Share News

మళ్ళీ ‘ఆకురాలుకాలం’

ABN , Publish Date - May 27 , 2024 | 12:47 AM

మహెజబీన్‌ పాతికేళ్ళక్రితం వెలువరించిన ‘ఆకురాలు కాలం’ (1997) పుస్తకంగా రాక ముందు నుంచే పత్రికల్లో విడి కవితలు వస్తున్న కాలం నుంచే విశేష పాఠకాదరణ పొంది గ్రంథరూపంలో వెలువడిన తరువాత హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన కవితా సంపుటి...

మళ్ళీ ‘ఆకురాలుకాలం’

మహెజబీన్‌ పాతికేళ్ళక్రితం వెలువరించిన ‘ఆకురాలు కాలం’ (1997) పుస్తకంగా రాక ముందు నుంచే పత్రికల్లో విడి కవితలు వస్తున్న కాలం నుంచే విశేష పాఠకాదరణ పొంది గ్రంథరూపంలో వెలువడిన తరువాత హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయిన కవితా సంపుటి. ఇన్నాళ్ళకు మళ్ళీ దీని ముద్రణ జరిగింది. మహెజబీన్‌ కవిత్వంలో తెలుగు నేల మీద జరిగిన ఉద్యమాల వాడి, వేడి, స్త్రీ హృదయంలో చెలరేగిన అలల పరంపర, సామా జిక సమస్యల మీద ఆమె అక్షరాలు చేసే సవ్వడి, ప్రేమ సముద్రపు లోతుపాతులు అన్నీ కలగలిపి ఉన్నాయి.


ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కొన్ని దశాబ్దాలు ఈ ‘ఆకురాలు కాలం’ కొనసాగింది. అంటే ఎన్‌కౌంటర్‌ల కాలం. రాజ్యం ఒక వైపు, పీడనను ప్రశ్నించే గొంతులు మరోవైపు నిలబడి దేశం మీద కొన్నాళ్ళు భీకర యుద్ధపర్వం లిఖించారు. ఈ పోరులో పల్లెలన్నీ రక్తంతో తడిసిపోయాయి. పోలీసులు, నక్సలైట్లు పిట్టల్లా రాలిపోయారు. కవులు కవిత్వమై పొగిలిపోయారు.

‘‘అతనెపుడూ అంతే/ వస్తూ వస్తూ పక్షుల పాటల్ని వెంట తెస్తాడు/ .../ ఝాము రాత్రి నిర్దాక్షిణ్యంగా నన్ను లేపి/ మంజీరనాదాల్ని తూటాలు వేటాడిన వైనం చెబుతాడు/ అప్పుడు/ భయంగా అతన్ని నా గుండెలో దాచుకుంటాను/ అతని ప్పుడు లేడు/ ఈ మధ్య అర్ధాం తరంగా వచ్చిన/ ఆకురాలే కాలానికి/ ఎక్కడ రాలిపడ్డాడో?’’ - ఈ విప్లవ సానుభూతి మహెజబీన్‌ కవిత్వంలో అక్కడక్కడ ఎంతో గాఢంగా తొంగి చూస్తుంది. గోడల మీద నినాదాలు రాసినపుడు ‘‘లాఠీలు మమ్మల్ని ముద్దుపెట్టుకుంటాయి. అప్పడు మా రక్తం సాక్షిగా గోడలన్నీ మాట్లాడుతాయి’’ అంటుంది. అతడు వాల్‌ పోస్టర్లు అతికించి వచ్చిన సందర్భంలో ‘జ్ఞాపకం’ కవిత రాస్తూ ‘‘నువ్వు ఎన్‌కౌంటర్‌వో, లాకప్‌వో/ తెలియని సందిగ్ధ జ్ఞాపకం/ రావని మాత్రం తెలిసిన చేదు జ్ఞాపకం’’ అంటుంది. చాలా కవితల్లో విప్లవో ద్యమాన్ని స్త్రీ కోణంలో చూడడం కనిపిస్తుంది. ఉద్యమ భాగస్వామి గురించి, తనకీ సమాజానికి మధ్య జరిగే రాపిడి గురించి విభిన్నమైన వ్యక్తీకరణ మనల్ని ఆనాటి కల్లోల కాలంలోకి తీసుకెళ్తుంది. ‘‘స్నేహితుడా! రెప్పపాటు కాలంలో నువ్వు/ ఆకాశంలో చుక్కవైనావు/ నిన్ను తల్చు కుంటూ/ రేపటి తరం నిర్భయంగా నడవడానికి/ బాటలు వేస్తున్నాను’’ అంటూ ఒక ఉద్యమ ‘జావళీ’ని పాడుతుంది.


స్త్రీవాదంపై కనీసం పది కవితలున్నాయి ఈ పుస్తకంలో. పురుషాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, గర్భందాల్చే వరాన్ని గురించి, తల్లికీ తనకూ ఉన్న సామ్యత గురించి చాల నిక్కచ్చిగా మాట్లాడుతుంది. అలాగని తనది రాడికల్‌ ఫెమినిజం కాదు. ఒక స్త్రీగా తన వాదనను సున్నితంగా వినిపిస్తుంది. స్త్రీ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, కుటుంబంలో ప్రవేశించే సామాజిక రాజకీయాల గురించి, తన చుట్టూ జరుగుతున్న అనేక రకాల వివక్ష గురించి నింపాదిగా ప్రశ్నిస్తుంది.

‘‘ఒక అనాచ్చాదిత ప్రేమ/ నా నగ్న ఫాలాన్ని స్పర్శిస్తుంది/ ఒక స్పర్శ నా కళ్ళలో మునిగి/ చెక్కిలి మీద కవ్వింపుగా మెరు స్తుంది/ మెడవంపు లోయలలో వాలి/ ఒక చూపు పంచ చామరమై వీస్తుంది/ అక్షరాలను వొదిలి కవిత్వం/ మమ్మల్ని పెనవేసుకుంటుంది’’ - ‘అతని సమక్షం’లో వర్ణించిన ఈ erotism కవిత్వానికి, శృంగారానికి పాటించిన అభేదం మనల్ని ఆశ్చర్యపరు స్తుంది. ఆక్టావియో పాజ్‌ అన్నట్లు ""The relationship between erotism and poetry is such that it can be said without any affectation, that the former is a poetry of body and the latter an erotism of language'' ముగింపులో కవిత్వం జీవితంలోకి ప్రవేశించ డాన్ని ఎంతో గడసరిగా చెప్తుంది. ఈ కవితలోని ప్రతి వాక్యం శృంగార వర్ణన అనిపిస్తుంది. అదే సమయంలో అంతకుమించి కవిత్వ సృజన సమయాన్ని సెలబ్రేట్‌ చేసు కున్నట్టుగా అనిపిస్తుంది. ప్రేమ గురించి మాట్లాడుతూ ‘‘అంతా బతికున్నప్పుడే చెప్పేయాలి/ గుండె చప్పుడు ఆగిపోయాక/ ఏ ఉపగ్రహం ప్రేమలేఖల్ని మోసుకెళ్ళదు’’ అంటుంది.


‘చెత్తకుప్పలమీద పర్చుకున్న/ శాపగ్రస్త బాల్యం Street Children/ .../ కేవలం బ్రతకడానికి/ ఎన్నెన్ని యుద్ధాలు చేస్తారు వాళ్ళు/ ఎన్నిసార్లు గాయపడ్తారో తెలుసా?’’ - మహెజబీన్‌ ఎన్నో సామాజిక సమస్యల మీద ప్రత్యక్షంగా పోరాటం చేసింది. హైదరాబాద్‌లోని ఓల్డ్‌సిటీ పేద ముస్లిం స్త్రీల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడం కోసం, వాళ్ళను జన జీవన స్రవంతిలో కలపడం కోసం ఎంతో కృషి చేసింది. బాల కార్మికులను, స్కూల్‌ డ్రాపవుట్‌ పిల్లలను తిరిగి బడిలో చేర్చడంకోసం ప్రయత్నించింది. ‘స్ట్రీట్‌ చిల్డ్రన్‌’ కవిత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి తెలుగువాచకంలో పాఠ్యాంశంగా ఉండేది. 1997 నుండి రాష్ట్ర విభజన దాకా విద్యార్థులు ఈ కవితను చదువుకున్నారు. ‘‘మా అమ్మ హఠాత్తుగా చిన్నదై నట్టు అన్పిస్తుంది, పనిపిల్ల ఒక అంగారధారిక’’ అంటూ పనిపిల్ల లేత బాల్యాన్ని కవిత్వీకరిస్తుంది.

మెహందీ స్త్రీల గురించి (సరిహద్దు రేఖలు), మేల్‌ చావనిజం (చీకట్లోంచి వెలుతురులోకి) గురించి, త్రిపురనేని శ్రీనివాస్‌ మరణం గురించి (Elegy), ప్రశాంత కాశ్మీర్‌ (లోయ) కోసం పరితపించిన ఆర్ద్రమైన అనుభవ సాంద్రత నుంచి మాట్లాడిన గొంతు మహెజబీన్‌ది. మాటల్లో పొదుపుదనం, శిల్పంలోని కొత్త నడకే ఆమె కవిత్వాన్ని ఇంకా నిలబడేలా చేసింది.

వెల్దండి శ్రీధర్‌

98669 77741

Updated Date - May 27 , 2024 | 12:48 AM