Share News

జన ఝంఝా ప్రభంజనం ధాటికి కొట్టుకెళ్లిన ‘జగ’జ్జనులు

ABN , Publish Date - Jun 06 , 2024 | 03:12 AM

ఎన్నికలు జరిగిన మే 13 సాయంత్రం వరకు జగన్మోహన్‌రెడ్డి ఏదో ఒకటి చేసి తమని విజయ తీరాలకు చేరుస్తారనే ఆశ వైసీపీ శ్రేణుల్లోనూ, ఏదో చేస్తాడనే భయం...

జన ఝంఝా ప్రభంజనం ధాటికి కొట్టుకెళ్లిన ‘జగ’జ్జనులు

ఎన్నికలు జరిగిన మే 13 సాయంత్రం వరకు జగన్మోహన్‌రెడ్డి ఏదో ఒకటి చేసి తమని విజయ తీరాలకు చేరుస్తారనే ఆశ వైసీపీ శ్రేణుల్లోనూ, ఏదో చేస్తాడనే భయం టీడీపీ శ్రేణుల్లోనూ కొట్టొచ్చినట్టు కనిపించింది. ఎన్నికల రోజు జనం తిరగబడిన తీరు, సప్తసమ్రుదాలు దాటి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన యువతని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రకరకాల వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఓటు కోసం పోటెత్తిన యువతని చూసిన తరువాత వైసీపీ కంచుకోటలు బద్దలవుతాయని అర్థమయినా, జూన్‌ 4 సాయంత్రం వరకూ వారిని ఆశ, వీరికి భయమూ వీడలేదు.

మే 8వ తేదీ కోర్టు నుంచి ఇంటికి వెడుతుంటే గుంటూరు ఎసీ కాలేజీ దగ్గర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విచారిస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గం పోస్టల్‌ బాలెట్‌ ఓటింగ్‌ జరుగుతోందని చెప్పారు. మరికొంత దూరం వెళ్లిన తరువాత ప్రభుత్వ మహిళా కాలేజీ దగ్గర ఓటింగ్‌ జరుగుతోంది. ఏసీ కారులో కూడా కూర్చోలేని ఎండ తీవ్రత ఉంది. ఆ స్థితిలో కూడా ఉపాధ్యాయులు, ఉద్యోగులూ, ఆడామగా అందరూ బారులు తీరి గంటలు గంటలు క్యూలో నిల్చొని ఉన్నారు. చాలా మంది వైసీపీ వాళ్లిచ్చే డబ్బులు కూడా తిరస్కరించారని తెలిసింది. వీటన్నింటితో పాటు పోలింగ్‌ రోజు ఓటర్ల ఉత్సాహం చూసిన తరువాత ఒక విషయం స్పష్టంగా అర్థమయింది. ఆర్‌కె గారు చెప్పినట్టు ఇక్కడ వ్యక్తులు, మేనిఫెస్టోలు, జెండాలు, ఎజెండాలు అన్నీ ద్వితీయ ప్రాముఖ్యత కలిగినవే. ప్రజల దృష్టిలో ఉంది ఒకటే. అది జగన్‌ని కొనసాగించాలా? ఇంటికి పంపాలా? అనేదే. ఆ నిర్ణయం జరిగిందనే స్పష్టం అవుతోంది.


జూన్‌ 4 దగ్గర పడేకొద్దీ అన్నిచోట్లా పందెం రాయుళ్ల హవా తగ్గుముఖం పట్టింది. కోట్లు చేతులు మారే విజయవాడ లాంటి చోట్ల వైసీపీ తరఫున పందెం కాసే వాళ్ళు కరువై ఆ ఊరి టీడీపీ తరఫు పందెం రాయుళ్ళు పక్క జిల్లాల బాట పట్టారు. అక్కడ కూడా రెండు రెట్లా, మూడు రెట్లా అన్నారట. ఇంతలో జూన్‌ 1న ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీకి సంబంధించి నలభై సంస్థలు తమ సర్వే ఫలితాలు వెల్లడించగా అందులో 35 సంస్థలు టీడీపీ కూటమికి, కేవలం 5 సంస్థలు వైసీపీకి అనుకూలంగా తమ ఫలితాలని వెల్లడించాయి. అందులోనూ ఒకటి తప్ప మిగిలినవి పేరూ ఊరూ లేని పెయిడ్‌ కంపెనీలు. హిందువులు చనిపోయినప్పుడు మధ్యమధ్యలో శవాన్ని దించి శవం చెవిలో ‘నారాయణ, నారాయణ’ అంటారు. వైసీపీ వాళ్లు ఈ ఆశా అవకాశం కూడా వదులుకోకుండా చిన్నాచితక సంస్థలని, వ్యక్తులని మేనేజ్‌ చేసుకుని తమ కార్యకర్తలలో కౌంటింగ్‌ వరకు ఆశ కొనసాగేలా ప్రయత్నించిందనిపిస్తుంది.

ఇక మంగళవారం టీవీ చానల్స్‌ అన్నీ టీడీపీ కూటమి ఎగురవేసే జయకేతనాన్ని చూపిస్తుంటే ఫలితాలు చూస్తున్న జనం కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి వ్యక్తుల పరాజయ వార్తల సమయంలో కేరింతలు కొట్టడం చూస్తే సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి, తెన్నేటి, గౌతు లచ్చన్న, ప్రకాశం లాంటి ఉన్నత వ్యక్తులు తారాడిన సభలో ఇలాంటి లేకి మనుషుల ప్రవర్తనని ప్రజలెంత అసహ్యించుకున్నారో అర్థమయింది.

ఉద్యమ నేపథ్యాలు, సుదీర్ఘ రాజకీయ చరిత్ర, శ్రమ లేకుండా కేవలం ఒక వ్యక్తి కొడుకనే ఒకే ఒక కారణంగా లభించిన అయాచిత పదవి, ప్రజల మద్దతు... తన అహంభావంతో తెలివితక్కువ తనంతో, కక్షసాధింపు ధోరణితో ఎలా కోల్పోతామో జగన్‌రెడ్డి నిరూపించాడు. పక్క రాష్ట్రంలో తన స్నేహితుడి పతనంతో తనకు ఎదురయిన ముందస్తు హెచ్చరికల్ని కూడా ఖాతరు చేయని మూర్ఖత్వం మూర్తీభవించిన వ్యక్తిగా జగన్‌ మిగిలాడు. ఇది ఒకరకంగా ఏపీ ప్రజల అదృష్టమే. తనని మరోసారి గెలిపిస్తే రాష్ట్రం ఎంత నాశనం అవుతుందో పూర్తి స్థాయి సినిమా చూపించి ప్రజల్ని ఎలర్ట్‌ చేసినందుకు జగన్‌రెడ్డికి కూడా ఏపీ ప్రజలు కృతజ్ఞత చెప్పాలి.


ఏపీ వరకు ఆలోచిస్తే అధికార పార్టీల జయాపజయాలు ఎలా ఉన్నా, నిజంగా ఓడిపోయింది మా వామపక్ష సోదరులే. ప్రభుత్వ పక్షం కంటే ఒక సీటు ఆధిక్యతతో ఉన్న కమ్యూనిస్టుల ఒకనాటి వైభవం ముచ్చటగా మూడవసారి కూడా వారికి ప్రవేశం లేకుండానే ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కొలువుతీరబోతోంది. పార్టీ పార్లమెంటరీ ప్రజాపంథా స్వీకరించిన నాటి నుంచి అవసరమైన కీలక సందర్భాల ఎత్తుగడల వైఫల్యాలే ఉన్నాయి. 1955 మధ్యంతర ఎన్నికల్లో ఇతర పార్టీల్ని కలుపుకోవడానికి ఇష్టపడకపోవడం, 1983లో 60 సీట్లు ఇస్తానని ఎన్‌.టి రామారావు చేసిన ఆఫర్‌ని తిరస్కరించడం ఇందుకు ప్రధాన ఉదాహరణలు.

ఈ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీనీ, రాష్ట్రంలో వైసీపీనీ వ్యతిరేకించమని, సాగనంపమని పిలుపునిచ్చిన వామపక్షాలు, రాష్ట్రంలో వారి పిలుపునకు అనుగుణమైన ప్రత్యామ్నాయం చూపడంలో విఫలమయ్యాయి. చివరకు ఒకరికి 10, మరొకరికి 8 శాసనసభ స్థానాలు, చెరో ఒక పార్లమెంటు స్థానం కోసం షర్మిల దగ్గర దేబిరించి, ఆమె కూడా కాదంటే ఢిల్లీ స్థాయిలో పైరవీ చేసి తెచ్చుకునే స్థాయికి వారి పరపతి పడిపోయింది. పోనీ ఈ స్థానాల్లోనైనా ఓటమి గౌరవప్రదంగా ఉందా? లేదు. ఎక్కడా ధరావతు దక్కలేదు. అభ్యర్థిత్వం ఆదాయ వనరుగా మారినప్పుడు ఇంతకన్నా మెరుగైన ఫలితాలు ఆశించడం పొరపాటే. మోదీతో కలిశాడని చంద్రబాబుని ఆడిపోసుకునే ముందు... కేంద్రంతో కలవకపోతే రాష్ట్రంలో నిలబడే పరిస్థితి, ప్రజలు పోలింగ్‌ బూత్‌ల్లోకి వెళ్లే పరిస్థితి ఉందా? ఆలోచించాలి కదా! ప్రజలు కోరుకుంటున్నట్లు చంద్రబాబు విజయానికి సహకరించి ఎన్నికల తర్వాత ఆయన సహకారం అవసరమైతే ఇండియా కూటమికి జతచేసేట్లుగా ప్రయత్నించవచ్చు కదా! ఎన్నికల ఎత్తుగడలంటే ఇవే కదా! చంద్రబాబు–జగన్‌ ఇద్దరూ అవసరమైనప్పుడు మోదీని సమర్థించేవాళ్లే అనుకున్నప్పుడు... మోదీని వ్యతిరేకించిన చరిత్ర చంద్రబాబుకు ఉంది కానీ, జగన్‌కి లేదు కదా!

1985లో ఒకవైపు బీజేపీతో, మరోవైపు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఎన్‌టిఆర్‌ ఎన్నికల్లో దూకినప్పుడు ఆయనతో జత కట్టారుకదా! కమ్యూనిస్టు మహారథులైన సుందరయ్య, రాజేశ్వరరావు, బసవపున్నయ్యల ఆధ్వర్యంలోనే అది జరిగింది కదా! కాంగ్రెస్‌ను మహారాక్షసిగా కమ్యూనిస్టులు భావించే రోజుల్లో ఆ పెద్దరాక్షసికి వ్యతిరేకంగా భారతీయ క్రాంతిదళ్‌ (బీకేడీ చరణ్‌సింగ్‌ పార్టీ), స్వతంత్ర (ఎన్‌జి రంగా పార్టీ) లాంటి పచ్చి మితవాద పార్టీలతో జత కట్టలేదా? యూపీ, బిహార్‌ లాంటి కమ్యూనిస్టుల ఐక్య సంఘటనలో ఆనాటి జనసంఘం కూడా భాగస్వాములే కదా! ఇప్పుడు కూడా దేశమంతా ఒకరకంగా, కేరళలో మరోరకంగా పోటీపడడం లేదా? మరి ఏపీలో కూడా మరోరకమైన ఎత్తుగడ ఎందుకు అనుసరించలేదు?


మన కమ్యూనిస్టు కంచుకోటలు బద్దలు కాకుండా మన ‘రెడ్‌ విలేజెస్‌’ డెడ్‌ విలేజెస్‌గా మారకపోయి ఉంటే ఒకనాటి మన ఓటర్లు మనకు మిగిలివుంటే వైసీపీని ఓడించాలనే మన పిలుపుని మనమే తుంగలో తొక్కి ఆ పార్టీ గెలుపునకు పరోక్షంగా దోహదపడేవాళ్లం కాదా! పెద్ద దొంగా? చిన్న దొంగా? అనే మీమాంసలో మన ఎంపిక చిన్న దొంగ వైపే ఉండాలనే మన గత సూత్రీకరణకు ఈనాటి మన ఆచరణ వ్యతిరేకం కాదా?

వామపక్ష శ్రేణులు ముఖ్యంగా సీపీఎం గాని, ఆ పార్టీకి చెందిన కొందరు మేధావులు గాని ఇద్దరు దొంగలపై పెట్టే విమర్శల్లో పెద్ద దొంగ పట్ల విమర్శల స్థాయి తక్కువ చేసి తమ విశ్వసనీయతను పోగొట్టుకుంటున్నారు. ఇది రాష్ట్ర భవిష్యత్‌ రాజకీయాలకు హానికరం. మనం శాసనసభలో ఉన్నా, లేకపోయినా ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతే ప్రమాదం. ఎమర్జెన్సీని సమర్థించిన పాపాన్ని సీపీఐ ఈనాటికీ కడుక్కోలేకపోతోంది. పరోక్షంగా వైసీపీకి సహాయపడే అలాంటి తప్పే సీపీఎం చేస్తోంది.

విప్లవోద్యమాన్ని ఎలాగూ నిర్మించలేం. కనీసం పార్టీని పార్లమెంటరీ పంథాలోనైనా సరైన ఎత్తుగడలతో నడిపి మరో ఐదేళ్ల తర్వాతయినా తెలుగు శాసనసభలో ప్రవేశించే మార్గం చూడండి.

చెరుకూరి సత్యనారాయణ

Updated Date - Jun 06 , 2024 | 03:12 AM