Share News

జాతీయ పార్టీలకు జవజీవాలు!

ABN , Publish Date - Apr 04 , 2024 | 01:17 AM

ఆంధ్రపదేశ్‌లో పదేళ్లపాటు ఉనికి కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు 2024 ఎన్నికలు మళ్లీ ఊపిరి పోయబోతున్నాయి. ఈసారి ఈ రెండుపార్టీలు గతంలో...

జాతీయ పార్టీలకు జవజీవాలు!

ఆంధ్రపదేశ్‌లో పదేళ్లపాటు ఉనికి కోల్పోయిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు 2024 ఎన్నికలు మళ్లీ ఊపిరి పోయబోతున్నాయి. ఈసారి ఈ రెండుపార్టీలు గతంలో కంటే మెరుగ్గా ఓట్లు, సీట్లు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలే దీనికి ప్రధాన కారణం.

ఉమ్మడిరాష్ట్రం విడిపోవడానికి ప్రధానకారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం, అందుకు సహకరించినది బీజేపీ అని భావించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆ రెండు పార్టీలపై విపరీతమైన ఆగ్రహాన్ని పెంచుకున్నారు. 2014లో పార్లమెంట్‌తోపాటు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని భూస్థాపితం చేసేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం కావడంతో పాటు తనపై అక్రమంగా కేసులు పెట్టి జైలుపాలు చేసిన కాంగ్రెస్‌ను ఓడించి తనకే అధికారం అప్పగించాలని జగన్‌ ఆ ఎన్నికల సందర్భంగా ప్రజలను కోరారు. అయినా చంద్రబాబుకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో తెలుగుదేశం, ఎన్డీయే కూటమికే ప్రజలు అధికారాన్ని అప్పగించారు. పవన్‌కల్యాణ్‌ సారథ్యంలోని జనసేన ఎన్నికల్లో పోటీచేయకపోయినా మద్దతు ఇవ్వడం ఆ కూటమికి మరింతగా కలిసివచ్చింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం 44.9 శాతం ఓట్లతో 102 ఎమ్మెల్యే, 40.8 శాతం ఓట్లతో 15 ఎంపీ స్థానాలు, వైసీపీ 44.6 శాతం ఓట్లతో 67 ఎమ్మెల్యే, 45.7 శాతం ఓట్లతో 8 ఎంపీ స్థానాలు, బీజేపీ 2.2 శాతం ఓట్లతో నాలుగు ఎమ్మెల్యే స్థానాలు, 7.2 శాతం ఓట్లతో రెండు ఎంపీ స్థానాలు గెలుచుకున్నాయి. నవోదయపార్టీ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని, స్వతంత్య్ర అభ్యర్థి ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే స్థానాన్నీ గెలుచుకోలేక ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ 2.9 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు, రాజధాని నిర్మాణానికి నిధులు, ప్రత్యేక రైల్వే జోన్‌ వంటి అనేక హామీలు ఇచ్చిన మోదీ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు. దాంతో బీజేపీపై కూడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 2018లో తెలుగుదేశం, ఎన్డీయే కూటమి విచ్ఛిన్నమై కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఆయాప్రభుత్వాలకు అవి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మళ్లీ ఉద్యమాలు మొదలయ్యాయి. దీని ప్రభావం 2019 ఎన్నికలపై పడింది.

‘ఇరవైఐదు మంది ఎంపీలను ఇవ్వండి ప్రత్యేక హోదా సాధిస్తా, మెజారిటీ ఎమ్మెల్యేలను ఇస్తే రాష్ట్రంలో పరిపాలన స్వరూపం మారుస్తా, ఒక్క అవకాశం ఇవ్వండి’ అని వేడుకున్న జగన్‌ను నమ్మి రాష్ట్రప్రజలు అనూహ్యంగా స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు రెండూ తమకు అన్యాయం చేశాయని గాఢంగా విశ్వసించిన ప్రజలు వాటిని చావుదెబ్బ కొట్టారు. వైసీపీకి బ్రహ్మరథం పడుతూ 50.6 శాతం ఓట్లతో 151 మంది ఎమ్మెల్యేలను, 49.9 శాతం ఓట్లతో 22మంది ఎంపీలను గెలిపించారు. కాగా తెలుగుదేశం 39.7 శాతం ఓట్లతో 23 మంది ఎమ్మెల్యే, 40.2 శాతం ఓట్లతో మూడు ఎంపీ స్థానాలు దక్కించుకుంది. 5.6శాతం ఓట్లతో జనసేన ఒక ఎమ్మెల్యేను మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్‌ 1.2 శాతం ఓట్లు సాధిస్తే బీజేపీ 0.9 శాతం ఓట్లు సాధించింది. ఈ రెండు పార్టీలకంటే అధికంగా నోటాకు 4,01,324 (1.3 శాతం) ఓట్లు పడడం ఆ రెండు పార్టీల మీద ప్రజలకున్న అక్కసును వెల్లడిస్తోంది.

సీఎంగా గద్దెనెక్కిన జగన్‌, కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండడం వల్ల ప్రత్యేకహోదా తేలేమని తొలి వారంలోనే చేతులెత్తేశారు. అనంతర కాలం నుంచి ఇప్పటి వరకు సంక్షేమానికి పెద్దపీట వేసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం, అమరావతి స్థానంలో మూడు రాజధానుల అంశాన్ని లేవనెత్తడం, పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడం, రైల్వే జోన్‌ రాకపోవడం, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం, కేంద్రంలోని మోదీ సర్కార్‌తో రహస్య అవగాహనతో వ్యవహరించడం తదితర అంశాల కారణంగా వైసీపీపైనా ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది.

ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జగన్‌ సర్కార్‌ నియంతృత్వ పోకడలు, ప్రతిపక్షాలపై దాడులు, అరెస్టులతో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వనని ప్రతిజ్ఞ చేశారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న ఆయన టీడీపీతో కూడ సయోధ్య కుదుర్చుకున్నారు. ఫలితంగా తెలుగుదేశంకు 17 ఎంపీ, 144 ఎమ్మెల్యే స్థానాలు, బీజేపీకి ఆరు ఎంపీ, పది అసెంబ్లీ స్థానాలు, జనసేనకు రెండు ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాలతో సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. వైఎస్‌ జగన్‌ ఒంటరిగా 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు పోటీకి దిగారు. ఇండియా కూటమి తరపున ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్‌ జతకట్టి పోటీకి సై అంటోంది.

గట్టి ఓటుబ్యాంకు కలిగిన తెలుగుదేశం, జనసేనలతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోనుంది. ఈ క్రమంలోనే కొన్ని సీట్లు సాధించే అవకాశం కూడా ఉంది. అయితే కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నవారు, ముస్లిం, మైనారిటీ వర్గాలు ఈ కూటమికి దూరమయ్యే ప్రమాదం వుంది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల వైపు మొగ్గుచూపే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు జగన్‌తో విభేదించిన ఆమె సోదరి వైఎస్‌ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్‌శ్రేణుల్లో కాస్త హుషారు కనిపిస్తోంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలోనూ తమకు అధికారం ఇస్తే ప్రత్యేక హోదాతోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామని షర్మిళ ప్రచారం చేస్తున్నారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో జత కలవడంతో వారికున్న కొద్దిపాటి ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ అవుతాయి కాబట్టి ఆ పార్టీ గతంకంటే ఓట్ల శాతాన్ని పెంచుకుంటుంది. కాంగ్రెస్‌, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని భావించిన ప్రజలు వాటికి శాశ్వత సమాధి కట్టాలని నిర్ణయించినప్పటికీ, 2024 ఎన్నికల్లో వైసీపీ, తెలుగుదేశం వాటికి అనివార్యంగా ఊపిరి పోస్తున్నాయి.

దేవగళ్ల రామకృష్ణ

జర్నలిస్టు

Updated Date - Apr 04 , 2024 | 01:17 AM