Share News

మధునాపంతుల సూరయ్య శాస్త్రి శత వసంత వేడుకలు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:58 AM

ఒక ఆత్మీయమైన పలకరింపు... ఒక స్నేహార్ద్రమైన చల్లని చూపు... ఒక సహృదయ మానసిక విలాసం... ఎల్లప్పుడూ వదనంలో చిరు మందహాసం... మారని సంతకంలా అరవై ఏళ్ళుగా ఒకే ఆహార్యం...

మధునాపంతుల సూరయ్య శాస్త్రి శత వసంత వేడుకలు

ఒక ఆత్మీయమైన పలకరింపు... ఒక స్నేహార్ద్రమైన చల్లని చూపు... ఒక సహృదయ మానసిక విలాసం... ఎల్లప్పుడూ వదనంలో చిరు మందహాసం... మారని సంతకంలా అరవై ఏళ్ళుగా ఒకే ఆహార్యం... గౌరవభావం ఉట్టిపడే స్థిర గంభీరత... ఇవన్నీ కలబోసిన మూర్తిమత్వం మధునాపంతుల సూరయ్య శాస్త్రి. పద్యకవి అయినా వచన కవితలో మెరిసిన భావశకలంను హత్తుకునే సహృదయశీలి... ఎన్నో ఎన్నెన్నో ప్రాచీన సాహిత్య అధ్యయన విశేషంతో పరిపక్వమైన ఆలోచనలు... ప్రక్రియాభేదం లేకుండా అందరినీ సమాదరించడం ఆనందించడం ఆయనలోని గొప్పతనం.

‘తొలి మేల్‌ త్రోవలు నేటి సంస్కృతుల రీతుల్‌ లెస్స గుర్తించి నా తలలో తీయని నాల్కగా మెలగు సోదర్యుండు సూరయ్య శాస్త్రులు’ అని ఆంధ్ర పురాణకర్త మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ‘ఆంధ్రపురాణము’ అవతారికలో తన తమ్ముని గురించి చెప్పుకున్నారు. మధునాపంతుల సూరయ్య శాస్త్రి తెలుగు ఉపాధ్యాయులు. ఆయుర్వేద వైద్యంలో నిష్ణాతులు. పద్యకవిగా ప్రౌఢశైలిలో ‘దేవీనవతి’ కావ్యాన్ని వెలయించినవారు. వందలాది విద్యార్థులకు సాహిత్యాభిరుచి కలిగించినవారు. అందులో నేనూ ఒకడిని.

మధునాపంతుల సూరయ్య శాస్త్రి 1924 నవంబరు 15 తేదీన జన్మించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో పల్లిపాలెంలో కుటుంబసభ్యులు, శిష్యులు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డా. జి.వి. పూర్ణచందు, డా. యనమదల మురళీకృష్ణ, డా. పి.వి. శర్మ, దాట్ల దేవదానం రాజు, పి.ఆర్‌.ఎల్‌. స్వామి, కిరణ్‌ మధునాపంతుల, ఇంద్రగంటి రామచంద్ర గోపాలం, అల్లంరాజు రామగోపాల రావు, రవిశంకర రెడ్డి, గోవిందరెడ్డి లను ప్రతిభా పురస్కారాలు, ఆత్మీయ సత్కారాలతో గౌరవిస్తున్నారు.

దాట్ల దేవదానం రాజు

Updated Date - Jan 11 , 2024 | 12:58 AM