Share News

హిమాలయాల్లో అక్షర వసంతం

ABN , Publish Date - May 19 , 2024 | 03:54 AM

గత రెండు వేల సంవత్సరాలకు పైగా ప్రపంచం సమస్త భాషలలోను అసంఖ్యాక రచయితలను చూసింది; వారి ఆలోచనల నైశిత్యాన్ని, భావ చింతనను, కల్పనా రమ్యతను...

హిమాలయాల్లో అక్షర వసంతం

గత రెండు వేల సంవత్సరాలకు పైగా ప్రపంచం సమస్త భాషలలోను అసంఖ్యాక రచయితలను చూసింది; వారి ఆలోచనల నైశిత్యాన్ని, భావ చింతనను, కల్పనా రమ్యతను ఆవాహన చేసుకుంది. ఆ అక్షర మాంత్రికులలో కొంతమంది రూపెత్తిన అహంభావులు అయినా తమ పాఠకులపై బ్రహ్మాండమైన ప్రభావాన్ని నెరపినవారు; మరి కొంతమంది మృదుస్వభావులు, స్నిగ్ధమూర్తులు, మనసులను ద్రవింపజేసినవారు; ఇంకొంతమంది మానవ జీవిత అనంత వృత్తాంతాలను అద్భుతమైన నేర్పుతో అభివర్ణించినవారు; పలువురు తమ కథలకు అనూహ్యమైన ముగింపు నివ్వడం ద్వారా పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసినవారు; ఇంకా ఎంతోమంది తమ ప్రాతి భాసికంలోనే కాకుండా రచనా విన్యాసంలో సైతం నిగూఢమైనవారు. ఈ బహు రీతుల సృజనకారులలో ప్రతి తరహా వారితోను మానవ సమాజాలు మెరుగుపడ్డాయి, మన జీవితాలు కాంతిమంతమయ్యాయి. సృజన కార్యకలాపాలలో అంత వైవిధ్యమే లేకపోతే మన బతుకులు కళాకాంతి లేకుండా నిస్సారమయ్యేవి, నిష్ఫలమయ్యేవి.


మన కాలం అత్యుత్తమ కథా రచయితలలో రస్కిన్ బాండ్ ఒకరు. సుసంపన్న, సువిఖ్యాత భారతీయ కథా కథన సంప్రదాయానికి గర్వకారణం రస్కిన్ బాండ్. చెట్టు చేమ, పక్షీ పశువూ, కొండ కోన, ఆకాశ మార్గాన పయనిస్తున్న మేఘాలు, భూతలాన ప్రవహిస్తున్న నదులతో శోభిస్తున్న ప్రకృతి పట్ల ప్రగాఢ ప్రేమానురక్తులను మేళవించుకునే తన కథాకథన ప్రజ్ఞతో ఇంచుమించు మూడు తరాల సాహిత్య ప్రేమికులను ఆయన సమ్ముగ్ధం చేశారు, ఇంకా వారి మనసులను రంజింప చేస్తూనే ఉన్నారు. రస్కిన్ బాండ్ రచనలు హిమగిరి ప్రాంతాల సన్నివేశాలనే ఆధారంగా తీసుకుంటాయనే ఒక సాధారణీకరణ అభిప్రాయాన్ని సాహిత్యాభిమానులు తరచు వ్యక్తం చేయడం కద్దు. రస్కిన్ బాండ్ పరిమితులకు అతీతమైన సృజనశీలి. హిమాలయ ప్రాంతాల రమ్య దృశ్యాలు ఆయనలోని సృజన శక్తికి స్ఫూర్తినిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయినా హిమగిరుల ఆవరణం ప్రతి ఒక్కరినీ ఉత్తేజితులను చేస్తున్నప్పుడు అక్కడే పుట్టి పెరిగిన రస్కిన్ బాండ్ అందుకు ఎలా మినహాయింపు అవుతారు?


రస్కిన్ బాండ్ రచనలకు హిమాలయాలు ఒక నిరంతర నేపథ్యం. అయితే ఆయన కథలు విభిన్న, నానా విధమైన విషయాలను అన్వేషించాయి, అభివర్ణించాయి. ఒకే ఒక్క గవాక్షం ఉన్న మహాభవనంలో కూర్చున్న ఒక అద్భుత ఇంద్రజాలికుడు లాంటి వాడు మన రస్కిన్ బాండ్. కిటికీని తెరిచినప్పుడల్లా తన వీక్షణతో విభిన్న ప్రపంచాన్ని ఆవిష్కరించే మాంత్రికుడు ఆయన. ఈ విషయంలో ఆయన, మధ్యతరగతి కుటుంబ జీవితాల గురించి కథలు రాసిన భారతీయ (భాషలలోని) మహాకథకులతో పోల్చదగినవాడు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ పరిస్థితులలో ఒకేతీరున సువ్యక్తమవుతున్న మానవ జీవన విలక్షణత, నాటకీయత గురించి రస్కిన్ బాండ్ తన పాఠకులను మంత్ర ముగ్ధులను చేశారు. వారిని పలు విధాల పరవశింపచేశారు.

అన్ని వర్గీకరణలు, అనుబంధితాలకు అతీతంగా రస్కిన్ బాండ్ ఒక పరిపూర్ణ మానవతావాది. కనుకనే ఆయన మానవ జీవిత దార్శనికుడు. గ్రామీణ జీవనమైనా, ‘గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులు, పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల’ తలపోతలు అయినా లేదా మనిషి, ప్రాకృతిక జగత్తు మధ్య బాంధవ్యమైనా–రస్కిన్ బాండ్ ప్రతి కథా చర్చించే ఇతివృత్తాలు, ఆలోచనలకు మానవ అస్తిత్వమే కేంద్రంగా ఉంటుంది; మానవ జీవిత సౌందర్యం, సాఫల్యాలు, మానవాళి దుఃఖాలు, వేదనలు ఆ కథల్లో మనకు కనిపిస్తాయి, మనలో లోవెలుగులను నింపుతాయి.


చెప్పవచ్చినదేమిటంటే రస్కిన్ బాండ్, ఆయన జీవన పరిసరాలూ, విశాల ప్రపంచమూ, గ్రామీణ ప్రజలతో జీవితం పొడుగునా ఆయనకు ఉన్న సంబంధ బాంధవ్యాలు – ఇవన్నీ కేవలం ప్రకృతి పట్ల ప్రేమను మించినవి కావా? రస్కిన్ బాండ్ జీవించి ఉన్న కాలంలోనే మనమూ నడయాడుతున్నందుకు ఎంతో అదృష్టవంతులం. ప్రకృతి, పర్యావరణం పట్ల రస్కిన్ బాండ్‌కు ప్రగాఢ శ్రద్ధాసక్తులు ఉన్నాయి. వాటిని ఆయన గౌరవిస్తారు, పూజ్య భావంతో చూస్తారు. ఆయన కథలు, కవితలు, ఇతర రచనలలో ప్రాకృతిక పరిసరాలు మనకు ప్రత్యక్షమవుతాయి. ఆయన భావవిన్యాసాలు, అక్షర కల్పనలతో అవి మనలను అలరిస్తాయి, జాగృతం చేస్తాయి.

ప్రకృతి వర్ణనలతో నిండిన కథలు రాయడమే కాదు, పర్యావరణ సంరక్షణకు పలు విధాల కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికుడు రస్కిన్ బాండ్. భావి తరాల వారి కోసం ప్రాకృతిక జగత్తును పరిపూర్ణంగా కాపాడుకోవాలని ఆయన తరచు ఘోషిస్తుంటారు. పర్యావరణ సమతుల్యతను సంరక్షించుకోవల్సిన ఆవశ్యకతను తన రచనలు, ఉపన్యాసాలు, సంభాషణల్లో ఆయన వక్కాణిస్తుంటారు. స్థిర జీవనం, సుస్థిర అభివృద్ధి, వాటికి సంబంధించిన సకల అంశాలను సమగ్రంగా అర్థం చేసుకున్న రచయిత ఎవరైనా ఉన్నారంటే ఆ ఒక్కడు నిస్సందేహంగా రస్కిన్ బాండ్.


రస్కిన్ బాండ్ కథలు తమ మాటల మాంత్రికతతో మనలను భిన్న ప్రపంచాలకు తీసుకువెళతాయి. అంతేనా? కానే కాదు. అవి అదనంగా ఒక సామాజిక పాత్రను నిర్వహిస్తున్నాయి. వ్యాకుల పడుతున్న ఆత్మలకు అవి సాంత్వననిస్తాయి. గాయపడిన మనస్సులకు ఉపశమనం కలిగిస్తాయి. దెబ్బ తిన్న హృదయాలను ఊరడిస్తాయి ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని శాంతపరుస్తాయి. కలవరపడుతున్న అభాగ్యులను ఓదార్చుతాయి. పాఠకులను అలా ప్రభావితం చేసే అటువంటి సమున్నత సృజనాత్మక రచనా ప్రతిభను చాలా కొద్దిమంది రచయితల్లో మాత్రమే కానవస్తుంది. అటువంటి రచయితల్లో రస్కిన్ బాండ్ అత్యుత్తముడూ, అత్యున్నతుడూ అని చెప్పేందుకు నేను సంకోచించను.

రస్కిన్ బాండ్‌తో ఒక దశాబ్ద కాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే భాగ్యం నాకు లభించింది. ఇటీవల ఆయనను వ్యక్తిగతంగా కలుసుకునే అదృష్టమూ దక్కింది. రస్కిన్ బాండ్‌ను సాహిత్య అకాడమీ ఆయన స్వగృహంలోనే సన్మానించిన సందర్భంగా ఆ విశిష్ట రచయితతో కొద్దిసేపు గడిపాను. ఆయన నిరాడండరత, నిష్కాపట్యం నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆడంబరం, అభిజాత్యం ఏ మాత్రంలేని ఉదాత్తుడు ఆయన. జీవితం పట్ల, మారుతున్న కాలం పట్ల వాస్తవిక దృక్పథమున్న వివేచనాశీలి.


ఒక రచయితగా రస్కిన్ బాండ్ హిమాలయ శిఖరాలను అధిరోహించారు. ఏడు దశాబ్దాలకు పైగా సాహిత్య వ్యాసంగంలో మునిగి ఉన్న ఆయనకు ఎల్లలు లేని సాహిత్య జగత్తునుంచి ఎంతగానో గౌరవమన్ననలు అందుతున్నాయి. ఎన్నో సంస్థ–దేశీయ, విదేశీ, అంతర్జాతీయ– ల నుంచి ఆయన ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. అయినా రస్టీ (రస్కిన్ సృష్టించిన ఒక అజరామర బాలుడి పాత్ర) స్రష్ట ప్రేమాస్పదుడు, స్నేహశీలిగా సర్వజనామోదం, గౌరవాదరాలు పొందుతున్న సుజనుడు. పేరు ప్రఖ్యాతులు ఆయన తలకెక్కలేదు. ఇటవంటి మంచి మనిషిని మనం తరచు చూడము, చూడలేము. ఇంతకూ రస్కిన్ బాండ్ ఎటువంటి రచయిత? ఈ వ్యాసం ఆరంభంలోనే నేను వివిధ రకాల రచయితలను, వ్యక్తిత్వాలను ప్రస్తావించాను. నేను పేర్కొన్న విభిన్న తరహా రచయితల సమ్మేళనమే మన ఈ సాహిత్య ఇంద్రజాలికుడు.


రస్కిన్ బాండ్ అక్షర మహామూర్తి. ఆయన్ని గౌరవించాలి. ఒక రచయితగా, భారతీయ పౌరుడుగా ఆయన్ని గౌరవించడం మన విధ్యుక్త ధర్మం. ఆయన కథలు, కవితలు, నవలలను సమస్త భారతీయ భాషలలోకి అనువదించుకోవాలి. అలా చేయని పక్షంలో జీవితంలో మనం విఫలమవుతాము. చేసిన పక్షంలో జీవితం మన పట్ల దయ చూపుతుంది. భావితరాలు మనలను ప్రశంసాపూర్వకంగా అభినందిస్తాయి.

డాక్టర్ కె. శ్రీనివాసరావు

కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి

(నేడు రస్కిన్ బాండ్ 90వ పుట్టినరోజు)

రస్కిన్‌ బాండ్‌తో వ్యాసకర్త

Updated Date - May 19 , 2024 | 03:54 AM