Share News

నిరుద్యోగులకు భరోసాగా జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:39 AM

బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో నియామకాలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేసీఆర్ పాలనలో ఎన్నో పోరాటాల మూలంగా లోపాలతో కూడిన అరకొర ఉద్యోగ...

నిరుద్యోగులకు భరోసాగా జాబ్‌ క్యాలెండర్‌

బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. నియామకాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణలో నియామకాలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. కేసీఆర్ పాలనలో ఎన్నో పోరాటాల మూలంగా లోపాలతో కూడిన అరకొర ఉద్యోగ ప్రకటనలు వచ్చేవి. అవి కోర్టు మెట్లు ఎక్కి తీర్పులు వచ్చేసరికి ఉద్యోగాల భర్తీలో తీవ్ర జాప్యం జరిగేది. ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీలో అనేక వైఫల్యాల మూలంగా ఒక తరం‌ నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులకు తగిలిన గాయాలు మాన్పటానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే ముందుగా టీజీపీఎస్సీని సంస్కరించింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ పోటీ పరీక్ష నిర్వహించినా పారదర్శకంగా పటిష్ఠంగా నిర్వహించి నిరుద్యోగులకి భరోసా కల్పించాలనే లక్ష్యంగా రేవంత్ సర్కారు అడుగులేస్తోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను ఎటువంటి లోపాలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించి ఎంతోమంది ప్రశంసలు పొందింది.


నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పరీక్షల నిర్వహణలో గతంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంటర్, పదో తరగతి వంటి పరీక్షల్ని కూడా పకడ్బందీగా నిర్వహించింది. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం ఏకోపాధ్యాయ పాఠశాలలను మూసివేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా కేసీఆర్ ప్రభుత్వంలో మూసి వేయబడిన 4 వేల పాఠశాలల్లో పాఠశాలకు ముగ్గురు చొప్పున 12 వేల ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. పేద పిల్లలు చదువుకునే బడులకు రూ. 2,000కోట్లు కేటాయించి ప్రభుత్వ బళ్లను తీర్చిదిద్దుతా అని ముఖ్యమంత్రి ప్రకటించారు. అడక్కుండానే ఉపాధ్యాయ ఉద్యోగాల ధరఖాస్తుకు వయోపరిమితిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సడలించారు. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో రెండు లక్షల 32 వేల ఉద్యోగాలు మంజూరైతే కేవలం అనేక ఆటంకాలతో భర్తీ చేసింది ఒక లక్ష 60 వేల ఉద్యోగాలు మాత్రమే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయటానికి ఉద్యోగాల క్యాలెండర్ ద్వారా కసరత్తు చేస్తోంది.


పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని ఆలోచన చేయలేదు. ఉపాధ్యాయ పదోన్నతుల విషయంలో ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులు సైతం బుట్టదాఖలు చేసింది. అలాంటిది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడక్కుండానే శర వేగంగా 18 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. సక్రమంగా ఉపాధ్యాయుల బదిలీలు చేసింది. తద్వారా ఏర్పడే ఉపాధ్యాయ ఖాళీలను మరో నోటిఫికేషన్ ద్వారా భర్తీకి సిద్ధమవుతుంది. నిరుద్యోగులకు ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందో అనేటటువంటి గందరగోళ పరిస్థితి నుండి బయటపడేయటానికి మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం టీజీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ను కూడా జూలైలో విడుదల చేయబోతుంది. నిరుద్యోగిత నిర్మూలన అంశంలో విమర్శించడానికి ప్రతి పక్షాలకు అవకాశాలు లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇలాంటి తరుణంలో గ్రూప్–2 పోస్టులు పెంచాలని పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని, గ్రూప్–3 పోస్టులు పెంచాలని, ఈ విధంగా డీఎస్సీ పోస్టులు పెంచి డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని ఆయా పరీక్షల ఆశావహ అభ్యర్థుల సహజ సిద్ధమైన డిమాండును ఆసరాగా చేసుకుని నిరుద్యోగులకు ఎప్పుడు న్యాయం చేయని; బోడ సునీల్ నాయక్, ముత్యాల సాగర్, ప్రవళిక మృతులకు కారణమైన హరీశ్‌రావు, కేటీఆర్ తదితర బీఆర్ఎస్ నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం, నిరుద్యోగులు చేసే పోరాటంలో జొరబడి కుట్రలు చేస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టుంది. ఇంతకాలం నిరుద్యోగులను చంపిన హంతకులే సంతాప సభ పెట్టి సంతాపం తెలిపినట్టుంది. కొంతమంది కోచింగ్ సెంటర్ యజమానులు శ్రుతి మించి తమ స్వార్ధ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం నిరుద్యోగులు చేసే పోరాటంలో దూరి తమ పబ్బం గడుపుకుంటున్నారు. తమ కోచింగ్ సెంటర్లో చేరిన నిరుద్యోగులను పోగేసి కృత్రిమ నిరుద్యోగ సమస్యను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోచింగ్ సెంటర్ యాజమాన్లు తాము లీడర్లు కావడం కోసం పరీక్ష వాయిదా పడితే ఒక బ్యాచ్‌కి లక్షల చొప్పున ఆదాయం పొందవచ్చు, అదేవిధంగా నిరుద్యోగులను రెచ్చగొడుతూ యూట్యూబ్‌లో మాట్లాడితే చూసే వారి సంఖ్య పెరిగి ఆ రకంగా కూడా ఆదాయం పొందవచ్చనే స్వార్ధ బుద్ధితో వ్యవహరిస్తూ నిజమైన నిరుద్యోగుల్ని మోసం చేస్తూ కృత్రిమ ఉద్యమకారులుగా చలామణి అవుతూ లాభపడుతున్నారు.


సమస్త నిరుద్యోగ సమస్యలకు పరిష్కార వేదికగా ఉద్యోగాల క్యాలెండర్‌ను వేగవంతంగా రూపొందించే దిశలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. ఒకవేళ డీఎస్సీ పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద పిల్లలకు ఉపాధ్యాయుల కొరత ఏర్పడి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది. అట్లాగే గ్రూప్–2 వాయిదా వేస్తే ఒకవేళ పోస్టులు పెంచినా తయారు చేసే ఉద్యోగాల క్యాలెండర్ అంతరాయం ఏర్పడి ఉద్యోగాల క్యాలెండర్ రూపకల్పనకు తీవ్రమైన జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షలు వాయిదా వేయొద్దు, వాయిదా వెయ్యాలి భిన్న వాదనలు ఉన్నాయి. ఈ రెండు వాదాలను కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయ నిపుణులతో పరిశీలించి సముచిత నిర్ణయం తీసుకునే వరకు నిరుద్యోగులు ఓపిక పట్టాలి. గ్రూప్–1లో 1:100 ప్రవేశపెడితే న్యాయపరమైన చిక్కులు వచ్చి గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దయి మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులు సంయమనం పాటించాలి. రెండు లక్షల ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగులకు మేలు చేయాలనే సంకల్పంతో, నిరుద్యోగుల చిరకాల వాంఛ అయిన టీజీపీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్‌ను జూలై నెలలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విడుదల చేయనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, నిరుద్యోగులు అండగా నిలవాలి.

కోటూరి మానవతారాయ్

తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్

Updated Date - Jul 05 , 2024 | 05:39 AM