Share News

చట్టబద్ధ ఎంఎస్‌పితోనే రైతులకు న్యాయం!

ABN , Publish Date - Feb 28 , 2024 | 04:25 AM

సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 350కి పైగా రైతు సంఘాలకు చెందిన లక్షలాదిమంది రైతులు లోగడ ఉద్యమించారు. ఆ సందర్భంగా చలి, మండుటెండల దుష్ప్రభావంతో అనారోగ్యాల పాలై 750 మంది రైతులు చనిపోయినా...

చట్టబద్ధ ఎంఎస్‌పితోనే రైతులకు న్యాయం!

సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో 350కి పైగా రైతు సంఘాలకు చెందిన లక్షలాదిమంది రైతులు లోగడ ఉద్యమించారు. ఆ సందర్భంగా చలి, మండుటెండల దుష్ప్రభావంతో అనారోగ్యాల పాలై 750 మంది రైతులు చనిపోయినా, పట్టుదలతో శాంతియుతంగా ప్రభుత్వ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకుండా 13 మాసాలపాటు చారిత్రాత్మక రైతు ఉద్యమాన్ని కొనసాగించారు. దరిమిలా, ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా తెచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలను ఉపసంహరించి, భారత రైతాంగానికి క్షమాపణ చెప్పి, త్వరలో రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించడానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. కానీ దానిని అమలుచేయనందున రైతు సంఘాలు తిరిగి ఉద్యమబాట పట్టవలసి వచ్చింది.

రెండవ పర్యాయం సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌–పొలిటికల్‌), కిసాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ల నాయకత్వంలో పంజాబ్‌ రైతులు చేపట్టిన ‘కిసాన్‌ ఢిల్లీ మార్చ్‌’ని అడ్డుకోవడానికి కనీవినీ ఎరుగని రీతిలో కేంద్రం దమనకాండకు పాల్పడుతోంది. కొద్దిరోజుల క్రితమే ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌కి ‘భారతరత్న’ పురస్కారాన్ని మోదీ ప్రభుత్వం ప్రదానం చేసింది. దశాబ్దాలుగా భారత రైతాంగం వెనుకబాటుతనానికి, ఆత్మహత్యల పరంపరకు అడ్డుకట్ట వేసి, రైతులు సమాజంలోని ఇతర వర్గాలవారితో పాటు ఆత్మగౌరవంతో జీవించడానికి వీలుగా స్వామినాథన్‌ కమిషన్‌ కొన్ని సిఫార్సులు చేసింది. రైతులు పండిస్తున్న పంటలకు సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయం (C2)నకు 50శాతం కలిపి చట్టబద్ధ కనీస మద్దతు ధర ఇవ్వాలని చేసిన సిఫార్సు అందులో ప్రధానమైనది. దీనిని అమలుచేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడమే కాక, ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్ర మోదీ పలు బహిరంగ సభలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అనంతరం ఆ హామీని అమలుచేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది మోదీ ప్రభుత్వం.

ఎంఎస్‌పి అంశాన్ని పరిశీలించడానికి 29మంది పేర్లతో రూపొందించిన కమిటీలో కేంద్ర ప్రభుత్వమే 25 పేర్లు నింపి, సంయుక్త కిసాన్‌ మోర్చా తరపున కేవలం ముగ్గురి పేర్లు అవి కూడా తమకు ఆమోదయోగ్యమైన పేర్లను మాత్రమే చేర్చింది. దీంతో ఎస్‌కెయం పేర్లను పంపలేదు. ప్రభుత్వానికి అనుకూలమైన ఆర్ధికవేత్తలతో C2+50శాతం డిమాండ్‌ను అమలు చేయాలంటే ఏటా 10లక్షల కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయవలసి ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం చేస్తుండటం దురదృష్టకరం. కేంద్రం ఇప్పటివరకు రైతులు పంట పండించేందుకు నగదుగా చెల్లించవలసిన మొత్తానికి (A2 నకు) కుటుంబసభ్యుల శ్రమ విలువ (F.L.)కు 50శాతం కలిపి లెక్కించి ఎంఎస్‌పిని 22 పంటలకు ప్రకటిస్తున్నా, దానికి చట్టబద్ధత కల్పించ లేదు. దీంతో ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సిఐ) సేకరించినప్పుడు తప్ప రైతులకు ఎంఎస్‌పి లభించడం లేదు. ఇప్పటివరకు బియ్యం, గోధుమలను మాత్రమే పెద్దఎత్తున, అది కూడా పంజాబ్‌, హర్యానాలలో, కొద్ది మేరకు ఆంధ్రప్రదేశ్‌, యూపీ మున్నగు రాష్ట్రాలలో ఎంఎస్‌పి ధరలకు సేకరిస్తోంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కొంతమేరకు పత్తి పంటను సేకరిస్తూ ఉంటుంది.

పండిన ఆహార పంటలలో కుటుంబ అవసరాలు పోగా, మిగిలిన భాగం మాత్రమే మార్కెట్‌లోకి అమ్మకానికి వస్తాయి. దేశం మొత్తం మీద 2400 రెగ్యులేటెడ్‌ మార్కెట్‌ యార్డులు, 4,800 సబ్‌ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. వీటిలో చాలా భాగం ఈ–నామ్‌తో అనుసంధానించబడి, ప్రతిరోజూ రైతు అమ్మిన పంట పరిమాణం, ధర నమోదవుతూ ఉంటాయి. ఎంఎస్‌పి రైతుకు లభించడం కోసం ప్రభుత్వమే కొనవలసిన అగత్యం లేదు. ఎంఎస్‌పికి, వ్యవసాయ మార్కెట్‌లో (AMC) రైతు అమ్మిన ధరకు మధ్య వున్న వ్యత్యాసాన్ని ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతుకు అందిస్తే సరిపోతుంది. ఇప్పటికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే A2+FL+50శాతం – ఎంఎస్‌పి రైతులకు అందించేందుకు రూ.50,000 కోట్లు అవసరమౌతుందని అంచనా. C2+50శాతం ఎంఎస్‌పి అందించాలంటే రూ.2.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమౌతాయి. ఇందులో సింహభాగం కేంద్రం, కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వాలు భరించే విధానం ఉంటే రైతుకు న్యాయం జరుగుతుంది.

ఇప్పటివరకు బియ్యం/గోధుమలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజానీకానికి అందజేస్తున్నారు. వాటితో పాటుగా కొద్దిమేరకు పెసలు/మినుములు/కందిపప్పు లాంటి పప్పుధాన్యాలను కూడా అందజేయడం ప్రారంభిస్తే ప్రజలకు పోషక ఆహార లభ్యత స్థాయి పెరగడమేకాక, ఈ పంటల ఉత్పాదకత, ఉత్పత్తి పెరిగేందుకు, ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. లోగడే అరవింద్‌ సుబ్రమణియన్‌ కమిటీ టుబాకో బోర్డు నమూనాలో ‘పప్పుధాన్యాల బోర్డు’ను ఏర్పాటు చేయడం అవసరమని సూచించినా మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

ఇప్పటివరకు పంజాబ్‌, హర్యానా రాష్ట్రాలలో సేకరణకే ఎఫ్‌సిఐ అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అలాకాకుండా మిగులు ఉత్పత్తి వున్న రాష్ట్రాలలో ఆయా పంటల పరిమాణాలను అనుసరించి, లభ్యమైన మేరకు సేకరణ చేసే విధానాన్ని అనుసరిస్తే దాని ప్రభావం ప్రైవేట్‌ అమ్మకాలపైన కూడా పడి, రైతులకు మెరుగైన ధరలు లభిస్తాయి. దేశం మొత్తం మీద దాదాపు 20,000 సంతలు/చిన్న మార్కెట్లు ఉన్నాయని, వాటన్నిటినీ గ్రామీణ మార్కెట్లుగా అభివృద్ధి చేసి ఈ–నామ్‌లకు అనుసంధానిస్తామని 2015లో నాటి కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌ సింగ్‌ ప్రకటించినా, ఇప్పటివరకు పురోగతి లేదు. ఏటా జాతీయ రహదారుల అభివృద్ధికి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్న మోదీ ప్రభుత్వం, ఈ చిన్న చిన్న మార్కెట్ల అభివృద్ధికి, కుంటినడకన నడుస్తూవున్న ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి తగినంత నిధులను సమకూరిస్తే వ్యవసాయ రంగం, దానితోపాటు రైతులు, వ్యవసాయ కార్మికుల ఆదాయాలు కూడా మెరుగవుతాయి.

2022–23లో కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రైసెస్‌ (CACP) లెక్కల ప్రకారం C2+50% ఎంఎస్‌పి రూ.2,707, A2+FL+50% ఎంఎస్‌పి గ్రేడ్‌–A క్వింటాలుకు రూ.2,060/–లు అంటే క్వింటాలుకు రూ.647/–లు వ్యత్యాసం ఉంది. దేశంలో 1308 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇందులో గృహావసరాలు పోగా దాదాపు 1000 లక్షల టన్నుల ధాన్యం అమ్మకమై ఉంటుంది అంటే దేశం మొత్తం మీద ధాన్యం పండించిన రైతులకు సుమారు రూ.64,000 కోట్లు నష్టం వాటిల్లింది.

ఈ విధంగా చూస్తే వివిధ పంటలకు C2 +50% ధర లభించకపోవడం వల్ల భారత రైతాంగానికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. ప్రతి బడ్జెట్‌లోనూ ఇన్‌కంటాక్సు, ఎక్సైజ్‌, కస్టమ్స్‌ డ్యూటీలో పారిశ్రామిక, ధనిక వర్గాలకు ఇచ్చే రాయితీల వల్ల దాదాపు లక్ష కోట్ల రూపాయలపైన ప్రభుత్వానికి రావలసిన ఆదాయం తగ్గుతోంది. 14.5 కోట్ల రైతు కుటుంబాలు, అందులోనూ 86 శాతంగా ఉన్న సన్నకారు, చిన్న రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కార్మికులకు మేలు చేకూర్చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మాత్రం భారం వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మీనమేషాలు లెక్కించకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం C2 +50% చొప్పున లెక్కించి, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి. సేకరణ విధానాన్ని సవరించి ఎక్కువ రాష్ట్రాలలో రైతులకు ఎంఎస్‌పి ధరలు లభించేలా కృషి జరగాలి. ఉద్యోగ, వ్యాపార వర్గాలతో పోలిస్తే వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న సన్నకారు, చిన్న రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల జీవన స్థాయిలో మెరుగుదల కోసం కేంద్రం తప్పనిసరిగా స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులన్నిటినీ అమలు చేయడం ఆయనకు అర్పించగలిగిన ఘనమైన నివాళి అవుతుంది.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

మాజీ మంత్రి

Updated Date - Feb 28 , 2024 | 04:25 AM