Share News

మందుపాతర

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:21 AM

యెన్నిసార్లు చెప్పినా కప్పలా అదే ప్రపంచంలో జీవిస్తావు కానీ చెవిమీద పేను వారదు యెన్ని కన్నీళ్ళు కార్చినా బొమ్మలా చూస్తూ ఉండిపోతావు కానీ నీ మనసు అస్సలు మారదు...

మందుపాతర

యెన్నిసార్లు చెప్పినా

కప్పలా అదే ప్రపంచంలో

జీవిస్తావు కానీ

చెవిమీద పేను వారదు

యెన్ని కన్నీళ్ళు కార్చినా

బొమ్మలా చూస్తూ ఉండిపోతావు కానీ

నీ మనసు అస్సలు మారదు

ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే

ఇక కనుమూయటమనే

చిన్న ఆటొక్కటే మిగిలున్నదన్న

విషయమన్నా తెలుసా

తిరనాళ్ళలో తప్పిపోయినట్టు

ఎక్కడో కాటుగలిసిపోయిన

ఏ చోటో ఉండి ఉంటాడులే అని

మనసుకు సర్ది చెప్పుకుందుము

కళ్ళ ముందే తూట్లు పడుతున్న

నీ శరీరాన్ని చూస్తూ

ఊరికే ఉండగలమా?

పస్తులుంటూ

పచ్చడిమెతుకులకే పరిమితమయి

గుడ్డిగుడిసెకు

జీవితాన్ని కట్టేసుకున్నవాళ్ళు

ఎంతమంది ఎదురుపడటంలేదు

నువ్వు నమ్ముతున్న మందుసుక్కలు

ఇంటిగోడల మధ్య

చిచ్చుపెట్టే మందుపాతరలు

నీ తలను తుంచిపడేసే వేటకత్తులు

నిండు దీపాన్ని

ఆర్పేసుకోవటానికి నువ్వెవరు

గొంతులోంచి బయటికొచ్చే

శబ్దాన్ని ఉరితీసుకోవటానికి

నీవెవరు

పావలా సంపాదించకున్న

నిన్ను కన్నబిడ్డలా సాదే

ఆమెదే నీ దేహం

తాగొచ్చి పక్కలో

ఉచ్చపోసిన్నాడే

నీ శరీరంతో నీకు సంబంధం తెగిపోయింది

పుచ్చిపోయిన నీ కాలేయం

మరణశయ్య మీదికెక్కకముందే

మనిషిగా మారు

పలుపలు ఆలోచనల దారాలు కట్టుకొని

తెలియని ఆకాశానికి ఎగిరిపోకు

ఈ కొద్దిరోజులు

నీ అవయవాలకు పట్టిన

బూజును కాస్తా దులుపుకుంటే

ఇల్లు కుదుటపడుతుంది

తండ హరీష్‌ గౌడ్‌

89784 39551

Updated Date - Jan 08 , 2024 | 12:21 AM