తెలుగు భాష, సంస్కృతులపై అభిమానం పెంచాలి
ABN , Publish Date - Jul 31 , 2024 | 01:56 AM
గౌరవనీయ ఉపముఖ్యమంత్రి వర్యా, సినిమా నేపథ్యం ఉన్న దివంగత ఎంజీఆర్, ఎన్టీఆర్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తమిళానికి, తెలుగుకు ఎంతో సేవ చేసి ఘనకీర్తిని పొందారు. మీకూ తెలుగుపై అభిమానం...
గౌరవనీయ ఉపముఖ్యమంత్రి వర్యా,
సినిమా నేపథ్యం ఉన్న దివంగత ఎంజీఆర్, ఎన్టీఆర్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తమిళానికి, తెలుగుకు ఎంతో సేవ చేసి ఘనకీర్తిని పొందారు. మీకూ తెలుగుపై అభిమానం ఉంది. మీరు తెలుగు సాహిత్యం బాగా చదివినవారు, కళా హృదయం ఉన్నవారు, అశేష జనావళిని ప్రభావితం చేయగల వ్యక్తిగత ఆకర్షణ ఉన్నవారు, అన్నిటికీ మించి మంచి చేయాలనే తపన ఉన్నవారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీతో చేయి కలిపి అధికారంలోకి వచ్చారు.
తెలుగు సినిమా ఎన్నడూ లేనంతగా ఉత్థానావస్థలో ఉంది. విశ్వవ్యాప్తంగా మన కథలకు, కథనానికీ, సంగీతానికీ, సాహిత్యానికీ, నృత్యానికీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. అయితే, తెలుగు భాష మాత్రం, మన రాష్ట్రాల్లోనే క్షీణిస్తోంది. ఇదొక విడ్డూరం.
తెలుగు చదవగలిగినవారు తక్కువైపోతుండబట్టి, తెలుగు సినిమా పాటలను యూట్యూబ్‌లో ఆంగ్లంలో రాస్తున్నారు. రేపు చిన్న తెలుగు పదాలు కూడా పలక లేకో, పలికితే ఎబ్బెట్టుగా అనిపించో, ఆంగ్ల పదాలే వాడతారు. భవిష్యత్తులో తెలుగు వాడుక భాష కాక, కేవలం పుస్తక భాషగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. భాష మరణిస్తే దాని తాలూకు సంస్కృతి, సంప్రదాయాలు మరణిస్తాయి. ఈ సమస్యకు పరిష్కారం ఇప్పుడైనా కనుక్కోకపోతే, పరిస్థితి తిరిగి కోలుకోలేనంతగా విషమిస్తుంది. ఎందుకంటే, అంతరిస్తున్న జీవజాతుల జాబితాలో ‘తెలుగు మాస్టారు’ ఎపుడో చేరిపోయారు. అయితే దీన్ని భాషా సమస్యగా కంటే మనస్తత్వానికి సంబంధించిన సమస్యగా చూడాలి. ఆంగ్లం రాకపోవడం తెలుగువారిలో ఆత్మన్యూనతను పెంచుతోంది. ఎన్ని తప్పులతో మాట్లాడినా ఆంగ్లంలో మాట్లాడితే అదొక ప్రతిష్ఠ. మన జీవితాలలో ఆంగ్లం అవసరమే. యువతకి ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు కల్పించడం కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం జరుగుతున్న ఈ తరుణంలో, తెలుగేతరులతో లావాదేవీలు నడపడానికి, ఆర్థిక, మానవ వనరులను ఆకర్షించడానికి, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయటానికి ఆంగ్ల భాష తప్పనిసరి.
అంతమాత్రాన ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని తెలుగు శిథిలాల మీద నిర్మించుకోవలసిన అవసరం లేదు. కూర్చున్న కొమ్మను ఎవరైనా నరుక్కుంటారా? రెండు తరాలుగా ఈ తప్పిదం జరుగుతున్నది. ఫలితంగా దుష్పరిణామాలు చక్రవృద్ధి చెందుతున్నాయి. ఇంతకు ముందు చెప్పినట్టు చిన్న చిన్న తెలుగు పదాలు కూడా అందరూ మర్చిపోతున్నారు. తాము చదువుకున్నవారమని తద్వారా సమాజంలో తమ ఉన్నత స్థానాన్ని సూచించడానికి ఆంగ్లంతో ముడి వేసుకుంటున్నారు. ఈ ముడిని విప్పాలి. ఎంత చదువుకున్నా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా తెలుగు రాకపోతే నామోషి కలగాలి. సమాజంలో ఉన్నత వర్గాలలో ఈ నామోషి మొదలైతే, అది క్రమేపీ కింది వర్గాల వరకూ వస్తుంది. ఇందుకు సమాజంలో విస్తారంగా తెలుగు భాష, సంస్కృతులపై అభిమానం పెంచే కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాలి. రాష్ట్ర ఖజానా ఖాళీ అని తెలుసు, కానీ విధాన నిర్ణయాలు తీసుకోవడానికి, వాటి అమలుకు పెద్దగా డబ్బు అవసరం లేదు.
తెలుగు ఉపాధ్యాయులకి ఇతర ఉపాధ్యాయుల కంటే వేతనం ఎక్కువ ఇవ్వాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. తెలుగు చదవకున్నా ఉత్తీర్ణులని చేస్తారులే అనుకునే దశ నుండి, ఉత్తీర్ణతకు ఆకర్షణీయంగా ఉండే విధంగా, అంటే స్కోరింగ్ సబ్జెక్ట్‌గా తెలుగును రూపొందించాలి. విద్యావిధానంలో భాష, సాహిత్యం, కళలపై అభిమానం పెంచాలి. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు (మీతో సహా) సింహభాగం కళా రంగానికి చెందినవారే అవడం యాదృచ్ఛికం కాదు. తమిళనాడులో సినిమాలకు తమిళ పేర్లే పెడితే రాయితీలు ఇచ్చినట్టు, తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెడితేనే రాయితీలు ఇవ్వాలి. కర్ణాటక ప్రభుత్వం కన్నడ విషయంలో చేసినట్టు, ఫలకాల మీద వ్యాపార సంస్థల పేరు తెలుగులో పెద్దగా ఉండాలనే నియమం పెట్టాలి. రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలకు తెలుగు తప్పనిసరి చేయాలి. తెలుగు సినీ హీరోలు, దిగ్దర్శకులు తెలుగు భాషపై తమ అభిమానం చాటాలి. వారికి తెలుగు రాకపోయినా నేర్చుకుంటున్నాం అని చెప్తే, యువత ప్రభావితులవుతారు. మీ ట్విట్టర్ ఖాతాలో చదవడానికి రోజుకో తెలుగు పుస్తకం సూచిస్తే, అది ఎనలేని ప్రభావం చూపుతుంది.
ఏదైనా మార్పు చేయాలనుకుంటే, ఒక ముఖ్య ఘటనను ఆసరాగా చేసుకోవాలని ప్రవర్తన శాస్త్రం చెప్తోంది. దీనినే ఆ శాస్త్రం ‘ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్’ అంటుంది. మీరు అపూర్వ ప్రజాభీష్టం మీద అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వం ఇంకా కొత్తదే. విస్తారమైన మార్పు మొదలెట్టడానికి ఇది మంచి సమయమే కాదు, సరైన సందర్భం కూడా. ఎందుకంటే, ఇంతకు ముందు లేని సాంకేతిక సానుకూలతలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది. సామాజిక సంభాషణలు, వ్యాపార లావాదేవీలన్నీ ఇప్పుడు ఫోన్‌లో జరుగుతున్నాయి. తెలుగు కీబోర్డ్, స్పీచ్–టు–టెక్స్ట్, ఆటో కరెక్ట్, ఎఐ ఇంకా మెరుగై, తెలుగు భాష వినియోగాన్ని సులభతరం చేస్తాయి. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితాలలో నిమగ్నులై ఉంటారు. చాలా వరకు స్వలాభం దాటి ఆలోచించలేరు. ఇది ఆసరాగా చేసుకుని లాభపడదామనుకునేవాడు రాజకీయ నాయకుడు. ఇది తెలుసుకుని సమాజాన్ని, జాతినీ పరిరక్షించేవాడు రాజనీతిజ్ఞుడు.
దాసు కిరణ్
దాసుభాషితం సీఈవో