రాయలసీమకు జగన్ ద్రోహం!
ABN , Publish Date - Feb 09 , 2024 | 03:42 AM
రాయలసీమ సుదీర్ఘ చరిత్ర పుటలు తిరగేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరేమో? అనిపిస్తుంది. పాదయాత్ర సమయంలో...
రాయలసీమ సుదీర్ఘ చరిత్ర పుటలు తిరగేస్తే జగన్మోహన్ రెడ్డి చేసినంత ద్రోహం ఏ ముఖ్యమంత్రి చేసి ఉండరేమో? అనిపిస్తుంది. పాదయాత్ర సమయంలో మాట తప్పను మడమ తిప్పను అని రాయలసీమ వాసులకు ఇచ్చిన హామీలన్నీ గాలికి పోయాయి. సీమ సాగు నీటి ప్రాజెక్టులకు తీవ్ర అపకారం చేసే కొత్త ట్రిబ్యునల్ నియామకానికి కేసీఆర్‌తో జగన్ లాలూచీ పడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం అటుంచి, తను పునాదిరాళ్లు వేసిన పలు సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేమితో అటకెక్కాయి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చి ఉంటే రాయలసీమలో ఈ ఏడాది ఇంత భారీ ఎత్తున వలసలు ఉండేటివి కావు.
రాయలసీమ ప్రస్తావనకు వచ్చిన ప్రతి సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులే ఎందుకు ముందుకు వస్తున్నాయంటే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు, ఆవేదనలు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఉంటాయి. రాయలసీమలో వర్షపాతం తక్కువ. పైగా ఎక్కువ భాగం వ్యవసాయం వర్షాధారంగా కొనసాగుతుంది. ఫలితంగా రాయలసీమ వాసులు నీళ్లు నీళ్లు అని కలలో కూడా పరితపిస్తూ ఉంటారు. నేడు సగటు రాయలసీమవాసి రాజకీయాలతో నిమిత్తం లేకుండా ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనాయ’ని మధనపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా నమ్మిన రాయలసీమ అస్తిత్వం కోరే ఆయన సామాజికవర్గం కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నది. కొందరు మాత్రం పోరుబాట వదలకుండా ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఏర్పాటు చేసుకొని తిరుగుబాటు బావుటా ఎగరేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో 2019 నుంచి నాలుగేళ్ల కాలంలో రూ.2,637 కోట్లు మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు వ్యయం చేశారు. తమకు న్యాయం జరగలేదని సీమ వాసులు తిరస్కరించిన టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు రూ.13,959 కోట్ల రూపాయల వ్యయం చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 2019లో రాయలసీమ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాయలసీమను కోనసీమ చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు పంపమని కోరారు. ఇప్పుడు రాష్ట్ర ఇంజనీర్ ఇన్ చీఫ్‌గా ఉన్న నారాయణరెడ్డి కర్నూలు చీఫ్ ఇంజనీర్‌గా రూ.33,134 కోట్ల వ్యయంతో పలు పథకాలతో నివేదిక సమర్పించారు. అందులో ఏ ఒక్కటీ పట్టాల కెక్కలేదు. తీవ్ర వివాదాలు, గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల్లో నలుగుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇందులో ఒకటి. తీరా ఇప్పుడు ఇది తాగునీటి పథకంగా మిగిలింది. కర్నూలు ఇంజనీరింగ్ అధికారులు ఈ పథకాన్ని ఈ పాటికే నిర్మాణం పూర్తయిన ముచ్చుమర్రి విస్తరణగా ప్రతిపాదన పంపారు. కాని తాడేపల్లి పాలెస్‌లో దీనిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణగా మార్చారు. ఫలితమే ఇన్ని తిప్పలు.
మరీ విడ్డూరమేమంటే 17 కిలోమీటర్లకు పైగా అప్రోచ్ ఛానల్ శ్రీశైలం రిజర్వాయర్ ముంపు ప్రాంతంలో ప్రతిపాదించడమే. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ బిల్లుల మోత ఉంటే అయితే గియితే రాయలసీమ ఎత్తిపోతలకు అప్రోచ్ ఛానల్ గుదిబండ కాబోతోంది. ప్రతి ఏటా బురద తీయడం తలకు మించిన భారంగా మారబోతోంది. ఇంజనీరింగ్ నిపుణులు ముక్కు మీద వేలేసుకొనేదిగా ఉంది. ఇంత హడావుడి చేసి రాయలసీమ ఎత్తిపోతల నుంచి అదనంగా ఒక్క చుక్క నీటిబొట్టు తీసుకోబోమని రాష్ట్ర ప్రభుత్వమే గ్రీన్ ట్రిబ్యునల్ ముందు అఫిడవిట్ వేసింది. కేంద్ర జల సంఘానికి పంపిన డీపీఆర్‌లో కూడా ఇదే ఉంది. మరెందుకు ఈ పథకం చేపట్టినట్లు? తాజాగా శ్రీశైలం జలాశయం కృష్ణ యాజమాన్య బోర్డు అధీనంలోకి వెళ్లింది. బోర్డు అనుమతిస్తేనే ఏ మేరకైనా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీళ్లు తీసుకోవలసి ఉంటుంది. వాస్తవంలో రాయలసీమలో ఎవ్వరూ ఈ ఎత్తిపోతల గురించి ఆలోచించడం లేదు.
వాళ్లు కోరుకొనేది సిద్ధేశ్వరం అలుగు ఆర్డీఎస్ కుడి కాలువ వేదవతి, తుంగభద్ర ఎగువ సమానాంతర కాలువ, గుండ్రేవుల రిజర్వాయర్. వీటి గురించి రాష్ట్ర ప్రభుత్వం కించిత్తు కూడా పట్టించుకోవడం లేదు. గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం జరిగితే కేసీ కెనాల్ ఆయకట్టు మొత్తం శాశ్వతంగా స్థిరీకరణ జరుగుతుంది. కేసీ కెనాల్ ఆయకట్టుకు 2.965 టియంసిల సామర్థ్యంతో నిర్మించిన అలగనూరు జలాశయం నిర్మాణ లోపంతో చుక్కనీరు నిల్వ లేకుండా పశువుల మేత పొలంగా ఉంది. 2,65,628 ఎకరాలకు 39 టియంసిలు నికర జలాలు కేటాయింపులున్నా, కేవలం 1.25 టియంసిల సామర్థ్యం కలిగి బ్రిటీష్ కాలంలో నిర్మించిన సుంకేసుల బ్యారేజీ ఒక్కటే కేసీ కెనాల్ ఆయకట్టుకు దిక్కు. ఒక్కో ప్రాజెక్టుది ఒక్కో విషాద గాథ.
ఈ జాబితాలో హంద్రీనీవా ఎత్తిపోతల పథకముంది. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు నాలుగు జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందించే పథకమిది. 2021లో హంద్రీనీవా ప్రస్తుతమున్న ప్రధాన కాలువ 6300 క్యూసెక్కులు ప్రవహించే విధంగా 6,182 కోట్ల రూపాయలతో లైనింగ్ చేపట్టడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రతిపాదన ఏమైందో తెలియదు. హంద్రీనీవా పురోగతికి నిదర్శనంగా గత ఏడాది జూన్ నెలతో ఆఖరైన నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి రెండు వేల టియంసిల నీళ్ళు చేరినా హంద్రీనీవా నుంచి 28 టియంసిలు మాత్రమే లిప్టు చేశారు. ఈ నీటి సంవత్సరంలో డిసెంబర్ ఆఖరుకు కేవలం 24 టియంసిలు లిప్టు చేశారు. సంభ్రమాశ్చర్యాలు గొల్పే మరో అంశమేమంటే ఒక్క హంద్రీనీవాకే విద్యుత్ బిల్లులు 2,700 కోట్లు చెల్లించవలసి ఉంది. కొసమెరుపు ఏమంటే 2019లో కర్నూలు ఇంజనీరింగ్ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో ఇప్పుడున్న హంద్రీనీవా ప్రధాన కాలువకు సమానాంతర కాలువ నిర్మాణం మరొకటి ఉంది. ఆ ప్రతిపాదన ఊసే చర్చకు రాలేదు. 3850 క్యూసెక్కులు సామర్థ్యంతో కాలువ వున్నా అంతకు తక్కువగా నీటి ప్రవాహం సాగినా టీడీపీ హయాంలో కొన్ని సంవత్సరాల్లో 40 టియంసిలు ఎత్తి పోశారు. ఈ పథకం కింద పంట కాలువల నిర్మాణానికి భూసేకరణ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్లుంది.
మరో పథకం వెలిగొండ. ఈ పథకానికి చెందిన రెండు టన్నెళ్లు పూర్తయినట్లు, పథకం అమలులోకి వచ్చేసిందని, నిర్మాణ సంస్థతో పాటు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు విడుదల చేసింది. ఇల్లు అలకగానే పండుగ కాదుకదా? ఇది మిగులు జలాల ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టు. వరద నీరే గతి. కృష్ణా నది నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు చుక్కనీరు తీసుకోవాలన్నా ఇక ముందు బోర్డు అనుమతించాలి. వరద రోజుల్లో కూడా ఈ సూత్రం అన్వయిస్తుంది. మరి ఏ పద్దు కింద వెలిగొండకు నీటిని విడుదల చేయిస్తారు? రెండు టన్నెళ్ల ద్వారా వచ్చే కృష్ణా జలాలు ఈపాటికే నల్లమల కొండల మధ్య నిర్మితమైన నల్లమల సాగర్ చేరాలి. ఇక్కడ 11 గ్రామాలు ముంపు కిందకు వస్తాయి. ఇంతవరకు వీరికి పరిహారం ఇవ్వలేదు. పునరావాసం కల్పించలేదు. ఇందుకు తొలి దశలోనే దాదాపు 900 కోట్ల రూపాయలు కావాలని అంచనా వేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరి చూస్తుంటే పరిహారం ఇవ్వకనే గండికోట నిర్వాసితులలాగా నల్లమల సాగర్‌లో నీళ్లు నింపి నిర్వాసితులను ముంపులో ముంచేట్టుగా ఉంది. ఇవన్నీ అటుంచి జగన్ 2019 డిసెంబర్‌లో పునాది రాయి వేసిన కుందు నదిపై నిర్మించే జొలదరాసి, రాజోలి రెండు పథకాలు కొంచెం కూడా ముందుకు సాగలేదు. ఈ రెండు పథకాల కోసం 1226 ఎకరాల భూసేకరణ చేశారు. కానీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు.
కాగా కుందు నది బ్యూటిఫికేషన్ పేర వేలాది మంది రైతులను వీధి పాలు చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ రైతులు నదికి ఇరువైపుల విద్యుత్ మోటార్లు పెట్టుకొని వ్యవసాయం చేసేవారు. ఈ పథకం అమలుకు ఇవన్నీ తొలగించి వీరి కడుపు కొట్టారు. ఈ నదిని ఒక కాలువగా చేసేందుకు సిద్ధమయ్యారు. కనీసం ఈ నదిలో చెక్‌డ్యామ్‌లు నిర్మించి ఉంటే భూగర్భజలాలైనా పెరిగేటివి. కృష్ణ, తుంగభద్ర నదుల నుంచి చట్టబద్ధంగా నికర జలాలు అందడం లేదనే ఆవేదన చిరకాలంగా వున్నా, అంతిమంగా పెన్నా వరద నీళ్లతో పాటు వర్షపు నీరు కూడా నిల్వ చేసుకొనే వసతి రాయలసీమకు కరువైంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చర్యలనూ తీసుకోలేదు. 2023 జూన్ నెలతో ఆఖరైన నీటి సంవత్సరంలో పెన్నా నది నుంచి 200 టియంసిలు సముద్రం పాలయ్యాయి. పెన్నా నదిపై ఆఖరు జలాశయం సోమశిల నుంచి విడుదలైన గణాంకాల మేరకు అంత క్రితం నీటి సంవత్సరం 415 టియంసిలు, 2021 జూన్‌తో ఆఖరైన నీటి సంవత్సరం 315 టియంసిలు... మొత్తం 965 టియంసిలు సముద్రం పాలయ్యాయి. పెన్నా నదిపై ఎప్పుడో నిర్మించిన నాలుగు జలాశయాలు కూడా మరమ్మతులకు నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకున్నాయి. పెన్నా అహోబిలం 11.4 టియంసిల నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నా పూర్తి స్థాయిలో నిల్వ చేసిన సందర్భం లేదు. మైలవరం గతి కూడా అంతే. గొంతెండి పోతున్న రాయలసీమకు ప్రకృతి ప్రకోపం కాసింతైతే, పాలకుల నిర్లక్ష్యంతో వర్షపు నీటిని నిల్వ చేసుకుని వాడుకొనే అవకాశం కూడా లేకుండా పోయింది.
వి. శంకరయ్య
విశ్రాంత పాత్రికేయులు