సాహిత్య కార్యకర్త
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:38 AM
కార్యకర్తలు లేకపోతే కావ్యకర్తలు రాణించ లేరు. పుస్తకం అచ్చు బాధ్యత చూడాలన్నా దాన్ని సభలు సమావేశాలూ పెట్టి ప్రచార ప్రసారాలు చేయాలన్నా కార్యకర్తే కీలకం. బంగారం పళ్ళేనికైనా...
సాహిత్య వేదిక
బొమ్మలు: అక్బర్
కార్యకర్తలు లేకపోతే కావ్యకర్తలు రాణించ లేరు. పుస్తకం అచ్చు బాధ్యత చూడాలన్నా దాన్ని సభలు సమావేశాలూ పెట్టి ప్రచార ప్రసారాలు చేయాలన్నా కార్యకర్తే కీలకం. బంగారం పళ్ళేనికైనా గోడచేర్పు అవసరం. సహజంగా కార్యకర్తలు సృజనాత్మక రంగంలో రాణించ లేరు. అది దక్షతతో కూడిన వ్యవహారం. కవులు రచయితలు ఆ రంగంలో రాణించిన దాఖలాలు దాదాపు లేవు. కానీ పెనుగొండ లక్ష్మీనారాయణ ఒక మినహాయింపు. ఆయన సవ్యసాచి.
సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ సాయం కళాశాలలో చదువు పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిని చేపట్టారు. అభ్యుదయ రచయితల సంఘంలో యువకుడిగానే కార్యకర్త బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి అరసానికి కరుడు గట్టిన కార్యకర్త. ఐదు దశాబ్దాలుగా అందులో క్రియాశీలంగా కృషి చేస్తూ వస్తున్నారు. అభ్యుదయ సాహిత్యానికి కొండంత అండ పెనుగొండ అంటే అతిశయోక్తి కాదు.
వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా ఎన్ని పదవీ బాధ్యతలు నిర్వర్తించినా తనను తాను అరసం కార్యకర్తగానే చెప్పుకోవడానికి గర్వపడతారు. అందులో పెద్దలైన రాంభట్ల, సోమ సుందర్, రెంటాల గోపాల కృష్ణ, కొండేపూడి శ్రీనివాస రావు, బొల్లిముంత శివరామకృష్ణ, పులుపుల వెంకట శివయ్య, చాగంటి సోమయాజులు, పరుచూరి రాజారాం వీళ్ళ అడుగుజాడల పట్ల ఆయనకు అపార గౌరవం. వామపక్ష ఉద్యమాలు మనుషుల్ని మానవీయ వ్యక్తులుగా మలుస్తాయని గాఢంగా నమ్మే వ్యక్తి పెనుగొండ.
పెనుగొండ కవిగా ‘రేపటిలోకి’ ప్రవేశించినా విమర్శ ఆయన ప్రధాన రంగం అయింది. విమర్శను ఆయన చేపట్టాడు అనేకంటే ఆ ప్రక్రియే అనివార్యతను కలగ జేసింది అనేది ఆయన రాసిన వ్యాసాలు చూస్తే మనకు అర్థమవుతుంది. పెనుగొండ రాసిన వ్యాసాలు మూడు సంపుటాలుగా వచ్చాయి. ‘అనేక’ (2004), ‘విదిత’ (2014), ‘దీపిక’ (2021). ఈ మూడు పుస్తకాల్లోనూ దాదాపు వందకు పైగా వ్యాసాలు ఉన్నాయి. అందులో సుమారు ముప్పై మంది సాహిత్యకారుల కృషిని గుర్తించిన పరామర్శలున్నాయి. తెలుగు సాహిత్యంలో రాశిపరంగా కాకపోయినా వాసిపరంగా వినుతికెక్కి విస్మృతికి లోనైన కొంతమంది రచయితలకు కవులకు ఆయన దివిటీపట్టారు.
శ్రీశ్రీ, చాసోల గురించి కొందరు ప్రసిద్ధ విమర్శకులు రాసిన అవాకులు చెవాకులకు పెనుగొండ చాలా తీవ్రంగా స్పందించి సమాధానమిచ్చారు. అవతలివాళ్ళు ఎంతటివాళ్ళు అయినా వాళ్ల నోటి తీటకి తీవ్రస్థాయిలో బదులు ఇవ్వక పోతే అంతకంటే చారిత్రక ద్రోహం ఉండదని ఆయన నమ్మకం.
కథానికా సంకలనాల మీద పెనుగొండ విశేషమైన కృషి చేశారు. కాళీపట్నం రామారావు గారి కథానిలయం స్థాపనకు పరోక్షంగా ఒక వ్యాసం ద్వారా బీజ వాపన చేసింది పెనుగొండే.
ఈ వ్యాసం లోనే తొలి కథా సంకలనం 1932లో వచ్చిన ‘కథావళి’ అని, నిషేధానికి గురైన తొలి కథా సంకలనం ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ అని, కులవృత్తికి సంబంధించిన తొలి కథా రచయిత అందే నారాయణ స్వామి అని, తొలి తెలుగు కథానువాదకుడు, కథా విమర్శ కుడు అక్కిరాజు ఉమాకాంతం అని నిర్ధారణ చేశారు. ‘గురజాడ సాహిత్యం – వక్రీకరణలు, వాస్తవాలు’ అనే వ్యాసంలో గురజాడతో పాటు రాయప్రోలును కూడా యుగకర్తను చేయడంలో అకడమిక్ కుట్ర ఇమిడి ఉందని అభిప్రాయపడ్డారు. ముద్దుకృష్ణ సంకలనం చేసిన వైతాళికులు కవితల ఎంపికలో చూపిన పక్షపాతం గురించి ‘భావకవుల ప్రేమ గోల’ అనే వ్యాసంలో ఎత్తిచూపారు. ఇలాంటి బాధ్యత గల కార్యక్రమాల్లో రాగద్వేషాలకు అతీతంగా ఉండాలన్నారు.
‘తెలంగాణ విమోచన పోరాట సాహిత్యం – ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘీభావం’ అనే వ్యాసంలో ఆనాటి ఆంధ్ర రచయితలు నవల, కథ, కవిత, నాటకం వంటి ప్రక్రియల్లో తమ రచనల ద్వారా నాటి ఉద్యమానికి ఎలా ఊపిరులూదిందీ వివరించారు. ‘సాహిత్యం low సంగ తులు’ వ్యాసంలో వర్తమాన తెలుగు సాహిత్య రంగంలో నెలకొన్న అవాంఛనీయ అనారోగ్యకర వాతావ రణాన్ని తూర్పారబట్టారు. ‘తొలి మలి తరం తెలుగు కథలు సంకలనం’లో ఎలా ప్రామాణికత లోపించిందో సోదాహరణంగా వివరించే ప్రయత్నం చేశారు. ఈ సంకలనంలో ఎన్నో నిరాధార నిర్ధారణలు, మరికొన్ని అవగాహనా లోపాలు, ఎంతో అస్పష్టత ఉన్నాయని, ఈ పుస్తకం పాఠకులను తప్పుదోవ పట్టిస్తుందని కచ్చితంగా చెబుతున్నాను అని డంకా భజాయించారు.
ఒకవైపు నేటి ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన తెలుగు కవిత్వాన్ని విపులంగా విశ్లేషిస్తూనే మరోవైపు నాటి నవ్య కవితాఝరి ఐన నయాగరా కవుల గురించి విశ్లేషించారు. తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్మరణీయమైన చారిత్రక పాత్ర నయాగరా కవితా సంకలనానికి ఉందన్నారు. ప్రాంతీయ కథా సంకలనాల గురించి విపులంగా చర్చిస్తూనే అభ్యుదయ సాహిత్యంలో దళిత జీవన చిత్రాల గురించి విపులంగా విశ్లేషించారు.
ఈ పుస్తకాలతో పాటు పెనుగొండ కృషికి గీటురాయి ‘గుంటూరు సీమ సాహిత్య చరిత్ర’. ఏ ప్రాంతం వారైనా తమ సాహిత్య చరిత్ర రాయడానికి ఈ పుస్తకాన్ని ఒక నమూనాగా స్వీకరించవచ్చు. తన ప్రాంతం పట్ల చారిత్రక అవగాహన సాంస్కృతిక రాజకీయ ఉద్యమాల పట్ల గాడమైన అభినివేశం పరిజ్ఞానం లేకపోతే అంత సాధికారికంగా రాయడం కుదరదు.
ఆయన సంపాదకత్వం వహించిన గ్రంథాల్లో ముఖ్యమైనది గుంటూరు సీమ కథలు. ఇందులో అక్కిరాజు ఉమాకాంతం 1918లో రాసిన ‘అన్నపూర్ణ’ కథ నుంచి వేదగిరి రాంబాబు రాసిన ‘తల్లి’ కథ వరకు 70 కథలు ఉన్నాయి. కథా స్రవంతి పేరుతో నాలుగు కథా సంకలనాలను వెలువరించారు. పాపినేని శివశంకర్, వల్లూరు శివప్రసాద్‌లతో కలిసి సంపాదకత్వం వహించిన ‘కవితా ఓ కవితా’, ‘విస్మృత కథ’, గంగోత్రి సాయితో కలిసి రూపొందించిన నాటక రంగ విశేష సంచిక ‘రూపిక’ ముఖ్యమైనవి. గుంటూరు కేంద్రంగా ఆయన మిత్రులతో కలిసి చేసిన సాహిత్య కార్యక్రమాలు ఆయన నిబద్ధతకు అద్దం పడతాయి.
‘‘సాహిత్య సాంస్కృతిక సామాజిక ఉద్యమాల్లో ఐదు దశాబ్దాలకు పైగా చురుకైన కార్యకర్తగా బాధ్యత వహించడంలో నాకు చుక్కానిగా నిలిచింది వామపక్ష భావజాలం. మొత్తంగా సమాజాన్ని ప్రత్యేకించి ఈ రంగాలను దగ్గరగా గమనిస్తున్న నాకు ఆ భావజాలం పట్ల రోజురోజుకీ మరింత విశ్వాసం పెరుగుతుంది. ఈ రంగాలను ప్రజాపక్షంగా తీర్చి దిద్దడంలో ఎందరో కృషిచేసి ఈ తరానికి వారసత్వం అందించారు. ఆ వారసత్వాన్ని నేను అందిపుచ్చుకొని నా తర్వాత అందించటమే నా బాధ్యత’’ అంటూ చేసిన ప్రకటనను బట్టి పెనుగొండ తాను నమ్మిన ప్రగతిశీల భావజాలాన్ని జనం మధ్యకు తీసుకువెళ్లడానికి నిరంతరం శ్రమిస్తున్న కృషీవలుడిగా మనకు అర్థమవుతుంది.
(పెనుగొండ లక్ష్మీనారాయణ ‘దీపిక’
విమర్శ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు ప్రకటించిన సందర్భంగా)
జి.ఎస్. చలం