Share News

జన తెలంగాణ జయ ధ్వానం

ABN , Publish Date - Feb 07 , 2024 | 03:43 AM

మనుషులకు సాపాటే కాదు, సంస్కృతి కూడా ముఖ్యం. ప్రతి సమాజానికి ఒక విలక్షణ సంస్కృతి ఉంటుంది. అది ఆ సమాజంలోని వారందరినీ ఆత్మీయంగా సంఘటితం చేస్తుంది. ఇందుకు దోహదం చేసే...

జన తెలంగాణ  జయ ధ్వానం

మనుషులకు సాపాటే కాదు, సంస్కృతి కూడా ముఖ్యం. ప్రతి సమాజానికి ఒక విలక్షణ సంస్కృతి ఉంటుంది. అది ఆ సమాజంలోని వారందరినీ ఆత్మీయంగా సంఘటితం చేస్తుంది. ఇందుకు దోహదం చేసే ఒక సాంస్కృతిక శక్తి గేయం. ప్రపంచంలో ఏ మూలలోనైనా ప్రజలపై ఈ సాంస్కృతిక ప్రభావం గణనీయంగా ఉంటుంది, అత్యాధునిక యూరోప్ గానీ, వెనుకబడిన అసియా దేశాలు గానీ అందుకు మినహాయింపు కాదు. ఒక జనసమూహ ఉమ్మడి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడంలో గేయాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందునా తమ అస్తిత్వాన్ని ప్రతిబింబించే, ఆత్మగౌరవాన్ని చాటే గేయాలు ప్రజల హృదయాలలో సుస్థిరంగా ఉండడం కద్దు. అటువంటి గేయాలు కొన్ని చరిత్రలో సుస్థిర స్థానమేర్పరుచుకున్న ఉద్యమాల్ని ఉప్పొంగించాయి. ప్రజల ఆకాంక్షలను గేయాల రూపంలో పదునైన ఆయుధాలుగా మార్చి పాలకుల గుండెల్లో గుచ్చుకునేలా చేసిన కవులు, కళాకారులు ఎందరో ఉన్నారు.

కుల మతాలకు అతీతంగా కొన్ని గేయాలు ప్రజలందర్ని ఏకధాటిపై నడిపిస్తూ అస్తిత్వాన్ని, సాంస్కృతిక విలువలతో కూడిన పోరాటస్ఫూర్తిని నూరి పోస్తాయి. మహాకవి ఇక్బాల్ స్వప్నమైన ముస్లిం దేశమైన పాకిస్థాన్‌లో తమ సంస్కృతికి గుర్తింపు లేదని భావించిన తూర్పు పాకిస్థాన్ ముస్లిం ప్రజానీకం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘అమార్ సోనార్ బంగ్లా’ గేయం స్ఫూర్తితో పాక్ పాలకులతో పోరాడి తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకున్నారు. రవీంద్రుడు ఆ స్ఫూర్తిదాయక గేయాన్ని రచించిన అర్ధ శతాబ్ది అనంతరం జరిగిన విముక్తి పోరాటంలో అది బంగ్లా దేశీయుల ఆత్మగౌరవానికి ఊపిరి పోసింది. 1971లో ప్రత్యేక దేశంగా అవిర్భవించిన వెన్వెంటనే ఆ గేయాన్ని తమ జాతీయ గీతంగా ప్రకటించుకుని బంగ్లాదేశ్ తనను తాను గౌరవించుకున్నది.

సరిగ్గా అమార్ సోనార్ బంగ్లాతో తమ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక దేశం కొరకు పోరాడుతున్న సమయంలో జై తెలంగాణ నినాదం జోరందుకొంది. అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న అభ్యుదయ కవి దాశరథి రచించిన నా తెలంగాణ కోటి రత్నాల వీణను పాడినా జై తెలంగాణ అంటూ ఆవేశంతో హోరెత్తెక్కించిన వారే అధికంగా ఉండేవారు. ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమ సమయానికి గోరటి వెంకన్న, రసమయి, ఏపూరి సోమన్న, దేశపతి శ్రీనివాస్, పసునూరి రవీందర్, జయరాజ్, విమలక్క తదితరులు అనేక మంది తమ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపర్చగా, అందులో అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ జననీ జయకేతనం’ ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చైతన్యం నిస్సందేహంగా ముక్కోటి గొంతుకలను ఒక్కటి చేయడంలో ఒక ముఖ్య భూమికను పోషించింది.

‘జయ జయహే తెలంగాణ’ ఉద్యమ వ్యాప్తిలో ప్రభాతగీతమైంది. తెలంగాణ అస్తిత్వ విశిష్టత, పోరాటస్ఫూర్తిని నూరి పోసిన ఆ గీతం తెలంగాణ పొలిమేరను దాటి ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాదులలో మారుమ్రోగిపోయింది. అటు ఆడవుల జిల్లా ఆదిలాబాద్ మొదలు అమెరికా, అరబ్బు దేశాల వరకు తెలంగాణ వాసులు నలుగురు కలిస్తే ఈ పాటతో భేటీకి శ్రీకారం జరిగేది. గల్ఫ్ దేశాలలోని భారతీయ, అంతర్జాతీయ పాఠశాలల్లో తెలంగాణ చిన్నారుల మొదలు యు.ఏ.ఇ లోని దుబాయి నుంచి సౌదీ అరేబియాలోని తబూక్ వరకు 2500 కిలోమీటర్ల దూరం వరకు లారీలు నడిపే డ్రైవర్ల వరకు అసంఖ్యాకులను అమితంగా ఆకర్షించి పాడించేది, అందెశ్రీ గీతం. ఈ పాట వింటున్నప్పుడల్లా తెలంగాణ వచ్చి తీరుతుందన్న విశ్వాసం కలిగించేది.

గల్ఫ్ దేశాలలో రోడ్లపై వేగ నియంత్రణ కెమరాలు ఉంటాయి. పరిమితి మించి వేగంగా వాహనం నడిపితే జరిమానాను వీసా నెంబర్‌తో అనుసంధించి వసూలు చేస్తారు, ‘జయ జయహే తెలంగాణ – జననీ జయకేతనం’ పాటకు పరవశించిపోయే డ్రైవర్లు వేగ పరిధి సూచికలను పట్టించుకోకుండా వాహనాలు నడుపుతూ అపరాధ రుసుం రూపంలో తమ జీతంలో సగం జీతం వరకు కూడ చెల్లించుకున్నవారు అనేక మంది ఉన్నారు. ఇలా ప్రజాదరణ పొందిన అందెశ్రీ గేయం కచ్చితంగా రాష్ట్ర గేయంగా ప్రకటన రావడమే తర్వాయి అన్నట్లుగా పాఠశాలలో చిన్నారుల మొదలు ప్రభుత్వ కార్యాలయాలలో అందరు జాతీయ గీతంతో సమానంగా ఆలపించారు. ఈ గేయాన్ని కొంత సవరించి తాను కూడ కొన్ని చరణాలను జోడించినట్లుగా ఒక సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.

కారణాలు ఏమైనా అధికారికంగా మాత్రం జయ జయహే తెలంగాణ స్వరాష్ట్ర జాతీయ గీతంగా రూపుదాల్చలేదు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవిర్భవించినా ఈ గీతం అధికారిక గేయంగా లేకపోవడం స్పష్టమైన ఒక లోటుగా కనిపించేది.

తమ అస్తిత్వ పోరాటం కంటే అర్ధ శతాబ్దికి ముందు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన అమార్ సోనార్ బంగ్లా గేయం తమ లక్ష్య సాధనకు దిక్సూచిగా ఉండగా, బంగ్లాదేశ్ ఏర్పడే నాటికి ఆయన మరణించి మూడు దశాబ్దాలయింది. మరీ, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఒక కవిగా, వాగ్గేయకారుడిగా తనవంతుగా విలక్షణ పాత్ర పోషించిన అందెశ్రీ మన మధ్య ఉన్నా ఆయన రచించిన జయ జయహే తెలంగాణ గీతాన్ని ఎందుకు అధికారిక రాష్ట్ర గేయంగా ప్రకటించలేదో తెలియదు.

ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన ఒక దశాబ్ద కాలనికి అస్తిత్వం, సాహితీ సాంస్కృతిక విలువలు, పోరాటస్ఫూర్తిని నూరి పోసిన ఈ గేయాన్ని తెలంగాణ అధికారిక రాష్ట్ర గేయంగా నూతన ప్రభుత్వం గుర్తించింది. ఈ గుర్తింపు, ఒక్క అందెశ్రీకే కాకుండా ఆయనతో పాటు తమ సాహిత్యం, కళలను పదునైన ఆయుధాలుగా మలుచుకుని తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పోరాటం చేసిన ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవంగా భావించవచ్చు. ప్రజల ఆకాంక్షను గౌరవించిన చరిత్రాత్మక సందర్భమిది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - Feb 07 , 2024 | 03:43 AM