ఇంకా యువరాజునన్న భ్రమలోనే కేటీఆర్!
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:29 AM
దమ్ముంటే మల్కాజిగిరి నుంచి తనపై పోటీకి దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాస్యాస్పదం. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్...

దమ్ముంటే మల్కాజిగిరి నుంచి తనపై పోటీకి దిగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసరడం హాస్యాస్పదం. వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జీ ఉండాలంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఏ అంశంలోనూ సమ ఉజ్జీ కారు. తాను పుట్టి పెరిగిన ఊరుకు దూరంగా ఉన్న ఓ మండలం నుంచి ఏ పార్టీ దన్నూ లేకుండా స్వతంత్రునిగా బరిలో దిగి రేవంత్ రెడ్డి జడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. శాసనమండలికి స్వతంత్రునిగానే ఆయన విజయం సాధించారు. కాకలు తీరిన రాజకీయ యోధుడు గుర్నాథ్‌రెడ్డిపై రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏ రాజకీయ నేపథ్యం లేని సామాన్య రైతు కుటుంబం నుంచి ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రజల ఆశీస్సులు, అభిమానంతో అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి పీఠం వరకు కొనసాగింది.
అందుకు పూర్తిగా భిన్నం కేటీఆర్ ప్రస్థానం. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో కేకే మహేందర్ రెడ్డి ఉద్యమ ఖిల్లాగా మార్చిన సిరిసిల్లలో చీమలు పెట్టిన పుట్టలో పాము దూరినట్లు కేటీఆర్ దూరాడు. నాలుగు పార్టీల దన్నుతో (2009 మహాకూటమిలో టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్ భాగస్వాములు) తండ్రి కేసీఆర్ ఇచ్చిన టిక్కెట్‌పై (మేనేజ్‌మెంట్ కోటా) సిరిసిల్లలో 171 ఓట్లతో కేటీఆర్ గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడూ ఉద్యమ భావోద్వేగాలను అనుకూలంగా మలుచుకొని ఉప ఎన్నికల్లో గెలుపొందారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అంతులేని అధికారంతో కన్నూ మిన్నూ కానకుండా వ్యవహరించారు. మధ్య మానేరు జలాశయం నిర్మాణ సమయంలో భారీగా ఇసుక దందా కొనసాగించారు. ఇసుక లారీల కింద పడి ప్రాణాలు పోతుండడంతో నిరసన దీక్షకు దిగిన నేరెళ్ల దళితులను పోలీసు స్టేషన్‌లో పెట్టి చిత్రహింసలు పెట్టించారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అన్నిరకాల దందాలు చేశారు. కేటీఆర్, తండ్రి కేసీఆర్, చెల్లెలు కవిత, బావ హరీశ్‌రావు, వరుస సోదరుడు సంతోష్‌రావుల అహంకారపూరిత ధోరణి, ప్రజా వ్యతిరేక విధానాలకు చెంపపెట్టు వంటి తీర్పును గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చారు.
అధికారాన్ని కోల్పోయిన తర్వాత కేటీఆర్ వ్యవహార శైలి మరింత దిగజారుడుతనంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం నోరుపారేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నుంచే తాము కేవలం ఒకటిన్నర శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయామని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటిస్తే కాంగ్రెస్ గెలిచేది కాదని అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను అధికారం దిశగా నడిపించిన విషయం, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటుకూ విలువ ఉంటుందన్న విషయం యువరాజులా వ్యవహరించిన కేటీఆర్‌కు ఎప్పటికీ అర్థం కాకపోవచ్చు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగింటి అమలు ప్రారంభమైంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే 18 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.5లక్షల నుంచి రూ.పది లక్షలకు పెంచడంతో లక్షలాది కుటుంబాలు నిబ్బరంగా ఉంటున్నాయి. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఆచరణలోకి వచ్చాయి. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటికే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. గ్రూప్–1 నోటిఫికేషన్, 11 వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ శరవేగంగా హామీలు అమలుచేస్తుంటే ఒక్కసారే అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తుండడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం.
ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి మోహరించినప్పుడు చెరో పక్షం నుంచి ఒక్కో యోధుడు పోరాడటం రాచరిక సంస్కృతి. తనకు తాను యువరాజుగా భావించుకునే కేటీఆర్ ఇంకా ఆ మైకంలో నుంచి బయటపడినట్లు లేరు. అందుకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తనపై మల్కాజిగిరిలో బరిలో దిగాలని, 17 సీట్లలో ఎందుకు ఒక్క సీటులోనే ముఖాముఖి తేల్చుకుందామని సవాళ్లు విసురుతున్నారు. రాష్ట్రంలో కేటీఆర్ కుటుంబ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే 2019 లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి గెల్చిన ఘనత రేవంత్ రెడ్డిది. గత ఎన్నికల్లో 80 నియోజకవర్గాల్లో ఒంటి చేత్తో ప్రచారం చేసి కాంగ్రెస్ గెలుపులో కీలకపాత్ర పోషించిన యోధుడు రేవంత్ రెడ్డి. కేటీఆర్ కుటుంబ పదేళ్ల పాలనకు చరమగీతం పాడిన నాయకుడు రేవంత్ రెడ్డి. అటువంటి నేతకు సవాల్ విసిరి తాను ఆయనకు సమ ఉజ్జీననే భ్రమలో కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్‌కు నిజంగా దమ్ము ఉంటే రేవంత్ రెడ్డి గతంలో మల్కాజిగిరిలో బరిలో దిగినట్లు తమ పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే లేని మహబూబ్‌నగర్, ఖమ్మం నియోజకవర్గాల నుంచి బరిలో దిగి సత్తా చాటాలి. అప్పుడు కేటీఆర్ సవాళ్ల సత్తా ఏమిటో తేలిపోతుంది.
సత్తు మల్లేష్
టీపీసీసీ జనరల్ సెక్రటరీ