మట్టి వెతల కళింగాంధ్ర కవిత
ABN , Publish Date - Mar 11 , 2024 | 02:06 AM
రెండువేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు అనగా రెండు దశాబ్దాల పైచిలుకు కాలంలో కలింగాంధ్ర కవిత్వపు వస్తుశిల్పాలు విమర్శకు గురికావాల్సిన ఆవశ్యకత వుంది. ఇరవై ఒకటవ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాలు పూర్తయి...
రెండువేల సంవత్సరం నుంచి ఇప్పటివరకు అనగా రెండు దశాబ్దాల పైచిలుకు కాలంలో కలింగాంధ్ర కవిత్వపు వస్తుశిల్పాలు విమర్శకు గురికావాల్సిన ఆవశ్యకత వుంది. ఇరవై ఒకటవ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాలు పూర్తయి మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టింది కళింగాంధ్ర. ఈ కాలవ్యవధిలో కళింగాంధ్ర నేల మీద జరిగిన రాజకీయ సామాజిక ఘటనలు- ఆ నేపథ్యంలో వచ్చిన కవిత్వం- వాటి వ్యక్తీకరణ తీరుతెన్నులు రాబోయే భవిష్యత్తు సాహిత్య వాతావరణాన్ని కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఈ రెండు దశాబ్దాల కళింగాంధ్ర కవిత్వం భవిష్యత్తు కళింగాంధ్ర కవిత్వానికి చోదక శక్తిగా వుంటుందా? అనేది తరచి చూసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. ఈ క్రమంలో ఏర్పడ్డ ఖాళీలను కచ్చితంగా పూరించుకోవాల్సిన పెద్ద బాధ్యతే ఉంది. ఖాళీలను పూరించడం చారిత్రక అవసరం అని కళింగాంధ్ర నేలను భుజానికెత్తుకునే సృజనకారులుగా గుర్తెరగాలి. ఈ నేల మీద అపారమైన వనరులున్నట్టే- అపారమైన సాహిత్య వస్తువుంది. ఇప్పటివరకు కళింగాంధ్ర వస్తువు సాహిత్యంలోకి ఎంతగా వచ్చిందో గమనించుకోవాలి.
ఇరవై ఒకటవ శతాబ్దపు కళింగాంధ్ర కవిత్వాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడు- కచ్చితంగా ఇది ‘ప్రజాదారి’ అని అర్థమౌతుంది. విప్లవోద్యమం బాటలో నడిచిన పాణిగ్రాహి వారసులం మనం. కళింగాంధ్రలో విప్లవోద్యమ అడుగులే లేకపోతే బహుశా ఇప్పటి కళింగాంధ్ర కవిత్వం ఈ తీరుగా వుండదు. ఇక్కడి కవి వలసదుఃఖాన్ని తలకెత్తుకొన్నాడంటే- కార్మికవర్గ స్పృహని రగిలించుకున్నాడంటే- ఈ నేలమీద జరుగుతున్న అనేక రాజకీయ సామాజిక ఘటనల సంఘర్షణను అర్థం చేసుకుని కవిత్వంగా మొగ్గతొడుగుతున్నాడంటే- ఈ అన్నింటి వెనుక కచ్చితంగా కళింగ నేలమీద జరిగిన విప్లవోద్యమ ప్రకంపనల స్పర్శ లేకుండా లేదు- కాబట్టి ఇప్పటి కళింగాంధ్ర కవిత్వానికి బీజాలు విప్లవోద్యమం ఉత్పత్తే!
2
కొత్త శతాబ్దపు తొలినాళ్ల కళింగాంధ్ర కవిత్వంలో మనం కచ్చితంగా చెప్పుకో వాల్సినవి- ‘నాగేటిచాలుకు నమస్కారం’ (2002), ‘నాగలి’ (2006), ‘దుఖ్కేరు’ (2005), ‘నిప్పులవాగు’ (2005), ‘మట్టి చెట్టూ పిట్ట భజినిక’ (2006)- ఐదూ వ్యవసాయ నేపథ్య దీర్ఘకవితలే. ఈ ఐదు దీర్ఘ కవితలూ- తరువాత రాబోయే కళింగాంధ్ర వ్యవసాయ కేంద్రక కవిత్వానికి తొలి విత్తనాలు వేసాయనే చెప్పి తీరాలి.
3
‘నాగేటి చాలుకు నమస్కారం’, ‘నాగలి’ రెండూ గంటేడ గౌరునాయుడు రాసినవి. ‘నాగేటిచాలుకు నమస్కారం’ కవి దుఃఖాలాపన. ఈ కవితలో రైతు సాదాసీదా జీవితం కవిత్వంలోకి వస్తుంది. సహజాలంకారమైన జీవితం- వానలు కురవడం, విత్తనాలు జల్లడం, ఉడుపులు- ఇలా వ్యవసాయ అనుబంధ అంశాలతో కవిత కళకళలాడుతుంది. రైతు సాంస్కృతిక జీవితం కవితలో పరుచుకుంటుంది: ‘‘రానున్న పంటలతో/ నిండాలని తమ గాదులు/ రైతన్నల కన్నుల్లో/ ఉదయించే ఉగాదులు’’ అని అన్న కవి- ‘‘కలలు చెడగొట్టింది కార్తీకం/ కలత నిదర చెదురయ్యింది కార్తీకం/ నల్లమబ్బులు తెచ్చి కార్తీకం/ వాయు గుండాలనే రేపె కార్తీకం’’ అంటాడు. ‘నాగేటి చాలుకు నమస్కారం’ 2002లో వస్తే ‘నాగలి’ 2006లో వచ్చింది. ‘నాగేటి చాలుకు నమస్కారం’ రాసిన నాలుగేళ్ల తర్వాత కూడా కవిని వ్యవసాయ సంక్షోభం కల్గించిన దుఃఖపీడన వదలలేదు అనడానికి ఈ ‘నాగలి’ దీర్ఘకవిత ఒక చిహ్నం.
‘నాగలి’ ప్రచురణకు మునుపే 1990 పూర్వపరాల్లో రాసి- 2005లో ప్రచురణ జరిగిన- ‘దుఃఖ్కేరు’లో పొలిపొలి, నాగళ్ళు, దుక్కిటేరు అను మూడు కవితలు న్నాయి. ‘దుఃఖ్కేరు’ను శృతి కావ్యం అన్నారు ఛాయరాజ్. ఒకటి- ‘పొలి పొలి’లో గ్రామీణ వ్యవసాయ జీవిత సాంస్కృతిక అంశాలను- వాటి మధ్య వున్న విప్లవ చర్యను- అక్షరబద్దం చేస్తారు. ఈ కవిత 1995, 96లో రాశారు ఛాయరాజ్. రెండు- ‘నాగళ్ళు’ కవితలో బువ్వ పెట్టే రైతన్నలను అన్యాయం చేస్తున్న ‘పెట్టు బడి దుష్టశక్తుల నాశనం’ గానం చేస్తారు ఛాయరాజ్. ఇది 1988లో రాశారు. మూడు- ‘దుక్కిటేరు’లో సకలం రైతే అని సగౌరవంగా ప్రకటిస్తారు. కళింగాంధ్ర కవిత్వ బాంఢాగారంలో ‘దుఃఖ్కేరు’ విలక్షణమైన కావ్యంగా మనం చెప్పుకోవచ్చు
మరో కళింగనేల వ్యవసాయ కవి ‘అల’. అల రాసిన ‘నిప్పుల వాగు’ విప్లవ దృక్కోణంలోంచి వెలువడిన వ్యవసాయిక కవిత. ఆరుగాలం చేసిన కష్టం- చివరకు భూస్వామి పాదాక్రాంతం అయినప్పుడు విప్లవమే పరిష్కారంగా చూపుతాడు కవి. విప్లవ అవసరాన్ని కవిత అడుగడుక్కీ ప్రకటిస్తుంది. ‘మట్టిచెట్టు పిట్టభజినిక’ అను తన రెండో దీర్ఘకవితలో అల ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయ సంక్షోభాన్ని కవిత్వం చేస్తారు. ‘మట్టిచెట్టు పిట్టభజినిక’ వ్యవసాయ రాజకీయ కవిత. గాఢమైన శిల్ప చేవ వున్న కవిత.
రెడ్డి రామకృష్ణ ‘గొడిముక్క’ దీర్ఘకవితను 2001లో వెలువరించారు. ‘గొడిముక్క’ అంటే దగ్గర గజం పొడవు గల వెదురుముక్క- గొడ్లును అదిలించడానికి ఉపయోగించే గొడ్లుకాపరి చేతిలోని కర్ర. ఏళ్లకేళ్లు ‘బుగత’ బారిన పడిన ఒకానొక ‘పాలేరు’లో చైతన్యం పూసిన కళింగాంధ్ర కొత్త సందర్భం ఈ కవిత. ‘చుండూరు’- ప్రేరణలోంచి ఎదిగొచ్చిన కవిత ఇది. కవిత ముగింపులోనూ ‘చుండూరు’ కనిపించడం- ఒక కోణంలో కవిత సాధించిన విజయమే. లక్షింపేట వాస్తవికత ‘గొడిముక్క’. రామకృష్ణ గారు గొడిముక్కలో రాసింది- లక్షింపేటలో నిజమైంది. కారా మాస్టారి ‘యజ్ఞం’ కథ నేపథ్యం ఇదే కదా! తిమోతి జ్ఞానానంద కవి తదుపరి దళిత వస్తువును ఇంత బలంగా కళింగనేల మీద చెప్పిన కవి బహుశా రామకృష్ణ గారే అవ్వొచ్చు!
4
ఈ ఆరు దీర్ఘకవితలూ ఇరవై ఒకటవ శతాబ్దపు కళింగాంధ్ర కవిత్వాన్ని దిశానిర్దేశం చేసాయని నేను భావిస్తున్నాను. వీటి తదుపరి వచ్చిన కవిత్వం- ఈ ఆరు దీర్ఘకవితలు వేసిన బాటని మరింత విశాలం చేశాయని చెప్పొచ్చు.
గంటేడ ‘నదిని దానం చేశాక’లో (2006)- నాగావళి నది వొడ్డు నిర్వాసిత గ్రామాల దుఃఖాన్ని గానం చేస్తారు. పి.ఎస్. నాగరాజు ‘ప్రవహించే ప్రజలు’ (2005) పోరాట చైతన్యాన్ని ప్రకటిస్తుంది. అరుణ బవేరాది (ఒక కన్నీటిచుక్క కోసం-2002) ఒక దారి- సున్నిత ప్రకటన అతనిది. దేశరాజు ‘ఒకేఒక్క సామూ హిక స్వప్నావిష్కారణ’ వచ్చిందీ ఈ కాలంలోనే (2000). చింతా అప్పల నాయుడు, సిరికి స్వామినాయుడు కలిసి 2003లో ‘రెక్క తలుపుల గోస’గా వచ్చారు- ఇది ప్రధానంగా వ్యవసాయ సంబంధ కవిత్వం- ఈ కవితల్లో శిల్పం కన్నా వస్తువు ముఖ్యం- కెక్యూబ్ వర్మ ‘వెన్నెల దారి’ (2006)తో కళింగనేల మీద విప్లవకవిత్వ నడకని రూపుకట్టాడు. మోహన్ ‘ఉద్దానం పువ్వు’ 2002లోనే వచ్చింది. మానేపల్లి ‘కలలు నేల మీదికి’ (2004), పి. అనంతరావు ‘మూడు చిరునా మాలు’ (2006), రెడ్డి రామకృష్ణ ‘పినలగర్ర’ (2008)- ఈ కాలంలోనే వచ్చాయి.
కళింగాంధ్ర కవిత్వం గురించి మాట్లాడుకునేటప్పుడు- ‘దుక్కి’ సంపుటి గురించి తప్పక చెప్పుకోవాలి. ఇది 2008లో వచ్చింది. కవి- చింతా అప్పలనాయుడు. ‘దుక్కి’ సంపుటిలో కళింగాంధ్ర వ్యవసాయిక జీవద్భాష తొణికిసలాడుతుంది.
2000 నుంచి 2010 వరకు కళింగ నేల మీద పురుడుపోసుకున్న కవిత్వంలో వస్తువు- ప్రధానంగా వ్యవసాయంది. శిల్పం- వ్యవసాయంది. అందుకే కళింగాంధ్ర వ్యవసాయ కవిత్వానికి అమిరిన శిల్పాన్ని ‘వ్యవసాయ శిల్పం’ అని నేను నామకరణం చేయదలిచాను. రెండువేలు తర్వాత కళింగ నేల మీద ప్రధానంగా- రైతు- వ్యవసాయం నుంచి పరాయీకరణకు గురికాబడినప్పుడు- వస్తుశిల్పాలు రెండూ వ్యవసాయానికి చెందినవి అవడంలో ఆశ్చర్యం లేదు.
2010 తర్వాత మాత్రం కొత్త వస్తువు కళింగాంధ్ర కవి ముందుకు వచ్చి నిల్చుంది. వస్తువుననుసరించే శిల్పమూ మారింది. దీనికి ప్రధాన కారణం సామాజిక ఘర్షణలోని ప్రత్యేకతే. కళింగాంధ్రలో సోంపేట, కాకరాపల్లి, కొవ్వాడ లాంటి ఘటనలు జరగటం- ఆయా ఘటనల పూర్వపరాలను కళింగాంధ్ర కవి తన లోపలికి ఇంకించుకోవటం- కొత్త కళింగాంధ్ర కవికి- అవి చోదకశక్తిగా పనిచేయటం వలన శిల్పం మారింది.
కళింగాంధ్ర కవి వేళ్లు కళింగమట్టిలోనే పాదుకున్నాయనేదానికి ఉదాహరణగా సిరికి స్వామినాయుడు రాసిన కవితలు కొన్ని నిలుస్తాయి. స్వామినాయుడు- వస్తుశిల్పాలలో వైవిధ్యం ఇంకా సాధించాల్సి వుంది. స్వామినాయుడు ‘పొద్దు’ కవిత చూడండి- ‘తూరుపుదిక్కును జూపి అమ్మనడిగాను/ ‘పొద్దేమిటి ఎరుపుగా ఉంద’ని!/ ‘మీ అయ్యారబోసిన మిరపకళ్లమ’ని చెప్పింది/ బంతిపూలై విరిసిన కళ్లతో...!// పడమటి దిక్కును జూపి మళ్లీ అదే అడిగాను/ ‘మార్కెట్ మంటల్లో తగలబడుతున్న/ మన బతుకుల’ని చెప్పింది/ఎత్తిన కారం పిడికిళ్ళతో... !’/
కళింగాంధ్ర కవుల్లో మరో కవి- పాయల మురళీకృష్ణ. మురళీకృష్ణది ఒక ప్రత్యేకమైన శిల్పం. పొరలుపొరలుగా కవితను విప్పదీస్తాడు. మరో కళింగాంధ్ర కవి- మొయిద శ్రీనివాస్- కార్మికవర్గ స్పృహ తన ఆలోచనకూ, కవిత్వానికి మూల ఇరుసు. కొత్త పదబంధాలు సృష్టించిన చేవ వుంది ఈ కవికి. ఆశ్చర్యం గొలిపే వూహ చేయ గలడు. ఈ దశాబ్దంలోనే కెక్యూబ్ వర్మ ‘రెప్పలవంతెన’ (2013), ‘కాగుతున్న రుతువు’ (2017) సంపుటాలను తీసుకొచ్చారు. విప్లవ చైతన్యం పూసిన కవిత్వం ఇతనిది. బాల సుధాకర్ ‘ఎగరాల్సిన సమయం’ (2014), ‘ఆకు కదలని చోట’ (2016), ‘నీళ్లలోని చేప’ (2018), ‘భూమి పెదాలపై’ (2019) సంపు టాలూ ఈ కాలంలోనే వచ్చాయి. మరో కళింగాంధ్ర కవి ‘పక్కి రవీంద్రనాథ్’- ‘పక్షి తనాన్ని కలగంటూ..’ (2019) అంటూ బయలుదేరుతాడు. గంటేడ ‘ఎగిరిపోతున్న పిట్టల కోసం’ (2014), రెడ్డి రామకృష్ణ ‘బీల-భూమి-సముద్రం’ (2012)- కళింగ అస్తిత్వాన్ని ప్రకటించే కవిత్వాలే. గవిడి శ్రీనివాస్, చింతాడ తిరుమల రావు, బుడితి రామినాయుడు, సన్ని, ఇళ్ల ప్రసన్న లక్ష్మి, చెళ్లపిళ్ల శ్యామల, పద్మావతి రాంభక్త, పి. అనంతరావు, ఎల్. ఎన్. కొల్లి మున్నగు కవులు తమ తమ సంపుటాలతో ఈ కాలాన్ని పరిపుష్టం చేశారు.
5
2020 తర్వాత మనం గుర్తుంచుకోదగిన కళింగాంధ్ర కవులు ముగ్గురున్నారు. లండ సాంబమూర్తి, కంచరాన భుజంగరావు, కలమట దాసుబాబు.
సాంబమూర్తి- ఉద్దానం కిడ్నీ బాధితుల ఘోషను కవిత్వం చేసిన కవిగా మనకు గుర్తుంటాడు. కంచరాన, దాసుబాబు- ఇరవై ఒకటో శతాబ్దపు మూడో దశాబ్దం లోనూ కళింగాంధ్ర వ్యవసాయ సంక్షోభాన్ని, వలస దుఃఖాన్ని గానం చేసిన కవులుగా గుర్తుంటారు. భుజంగరావు ‘నవ్వు మరిచిన నేల’, ‘నీటిగింజల పంట’- ఈ రెండు గుర్తించుకోదగిన కవితలు. కలమట దాసుబాబు రాసిన ‘కళింగోర’ కవిత ఈ నేల నుంచి వచ్చిన ఒక విశిష్టమైన కవితగా మనం గుర్తుంచుకోవాలి. అద్భుతమైన కళింగ మాండలికంతో కవిత నడుస్తుంది. ఈ కవిత నేపథ్యం వలసే- ఈ కవిత ముగింపులో ‘కళింగోర కవి దాసుబాబు’ అంటాడిలా- ‘దోపిడీ తీరు మారలేదు.. పోరూ పాతబడలేదు.../గుండారు బిగించి కన్నెర్రగించవే/ కళావతక్కా.. తల్లీ.. మా కళింగోర...’
రెండు వేల ఇరవై తర్వాత- మళ్లీ గంటేడ ఢిల్లీలో రైతు ఉద్యమానికి సంఘీ భావంగా-‘రైతు ఉద్యమ సంఘీభావ కవిత్వం’ (2021) పేరుతో ఒక కళింగనేల కవిగా కవిత్వం వెలువరించారు. కెక్యూబ్ విప్లవ వాస్తవికతతో ‘భూమిరంగు మనుషులు’ (2021)తో వచ్చారు. రెడ్డి శంకరరావు ‘కాలం ఒడిలో’ (2022), లండ సాంబమూర్తి ‘గాజురెక్కల తూనీగ’ (2020), ‘నాలుగురెక్కల పిట్ట’ (2022), భుజంగరావు ‘నీటిగింజల పంట’ (2023), బాలసుధాకర్ ‘దుఃఖపు వొరుపు (2021), నిర్వేదస్థలం(2022), అస్తిత్వవాచకం(2023)’ సంపుటాలతో బయలు దేరారు. 2020 తర్వాత వచ్చిన కవిత్వ సంపుటాల్లో విశిష్టమైనది- ‘దుర్ల’ (2021). కవి- మల్లిపురం జగదీశ్. ఇరవై ఒకటో శతాబ్దపు మూడో దశాబ్దంప్రారంభంలో ఆదివాసీ కవితా సంపుటిగా ‘దుర్ల’ రావడం కళింగాంధ్ర కవిత్వానికి మేలు చేర్పు.
6
ఏ ప్రాంతపు నేలకైనా దానిదైనా సొంత రూపం, వ్యక్తిత్వం వుంటాయి. దానినే అస్తిత్వం అంటున్నాం. కళింగ నేల అస్తిత్వం కళింగనేలకే ప్రత్యేకమైనది.
బాలసుధాకర్ మౌళి
96764 93680