Share News

గుంటూరును ముంచెత్తిన మరాఠీ ఆధిపత్యం!

ABN , Publish Date - Jan 12 , 2024 | 01:39 AM

కొన్ని రకాల సామాజిక ఆలోచనలు ఒక పట్టాన అంతరించిపోవు. కఠోర వాస్తవాల నుంచి పుట్టిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఏదోరకంగా అవి కొనసాగుతూనే ఉంటాయి. మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక...

గుంటూరును ముంచెత్తిన మరాఠీ ఆధిపత్యం!

కొన్ని రకాల సామాజిక ఆలోచనలు ఒక పట్టాన అంతరించిపోవు. కఠోర వాస్తవాల నుంచి పుట్టిన వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఏదోరకంగా అవి కొనసాగుతూనే ఉంటాయి. మనుషుల మధ్య ఆర్థిక, సామాజిక తారతమ్యాలను వివరించటానికే సామాజిక సిద్ధాంతాలన్నీ పుట్టుకొచ్చాయి. కొన్ని వాటిని సహజమైనవిగా భావించాయి. మరికొన్ని వాటిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇంకొన్ని మధ్యేమార్గాన్ని చూపించాయి. ఎంతో కొంత స్థాయిలో అసమానతలు ఉండటం సహజమని చెప్పటమే మధ్యే మార్గం ప్రధాన ఉద్దేశం. పేర్లు ఎన్నైనా ఉండొచ్చు. చెప్పే రీతుల్లో తేడాలుండొచ్చు. కానీ తరచి చూస్తే అన్నీ సిద్ధాంతాలూ ఈ మూడు విభాగాల్లోనే ఇమిడిపోతాయి. మనందరికీ బాగా తెలిసిన కర్మ సిద్ధాంతం కూడా ప్రధానంగా అసమానతలను వివరించేదే. భారతదేశం అంటేనే విశిష్టతలకు నిలయం. అట్లాంటి విశిష్టతల్లో మన కుల వ్యవస్థ కూడా ఒకటి. ప్రతి కులానికి ఒక హోదాను ఇచ్చి మనుషులను అనేక స్థాయిల్లో నిలబెట్టిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు. విశిష్టతలు ఉన్న వ్యవస్థను వ్యతిరేకించే సిద్ధాంతాలు కూడా విశిష్టంగానే ఉంటాయి. బ్రాహ్మణ ఆధిపత్య వ్యతిరేకత ఇందులో ఒకటి. ఒకనాడు ఈ ఆధిపత్యాన్ని వ్యతిరేకించటానికి పార్టీలే పుట్టుకొచ్చాయి. వందేళ్ల క్రితం మద్రాస్‌ రాష్ట్రంలో పుట్టిన జస్టిస్‌ పార్టీకి ఈ వ్యతిరేకతే పునాది. మహారాష్ట్రలో సామాజిక సంస్కరణల కోసం ఎంతో శ్రమించిన జ్యోతిరావు ఫూలేను నడిపించింది ఈ వ్యతిరేకతే. అంబేడ్కర్‌ది కూడా ప్రధానంగా అదే దోవ. మతపరంగా పూజాపునస్కారాలను నిర్వహించే వర్గం మీద ఇంత వ్యతిరేకత ఎందుకన్న ప్రశ్న వస్తుంది. కానీ ఈ వ్యతిరేకత దానివల్లే వచ్చిందని చెప్పలేం. ఆ వర్గం ఒకనాడు ఆర్థిక, పరిపాలన రంగాలపై చలాయించిన ఆధిపత్యానికి వ్యతిరేకంగా అది వచ్చింది. ఆ ఆధిపత్యం ఎలా ఉండేదో నిర్దిష్టంగా తెలుసుకోటానికి చాలా పరిశోధనలు జరిగాయి. ఒకనాటి గుంటూరు జిల్లాలో ఆ ఆధిపత్య రీతులను వివరించే రచనను ఇందులో ప్రధానమైందిగా చెప్పుకోవచ్చు. రాబట్‌ ఎరిక్‌ ఫ్రికన్‌బగ్‌ 1961లో లండన్‌ యూనివర్సిటీకి సమర్పించిన సిద్ధాంత వ్యాసం కోసం పరిశోధన చేపట్టి దాన్ని రాశారు. ఆ తర్వాత పుస్తకంగానూ ప్రకటించారు. 1788 నుంచి 1848 వరకూ గుంటూరు జిల్లాలో బ్రిటిషు పాలకులకు, అక్కడున్న స్థానిక ప్రాబల్యవర్గాల మధ్య సంబంధాలనూ సంఘర్షణలనూ వివరిస్తూ చాలా సమాచారాన్ని ఇచ్చారు.

గుంటూరు జిల్లాపై బ్రిటిషు ఆధిపత్యం 1788లో మొదలైంది. అప్పటికి భూమి శిస్తే ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం. దీన్ని రాబట్టే పాలనా యంత్రాంగమే ఆనాడు కీలకం. అయితే దీనిపై పట్టు అంతా బ్రాహ్మణుల చేతుల్లో ఉండేది. అంటే కలెక్టరు ఆఫీసు నుంచి గ్రామస్థాయి వరకూ బ్రాహ్మణులదే ఆధిపత్యం. విచిత్రం ఏమిటంటే ఆ ఆధిపత్యంలో ప్రధాన పాత్ర మహారాష్ట్రకు చెందిన దేశస్థ బ్రాహ్మణులది. వీరిని కాదని నిర్ణయాలు తీసుకునే సాహసం బ్రిటిషు అధికారులకు ఉండేది కాదు. రెవిన్యూ రికార్డులన్నీ వీరి చేతుల్లో ఉండేవి. మరాఠీ భాషలో వీటిని రాసేవారు. తెలుగు, ఇంగ్లిషులో కూడా రాసినా కీలక విషయాలన్నీ మరాఠీలోనే ఉంచేవారు. గుంటూరులోనే గాక తమిళ జిల్లాల్లోనూ వీళ్ల ఆధిపత్యమే కొనసాగేది. ఆ రోజుల్లో ముఖ్య శిరస్తాదార్‌ అనే పదవి ఉండేది. కలెక్టరు పదవి తర్వాత అదే కీలకమైంది. అన్ని విభాగాలూ శిరస్తాదార్‌ ఆధిపత్యం కిందే ఉండేవి. ఆ తర్వాత స్థానం నాయబ్‌ (డిప్యూటీ) శిరస్తాదార్‌ది. ఇక తాలూకాల్లో తహశీల్‌దార్లుదే రాజ్యం. 1855 నాటికి మద్రాసు రాష్ట్రంలో 20 జిల్లాలకు 21 మంది శిరస్తాదార్లు ఉండేవారు. అందులో 17 మంది మరాఠా బ్రాహ్మణులు. మిగిలిన నాలుగు పదవుల్లో ఇతర బ్రాహ్మణుల నుంచి ఇద్దరూ, బ్రాహ్మణేతర కులాల నుంచి మరో ఇద్దరూ ఉండేవారు. నాయబ్‌ శిరస్తాదారుల్లో కూడా మరాఠా బ్రాహ్మణులదే (20) ఆధిపత్యం. ఇతర బ్రాహ్మణుల చేతుల్లో 13 పదవులు ఉండేవి. మిగతా కులాల ప్రాతినిధ్యం వీటిల్లో కూడా అరకొరే. ఇతర కులాలకు మూడు, స్థానిక క్రైస్తవులకు రెండు ఉద్యోగాలు దక్కాయి. ఇక తహశీల్‌దారుల్లో మరాఠా బ్రాహ్మణులు 117, ఇతర బ్రాహ్మణులు 68 మంది ఉండేవారు. 45 చోట్ల మిగతా కులాల వ్యక్తులు తహశీల్‌దారు పదవులను నిర్వహించేవారు.

ముస్లింలు 13, క్రైస్తవులు మూడు చోట్ల ఉండే వారు. మొత్తం 305 కీలక ఉద్యోగాల్లో 154 మంది మరాఠా బ్రాహ్మణులు, 83 మంది ఇతర బ్రాహ్మణులు పెత్తనం చలాయించారు. అంటే 77 శాతం పదవులు వీళ్ల చేతుల్లో ఉండేవి. మరి గుంటూరు జిల్లాలో సంగతి ఏమిటి? అక్కడ 70 ఏళ్ల తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. 1922 నాటికి జిల్లా సర్వీసుల్లో 67.22 శాతం ఉద్యోగాల్లో బ్రాహ్మణులే కొనసాగేవారు. 1930ల నాటికి చాలా ఉద్యోగాలకు రిజర్వేషన్లు వచ్చాయి. అయినా 1958 నాటికి కూడా జిల్లా సర్వీసుల్లో బ్రాహ్మణుల సంఖ్య (28.74%) గణనీయంగానే ఉంది. ఇక గ్రామాలను తీసుకుంటే అక్కడ కరణాలుగా పెత్తనమంతా నియోగ బ్రాహ్మణులదే. తర్వాత కాలంలో మునసబుల అధికారాలను పెంచి కరణాల ఆధిపత్యాన్ని తగ్గించారు.

బీజాపూర్‌ సుల్తానులు దేశస్థ బ్రాహ్మణులను దక్షిణాదికి తీసుకువచ్చారు. గోలుకొండ నవాబులూ వీరిని చేరదీశారు. వేరే భాష మాట్లాడే ప్రజలపై అజమాయిషీ కోసం ఇతర ప్రాంతాల నుంచి చదువుకున్న వర్గాలను తీసుకుని రావటం మన చరిత్రలో చాలా సందర్భాల్లో జరిగింది. పైన అధికారం చలాయించే నవాబులను కాపాడటానికి ముస్లిం ఫౌజుదారులు ఉన్నా రెవిన్యూ యంత్రాంగం మొత్తం హిందువుల చేతుల్లోనే ఉండేది. వీరిలో కూడా బ్రాహ్మణ, కాయస్థ కులాల వారే ప్రధానం. ఇక సైన్యంలో కమ్మ, కాపు, వెలమ, రెడ్డి లాంటి అగ్రకులాలు ప్రముఖపాత్ర పోషించేవి. ప్రాంతాన్ని బట్టి ఈ కులాల పేర్లు మారొచ్చు. కానీ ఆధిపత్య కులాలు అన్ని భాషా ప్రాంతాల్లోనూ నాలుగో అయిదో ఉండేవి. ఈ కులాలకు చెందిన ముఖ్యులతో కలిసే ముస్లిం నవాబులు దేశంపై ఆధిపత్యం చలాయించారు. నవాబుల స్థానంలో వచ్చిన బ్రిటిషు వారు చాలా కాలం దాన్ని కొనసాగించారు. అందుకే ముస్లింల పాలనలో హిందువులు అణచివేతకు గురయ్యారంటూ మన చరిత్ర గురించి తరచూ చెప్పేదంతా వాస్తవ దృష్టితో చూస్తే నిజంకాదు. గుంటూరు జిల్లానే కాదు ఏ జిల్లాను తీసుకున్నా ఇదే కనపడుతుంది. ‘హిందువులను అదుపులో పెట్టాలి. అణచివేయాలి. వాళ్లు చాలా టక్కరులు. తిమ్మిని బమ్మిని చేస్తారు. ఎప్పటికీ వాళ్లను నమ్మలేం’ లాంటి మాటలు ముస్లిం రాజ్యాల ఆస్ధాన రచయితలు రాసిన పుస్తకాల్లో చాలాచోట్ల కనపడతాయి. అవన్నీ కూడా పాలనా యంత్రాంగంలో కీలక పాత్ర పోషించిన ప్రాబల్యవర్గాలు గురించి చేసిన వ్యాఖ్యలే. ఈ వర్గాలు తమ కులాలపైనే ప్రధానంగా ఆధారపడి బలగాలను సమకూర్చుకునేవి. చివరికి తిరుగుబాట్లకు కూడా ఎక్కువగా సొంత కులాలపైనే ఆధారపడేవారు. సొంత కులాలు, తెగల బలంతో విస్తృత సంబంధాలు కలిగిన ఈ వర్గాల పట్ల ముస్లిం పాలకులు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండేవారు. దేశస్థ బ్రాహ్మణుల సంగతినే తీసుకుందాం. జిల్లా పాలనా యంత్రాంగాన్ని తమ బంధువర్గంతో నింపేసే వారు. ఒక శిరస్తాదారుకు చెందిన 74 మంది బంధువులు జిల్లా ఆఫీసు ఉద్యోగాల్లో ఉండటమే ఇందుకు నిదర్శనం. కులం, బంధుత్వం ఆసరా లేకుండా ఉద్యోగాలు, పదవులు సంపాదించటం ఆనాడు చాలా కష్టం. కులప్రీతి ఉన్నచోట కుట్రలు, కుహకాలు, ముఠాలు తప్పవు. లంచాలను ఎరవేయటం 1830ల నాటికి ఎక్కువగానే ఉండేది. ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయటం 1850ల నాటికి కూడా బ్రిటిషు వారికి సాధ్యం కాలేదు.


ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ప్రాబల్యకులాలు ఏవంటే కమ్మ, రెడ్డి, వెలమ, కాపు పేర్లు వెంటనే స్ఫురణకు వస్తాయి. రెండు వందల ఏళ్లు వెనక్కి వెళితే ఈ జాబితాకు అతి ముఖ్యంగా చేర్చాలింది బ్రాహ్మణ కులమే. ఎందుకంటే పాలనా యంత్రాంగంలోనే కాకుండా జమిందార్లుగా, భూస్వాములుగా కూడా బ్రాహ్మణులు ఉండేవారు. గుంటూరు జిల్లాలో అయిదు జమిందారీ పరగణాలు ఉండేవి. 882 గ్రామాలు, 36 పట్టణాలు (గ్రామపరిధుల్లోనే) ఉండేవి. గ్రామాలను 14 సమితులుగా విభజించారు. 1847 నాటికి జిల్లాలో 4,11,599 మంది నివసించే వారు. జమిందార్లకు ఒకనాడు శిస్తు వసూలు అధికారమే మాత్రమే ఉండేది.

భూములపై యాజమాన్య హక్కులు ఉండేవి కావు. అయిదు జమిందారీల్లో వెలమ కులానికి చెందిన మాణికరావు కుటుంబం ఎప్పటి నుంచో జమిందారీ (రేపల్లె) గిరి చలాయించేది. విజయనగర సామ్రాజ్యం కంటే ముందు నుంచి కూడా ఈ కుటుంబానికి జమిందారీ గిరి ఉండేది. మనూరురావు (చిలకలూరిపేట, సత్తెనపల్లి) పేరుతో రెండు దేశస్థ కుటుంబాల కింద రెండు జమిందారీలు ఉండేవి. తెలగ కుటుంబానికి చెందిన మల్‌రాజు కింద మరో జమిందారీ (నరసరావుపేట) ఉండేది. అయిదోది జమిందారీ వాసిరెడ్డి (అమరావతి–కమ్మ) కుటుంబానిది. గోలుకొండ రాజ్యం పతనం తర్వాత వాసిరెడ్డి కుటుంబానికి జమిందారీ లభించింది. అమరావతి జమిందారీలో 333 గ్రామాలు ఉంటే నరసరావుపేటలో 323, చిలకలూరిపేటలో 79, సత్తెనపల్లిలో 80, రేపల్లెలో 67 గ్రామాలు ఉండేవి. 1788లో బ్రిటిషు పాలన మొదలైనా రెవిన్యూ యంత్రాంగంపై పట్టుచిక్కలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో 1802లో జమిందార్లకు తమ జమీన్లపై శాశ్వతహక్కు కల్పించే పద్ధతిని ప్రవేశపెట్టారు. పంటలో సగభాగాన్ని జమిందార్లు తీసుకునే వారు.

అందులో మూడో వంతు తమ కింద ఉంచుకుని మిగతా దాని విలువను డబ్బుగా బ్రిటిషు ఖజానాకి కట్టేవారు. బ్రిటిషు రక్షణతో యుద్ధ భయాలు తొలగటంతో జమిందారుల్లో బోగలాలస పెరిగింది. వారసత్వ తగాదాలు, విపరీత ఖర్చులతో 1850ల నాటికి జమిందారీ కుటుంబాలు ఆర్థికంగా సంక్షోభంలో పడ్డాయి.

పదవులు, ఉద్యోగాలు, సంపదలో అనుచిత ఆధిక్యతలు పదునైన భావజాలాన్ని సృష్టిస్తాయి. ఒకనాటి ఉమ్మడి మద్రాసు, మహారాష్ట్ర చరిత్రలే ఇందుకు ఉదాహరణలు. బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం అందుకే అక్కడ ఊపిరిపోసుకున్నది. గుంటూరు జిల్లా చరిత్ర చెబుతున్న నిజం అదే. ఆ ఆధిక్యతలు సడలుతున్న క్రమంలో ఆ భావజాల తీవ్రత కూడా క్రమేపీ తగ్గిపోయింది.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌)

Updated Date - Jan 12 , 2024 | 01:39 AM