Share News

అభివృద్ధిలో చేతులు కలపని జగన్‌!

ABN , Publish Date - Apr 25 , 2024 | 02:36 AM

ఈ పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ఆర్థిక సహాయాన్ని, వైసీపీ పాలనలో ఎదురయిన సహాయనిరాకరణను లోతుగా తెలుసుకోవాల్సిన సమయం...

అభివృద్ధిలో చేతులు కలపని జగన్‌!

ఈ పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన ఆర్థిక సహాయాన్ని, వైసీపీ పాలనలో ఎదురయిన సహాయనిరాకరణను లోతుగా తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. విభజిత ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందడానికి అవసరమైన నిధులను, ప్రాజెక్టులను, సంస్థలను కేంద్రప్రభుత్వం ఇతోధికంగానే కేటాయించింది. రాజధాని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు రహదారులు, రైల్వేలైన్లు, ఎయిర్‌పోర్టులు, ఓడరేవులు, జెట్టీలు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, డెవలప్‌మెంట్‌ నోడ్లు, పేదలకు ఇళ్లు, మౌలికసదుపాయాలు, తగిన మొత్తంలో ఆహారధాన్యాలు, వైద్యం, విద్యారంగాల్లో కీలకవ్యవస్థలూ ఇలా ఎన్నిటినో కేటాయించింది. స్థానికసంస్థల అభివృద్ధికి నిధులు మంజూరుచేసింది. జగన్ ప్రభుత్వం వీటిని ఏ మాత్రం అందిపుచ్చుకోలేదు. పైపెచ్చు ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి తమ నవరత్న పథకాల అమలుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చింది. కేంద్రనిధులను దారిమళ్లించి తమ పథకాల కోసం ఉపయోగించుకుంది. విచ్చలవిడిగా అప్పులు చేసి రాష్ట్రంపై అమితమైన ఆర్థికభారం మోపింది.

రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రప్రభుత్వం రూ.2,500 కోట్ల నిధులను కేటాయించగా వైసీపీ సర్కార్ 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎలాంటి బడ్జెట్‌ కేటాయింపులు చేయనేలేదు. రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులంటూ చెప్పి దేనినీ అభివృద్ధి చేయలేదు. అమరావతిలో అప్పటికే వెచ్చించిన మొత్తాల్ని నిరుపయోగం చేసేసింది. రాజధానికి సరైన రహదారులను నిర్మించలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కో‍సం నిర్మించిన భవనాలను పాడుబెట్టింది. వాటిలో ఎవరూ నివాసం ఉండకపోయినా ఉంటున్నట్లు పేర్కొని ఇటీవల వాటి అద్దె అంటూ బ్యాంకులకు జరిపిన చెల్లింపులపై విమర్శలొచ్చాయి. ఇక అమరావతి సచివాలయాన్ని కూడా తాకట్టుపెట్టి అప్పులు తీసుకువచ్చిన ఆరోపణలపై సరైన వివరణ ఇవ్వకపోవడంతో అది నిజమేనని ప్రజలు నమ్ముతున్నారు. అమరావతిలో కేంద్రప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.


కేంద్రప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి దాని నిర్మాణ బాధ్యతను తలకెత్తుకుంది. ఆ ప్రాజెక్టును పూర్తిచేసేది తామేనని ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే దాన్ని పూర్తిగా అశ్రద్ధ చేశారు. 2019కి ముందు 72 శాతం మేర పోలవరం పనులు పూర్తికాగా ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా రెండుమూడు శాతం పనులే జరిగాయంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నదుల అనుసంధానం పూర్తయితే ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర రైతులందరూ బాగుపడేవారు. నగరాలకు తాగునీటి సమస్య, విద్యుత్‌ సమస్య ఉండేవి కావు.

రాష్ట్రంలో మౌలికసదుపాయాల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసింది. గత పదేళ్లలో 2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను కేటాయించి నిర్మిస్తోంది. జగన్‌ ప్రభుత్వం దీనికి భిన్నంగా జిల్లాలు, గ్రామాల స్థాయిలోనూ కొత్తరోడ్ల నిర్మాణం మాట అటుంచితే ధ్వంసమైన రోడ్లనే పునర్నిర్మించలేదు. రాష్ట్రంలోని రహదారులను చూస్తేచాలు జరిగిన అభివృద్ధి ఏపాటిదో ఎవరికైనా అర్థమైపోతుంది. నడికుడి– శ్రీకాళహస్తి, కోటిపల్లి–నర్సాపురం, రాయదుర్గం–తుముకూరు కొత్త రైల్వేలైన్లు వంటి కీలక ప్రాజెక్టులను కేంద్రం రాష్ట్రానికి కేటాయించింది. అవి నిర్మాణమైతే ఆయా మార్గాల్లో ఉన్న గనుల నుంచి ఖనిజాల రవాణా ద్వారా రాష్ట్రానికి ఎంతో ఆదాయం లభించేది. ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించే ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం ముందుకువచ్చి నిధులు కేటాయించినా రాష్ట్రప్రభుత్వం మాత్రం ముందుకు రాలేదు.

ఈ పనులకు సంబంధించి రాష్ట్రవాటా చెల్లించలేమని రైల్వేబోర్డుకు లేఖలు రాసింది. కావాలంటే భూసేకరణ భరిస్తామని, అందుకు అనుమతించాలని కోరింది. దాంతో ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. కడప, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నాలలో విమానాశ్రయాలను కేంద్రం అభివృద్ధి చేసినా కర్నూలు, కడపలలో వాటిని నడపలేని పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం ఉంది.


విద్యుత్‌ కంపెనీల ఒప్పందాల పీపీఏలను రద్దుచేయడం, అమరావతిని నిర్వీర్యం చేయడం వంటి చర్యలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంవైపు తొంగిచూడడమేలేదు. కేంద్రం ప్రకాశం జిల్లా కనిగిరి, చిత్తూరు జిల్లా ఏర్పేడులలో వస్తుతయారీ పరిశ్రమల కోసం నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మ్యానుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) ఏర్పాటుకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన 25 వేల ఎకరాల భూమిని అందించలేదు. మనతో పాటు రాజస్థాన్‌లో కూడ నిమ్జ్‌ ఏర్పాటుకు అనుమతి ఇవ్వగా అక్కడ దాన్ని పూర్తిచేసి 65 వేలకోట్ల పెట్టుబడులతో నాలుగులక్షల మందికి ఉపాధి కల్పించారు. జగన్ ప్రభుత్వం అలక్ష్యం కారణంగా కనీసం లక్షకోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయి. సుమారు 6 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అలాగే చెన్నై, బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌ కింద 12,944 ఎకరాల్లో కృష్ణపట్నం నోడ్‌కు, బెంగళూరు – హైదరాబాద్‌ పారిశ్రామిక కారిడార్‌ కింద 9,350 ఎకరాల్లో ఓర్వకల్లు నోడ్‌కు, 3 వేల ఎకరాల్లో హిందూపూర్‌ నోడ్‌, 3 వేల ఎకరాల్లో అనంతపురం నోడ్‌లకు అనుమతులు ఇచ్చినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదు. వీటిని సకాలంలో పూర్తిచేసి ఉంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలలో పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి లభించేది. పరిశ్రమలకు పెట్టుబడి అలవెన్స్‌, ఆదాయపన్ను చట్టం కింద వెసులుబాటు దక్కేవి. ఇప్పటికే కియా వంటి పరిశ్రమలు ఈ రాయితీలు పొందుతున్నాయి. వేయి కోట్ల రూపాయలతో బల్క్‌డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపినా రాష్ట్రప్రభుత్వం వేగంగా స్పందించడంలో విఫలమవుతోంది.


రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధికిగాను కేంద్రప్రభుత్వం పలు పథకాల ద్వారా చేయూతనిచ్చింది. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద 2019–22 మధ్య రూ.3412 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా ఏడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల నిర్మాణానికి, మూడు ఆస్పత్రుల పునర్నిర్మాణానికి నిధులు విడుదయ్యాయి. జాతీయ అర్బన్‌ మిషన్‌ కింద, పట్టణ ఆరోగ్యకేంద్రాలలో దాదాపు 6వేల పోస్టులు భర్తీ చేసింది. ఈ మిషన్‌ కింద 110 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రధానమంత్రి స్వాస్త్య సురక్ష యోజన కింద అనంతపురం వైద్యకళాశాల అభివృద్ధికి రూ.240 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్యకళాశాలలకు, మూడు నర్సింగ్‌ కళాశాలలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో 6830 గ్రామాలు బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా మారాయి. 7489 గ్రామాల్లో ఘనవ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటైంది. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా రాష్ట్రంలో 2019 నుంచి ఇప్పటివరకు 35.88 లక్షల గ్రామీణగృహాలకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. కేంద్ర సహకారం ఎంతగా ఉన్నా వైసీపీప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని పూర్తిగా నిర్యక్ష్యం చేసింది. ముఖ్యంగా పంచాయతీలను నిర్వీర్యం చేసింది. వాటి అభివృద్ధికి నిధుల కేటాయింపును అటుంచి కేంద్రప్రభుత్వం ఇచ్చిన ఆర్థికసంఘం నిధులనూ దారి మళ్లించింది. అయిదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వభవనాలకు పార్టీ పతాకపు రంగులు వేయించారు. దానికీ పంచాయతీరాజ్‌ శాఖనే వాడుకున్నారు. ఆ పంజాయతీరాజ్‌ శాఖ నుంచే ప్రచార బుక్‌లెట్ల కోసం రూ.40 కోట్ల నిధులు మళ్లించారు. పంచాయతీ పాలనకు సమాంతరంగా జగన్ ప్రభుత్వం వాలంటరీ, సచివాలయ వ్యవస్థలు ఏర్పాటుచేసి స్థానికసంస్థలకు ప్రాధాన్యం లేకుండా చేసింది. ప్రజలు నేరుగా ఎన్నుకున్న సర్పంచ్‌కు కనీస గౌరవం లేకుండా పోయింది. ఆర్థికసంఘం నిధులను దారి మళ్లించడంతో కనీస సమస్యలు సైతం పరిష్కారం కావడం లేదు. కొందరు సర్పంచులు అప్పులు చేసి గ్రామాల్లో పనులు చేసినా బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. నిధుల కోసం పోరాడుతున్న సర్పంచ్‌లు రాష్ట్రపతిని కలసి వైసీపీసర్కారు తీరుపై ఫిర్యాదు కూడా చేశారు. మోదీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రాష్ట్రంలోని పట్టణప్రాంత పేదలకు 21,32,343, గ్రామీణప్రాంత పేదలకు 2,48,682 ఇళ్లు మంజూరు చేసింది. పట్టణప్రాంతంలో గృహాల నిర్మాణం కోసం ఇప్పటివరకు రూ.18,645 కోట్లు అందజేసింది అయినా రాష్ట్రప్రభుత్వం వీటిలో పదోవంతు కూడా నిర్మించలేదు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా పేదలకు పంపిణీ చేయకుండా పాడుపెట్టేసింది. పైగా పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ పేరుతో నాలుగువేల కోట్ల మేరకు అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన బోధనాసుపత్రులు ఇంకా పునాదుల స్థాయిని దాటలేదు. ఎన్నికల సందర్భంగా ఈ వాస్తవాలన్నిటినీ రాష్ట్రప్రజలు దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలి.

వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ

బీజేపీ రాష్ట్ర అధికారప్రతినిధి

Updated Date - Apr 25 , 2024 | 02:36 AM