు

మత్తులో వేసిన ఓటే మనల్ని కాటేసిందనీ..

‌తుపాకీనీడలో.. ఉనికిని కోల్పోయిన ఊరు

వల్లకాడైపోయిందనీ..!

దశాబ్దాలుగా మనల్ని గొర్రెల్ని జేసీ

కనిపించని కంచెల్లోకి నెట్టేస్తున్న మాయని

యికనైనా మానవాయుధాలమై తిప్పికొట్టాల్సిందే..

అమృతోత్సవాల వేళ నాగలిని భుజాలకెత్తుకొని

ఊరిమీద జెండాలా ఎగరేయాల్సిందే..!!

సిరికి స్వామినాయుడు

Updated Date - May 10 , 2024 | 12:37 AM