అంకెలమధ్య అసలు వాస్తవం చూడాలి!
ABN , Publish Date - May 12 , 2024 | 02:39 AM
వాతావరణం ఎట్లా ఉన్నదంటే, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టు. దేవుణ్ణి తలచుకుంటే కూడా బూతుగా ధ్వనించేట్టు. ఏం మాట్లాడినా మరుక్షణం దాన్ని అపచారంగా, అత్యాచారంగా మార్చి ప్రతిధ్వనింపజేయగల యంత్రాంగాలు మోహరించి...

వాతావరణం ఎట్లా ఉన్నదంటే, పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేట్టు. దేవుణ్ణి తలచుకుంటే కూడా బూతుగా ధ్వనించేట్టు. ఏం మాట్లాడినా మరుక్షణం దాన్ని అపచారంగా, అత్యాచారంగా మార్చి ప్రతిధ్వనింపజేయగల యంత్రాంగాలు మోహరించి ఉన్నాయి. కాసేపు స్థిమితపడి, ఆలోచించి, మంచిచెడ్డలు వివేచించే సహనం ఎవరికీ లేదు. సగం అర్థంతోనో, ఆపార్థంలోనో ఆవేశపడిపోవాలి. ఆవలిపక్షం మీద విరుచుకుపడాలి.
ప్రధానమత్రి కార్యాలయానికి ఆర్థిక వ్యవహారాలలో సహకరించే సలహామండలి (ఇఎసి-పిఎం) ఈ మధ్య ఒక మధ్యంతర అవగాహన పత్రాన్ని విడుదల చేసింది. దాని ప్రకారం భారతదేశంలో 1950 నుంచి 2015 మధ్యకాలంలో హిందువుల జనాభా 7.82 శాతం తగ్గింది. ముస్లిముల జనాభా 43.15 శాతం పెరిగింది. ఇంకేముంది? మతవిభజన ఆధారంగా వేడెక్కి ఉన్న రాజకీయ వాతావరణానికి ఎండుగడ్డే దొరికినట్టయింది. లెక్కలకు తప్పుడు వ్యాఖ్యానం ఇవ్వాలనే తాపత్రయంలో, ఆ పత్రం మైనారిటీ మతస్థుల జనాభాపెరుగుదలను ఒక సానుకూల అంశంగా చెప్పిందనే వాస్తవాన్ని మరుగుపరిచారు. గణాంకాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, జనాభా పెరుగుదల ధోరణులను చూసే పద్ధతేమిటి వంటి లోతైన అంశాలు ఎవరికీ అక్కరలేదు. ఒకటి తగ్గింది. ఒకటి పెరిగింది. అంతే. ఆ పత్రం రాసిన నిపుణుల బృందం కూడా ఆ పెరుగుదల ధోరణులను అనుకూల ధోరణులుగా చెప్పినా సరే. రాజకీయంగా పనికివచ్చే కోణాన్నే ప్రదర్శిస్తాం, టీవీ చర్చల్లో దాన్నే టముకు వేస్తాం.
ఈ గణాంకాల చర్చలోకి వెళ్లే ముందు, ఎవరికైనా రావలసిన ప్రశ్న, ఈ మధ్యంతరపత్రం ఈ సమయంలో ఎందుకు బయటకు వచ్చింది? ముస్లిములు ఎక్కువమంది పిల్లలను కంటారని, వారికి వనరుల మీద మొదటి హక్కు ఉండాలని కొందరు వాదిస్తున్నారని సాక్షాత్తూ ప్రధానమంత్రే మాట్లాడిన నేపథ్యంలో, ఈ ఆవేశకావేశాలకు ఆజ్యం పోయాలనే ఉద్దేశ్యంతో ఈ పత్రాన్ని ఇప్పుడు ఎవరైనా రంగం మీదకు తెచ్చారా? రాజకీయ సంవాదాల్లో ఆపద్ధర్మంగా ఈ పత్రాలూ నివేదికలూ ఎందుకు ప్రత్యక్షమవుతాయి? ఆలోచనలు సారిస్తే, మూలకారణాలు అర్థం కాకుండా పోవు.
అధికసంతానం వెనుకబాటుతనానికి ఒక సంకేతం. సంతానం దైవదత్తమన్న నమ్మకం అన్ని సామాజిక వర్గాలలోనూ ఉంటుంది. సాక్షత్తూ మన ప్రధాని నరేంద్రమోదీ, ఆరుగురు సంతానంలో ఒకరు. అధికసంతానం కలిగిన నాయకులుగా ఎన్టీయార్, లాలూ ప్రసాద్ యాదవ్ పేర్లు అందరికీ తెలిసినవే. విద్యాసంస్కారాలు, ఆదాయాలు పెరిగే కొద్దీ, కుటుంబ నియంత్రణకు ఆమోదం పెరుగుతూ వచ్చింది. ముస్లిమ్ మత వర్గంలో కూడా, మతపరమైన కారణాలతో కుటుంబ నియంత్రణను వ్యతిరేకించే ధోరణి, ఆ వర్గంలోని విద్యాసంస్కారాల వ్యాప్తికి తగినట్టుగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటికీ హిందువులతో సహా, అన్ని మతవర్గాలలో అవిద్య, దారిద్ర్యం ఆవరించిన శ్రేణులలో అధికసంతానం కనిపిస్తుంది.
ఒకస్థితిని పేర్కొన్న మాత్రం చేత దానిని అర్థం చేసుకోలేం. ఎటు నుంచి ఎటు పోతున్న గతిలో ఆ స్థితి ఉన్నది అని తెలియాలి. ముస్లిముల జనాభా 43 శాతం పెరిగింది, అన్నంత మాత్రాన, దశాబ్ది పెరుగుదల రేటు, దాని వృద్ధి పతనాలు అర్థం కావు. 1951–-1961 మధ్య కాలంలో, హిందువుల జనాభా 20.7 శాతం పెరిగితే, ముస్లిములది 32.7 శాతం పెరిగింది. 1961–-71 మధ్య పదేళ్లలో హిందువులు 23.7 శాతం, ముస్లిములు 30.7 శాతం పెరిగారు. 1991–-2001 పదేళ్లలో హిందువులు 19.9 శాతం, ముస్లిములు 29.4 పెరిగారు. 2001–-11 మధ్య కాలంలో హిందువులు 16.7 శాతం, ముస్లిములు 24.7 శాతం పెరిగారు. ముస్లిముల జనాభా పెరుగుదల రేటు 1990 దశకం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. అంటే ధోరణి తరుగుదల దిశగా ఉన్నదన్నమాట. ప్రస్తుతానికి ఇంకా, అది హిందువుల పెరుగుదల కంటె అధికంగా ఉండవచ్చు. కానీ, అతి త్వరలోనే రెండు జనాభావర్గాల మధ్య పెరుగుదల రేటులో వ్యత్యాసం తరిగిపోతుంది. 2021 జనాభా లెక్కల సేకరణ జరగలేదు కానీ, జరిగి ఉంటే దాని ఫలితాలలో ఇదే ధోరణిని, మరింత తరుగుదలను చూసేవాళ్ళము.
ఈ సందర్భంలో ఒక ప్రశ్న వేసుకోవాలి. జనాభా పెరుగుదల రేటును మతాల వారీగా మాత్రమే ఎందుకు చూడాలి? హిందువులలోని అన్ని కులాలలో జనాభా పెరుగుదల రేటు సమానంగా ఉందా? జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉన్న కులాలను తక్కినవారు దోషులుగా చూడాలి. విద్యాసంస్కారాలకు, ఆర్థిక స్థితిగతులకు సంతానానికి సంబంధం ఉంది కాబట్టి, సహజంగానే అగ్రకులాలలో జనాభా పెరుగుదల రేటు తగ్గిపోతూ వస్తుంది. అణగారిన కులాలలో ఇంకా అధికసంతానం కొనసాగుతూ ఉంటుంది. బిహార్‌లో 2023లో నిర్వహించిన కులగణనలో షెడ్యూల్డు కులాల వారీ జనాభా 2011 జనాభా లెక్కల నాటి 16 శాతం నుంచి 19.5 శాతానికి పెరిగింది. అదే ముస్లిముల జనాభా 2011 నాటి 16.9 శాతం నుంచి 17.7 శాతానికి మాత్రమే పెరిగింది. అంటే బిహార్‌లో ముస్లిముల జనాభా పెరుగుదల రేటు కంటె షెడ్యూల్డు కులాల వారి జనాభా పెరుగుదల రేటు ఎక్కువ. కులగణన దేశవ్యాప్తంగా జరిగితే, జనాభా పెరుగుదలలోని అనేక విశేషాలు తెలుస్తాయి.
మధ్యంతర ఆర్థికపత్రంలోని అంకెలు చూసి హడావుడి చేసిన నాయకులు, మీడియా ముఖ్యమైన మరికొన్ని వివరాలను చూడనే లేదు, చూసినా విస్మరించారు. మెజారిటీ మతస్థుల జనాభా పెరుగుదల రేటు తగ్గిపోవడం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ధోరణి అట. అది ప్రశంసనీయమైన పరిణామం అట. మైనారిటీల జనాభా తరిగిపోవడాన్ని ప్రతికూల అంశంగా పరిగణించిన ఆ పత్రం, దక్షిణాసియాలోని బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక, భూటాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల ధోరణిని తప్పుపట్టింది. ఆ దేశాల్లో మెజారిటీ జనాభా పెరుగుదల రేటు ఎక్కువుంది. మన పొరుగుదేశాల్లో ఒక మాల్దీవుల్లో మాత్రమే మెజారిటీ జనాభా తగ్గింది. చుట్టుపక్కల దేశాల్లో మైనారిటీలకు ప్రతికూల వాతావరణం ఉండడం వల్లనే, వారు భారత్‌ను ఆశ్రయిస్తున్నారని ఆ పత్రం చెప్పింది. భారతదేశంలో సర్వమతస్థులకు, ముఖ్యంగా మైనారిటీలకు అనుకూల వాతావరణం ఉన్నదని ఆ పత్రం భావం. ఆ వాస్తవాన్ని ఎన్నికల సందర్భంగా మైనారిటీలపై ప్రతికూలంగా ఎక్కుపెట్టడం విచారకరం. ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన గణాంకపత్రానికి సాక్షాత్తూ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీనుంచి, అనుకూల మీడియానుంచి తప్పుడు వ్యాఖ్యానాలు వస్తున్నాయంటే, ఇక వాస్తవాలను గుర్తించడం ఎంత కష్టం?
కె. భారత్ బాబు