Share News

తెలుగు సాహితికి కన్నడ కస్తూరి

ABN , Publish Date - May 27 , 2024 | 12:40 AM

మే 12 ఆదివారం ఒక సాహిత్యసభలో పాల్గొన డానికి హైదరాబాద్‌ వచ్చిన ప్రముఖ కన్నడ కవి, అనువాదకుడు లక్కూర్‌ సి. ఆనంద్‌ వారం తిరిగీ తిరక్కముందే మే 20 ఉదయం అకస్మికంగా మృతి చెందాడన్న వార్త...

తెలుగు సాహితికి కన్నడ కస్తూరి

మే 12 ఆదివారం ఒక సాహిత్యసభలో పాల్గొన డానికి హైదరాబాద్‌ వచ్చిన ప్రముఖ కన్నడ కవి, అనువాదకుడు లక్కూర్‌ సి. ఆనంద్‌ వారం తిరిగీ తిరక్కముందే మే 20 ఉదయం అకస్మికంగా మృతి చెందాడన్న వార్త, అటు కన్నడ సాహిత్య ప్రపంచంతో పాటు తెలుగు సాహిత్యప్రపంచాన్ని నివ్వెరపరిచింది. బంగారు గనులకు ప్రసిద్ధి చెందిన కర్నాటకలోని కోలార్‌ జిల్లా లక్కూర్‌ గ్రామంలో ఆనంద్‌ 44 సంవత్సరాల క్రితం జన్మించాడు. తల్లిదండ్రులు మునియమ్మ, చిన్నమ్మ. లక్కూర్‌లోనే ప్రాథమిక మాధ్యమిక విద్య అభ్యసించిన ఆనంద్‌ బెంగుళూరులో కన్నడ సాహిత్యంలో ఎం.ఎ. చేశాడు. అయితే ఆనంద్‌ మాతృభాష తెలుగు కావడం విశేషం. ఆనంద్‌ పదిహేనవ ఏట నుండే సాహిత్య రచనపై దృష్టిపెట్టాడు. కవిగా రచయితగా నిలదొక్కు కుంటున్న క్రమంలో తన ఇంటి పేరు వదిలేసి పుట్టిన ఊరు లక్కూరును పేరుకు ముందు చేర్చుకొని లక్కూర్‌ ఆనంద్‌గా ప్రాచుర్యం పొందాడు. బెంగలూరులోని కెంగేరి శేషాద్రిపురం కాలేజీలో కన్నడ అధ్యాప కుడిగా పనిచేసిన ఆనంద్‌, ఆ తర్వాత గుల్బర్గాలోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కన్నడ సాహిత్యంలో డాక్టరేట్‌ చేయడం కోసం పరిశోధక విద్యార్థిగా చేరాడు.


లక్కూర్‌ ఆనంద్‌ కన్నడ భాషలో అయిదు స్వీయ కవితా సంపుటులను వెలువరించాడు - ఆనంద్‌ కవితా సంపుటి ఊరిన ఏకాంత దీప (ఊరి ఏకాంత దీపం) కవితా సంపుటికి 2013లో సాహిత్య అకాడెమీ యువ పురస్కారం లభించింది. మాతంగి సంస్కృతి మీద పరిశోధన చేసి విమర్శ గ్రంథాన్ని వెలువరించాడు. కన్నడంలో బదలాయిసి, ఊరిద ఊరిగె, ఇప్పత్తర కల్లిన మేలె, బటవాడ యాగద రశీతి, ఇతి నిన్న విధేయను వంటి కవితాసంపుటాలు వెలువరించాడు.

బెంగుళూరు సాహిత్య సభలకు వచ్చే తెలుగు కవులను, రచయితలను కలిసి సాహిత్యాన్ని కలబోసు కుని ఆనంద్‌, దాదాపు అరవై శాతం తెలుగు కవులు, రచయితలు అందరితోనూ ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు పెట్టుకున్నాడు. తన చేతికి అందివచ్చిన తెలుగు సాహి త్యాన్ని గొప్ప ఆరాధనాభావంతో చదువుకున్నాడు. దొరకని పుస్తకాలను ఆయా రచయితలకు, కవులకు ఒకటికి పదిసార్లు ఫోన్లు చేసి మరీ తెప్పించుకునేవాడు - వాటిలో నచ్చిన రచనలను అనువాదానికి పూనుకునే వాడు - మనుషుల్లోకి చొరబడి నలుగురినీ కలుపుకుని పోయే తత్త్వం ఉన్న ఆనంద్‌ కన్నడ రాష్ట్రంలో కవులు రచయితలకు తలలో నాలుకలా వున్నాడు. కన్నడ సాహిత్య పరిషత్తు వంటి అనేక సాహిత్య సంస్థలతో సన్నిహితంగా మెలిగి తెలుగు నుండి కన్నడంలోకి అనువదించిన అధిక గ్రంథాలు ముద్రణ పొందడానికి కారకుడయ్యాడు.


తెలుగు సాహిత్వాన్ని అధ్యయనంచేసే క్రమంలో ఇతర కవులు, ప్రక్రియలతో పాటు తాను పుట్టిన కుదురు దళిత సాహిత్యంపైనా విశేష శ్రద్ధపెట్టాడు. దళిత కవులు మద్దూరి నగేష్‌ బాబు, పైడి తెరేష్‌ బాబు, ఎండ్లూరి సుధాకర్‌, కలేకూరి ప్రసాద్‌, గోరటి వెంకన్న, శిఖామణి, కత్తి పద్మారావు, జి.వి.రత్నాకర్‌ వంటి వారి రచనలను గొప్ప పూనికతో అనువాదాలు చేశాడు. చేరా ‘స్మృతికిణాంకం’, రాణి శివశంకర శర్మ ‘లాస్ట్‌ బ్రాహ్మిణ్‌’, నగ్నముని ‘ఆకాశదేవర’... ఇంకా మధురాంతకం నరేంద్ర, జూపాక సుభద్ర, గోపిని కరుణార్‌, ఎండ్లూరి మానస, చిలుకూరి దేవపుత్ర, బండి నారాయణస్వామి... ఇలా తెలుగు సాహిత్యాన్ని ఆనంద్‌ తడమని తావులు లేవు. ఇలా సుమారు తెలుగు నుండి కన్నడంలోకి యాభై పై చిలుకు గ్రంథాలను ఆనంద్‌ అనువదించాడు. అయితే వీటిలో గ్రంథ రూపం పొంది బయటకువచ్చినవి కొన్నే. చాలా గ్రంథాలు ముద్రణకు సిద్ధం చేసి ఉన్నాయి. వీటిని ఆనంద్‌ మిత్రులు, కన్నడ సాహిత్య సంస్థలు పూనుకొని గ్రంథరూపం తెచ్చిన ప్పుడే ఆనంద్‌ చేసిన కృషి ఫలించినట్టు.


తెలుగు సాహిత్యాన్ని కన్నడంలోకి అనువ దించిన వారిలో ఆర్వీఎస్‌. సుందరం, స. రఘు నాథ్‌, చిదానందశాలై, వెంకటాపు సత్యం, ఆర్‌.రత్నయ్య, రోహిణీ సత్య, వీరభద్ర గౌడ వంటి వారి సరసన లక్కూర్‌ ఆనంద్‌ స్థానం సంపాదించుకోవడం ముదావ హమే అయినా దండ తెగిపోయినట్టు నడివయసులోనే జీవనజవనాశ్వం మీద నుండి ఆనంద్‌ నిట్టనిలువునా కూలిపోవడం గొప్ప సాహిత్య విషాదం. ఆనంద్‌ తెలుగు కవులతో ఎంతగా మమేకం అయ్యాడో ఆయన చనిపోయిన రోజున పత్తిపాక మోహన్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌కు వచ్చిన స్పందనలే సాక్ష్యం. అందులో నూటికి ఎనభై స్పందనల్లో - నిన్న, మొన్న నాతో మాట్లాడాడని, పుస్తకాలు పంపమన్నాడని, కాపీరైటు యివ్వమన్నాడని, త్వరలో కలుద్దాం అన్నాడని... ఇదే సారాంశం! ఆశారాజు అయితే కెనడా నుండి, ‘ఎప్పుడూ ఫోన్‌ చేసి, నాకు విసుగు పుట్టేదాకా ప్రేమించివాడు’ అని రాసాడు. ఇక తెలుగు కవులు, రచయితలకు ఫోన్‌ చేసి విసుగు పుట్టించడానికి ఇపుడు లక్కూర్‌ ఆనంద్‌ మన మధ్య లేడు. తెలుగు సాహిత్యానికి కన్నడ కస్తూరి అలిమిన అతని అనువాదాలు మాత్రమే వున్నాయి.

శిఖామణి

984820 25266

Updated Date - May 27 , 2024 | 12:40 AM