బీసీలకు చెప్పింది కొండంత, చేసింది గోరంత!
ABN , Publish Date - Mar 06 , 2024 | 01:35 AM
బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతూ వారిని దగా చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. బడుగు, బలహీనవర్గాల వారిని మాటలతో మోసం చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదు...

బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతూ వారిని దగా చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. బడుగు, బలహీనవర్గాల వారిని మాటలతో మోసం చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అంటూ బటన్ నొక్కుడు సభల్లో, రాజకీయ వేదికలపై వారిని ఆకాశానికి ఎత్తుతారు. జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో పోలుస్తూ బీసీలను ఉద్ధరిస్తానని ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. బీసీల అభ్యున్నతికి ప్రత్యేక ఉపప్రణాళిక ద్వారా ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తానని.. బీసీ కార్పొరేషన్లకు నిధులిచ్చి ఆర్థికంగా పరిపుష్టి చేస్తానని.. నామినేటెడ్, కాంట్రాక్టు పనుల్లో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని... ఇలా ఎన్నో లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటికీ పంగనామాలు పెట్టారు. ఆ పవిత్ర గ్రంథాల సాక్షిగా బీసీలను దగా చేశారు.
బీసీలకు విధాన నిర్ణయాధికారాల్లో మిగతా వారితో సమానంగా గౌరవప్రదమైన హోదా దక్కాలన్నది చంద్రబాబు తపన, ఆశయం. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి హామీ యూనిట్లు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ లక్ష రూపాయల సబ్సిడీతో మూడు లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చి బీసీలకు అండగా నిలిచింది. వారి సంక్షేమం కోసం ఆదరణ పథకాన్ని అమలు చేసింది. 17 రకాల కులవృత్తుల వారికి 90 శాతం సబ్సిడీతో అధునాతన పనిముట్లు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. 137 రకాల బీసీ కులాలను కలుపుకొని 13 కార్పొరేషన్లు, 9 ఫెడరేషన్ల ద్వారా ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగా స్వయం ఉపాధి యూనిట్లు అందించింది. బీసీ కులవృత్తులను ప్రోత్సహించింది. రజకులకు వాషింగ్‌మెషిన్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు సంబంధించిన పరికరాలు, టైలర్లకు సరికొత్త కుట్టుమిషన్లు అందించి వారి అభ్యున్నతికి రూ.750 కోట్లు ఖర్చు చేసింది. దీంతో పాటు ప్రతి ఏటా 60 వేల మంది బీసీలకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వం కేవలం 2018–19 సంవత్సరంలో 3,48,837 మంది బీసీలకు రూ. 377.36 కోట్లు విలువైన పరికరాలు అందజేసింది. ఆదరణ పనిముట్లను సబ్సిడీ రూపంలో అందించడానికి ఐదేళ్లలో రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు చేసింది. బీసీ వర్గాల్లో స్వయం ఉపాధి స్ఫూర్తి కలిగించడంతో పాటు ఆదాయం పెంచుకునేందుకు దారి చూపించింది. కానీ జగన్ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసింది. నవరత్నాల పేరిట కేవలం 4.37 లక్షల మందికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది.
గత ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో వివాహాలు, వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన కమ్యూనిటీ భవనాలను నిర్మించింది. బీసీ కార్పొరేషన్లకు నిధులు కేటాయించి పేదలకు సాయం అందించింది. 1187 బీసీ కమ్యూనిటీ హాళ్లకు రూ.165 కోట్లు, 12 బీసీ భవనాలకు రూ.56.47 కోట్లు మంజూరు చేసింది. కులవృత్తిదారులకు ఎన్నో ఏళ్లుగా వెన్నుదన్నుగా నిలిచిన స్వయం ఉపాధి రుణాలను నిలిపివేసింది జగన్ ప్రభుత్వం. రూ లక్ష నుండి రూ.25 లక్షల వరకు అందించే 50 శాతం రాయితీ రుణాలకు నీళ్లు వదిలింది. ఈ రుణాలు ఇవ్వకపోవడంతో వారి వృత్తుల్లో ఆధునీకరణ అటకెక్కింది. బీసీలకు అమ్మఒడి లబ్ధి చేకూర్చినా, ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించినా ఆ నిధులన్నీ బీసీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నట్టు లెక్కలు చెబుతున్నది. అయినా నవరత్నాలు, బీసీ కార్పొరేషన్ రెండింటి ద్వారా లబ్ధి చేకూర్చినట్లు ప్రభుత్వం ఆర్భాటం చేస్తోంది. నవరత్నాల పేరుతో కొందరికి నగదు జమ చేసి, బీసీలను అందరినీ ఉద్ధరించినట్టు డబ్బా కొట్టుకుంటోంది జగన్ ప్రభుత్వం. బీసీలకు సంక్షేమ పథకాలు నామమాత్రంగానే అందుతున్నాయి. 2.14 కోట్ల బీసీ జనాభాలో కేవలం ఐదు రకాల కులాలకు చెందిన 44 లక్షల జనాభాకు తప్ప, మిగతా 1.70 కోట్ల బీసీ జనాభాను గాలికి వదిలేసింది. రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్ వృత్తిని అవలంబిస్తున్న కొన్ని కులాలు, మత్స్యకారులు, చేనేత వృత్తి వారికే నవరత్నాలు అందుతున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చాక గతంలో ఉన్న ఎన్నో పథకాలను రద్దు చేశారు. నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. నవరత్న పథకాల నిధులనే కార్పొరేషన్ల ద్వారా చూపించి జగనన్న చేదోడు, మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం పథకాల ద్వారా బీసీలకే నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నా బీసీలను ఆదుకోలేకపోతున్నది.
ఆర్థికంగా వెనుకబడిన పేదలకు ఉపాధి భద్రత కల్పించి వెన్నుదన్నుగా నిలిచిన బీసీ, ఎస్సీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్లు నిర్వీర్యమయ్యాయి. దీంతో వివిధ తరగతుల ప్రజలకు బ్యాంకు రుణాలతో ఉపాధి మార్గం ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లకు ప్రత్యేక స్థానం ఉండేది. ప్రతియేటా లక్ష్యాలు నిర్దేశించుకుని వీరికి బ్యాంకు రుణాలు ఇప్పించి ఉపాధి మార్గం చూపించేది. కిరాణా కొట్లు, ఫొటో స్టూడియోలు వంటి ఎన్నో వ్యాపారాలు పెట్టుకోవడంతో పాటు, కార్లు వంటి వాటితో ఉపాధి పొందేందుకు కార్పొరేషన్లు సహాయపడేవి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్ రుణాలు పెద్దఎత్తున ఇచ్చారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన కుటుంబాలకు దాదాపు పది వేలకు పైగా యూనిట్లు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, మైనార్టీ, బీసీ సామాజిక తరతగతుల్లో అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఛైర్మన్లను, డైరెక్టర్లను నియమించింది. అయితే నిధులు మాత్రం ఇవ్వలేదు. కార్పొరేషన్ల పరిధిలో ఎటువంటి కార్యక్రమాలూ జరగలేదు. గతంలో రుణాల కోసం వచ్చే జనంతో కళకళలాడే కార్పొరేషన్లు నేడు వెలవెలబోతున్నాయి. రాష్ట్రంలో అన్ని తరగతులకు ఇచ్చే సంక్షేమ పథకాల సొమ్మును కూడా వీరికి ఇచ్చిన సొమ్ముగా చూపిస్తున్నారే తప్ప, ఉపాధి కల్పించే బ్యాంకు రుణాల గురించి మాత్రం ప్రభుత్వం మాట్లాడటం లేదు.
జీవో నెం. 217తో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది మత్స్యకారుల్ని రోడ్డున పడేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24శాతానికి తగ్గించడంతో బీసీలు 16,800లకు పైగా స్థానిక పదవుల్ని కోల్పోయారు. ఈ ప్రభుత్వం రూ.18,226కోట్ల బీసీ కార్పొరేషన్ నిధుల్ని దారి మళ్లించింది. దళిత, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 18వేల ఎకరాలను ఇళ్ల పట్టాల పేరుతో బలవంతంగా గుంజుకుంది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో బీసీలపై జగన్ ప్రభుత్వంలో జరిగినన్ని దాడులు, వేధింపులు ఎప్పుడూ జరగలేదు. దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. జాబ్ క్యాలెండర్ అతీగతీ లేదు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, పోలీస్ నోటిఫికేషన్లు, ఇతర ఖాళీలు భర్తీ చేయకుండా బీసీ యువత జీవితాలతో ఆటలాడుతున్నారు.
చంద్రబాబు ఐటీ ఉద్యోగాలిచ్చి యువతను విదేశాలకు పంపితే, జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ ఉద్యోగాలతో సరిపెట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అమలైన స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ కేంద్రాలను జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూసివేసారు. గత ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందిస్తే, జగన్మోహన్ రెడ్డి ఆ సంఖ్యను 10 లక్షలకు కుదించారు. అయిదేళ్లుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన, 3000 మంది బీసీలపై తప్పుడు కేసులు పెట్టారు. సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వెల్లడించిన వారిని దారుణంగా వేధించారు. 30 మంది బీసీలను హత్య చేయించారు. జగన్ పాలనలో బీసీలు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.
మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని జగన్‌రెడ్డి బీసీ మంత్రం జపిస్తున్నారు. బీసీల పట్ల ఎక్కడలేని ప్రేమ ఒలక బోస్తున్నారు. బీసీల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. అబద్ధాలు చెబుతూ బీసీల ఓట్లకు గాలం వేస్తున్నారు. గత అయిదేళ్లుగా బీసీలను నిలువునా మోసం చేసారు. బీసీలు టీడీపీ సానుభూతిపరులనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం వారిపై కక్ష కట్టినట్టు వ్యవహరించింది. ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నది. కొద్ది మంది బీసీ నేతలకు కార్పొరేషన్ పదవులిచ్చి మొత్తం బీసీ వర్గాలను ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నారు జగన్‌రెడ్డి. జగన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆయన అబద్ధాలకు మరోసారి మోసపోరాదు.
యనమల రామకృష్ణుడు
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు