Share News

జగన్‌ మార్క్‌ ‘సామాజిక సాధికారత’

ABN , Publish Date - Feb 13 , 2024 | 12:54 AM

‘సామాజిక సాధికారత’ అనే ముసుగు తగిలించుకొని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని, పార్టీ నేతల్ని తోలుబొమ్మలుగా, కీలుబొమ్మలుగా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (వైసీపీ) ప్రభుత్వం...

జగన్‌ మార్క్‌ ‘సామాజిక సాధికారత’

‘సామాజిక సాధికారత’ అనే ముసుగు తగిలించుకొని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని, పార్టీ నేతల్ని తోలుబొమ్మలుగా, కీలుబొమ్మలుగా చేసి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (వైసీపీ) ప్రభుత్వం గత ఐదేళ్లుగా ఆడుతున్న నాటకం అభాసుపాలయింది. పార్టీలోను, ప్రభుత్వంలోను ఇద్దరు, ముగ్గురు అగ్రకుల నేతలు చేస్తున్న పెత్తనం చూసినపుడు వీరికి బడుగుల మీద ఉన్నది నిజమైన ప్రేమా? లేక వారి ఓటు బ్యాంకుపై ఉన్న ప్రేమా? అన్నది అర్థమవుతుంది. ఆ పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సముచిత గౌరవం దక్కుతోందన్న భావన ఏ మాత్రం కలగదు.

వైసీపీకి పార్లమెంటరీ పార్టీ నేతగా వి. విజయసాయిరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన రాజ్యసభలో ఆ పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌. లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌గా పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డి ఉన్నారు. నిజానికి వీరిద్దరికంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగివున్న వంగా గీతకు అవకాశం కల్పించాలి. కానీ, ఆమె పేరు చివర్న రెండు అక్షరాలు లేకపోవడం బహుశ ఆమెకు మైనస్సయ్యిందేమో! విజయసాయిరెడ్డికి ఇంకా అనేక పదవులు ఉన్నాయి. కేంద్రంలోని ట్రాన్స్‌పోర్ట్‌, టూరిజం, కల్చరల్‌కు సంబంధించిన స్టాండింగ్‌ కమిటీకి ఆయన చైర్మన్‌. అంతకుముందు కామర్స్‌ స్టాండింగ్‌ కమిటీకి చైర్మన్‌. అంతేకాదు.. వరుసగా మూడుసార్లు వైస్‌ చైర్మన్‌ పర్సన్స్‌ ప్యానెల్‌కు నామినేట్‌ కాబడ్డారు. రాజ్యసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీలో ఆయన సభ్యుడు. మరోపక్క పార్టీకి ప్రధాన కార్యదర్శి. నాలుగు జిల్లాలకు పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌. ఇన్ని పదవులు, ఇంత అధికారం మొత్తం ఒకరికేనా అని అడగొద్దు. ఇదంతా వైఎస్సార్‌ మార్క్‌ సామాజిక సాధికారతలో ఓ భాగం అని నమ్మాలి!

వైసీపీలో బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం, భాగస్వామ్యం లేదని చెప్పడానికి మరొక ఉదాహరణ.. రీజనల్‌ కోఆర్డినేటర్ల నియామక ప్రక్రియ. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నాలుగేళ్ల పాటు పనిచేసిన వై.వి. సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఉభయ గోదావరి జిల్లాలకు పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి; కృష్ణా, గుంటూరు జిల్లాలకు అయోధ్యరామిరెడ్డి; ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి; మిగిలిన అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డిని వేశారు. అంటే, అన్ని జిల్లాలను అస్మదీయులే గుప్పిట్లో పెట్టుకొన్నారు. అక్కడి పార్టీలో బడుగు బలహీనవర్గాల ప్రజాప్రతినిధులందరూ వీరి ఆదేశాలను పాటించాల్సిందే. అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న వ్యక్తి బలహీన వర్గాలకు చెందినవారే అయినా.. పార్టీ కార్యక్రమాలలో సుశిక్షితుడైన కార్యకర్తగా చేతులు గట్టుకొని హాజరవుతుంటారు. ఉన్నత స్థానాన్ని దిగజార్చవద్దని పార్టీ ఆయనకు చెప్పదు. గతంలో బలహీనవర్గాలకే చెందిన జీఎంసి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా ఉన్పప్పుడు గానీ, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్లుగా ఉన్న యనమల రామకృష్ణుడు, శ్రీమతి ప్రతిభా భారతిగానీ ఎన్నడూ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనలేదు. పార్టీ సమావేశాలకు రమ్మని తెలుగుదేశం వారిని ఆదేశించలేదు. స్వతంత్రంగా వ్యవహరిస్తే ఎక్కడ పార్టీ పెద్దల ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుందోనన్న భయం ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అత్యున్నత పదవుల్లో ఉన్న బలహీన వర్గాల నేతలలో ఉన్నది.

కీలకమైన ప్రభుత్వ యంత్రాంగంలోని పదవులను ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అన్నట్లు తన సొంత సామాజికవర్గంతో ముఖ్యమంత్రి జగన్‌ నింపివేయడం అగ్రకుల దురహంకారానికి, సామాజిక అన్యాయానికి అద్దం పడుతుంది. చీఫ్‌ సెక్రటరీ, డీజీపీలుగా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు ఉండటం బహుశ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ చూడలేం. టీటీడీ పాలకమండలి చైర్మన్‌, ఈవోలు సొంత సామాజిక వర్గంవారే. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పదింటికి ఉపకులపతులు ఆ వర్గంవారే. రాష్ట్రస్థాయిలో 55 మంది సలహాదార్లు ఉంటే అందులో 27 మంది తమవారే. మొత్తం 1082 నామినేటెడ్‌ పదవులలో 671 మంది సొంత కులపోళ్లనే కూర్చోబెట్టారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లలో 8 మంది విప్‌లు ఉంటే అందులో నలుగురు సొంత సామాజికవర్గం వారే. ప్రభుత్వ న్యాయవాదులు, యూనివర్సిటీ ఈసీ సభ్యులు, వివిధ కమిటీల చైర్మన్లు, సభ్యులు.. ఈ విధంగా అన్ని రంగాలలో కనిష్టంగా 31శాతం నుంచి గరిష్టంగా 75శాతం మేర సొంత కులస్థులకు పీటలు వేసిన వ్యక్తి... తనది సామాజిక సాధికారత ప్రభుత్వం అంటే ఎవరైనా నమ్ముతారా?

రాష్ట్ర మంత్రివర్గంలో బలహీనవర్గాలకు పెద్ద సంఖ్యలో చోటు కల్పించామని చెప్పుకోవడమేగానీ.. ఆ మంత్రులు ఏనాడైనా ప్రజల ముందుకొచ్చి మాట్లాడిన సందర్భం ఒక్కటైనా ఉన్నదా? ముఖ్యమంత్రి పదవి తర్వాత రెండో స్థానంగా భావించే హోంశాఖకు తొలుత ఓ దళిత మహిళకు అవకాశం కల్పించారు. రెండున్నరేళ్లు కాగానే ఆమెను తొలగించి మరొక దళిత మహిళను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. వీరిరువురిలో ఏ ఒక్కరైనా ఏ సందర్భంలోనైనా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారా? గౌరవనీయులైన దళిత మహిళల్ని చిన్నచూపు చూస్తూ.. వారి శాఖలపై ముఖ్య సలహాదారు పెత్తనం చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే.

సామాజిక సాధికారత అంటే వెంటనే గుర్తొచ్చేది ఎన్టీఆరే. ఆయన బీసీలను, మహిళలను సాధికారులను చేయడానికి స్థానిక సంస్థలలో తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించడం మొదలుకొని అన్నింటా వారికి సముచిత భాగస్వామ్యం అందించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల శ్రేయస్సే ధ్యేయంగా పరిపాలన సాగించడం వల్లనే తెలుగునాట అన్ని ప్రాంతాల్లోని బలహీనవర్గాలు అంతకుముందుకంటే అన్ని రంగాలలో ఎంతో మెరుగయ్యారు. చంద్రబాబునాయుడు తన పాలనలో స్వయంసహాయక సంఘాల వంటి విప్లవాత్మక పథకాలతో గ్రామీణ ప్రాంత అణగారిన వర్గాల మహిళలను సాధికారత దిశగా నడిపించారు. యువత సాధికారతకు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి ఎనలేని ప్రాధాన్యం కల్పించారు. ఎన్టీఆర్‌, ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉండగా మహేంద్రనాథ్‌, శ్రీమతి ప్రతిభాభారతి, యనమల రామకృష్ణుడు, దేవేందర్‌ గౌడ్‌ వంటి ఎంతోమంది బలహీన వర్గాలకు చెందినవారు తమ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్లీమెంటరీ పార్టీ నేతగా సుదీర్ఘకాలం పనిచేసిన కింజరాపు ఎర్రంనాయుడు జాతీయ రాజకీయాలలో రాణించగలిగారంటే, అందుకు కారణం పార్టీ ఇచ్చిన ప్రోత్సాహమే!

ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రజలను ఏమార్చడం కోసం, ఓట్ల కోసం ఆడుతున్న రాజకీయ క్రీడలో బలహీనవర్గాల నేతలు కేవలం పావులు మాత్రమే. వారికి నిజమైన అధికారాలు లేవు. సొంతంగా నిర్ణయాలు చేయగల శక్తి లేదు. తాము ప్రాతినిధ్యం వహించే వర్గాలను సాధికారుల్ని చేయగలిగే అవకాశమూలేదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా బీసీల ఉపాధి, విద్య, తదితర కార్యక్రమాలెన్నో జరిగేవి. ఇపుడు దానిని 56 కార్పొరేషన్లుగా విడగొట్టి వాటికి చైర్మన్ల పదవులను ఏర్పాటు చేశారు గానీ.. వాటికి నిధులు కేటాయించలేదు. చంద్రబాబునాయుడి పాలనలో టీటీడీ, ఏపీఐఐసీ, ఆర్టీసీ వంటి రాష్ట్రస్థాయి సంస్థలకు చైర్మన్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను నియమించిన చరిత్ర ఉండగా.. ఇపుడు వాటిని జగన్‌ తన సొంత కులస్థులతో నింపేశారు.

వాస్తవాలు ఈ విధంగా ఉంటే.. ఇటీవల రాష్ట్రంలో పలు ప్రాంతాలలో సామాజిక సాధికార బస్సు యాత్రలంటూ అధికార పార్టీ చేసిన విన్యాసాలు అన్నిచోట్లా బెడిసికొట్టాయి. ప్రజలు వాస్తవాలను గ్రహించారు. కొసమెరుపు ఏమిటంటే.. రాబోయే ఎన్నికలలో గెలుపు అవకాశాలు లేవంటూ వైసీపీ అధిష్ఠానం నిర్దాక్షిణ్యంగా సీట్లు నిరాకరించిన వారిలో బలహీన వర్గాలవారే అత్యధికం. ఇదీ జగన్‌ మార్క్‌ సామాజిక సాధికారత.

సి. రామచంద్రయ్య

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి సభ్యులు

Updated Date - Feb 13 , 2024 | 12:54 AM