Share News

ఇకనైనా కాళేశ్వరం భ్రమల్లోంచి బయటపడదాం!

ABN , Publish Date - Jun 07 , 2024 | 03:38 AM

ప్రతిరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అందులో జరిగిన అవకతవకల గురించి పత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2016లో ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి...

ఇకనైనా కాళేశ్వరం భ్రమల్లోంచి బయటపడదాం!

ప్రతిరోజు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి, అందులో జరిగిన అవకతవకల గురించి పత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2016లో ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి మేము తరచుగా ఈ ప్రాజెక్టు అతి పెద్ద భారంగా ఎలా పరిణమించబోతోందో వ్యాసాలు రాస్తూ ప్రభుత్వాన్ని, ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నాం. దురదృష్టవశాత్తు 2016లో మేము ఏమి చెప్పామో సరిగ్గా అదే ప్రస్తుతం జరిగింది.


ఈ ప్రాజెక్టు వల్ల ఇప్పటివరకు రాష్ట్రానికి సమకూరిన లబ్ధి లేశ మాత్రమే. మరోవైపు ప్రాజెక్టు కారణంగా రాష్ట్రంలోని ఆర్థిక వనరులు క్రమంగా హరించుకుపోతున్నాయి. సాలీనా ఈ ప్రాజెక్టుపై చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.13,000కోట్లు. బహుశా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రాజెక్టు మీద రుణాల చెల్లింపు కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెడుతున్నట్టు లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు సుమారు రూ.36కోట్లు ఈ ప్రాజెక్టుపై రుణాల చెల్లింపు కోసం కేటాయించవలసి ఉంటుంది. ఇందులో నీటిని ఎత్తిపోయడానికి జరిగే ఖర్చు జత చేయలేదు. ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుత్ చెల్లింపులు కలుపుకుంటే సాలినా దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు పెట్టాలి.

ఈ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమైన మూడు బ్యారేజీలు – సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ – ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రాజెక్టు కుప్పకులూతోంది. కేవలం ఆ ప్రాజెక్టులను యథాతథంగా ఉంచడం కోసం పెట్టవలసిన ఖర్చు వందల కోట్ల రూపాయలకు చేరవచ్చు. ఏ రాష్ట్రంలోనూ ఒక ప్రాజెక్టును నిలబెట్టుకోవడం కోసం బహుశా ఇంత ఖర్చు పెట్టి ఉండరు.

ఇప్పటికి సుమారు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద 35 వేల ఎకరాలకు మించి నీరు ఇవ్వలేదనేది వాస్తవం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి, వరద కాలువ నుంచి నీరు వస్తోంది కనుక ఇబ్బంది లేకుండా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయినప్పటికీ కూడా బహుశా ఎకరం నీరు ఇవ్వాలంటే ఒక సీజన్‌లో ప్రభుత్వం రూ.60,000 నుండి రూ.1,10,000 ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అలా కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్న ఒక ప్రాజెక్టును తెలంగాణలో కొత్త ప్రభుత్వం వారసత్వంగా పొందింది.


నాలుగు అంశాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మంచి ఉదాహరణగా మన ముందు నిలబడుతుంది. ఎటువంటి ఖర్చైనా వెనకాడకుండా వ్యవసాయానికి నీరు అందించడం అనే ఒక కాలం చెల్లిన భావనకు ప్రాధాన్యం ఇవ్వడం; అమలుకు ఆమోదయోగ్యం కాని పారదర్శకత, బాధ్యత లోపించిన ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కంప్లీషన్ పద్ధతిలో ప్రాజెక్టు తీసుకోవడం; వాణిజ్య బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని భవిష్యత్తు తరాల అవసరాలను తాకట్టు పెట్టడం; ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చూపించే ప్రభావాన్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం... ఇవన్నీ కలిపి ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిలబెట్టాయి. దీని ప్రతికూల ఫలితాలు మరికొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రం మీద ఉండబోతున్నాయి.

2016లో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ప్రారంభించడానికి ముందే అందుబాటులో ఉన్న డీపీఆర్ ఆధారంగా ప్రాజెక్టు విషయంలో పునరాలోచన చేయాలని ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి సమర్పించాం. మా రిపోర్టులో ఈ ప్రాజెక్టు ప్రతిపాదిత నమూనా భారీ వ్యయంతో కూడుకున్నదని, నిర్వహణ వ్యయం ఎకరానికి 60 వేల రూపాయల వరకు ఉంటుందని, కొన్ని భారీ కట్టడాలు వరద ఉధృతిని తట్టుకొని నిలబడలేకపోవచ్చని స్పష్టంగా పేర్కొన్నాము. ఈ ప్రాజెక్టును సమగ్రంగా పునః పరిశీలించాలని, అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో స్పష్టం చేశాం. అయితే ప్రభుత్వం ఎవరి మాట వినడానికి, చర్చించడానికి కానీ సిద్ధంగా లేదు.

ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గందరగోళ స్థితిలో ఉంది. మేడిగడ్డ ప్రాజెక్టు పగుళ్లు రావడమే కాదు, మునిగిపోతోంది. సుందిళ్ల, అన్నారం పరిస్థితి ఇంకా అర్థం కావడం లేదు. ఈ మూడు బ్యారేజీల్లోనూ నీరు నిలువ చేయడం సాధ్యం కాదు కనుక పంపింగ్‌కు అవకాశమే లేదు.


కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‍డి‍ఎస్‍ఏ) రాష్ట్రానికి ఒక నివేదిక సమర్పించింది. ప్రస్తుత ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేపట్టింది. అయితే ఈ మరమ్మత్తులు అన్నీ కూడా కేవలం ప్రాజెక్టును కాపాడడానికి కానీ పునరుద్ధరించడానికి కాదు. వీటికి మరింత నష్టం కలగకుండా ఉండడం కోసం ఈ మరమ్మత్తులు చేస్తున్నారు. ఎన్‍డి‍ఎస్‍ఏ నిపుణుల కమిటీ నివేదికలు సమర్పించిన మీదట మాత్రమే ఈ మూడు బ్యారేజీలకు మరమ్మత్తులు చేయడం సాధ్యం అవుతుంది.

దీని అర్థం ఏమిటంటే ప్రస్తుత సీజన్లో నీటిని పంపిణీ చేయడం కుదరదు. వచ్చే సంవత్సరం కూడా మరమ్మతులు పూర్తి అవుతాయా అంటే అనుమానమే. ఈ కారణంగా ఎల్లంపల్లికి కూడా ఇక్కడి నుంచి నీరు అందదు. ఫలితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు అందడం ఉన్న ప్రక్రియ ప్రస్తుతం ఆగిపోయినట్లే.

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి మరమ్మత్తులు చేయదలచిన ముందుగా కొన్ని విషయాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1) అతి భారీ ఖర్చుతో కూడిన ఈ ప్రాజెక్టుపై ఇంకా ఎంత మొత్తం వెచ్చించడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉంది? 2) ఎన్‍డి‍ఎస్‍ఏ చెప్పిన మరమ్మత్తులు చేసినా కానీ ఈ ప్రాజెక్టులు నీటి ప్రవాహాన్ని తట్టుకొని సుదీర్ఘకాలం నిలబడే అవకాశం ఉందా? 3) అవసరమైన మేరకు నిధులు సమకూర్చి, కింద మీద పడి ప్రాజెక్టు రిపేరు చేసినా ఒక ఎకరానికి నీరు పారడానికి అయ్యే ఖర్చు నీరు పారినందువల్ల ఒక ఎకరంపై వచ్చే ఆదాయంలో సమతుల్యత సాధ్యమవుతుందా? 4) ప్రభుత్వం ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? 5) ప్రజలపై అదనపు భారం మోపకుండా నిధులు సమీకరించుకునే అవకాశం ఏమన్నా ఉందా?


స్పష్టంగా చెప్పుకోవాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‍పీఏ)గా మారిపోయింది. అందువల్ల ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి రుణాలను రీషెడ్యూల్ చేయించుకోవాలి. అలాగే రుణాల చెల్లింపు సమయాన్ని కూడా మరింత పెంచుకునేలా చూడాలి. కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు ఒప్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను సరిగ్గా డాక్యుమెంట్ చేసి కేంద్ర ఆర్థిక సంస్థలకు ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందులో ఎటువంటి ఆలస్యం జరిగినా దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు.

ఈ మొత్తం తప్పిదంలో కేంద్రం పాత్ర కూడా పెద్దదే. ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడం, ఈ ప్రాజెక్టు చాలా బాగున్నాయని బహిరంగంగా ప్రకటించడం, ఆర్థిక సంస్థలు వాస్తవాలు పరిశీలించుకోకుండా రుణాలు ఇవ్వడం కూడా చాలా సవరించుకోలేని పెద్ద తప్పులే.

మరమ్మత్తులు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడుతుందా, మన ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటి రాష్ట్రంపై అదనపు భారం పడకుండా ప్రాజెక్టు కోసం రుణాలు తీసుకురాగలమా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మటే రాష్ట్రం ఒక నిర్ణయం తీసుకోవాలి. వీటికి కచ్చితమైన సమాధానాలు వచ్చిన తర్వాత వాటి ఆధారంగా ముందుకు వెళ్లడానికి అవసరమైన ప్రక్రియను అనుభవం, నమ్మకం ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థకు అప్పగించాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడానికి బహుశా ఆరు నెలల సమయం పడుతుంది. అంటే వచ్చే సీజన్ మొదలవుతుంది. ఈ లోగా ప్రభుత్వం నీటి, వ్యవసాయ విధానాలకు రూపకల్పన చేయాలి. ఇదే సమయంలో నదుల అనుసంధానంలో భాగంగా గోదావరిలో ఇచ్చంపల్లి నుండి, కృష్ణా నదిలో ఇంద్రావతి నుండి నీటి మళ్ళింపుపై చర్చలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి వీలుగా వ్యూహాలు అనుసరించాలి. అదే సమయంలో మేడిగడ్డ ప్రాజెక్టు కుప్పకూలడం నుండి రాష్ట్రం నేర్చుకోవలసిన పాఠాలు చాలానే ఉన్నాయి.


గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత గొప్పగా చెప్పినప్పటికీ తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా భ్రమల నుంచి బయటపడి వాస్తవాలను గమనించాలి. ఈ ప్రాజెక్టు ద్వారా 19 లక్షల ఎకరాలకు నీరు పారించడం దాదాపు అసాధ్యం. ప్రాజెక్ట్ అనుకున్నట్లుగా పూర్తి అయినా కూడా ఎకరానికి రూ.60,000 ఖర్చుపెట్టి ఇచ్చే నీరు ఖరీదుతో కూడుకున్నదే. ప్రభుత్వం రైతులతో చర్చించి వారు ఆరుతడి పంటలు వేసేలా ప్రోత్సహించాలి. కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల కోసం, వ్యవసాయం కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం చేపట్టింది. ప్రభుత్వం చాలా ఖరీదైన నీటిపారుదల సరఫరాకు ప్రయత్నించే బదులు రైతులతో చర్చలు జరపాలి. O&M ఖర్చులలో సగం ప్రభుత్వం అందజేస్తే, రైతులు నీటిని అడగకుండా ఒప్పందం కుదుర్చుకుని ప్రత్యామ్నాయ పంటలు పండిస్తారు. తెలంగాణ రైతులు ప్రజానీకం వాస్తవాలను గుర్తించి వ్యవసాయం మరింత ప్రోత్సాహకరంగా ఉండే విధానాలను ఆర్థిక వనరులు వృథా కాని పద్ధతులను అవలంబించేలా ప్రభుత్వంపై వత్తిడి తేవలసిన అవసరం ఉంది.

డాక్టర్ బిక్షం గుజ్జ

డాక్టర్ శివకుమార్ కనికే

Updated Date - Jun 07 , 2024 | 03:38 AM